Wednesday 5 May 2021

రామాయణము , ఉత్తరకాండ------------యాబదిఒకటవసర్గ

                               రామాయణము 

                             ఉత్తరకాండ------------యాబదిఒకటవసర్గ  

లక్ష్మణుడి ప్రేరణతో సుమంత్రుడు దూర్వాస మహాముని  పలికిన పలుకులను గురించి ఈ విధముగా చెప్ప సాగెను . లక్ష్మణా! ఒకానొకనాడు  అత్రి మహర్షి కుమారుడైన, దూర్వాస మహాముని వసిష్ఠ మహాముని ఆశ్రమములో చాతుర్మాస్య దీక్షను నడిపెను . మీ తండ్రి తన పురోహితుడైన వసిష్ఠ మహర్షిని దర్శించుటకు ఆయన ఆశ్రమమునకు వెళ్లగా అక్కడ వశిష్ట, దూర్వాస మహామునులు ఇద్దరిని చూసి పరమ సంతోషముతో నమస్కరించెను . వారుకూడా మహారాజుకి స్వాగతం పలికి ఆసనమిచ్చి అర్ఘ్య  పాద్యములతో ఫలమూలాదులతో సత్కరించిరి . పిమ్మట ముగ్గురు కూర్చుని మాట్లాడుకును సంధర్బములో మీ తండ్రి మహా తపోధనుడగు దూర్వాస మహా మునికి అంజలి ఘటించి . ఇలా పలికెను . " ఓ ముని శ్రేష్టా మా ఇక్ష్వాకు వంశము యొక్క  బవితవ్యము ఎట్టిది? . మా కుమారుల ఆయుః సౌభాగ్యములు ఎట్టివి? . వారి పుత్రుల యొక్క ఆయుప్రమాణాలు ఎట్టివి? . ఈ విషయములన్ని తెలుసు కోవాలని చాలా ఉత్సాహముతో ఉన్నాను దయచేసి తెల్పుము . " అని పలికెను . అప్పుడు దూర్వాస మహాముని " మహారాజా ! నేను నీకు ఒక పూర్వ వృతాంతాన్ని చెప్తా విను . ఒకానొకప్పుడు దేవతలకు అసురులకు యుద్ధము సంభవించెను . అప్పుడు దైత్యులు దేవతలకు భయపడి . భృగు మహర్షి భార్యని ఆశ్రయించిరి . ఆమె అభయమిచ్ఛేను . వారు ఆ ఆశ్రమములో  నిర్భయముగా ఉండసాగిరి . అది గమనించిన శ్రీ మహావిష్ణువు కోపించి తన సుదర్శన చక్రంతో భృగుపత్ని  శిరస్సు ఖండించెను . అది చూసి భృగుమహర్షి మిక్కిలి కోపంతో ' జనార్ధన! స్త్రీని , అందునా ఋషి పత్నిని  కోపంతో ఒడలెఱుంగక చంపినావు . కావున నీవు మానవుడవై జన్మిస్తావు . అంతే కాదు ఆ మానవ లోకంలో చాలా కాలం పత్నివియోగాన్ని పొందుతావు అని శపించెను పిమ్మట తాను చేసిన తప్పును తలచుకొని పశ్చాత్తాపంతో తనకు ప్రతి శాపం వచ్చునేమో అని కలవర పడెను ఆ ప్రభువునే ఆరాధించెను . అప్పుడు భక్త సులభుడు అయిన  ఆ మహా విష్ణువు  లోక హితము కొరకు ఆ శాపమును అంగీకరించెను ఆ పరంధాముడే నీ కడుపున రాముడిగా జన్మించెను . భృగు మహర్షి యొక్క శాప ఫలితము అతడు తప్పక పొందును . అతడు అయోధ్యకు రాజై వేల  సంవత్సరములు ప్రజలనురంజకముగా పరిపాలించి తన లోకమునకు చేరును . ఆ శ్రీ రాముడు అశ్వమేధముమొదలైన అనేక యాగాలు సమృద్ధిగా  చేయును . అతనికి సీతాదేవి యందు ఇద్దరు కుమారులు జన్మించును . వారిరువురు అయోధ్యనందు కాక వేరొక చోట జన్మించును . ఆ కుమారులకు రాముడు కోసల రాజ్యమును పట్టము కట్టును . " అని పలికెను . పిమ్మట దశరధ మహారాజు వారిరువురికి తిరిగి నమస్కరించి సెలవు తీసుకొని అయోధ్యకు తిరిగి వచ్చెను . లక్ష్మణా! ఈ విషయములన్నిటినీ నా మనస్సులోనే పదిలంగా ఉంచుకున్నాను వాటిని ఇప్పుడు నీకు వివరించాను . ఇది విధి నిర్ణయము అగుట వలన పరితపించ వలదు ధైర్యము వహించు. " అని పలికెను . ఆ మాటలు విన్న లక్ష్మణుడు చాలా సంతోషించి బలే బలే అని పలికెను . ఆ విధంగా వారిద్దరూ మాట్లాడుకుంటూ సూర్యాస్త సమయమునకు కేశిని నదీ తీరమునకు చేరిరి . 

                             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











రామాయణము , ఉత్తరకాండ -------- యాబదియవసర్గ

                               రామాయణము 

                             ఉత్తరకాండ -------- యాబదియవసర్గ 

జనకుడి కూతురైన సీతాదేవి వాల్మీకాశ్రమము చేరినట్లు తెలుసుకొని లక్ష్మణుడి మనస్సు మిక్కిలి పరితాపమునకు లోనయ్యేను . అప్పుడు అతడు సారధి ఐన సుమంత్రుడితో " సారధీ! ఎంతటి వారికైనా విధి నిర్నయం తప్పించుకోలేనిది కదా . నిజంగా శ్రీ రాముడే కోపిస్తే దేవ,దానవ,గంధర్వులను  సైతం పరిమార్చగలడు  . అట్టి రఘువీరుడు తన భార్యను అడవులకు వదిలి నాడు . సీతా సాద్వి విషయములో మంచి చెడులను మరచి నోటికి వచ్చినట్లు మాట్లాడిన పురజనుల మాటలను పాటించి ఇలాంటి క్రూర కృత్యమునకు పాల్పడుట ఎంత వరుకు ధర్మ బద్దం . ఏ విధముగా ఆలోచించినా ఇది ఆయన కీర్తికి గొడ్డలిపెట్టే " అని పలుకగా సుమంత్రుడు" లక్ష్మణా! పూర్వము మీ తండ్రిగారి ఎదుట దైవజ్ఞులు ఈ సంగతిని తెలిపినారు శ్రీ రాముడు సుఖార్హుడే అయ్యినప్పట్లికి కష్టములు తప్పవు ఆత్మీయుల ఎడబాటు తప్పక కలుగును . ఒక సారి మీ తండ్రికి దూర్వాస మహాముని చెప్పిన ఒక రహస్య విషయమును నీకు తెలిపేదెను వినుము . దాన్ని ఎవ్వరికి చెప్పరాదని రాజాజ్ఞ . మహారాజు ఈ విషయముని రహస్యముగా ఉంచమని చెప్పినప్పటికీ నీ బాధని చూడలేక నేను ఆ విషయమును చెప్పుచున్నాను "  అని పలుకగా లక్ష్మణుడు ఆశ్చర్యముతో " ఏమా విషయము ?" అని అడిగెను . 

శశి ,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగు పండితులు . 



Tuesday 4 May 2021

రామాయణము --------- ఉత్తరకాండ-----------నలుబది తొమ్మిదవసర్గ

                              రామాయణము 

                           ఉత్తరకాండ-----------నలుబది తొమ్మిదవసర్గ 

సీతాదేవి ఆ అరణ్యం లో కింద పది ఏడుస్తూ ఉండగా ఆ ప్రదేశానికి ముని బాలాకులు కొందరు వచ్చి ఆమెను చూసి వెంటనే వారు పరుగు పరుగున వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్లి "మహాత్మా మన ఆశ్రమమునకు దగ్గరలో క స్త్రీ వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది . ఆమె సాక్షాత్తు లక్ష్మి దేవి వాలే ఉంది . అట్టి వనితను ఇదువరిలో మేము చూసి ఎరుగము . ఆమె కచ్చితంగా మానవ కాంత అయ్యిఉండదు దివ్యస్త్రీ  కావచ్చు . కానీ ఆమె దుఃఖ సముద్రములో మునిగి ఉన్నది" . అని పలుకగా తపఃప్రభావముచే దివ్యదృష్టి కలవాడు ,ధర్మవేత్త అయిన ఆ మహర్షి వెంటనే త్వరత్వరగా ఆ ప్రదేశం వైపుగా వేళ్ళ సాగెను . ఆ మహాత్ముడిని శిష్యులు అనుసరించిరి . కొంతదోరం నడిచిన పిమ్మట వాల్మీకి మహర్షి సీతాదేవిని చూసేను . గబగబా ఆ దేవి వద్దకు వెళ్లి "అమ్మా! నీవు శ్రీ రాముడు ధర్మ పత్నివి . పరమ పవిత్రురాలివి సాద్వీ మణివి నీకు స్వాగతం . నీవు ఇక్కడికి రాబోతున్నట్టు నాకు ముందే తెలుసు నీ రాకకు గల కారణాలు కూడా తెలుసు . నీ వృతాంతం అంతా పూర్తిగా నేను ఎరుగుదును ,అమ్మా! నీ యందు ఎట్టి దోషము లేదనియు , నీవు పవిత్రురాలివనియు నేను బాగుగా ఎరుగుదును . ఈ సమీపములోనే కల నా ఆశ్రమము నందు కొందరు ముని పత్నులు తపస్సు చేసుకుంటూ ఉంటారు . అమ్మా! వారు నిన్ను సర్వదా కన్నా బిడ్డలా చూసుకుంటారు . ఈ ఆశ్రమమున నీవు నీ స్వగృహముగా భావించి ఎటు వంటి మనస్తాపము లేకుండా నిర్భయముగా ఉండుము . " అని పలికేను . 
ఆ మాటలు విన్న సీతా దేవి మహర్షి పాదపద్మములకు శిరసా ప్రణమిల్లి అట్లే అని పలికెను . పిమ్మట ఆమె ఆ మహర్షిని అనుసరించి ఆశ్రమము చేరెను . ఆ విధముగా ఆశ్రమములోకి వస్తున్న వాల్మీకి మహర్షిని సీతాదేవిని చూసి అక్కడి ముని పత్నులు ఎదురువచ్చిరి . వారితో వాల్మీకి మహర్షి "తల్లులారా ! ఈమె సీతా మహాసాద్వి ప్రతిభా మూర్తి అయినా శ్రీ రామచంద్ర ప్రభువు యొక్క ధర్మపత్ని . ఈమె నిష్కళంక చరిత పరమ పుణ్యాత్మురాలు . విధి వశమున పతి నిర్ణయం ప్రభావమున ఈమె ఇచటికి చేరినది . ఈమె ఇక నా రక్షణలో ఉండును మీరందరు నా మాటలపై గౌరవం ఉంచి . ఈమెను వాస్తల్యముతో చూడండి . సేవలు చెయ్యండి . " అని మరీ మరీ చెప్పి ఆమెను వారికి అప్పగించెను . పిమ్మట ఆయన పక్కనే కల మరొక ఆశ్రమములోకి శిష్యులతో కలిసి ప్రవేశించెను . 


శశి ,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 









రామాయణము, ఉత్తర కాండ ----------- నలుబది ఎనిమిదవ సర్గ

                                        రామాయణము 


                                ఉత్తర కాండ ----------- నలుబది ఎనిమిదవ సర్గ 

జనకుని కూతురు దశరథుడి కోడలు రామచంద్ర ప్రభువు ఇల్లాలు అయిన వైదేహి దేవి లక్ష్మణుడి మాటలు విని మొదలు నరికిన అరటిచెట్టులా నేల పై కూలి స్పృహ కోల్పోయింది . కాసేపటికి స్పృహ లోకి వఛ్చి ఆగకుండ కారుతున్న కన్నీటితో దీన వదనంతో ఎదురుగ ఉన్న లక్ష్మణుడి తో ఇలా పలికింది . " లక్ష్మణా! బహుశా బ్రహ్మ దేవుడు నన్ను దుఃఖములు అనుభవించుటకే సృష్టించి నట్లున్నాడు . పూర్వ జన్మలో నేను చేసిన పాపమేమిటో? ఇక్కడ గల మునులు ,మహాత్ముడు ధర్మస్వరూపుడు అయిన  శ్రీ రామచంద్ర ప్రభువు నన్ను వదిలి పెట్టుటకు కారణమేమిటి అని అడిగితే నేను ఏమని సమాధానము చెప్పను? . మీ అన్నగారికి నా వచనములు ఈ విధముగా తెల్పుము . ' నేను ఎల్లప్పుడూ భక్తి తత్పరతతో మీ హితమునే కోరుకొనుచూ ఉంటాను . వాస్తవముగా నేను పరమ పవిత్రురాలినని  మీ మనసుకు తెలుసు . నాకు మీరే దైవము, బంధువు, గురువు ,ప్రాణముల కంటే మిన్న . కనుక మీ ఆజ్ఞను నేను తప్పక నెరవేర్చెదను '. అని తెల్పుము. అని పలికి మల్లి లక్ష్మణునితో నాయనా లక్ష్మణా! మా అత్తలు అందరికి నేను శిరసా ప్రణమిల్లినానని  తెల్పుము . అంతఃపుర స్త్రీ లు అందరిని కూడా అడిగానని చెప్పు ." అని పలికి వెక్కి వెక్కి ఏడ్చుచూ చేతులతో ముఖము దాచుకొనెను . 
   ఆ మాటలు విన్న లక్ష్మణుడి మనస్సు మిక్కిలి వేదనకు గురి అయ్యింది . అతడు నెల పై సాగిలా పడి ఆ దేవికి మొక్కెను . ఎంతగా ప్రయత్నించినా గొంతుపెగలక వెక్కివెక్కి ఏడ్చెను . పిమ్మట అతడు బిగ్గరగా ఏడ్చుచు ఆ తల్లికి ప్రదక్షిణము చేసెను . అక్కడ నిలబడలేక ఆమెను ఓదార్చుటకు శక్తీ లేక తప్పక నావ ఎక్కి, గంగా నది ఉత్తర తీరమునకు చేరి రధము ఎక్కెను . అతడు మాటిమాటికి తల వెనక్కి తిప్పి నిస్సహాయుడై ఆదేవిని చూసేను . ఆ సమయములో ఆ దేవి దిక్కులేని దానిలా నేలపై పడి పొరలుతూ ఎక్కీఎక్కి ఏడ్చుచుండెను . 




రామాయణము ---------------- ఉత్తరకాండ ---------------- నలుబది ఎనిమిదవసర్గ --------------- సమాప్తం 

శశి,

ఎం.ఏ , ఎం.ఏ(తెలుగు),తెలుగు పండితులు .