Sunday 7 May 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదియేడవసర్గ

                                              రామాయణము 

                                             అరణ్యకాండ -ఇరువదియేడవసర్గ 

ఆ విధముగా రాక్షసులు హతమగుట చూసిన ఖరుడు తానె స్వయంగా రాముడిపై తలపడటానికి పూనుకొనెను . అది గమనించిన త్రిశరుడు (మూడు శిరములు కలవాడు )"ప్రభు !ఈ మానవుడితో మీరు తలపడుట అవమానకరం . నేను యుద్ధము చేసెదను . వాడిని ఈ రణరంగము సాక్షిగా నా వాడి శరములతో ముక్కలుముక్కలుగా చేసెదను "అని పలికి రణరంగం లోకి దూకేను . 
అతడు రాముడు పై తన శరములతో వర్షము కురిపించెను . అవి రాముడి పాలభాగమున తగిలెను . శ్రీరాముడు క్రుద్ధుడై అతడి రధమును ధ్వంసము చేసి ,పిదప అతడి మూడు శిరములను కూల్చివేసెను . ఆ రాక్షసుడి మొండెము ఆ రణరంగమున నెత్తురోడుతూ పడిపోయెను . శ్రీరాముడి దాటికి రాక్షసులు పెక్కు మంది చనిపోయిరి . మిగిలిన కొద్దిగొప్ప మంది భయముతో రణరంగమునుండి దూరముగా పారిపోవుచున్నారు . 
ఖరుడు వారిని వారించి ,ఉత్సాహపరచి రణరంగము వైపు మరల్చెను . 

రామాయణము అరణ్యకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Saturday 6 May 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదిఆరవసర్గ

                                           రామాయణము 

                                             అరణ్యకాండ -ఇరువదిఆరవసర్గ 

అప్పుడు దూషణుడు తన సైన్యము రాముని చేతిలో హతులగుట గమనించి ,ధీరులైన 5000 మంది రాక్షస యోధులను యుద్ధమునకు పిలిచేను . వారందరూ రాముని చేతిలో అతి స్వల్ప కాలములోనే హతులయ్యిరి .  చూసిన దూషణుడు శ్రీరాముడిపైకి దూకేను . అట్టి దూషణుడి ని చూసి శ్రీరాముడు అతని రధమును ,ధనుస్సుని ముక్కలు చేసెను . అయినను మీదకు ఉరుకుతున్న దూషణుడిని  తన నిశిత శరములతో పరిమార్చెను . 
రాక్షస వీరుడగు దూషణుడు మరణించుట చూసిన మిగిలిన రాక్షసులు మిక్కిలి క్రుద్ధులై శ్రీరామునిపైకి దూకిరి . శ్రీరాముడు వారందరిని అవలీలగా పరిమార్చెను . ఆ విధముగా వేలకొలది రాక్షసుల కళేబరములతో ,రక్త మాంసములతో ఆ రానా రంగము నిండిపోయెను . అప్పుడు అచట శ్రీరాముడు ,ఖరుడు ,త్రిశిరరాక్షసుడు మాత్రమే మిగిలిరి . 

రామాయణము అరణ్యకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Thursday 4 May 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువది అయిదవసర్గ

                                           రామాయణము 

                                             అరణ్యకాండ -ఇరువది అయిదవసర్గ 

ఖరుడు తన ముందు భాగమున నడుచుచున్న యోధులతో కూడి ,ఆశ్రమమునకు చేరి ,శత్రుసంహార సమర్థుడై ,రాణావేశములో ధనుర్ధారియై యున్న శ్రీరాముని చూసిరి . అప్పుడు ఖరుడు విల్లంబులు చేతబూని ,ధనుష్టంకారము చేయుచు ,రాముడు దగ్గరగా వచ్చిరి . భయంకరులైన రాక్షసులు శ్రీరాముని చుట్టుముట్టిరి . వారందరూ వాడి అయిన బాణములు ,శూలములు ,ఖడ్గములు శ్రీరామునిపైకి విసిరిరి . శ్రీరాముడు ఏమాత్రము తొణకక ,వందలకొలది వాడి అయిన బాణములు రాక్షసులపైకి ప్రయోగించెను . 
ఆ బాణములు తగిలి అనేక మంది రాక్షసులు మరణించిరి . మిగిలిన రాక్షసులు ప్రాణ భయముతో ఖరుని శరణు జొచ్చుటకై అతని వద్దకు పరుగిడిరి . అప్పుడు దూషణుడు వారిని వెంట బెట్టుకుని తిరిగి రణరంగమునకు వచ్చిరి . తిరిగి శ్రీరాముని చుట్టుముట్టిరి . ఆ రాక్షస యోధులందరూ చెట్లు ,బండరాళ్లు ,పెద్దపెద్ద కర్రలు రామునిపైకి విసరసాగిరి . రాముడు ప్రభావితమైన గంధర్వ బాణమును వారిపై ప్రయోగించెను . 
రాముడు బాణము తీయుట కానీ ,బాణము సంధించుట కానీ రాక్షస గణమునకు కనిపించుటలేదు . కేవలము వారి శరీరమునకు తగిలి నపుడే తెలియుచున్నది . పరంపరగా వచ్చుచున్న బాణములు రాముడి ముఖము నుండే వచ్చుచున్నావా అన్నట్లు వున్నవి . ఆ రణభూమి అంతయు రాక్షసుల కళేబరములతో ,రక్త మాంసములతో నిండిపోయెను . ఆ విధముగా ఆ రణరంగము భయంకరముగా కానవచ్చుచున్నది . 

రామాయణము అరణ్యకాండ ఇరువది అయిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Wednesday 3 May 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదినాల్గవసర్గ

                                                    రామాయణము 

                                                          అరణ్యకాండ -ఇరువదినాల్గవసర్గ 

ఖరుడు ,దూషణుడు అపారమైన పదునాలుగువేలమంది సేనతో శ్రీరాముని ఆశ్రమము వైపుగా వచ్చుచుండగా ,రామునికి దుశ్శకునములు కనిపించినవి . వాటిని గమనించిన రాముడు "లక్ష్మణా !ఈ దుశ్శకునములను బట్టీ ఎదో ఆపద రాబోవుచున్నదని అవగతమవుతున్నది . కనుక నీవు మీ వదినను తీసుకుని దగ్గరలోని గుహలో ఉండుము . నేను ఆ ఉపద్రవమును నాశనము చేయుదును "అని పలికెను . 
ఆ దుశ్శకునములను గమనించిన లక్ష్మణుడు సైతం ధనుర్భాణములు ధరించుచు ,యుద్ధమునకు సిద్ధమగుచుండెను . రాముడు అతడిని వారించి సీతా దేవి రక్షణ బాధ్యతను లక్ష్మణునికి అప్పగించెను . లక్ష్మణుడు సీతను తీసుకుని గుహ లోకి వెళ్లెను . అప్పుడు శ్రీరాముడు ధనుర్భాణములు ,కవచము ,ఖడ్గము మొదలగున్నవి అన్నియు ధరించి యుద్ధమునకు సమాయత్తమయ్యెను . 
ఖరుడి సైన్యము కదలికలకి అరణ్యములోని మృగములన్నియు భయముతో దూరముగా పారిపోవసాగినవి . దేవతలు ,యక్షులు ,కిన్నెరులు ,గంధర్వులు ,మునులు ,సిద్దులు మున్నగు వారంతా ఆ యుద్ధమును చూడవలెనని కోరికతో ఆకాశములోనుండి ఆసక్తితో గమనించసాగిరి . రాక్షస సైన్యము పదునాలుగువేలమంది ,శ్రీరాముడు ఒక్కడు అతడి పరాక్రమమును చూడవలెనని ఆత్రుతతో సమస్త దేవతలు ఎదురుచూడసాగిరి . రాక్ష స సైన్యము శ్రీరాముని ఆశ్రమముకు దగ్గరకు వచ్చిరి . వారు ప్రళయకాల రుద్రుడి వలె ఉన్న శ్రీరాముని చూసిరి . వారిలో వారు శత్రువును నేను చంపుతాను అంటే నేను చంపుతాను అని వాదించుకోసాగిరి . 

రామాయణము అరణ్యకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Tuesday 2 May 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదిమూడవసర్గ

                                        రామాయణము 

                                      అరణ్యకాండ -ఇరువదిమూడవసర్గ 

ఆ విధముగా భయంకరులు ,నరమాంస భక్షకులు ఐన 14,000 మంది రాక్షసులను వెంట బెట్టుకుని ఖరుడు ,అతని సోదరుడు దూషణుడు అరణ్యమార్గము గుండా శ్రీరాముని ఆశ్రమము వైపు సాగిరి . మార్గమున వారికి అనేక దుశ్శకునములు కనిపించెను . వినాశకాలే విపరీత బుద్ధి అన్న విధముగా వారు ఆ దుశ్శకునములు ఏ మాత్రము లెక్కింపక అత్యుత్సాహముతో ప్రగల్భములు పలుకుచు ముందుకు సాగిరి . 
జరిగెడి వృత్తాంతము అంతయు దేవతలు మునులు ఆకాశము నుండి వీక్షించుచుంటిరి . ఆ విధముగా ఆ రాక్షస సేన యావత్తు శ్రీరాముని ఆశ్రమము వద్దకు వచ్చిరి . 

రామాయణము అరణ్యకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .