Tuesday, 10 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునాఱవసర్గ

                                                రామాయణము 

                                                 కిష్కిందకాండ -పదునాఱవసర్గ 

చంద్రుని వాలే మనోహరమైన ముఖము కల తార పలికిన మాటలు విన్న వాలి ఆమెను మందలించుచు "ఓ సుందరీ !సుగ్రీవుడు నాకు సోదరుడే కాదనను . ఇప్పుడు అతడు నాకు శత్రువు అతడు యుద్ధమునకు ఆహ్వానించుచు గర్జిస్తుoడగా  నేను పిరికివాడు వాలే కూర్చొననా ?శ్రీరాముని వలన నాకు ప్రమాదం జరుగునని శంకించకు . ధర్మము బాగుగా ఎరిగిన ఆయన నిర్దోషినైన నన్ను భాదించడు . ఓ తారా !నీవు నాపై కల ప్రేమను వ్యక్తపరిచితివి . నేను నీకు మాట ఇచ్చుచున్నాను . సుగ్రీవుని చిత్తుగా ఓడించి తిరిగి నీ వద్దకు వచ్చెదను . సుగ్రీవుడు నా బలము ముందు నిలవలేడు . నేను అతడిని చావమోడుతాను కానీ చంపను . నీవు అంతఃపురములోకి వెళ్లుము . "అని పలికెను . 
వాలి మాటలు విన్న తార వాలికి ప్రదక్షణ చేసి ,మంగళహారతి ఇచ్చి స్వస్తి వచనములు పలికి అంతఃపురములోకి వెళ్లెను . పిమ్మట వాలి సుగ్రీవుని అరుపు వచ్చిన దిశగా కోపముతో వడివడిగా నడక ప్రారంభించెను . సుగ్రీవుడు కనపడినంతనే వాలి తన పై వస్త్రమును నడుమునకు బిగువుగా కట్టి పిడికిలి బిగించి సుగ్రీవునికి దగ్గరగా రాసాగేను



 . 
వాలిని చూసిన సుగ్రీవుడు కూడా తన ఉత్తరీయమును నడుమునకు బిగించి వాలి మీదకు దూకేను . వాలి ఒక్క పిడిగుద్దుతో సుగ్రీవుని పడవేసెను . రక్తము కక్కుకున్న సుగ్రీవుడు మిక్కిలి కోపముతో అరుచుచు అక్కడే వున్నా పెద్ద మద్ది చెట్టుని పీకి వాలిని  దానితో కొట్టెను . ఆ దెబ్బకు వాలి చలించిపోయెను . పిమ్మట అన్నదమ్ములు ఇరువురు చెట్లతోటి ,పర్వతములతోటి ,గోళ్ళతోటి ,మోచేతులతో ,మోకాళ్ళతో భయంకరముగా అరుస్తూ యుద్ధముచేసుకొనసాగిరి . వారిరువురి శరీరములు రక్తముతో తడిసిపోయెను . క్రమముగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లనారంభించెను . అప్పుడు సుగ్రీవుడు మాటిమాటికి దిక్కులు చూడనారంభించెను . అది గమనించిన శ్రీరాముడు సుగ్రీవుని ఆంతర్యమును అర్ధము చేసుకుని విషతుల్యమైన బాణమును తీసి వాలిపై ప్రయోగించెను . 

అది మాత్రా (రెప్పపాటు ) కాలములో వాలి శరీరములో ప్రవేశించెను . ఆ బాణము దాటికి నిలువలేక వాలి కిందపడిపోయెను . శ్రీరాముడు ప్రయోగించిన బాణము బంగారము వెండి తో అలంకృతమై వున్నది . ఆ బాణపు దాటికి వాలి శరీరము నుండి రక్తము ప్రవహింపసాగెను . అతడు అచేతనుడై రణరంగమున పడిపోయెను . 

రామాయణము కిష్కింద కాండ పదునాఱవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment