Wednesday 5 May 2021

రామాయణము , ఉత్తరకాండ------------యాబదిఒకటవసర్గ

                               రామాయణము 

                             ఉత్తరకాండ------------యాబదిఒకటవసర్గ  

లక్ష్మణుడి ప్రేరణతో సుమంత్రుడు దూర్వాస మహాముని  పలికిన పలుకులను గురించి ఈ విధముగా చెప్ప సాగెను . లక్ష్మణా! ఒకానొకనాడు  అత్రి మహర్షి కుమారుడైన, దూర్వాస మహాముని వసిష్ఠ మహాముని ఆశ్రమములో చాతుర్మాస్య దీక్షను నడిపెను . మీ తండ్రి తన పురోహితుడైన వసిష్ఠ మహర్షిని దర్శించుటకు ఆయన ఆశ్రమమునకు వెళ్లగా అక్కడ వశిష్ట, దూర్వాస మహామునులు ఇద్దరిని చూసి పరమ సంతోషముతో నమస్కరించెను . వారుకూడా మహారాజుకి స్వాగతం పలికి ఆసనమిచ్చి అర్ఘ్య  పాద్యములతో ఫలమూలాదులతో సత్కరించిరి . పిమ్మట ముగ్గురు కూర్చుని మాట్లాడుకును సంధర్బములో మీ తండ్రి మహా తపోధనుడగు దూర్వాస మహా మునికి అంజలి ఘటించి . ఇలా పలికెను . " ఓ ముని శ్రేష్టా మా ఇక్ష్వాకు వంశము యొక్క  బవితవ్యము ఎట్టిది? . మా కుమారుల ఆయుః సౌభాగ్యములు ఎట్టివి? . వారి పుత్రుల యొక్క ఆయుప్రమాణాలు ఎట్టివి? . ఈ విషయములన్ని తెలుసు కోవాలని చాలా ఉత్సాహముతో ఉన్నాను దయచేసి తెల్పుము . " అని పలికెను . అప్పుడు దూర్వాస మహాముని " మహారాజా ! నేను నీకు ఒక పూర్వ వృతాంతాన్ని చెప్తా విను . ఒకానొకప్పుడు దేవతలకు అసురులకు యుద్ధము సంభవించెను . అప్పుడు దైత్యులు దేవతలకు భయపడి . భృగు మహర్షి భార్యని ఆశ్రయించిరి . ఆమె అభయమిచ్ఛేను . వారు ఆ ఆశ్రమములో  నిర్భయముగా ఉండసాగిరి . అది గమనించిన శ్రీ మహావిష్ణువు కోపించి తన సుదర్శన చక్రంతో భృగుపత్ని  శిరస్సు ఖండించెను . అది చూసి భృగుమహర్షి మిక్కిలి కోపంతో ' జనార్ధన! స్త్రీని , అందునా ఋషి పత్నిని  కోపంతో ఒడలెఱుంగక చంపినావు . కావున నీవు మానవుడవై జన్మిస్తావు . అంతే కాదు ఆ మానవ లోకంలో చాలా కాలం పత్నివియోగాన్ని పొందుతావు అని శపించెను పిమ్మట తాను చేసిన తప్పును తలచుకొని పశ్చాత్తాపంతో తనకు ప్రతి శాపం వచ్చునేమో అని కలవర పడెను ఆ ప్రభువునే ఆరాధించెను . అప్పుడు భక్త సులభుడు అయిన  ఆ మహా విష్ణువు  లోక హితము కొరకు ఆ శాపమును అంగీకరించెను ఆ పరంధాముడే నీ కడుపున రాముడిగా జన్మించెను . భృగు మహర్షి యొక్క శాప ఫలితము అతడు తప్పక పొందును . అతడు అయోధ్యకు రాజై వేల  సంవత్సరములు ప్రజలనురంజకముగా పరిపాలించి తన లోకమునకు చేరును . ఆ శ్రీ రాముడు అశ్వమేధముమొదలైన అనేక యాగాలు సమృద్ధిగా  చేయును . అతనికి సీతాదేవి యందు ఇద్దరు కుమారులు జన్మించును . వారిరువురు అయోధ్యనందు కాక వేరొక చోట జన్మించును . ఆ కుమారులకు రాముడు కోసల రాజ్యమును పట్టము కట్టును . " అని పలికెను . పిమ్మట దశరధ మహారాజు వారిరువురికి తిరిగి నమస్కరించి సెలవు తీసుకొని అయోధ్యకు తిరిగి వచ్చెను . లక్ష్మణా! ఈ విషయములన్నిటినీ నా మనస్సులోనే పదిలంగా ఉంచుకున్నాను వాటిని ఇప్పుడు నీకు వివరించాను . ఇది విధి నిర్ణయము అగుట వలన పరితపించ వలదు ధైర్యము వహించు. " అని పలికెను . ఆ మాటలు విన్న లక్ష్మణుడు చాలా సంతోషించి బలే బలే అని పలికెను . ఆ విధంగా వారిద్దరూ మాట్లాడుకుంటూ సూర్యాస్త సమయమునకు కేశిని నదీ తీరమునకు చేరిరి . 

                             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











No comments:

Post a Comment