Monday 9 March 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదియెనిమిదవసర్గ

                                 రామాయణము 

                                    యుద్ధకాండ -తొంబదియెనిమిదవసర్గ 

 బలములు నశించుటచే ,విరూపాక్షుడు మరణించుట చేత ,రావణుని క్రోధము రెండింతలయ్యెను . రాక్షస శ్రేష్ఠుడైన మహోదరుడు రావణుని ఆజ్ఞ మేరకు ,అగ్ని జ్వాలల  ముందు  మిడతలదండు వలె తన సైన్యముతో సహా శత్రు సైన్యమున ప్రవేశించెను . మహోదరుడు వానరసైన్యముతో యుద్ధమునకు దిగెను . అతడు తన బాణములతో వానరుల యొక్క చేతులను ,పాదములను ,తొడలను చీల్చివేసెను . . ఆ రాక్షసుని చేతిలో బలముగా దెబ్బలు తిన్న వానరులు భయముతో దశదిశలకూ పారిపోయిరి . కొందరు వానరులు సుగ్రీవుని ఆశ్రయించిరి . 
సుగ్రీవుడు వెనువెంటనే మహోదరునితో యుద్ధమునకు దిగి అతడి శిరస్సుని ఖండించివేసెను . శిరస్సు తెగిన ఆ రాక్షసుడు నేలపై పడిపోయాడు . అప్పుడు ఆ దృశ్యమును చూసిన రాక్షస సైన్యము అక్కడ నిలవలేక పారిపోయిరి . వానరులంతా సంతోషముతో కోలాహల ధ్వనులు చేసిరి . రావణుడు కోపముతో  బుసలు కొట్టెను . శ్రీ రాముడు సంతోషించెను . అప్పుడు సుగ్రీవుడు అసాధ్యమైన కిరణములతో శోభిల్లుతున్న సూర్యుడు వలె విజయలక్ష్మి తో శోభిల్లెను . అంతరిక్షమున  వున్న దేవతలు ,యక్షులు ,సిద్దులు ,అందరూ సంతోషముతో పొంగిపోవుచూ సుగ్రీవుని పొగిడిరి . 

          రామాయణము యుద్ధకాండ తొంబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Tuesday 3 March 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదియేడవసర్గ

                                 రామాయణము 

                                       యుద్ధకాండ -తొంబదియేడవసర్గ 

రాక్షసరాజైన రావణుని దాటికి వానరులు తట్టుకొనలేకపోయిరి . కకావికలమవుతున్న వానరసేనను చూసిన సుగ్రీవుడు వానర యుద్ధ శిబిరములకు సుషేణుడిని కాపలా ఉంచి,తానె స్వయముగా యుద్ధమునకు దిగెను . సుగ్రీవుడు యుద్ధమునకు దిగుట చూసిన విరూపాక్షుడు అను రాక్షసుడు కూడా యుద్ధ రంగములో సుగ్రీవుని ఎదిరించి నిలబడెను . వారిరువురి మధ్య భయంకరమైన యుద్ధము జరిగినది . ఆ యుద్దములో విరూపాక్షుడు సుగ్రీవుడి చేతిలో మట్టి కరిచేను . అది చూసిన రాక్షస సేన భయముతో గగ్గోలు పెట్టినవి . వానరసేన సంతోషముతో జయజయద్వానములు చేసినవి . 

రామాయణము యుద్ధకాండ తొంబదియేడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .