Friday 2 March 2018

రామాయణము కిష్కిందకాండ -పన్నెండవసర్గ

                            రామాయణము 

                                     కిష్కిందకాండ -పన్నెండవసర్గ 
అప్పుడు సకల శుభదాయకుడైన శ్రీరాముడు సుగ్రీవుని మాటలు విని తన మనసుకి ధైర్యము నమ్మకము కలిగించుటకు తన విల్లు ధరించి వాడి ఐన శరమును బలిష్ఠముగా ఉన్న ఓ మద్ది చెట్టుపై వేయగా అది దానిని చీల్చి దానికి సమాంతముగా వున్న మరో ఏడు మద్దిచెట్లనీ ఏకకాలంలో చీల్చి ,కొండను చీల్చుకుంటూ పాతాళమున ప్రవేశించి తిరిగి రాముని తూణీరములోకి చేరెను .

 రాముని పరాక్రమమును కళ్లారా చూసిన సుగ్రీవుడు మిక్కిలి సంతోషించి ,శ్రీరాముని బలపరాక్రమములను పొగిడి ఆయనను ఆలింగనము చేసుకొనెను . 
పిమ్మట రాముడు చెప్పుటచే ,సుగ్రీవుడు తన అన్న ఐన వాలి పైకి యుద్ధమునకు వెళ్లి నగరము వెలుపల నిలబడి పెద్దగా పిలిచెను . అప్పుడు యుద్ధవీరుడైన వాలి ఆ కేక విని సమరోత్సాహముతో పరుగుపరుగున వచ్చి తమ్ముడితో తలపడసాగెను . ఆ మాహావీరులు ఇరువురు తమ ముష్టిఘాతములతో ఒకరినొకరు బలముగా మోసుకొనసాగిరి . ఒకేలా వున్న వారిరువురిలో సుగ్రీవుని రఘునందనుఁడు గుర్తింపలేకపోయెను . అందుచే తన బాణమును ప్రయోగించలేదు .

 అంతకంతకు బలము సన్నగిల్లగా ప్రాణభయముతో సుగ్రీవుడు తిరిగి ఋష్యమూక పర్వతమునకు పరుగు తీసెను . 
మతంగా మహర్షి శాపము గుర్తుండుటచే వాలి ఋష్యమూక పర్వతముపై అడుగు పెట్టక "బతికిపోయావుపో "అని వెనుతిరిగేను . ఋష్యమూక పర్వతము చేరిన సుగ్రీవుని చెంతకు రామలక్ష్మణులు ,హనుమదాది వీరులు చేరిరి . వారిని చూసిన సుగ్రీవుడు సిగ్గుతో తల వంచుకుని "రామా !నీవు రక్షించెదవనే ధైర్యముతో మా అన్నపైకి యుద్ధమునకు వెళ్లితిని . నీవు నాకు ఇచ్చిన మాటను ఏల నిలబెట్టుకోలేదు . నిన్ను నమ్మినందుకు ఇదేనా ఫలితము ?"అని ప్రశ్నించగా రాముడు 
"మిత్రమా !సుగ్రీవా !రూపురేఖలలోను ,కంఠ ధ్వనిలోను మీరిరువురు ఒక్కమాదిరిగా ఉంటిరి . మీలో ఎవరు నీవో ,ఎవరు వాళూ నేను పోల్చుకోలేకపోయితిని . పొరపాటున నీకు బాణము తగులునేమో అని నేను బాణ ప్రయోగము చేయకుంటిని .  ఈ సారి నీవు ఏదేని ఒక గుర్తును ధరించి యుద్ధమునకు వెళ్లుము . అప్పుడు నేను నిన్ను సులభముగా గుర్తించి వాలిని వధింపగలను "అని పలికెను . అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడి ఆజ్ఞను అనుసరించి అచట దొరుకు నాగకేసరి పూలను మాలగా కట్టి సుగ్రీవుడి మేడలో వేసెను . అనంతరము అందరూ కలిసి తిరిగి కిష్కింధకు పయనమయ్యిరి . 

                     రామాయణము కిష్కిందకాండ పన్నెండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment