Tuesday 4 May 2021

రామాయణము, ఉత్తర కాండ ----------- నలుబది ఎనిమిదవ సర్గ

                                        రామాయణము 


                                ఉత్తర కాండ ----------- నలుబది ఎనిమిదవ సర్గ 

జనకుని కూతురు దశరథుడి కోడలు రామచంద్ర ప్రభువు ఇల్లాలు అయిన వైదేహి దేవి లక్ష్మణుడి మాటలు విని మొదలు నరికిన అరటిచెట్టులా నేల పై కూలి స్పృహ కోల్పోయింది . కాసేపటికి స్పృహ లోకి వఛ్చి ఆగకుండ కారుతున్న కన్నీటితో దీన వదనంతో ఎదురుగ ఉన్న లక్ష్మణుడి తో ఇలా పలికింది . " లక్ష్మణా! బహుశా బ్రహ్మ దేవుడు నన్ను దుఃఖములు అనుభవించుటకే సృష్టించి నట్లున్నాడు . పూర్వ జన్మలో నేను చేసిన పాపమేమిటో? ఇక్కడ గల మునులు ,మహాత్ముడు ధర్మస్వరూపుడు అయిన  శ్రీ రామచంద్ర ప్రభువు నన్ను వదిలి పెట్టుటకు కారణమేమిటి అని అడిగితే నేను ఏమని సమాధానము చెప్పను? . మీ అన్నగారికి నా వచనములు ఈ విధముగా తెల్పుము . ' నేను ఎల్లప్పుడూ భక్తి తత్పరతతో మీ హితమునే కోరుకొనుచూ ఉంటాను . వాస్తవముగా నేను పరమ పవిత్రురాలినని  మీ మనసుకు తెలుసు . నాకు మీరే దైవము, బంధువు, గురువు ,ప్రాణముల కంటే మిన్న . కనుక మీ ఆజ్ఞను నేను తప్పక నెరవేర్చెదను '. అని తెల్పుము. అని పలికి మల్లి లక్ష్మణునితో నాయనా లక్ష్మణా! మా అత్తలు అందరికి నేను శిరసా ప్రణమిల్లినానని  తెల్పుము . అంతఃపుర స్త్రీ లు అందరిని కూడా అడిగానని చెప్పు ." అని పలికి వెక్కి వెక్కి ఏడ్చుచూ చేతులతో ముఖము దాచుకొనెను . 
   ఆ మాటలు విన్న లక్ష్మణుడి మనస్సు మిక్కిలి వేదనకు గురి అయ్యింది . అతడు నెల పై సాగిలా పడి ఆ దేవికి మొక్కెను . ఎంతగా ప్రయత్నించినా గొంతుపెగలక వెక్కివెక్కి ఏడ్చెను . పిమ్మట అతడు బిగ్గరగా ఏడ్చుచు ఆ తల్లికి ప్రదక్షిణము చేసెను . అక్కడ నిలబడలేక ఆమెను ఓదార్చుటకు శక్తీ లేక తప్పక నావ ఎక్కి, గంగా నది ఉత్తర తీరమునకు చేరి రధము ఎక్కెను . అతడు మాటిమాటికి తల వెనక్కి తిప్పి నిస్సహాయుడై ఆదేవిని చూసేను . ఆ సమయములో ఆ దేవి దిక్కులేని దానిలా నేలపై పడి పొరలుతూ ఎక్కీఎక్కి ఏడ్చుచుండెను . 




రామాయణము ---------------- ఉత్తరకాండ ---------------- నలుబది ఎనిమిదవసర్గ --------------- సమాప్తం 

శశి,

ఎం.ఏ , ఎం.ఏ(తెలుగు),తెలుగు పండితులు . 
























No comments:

Post a Comment