Tuesday 17 October 2017

రామాయణము కిష్కిందకాండ -పదునొకొండవసర్గ

                                              రామాయణము 

                                                కిష్కిందకాండ -పదునొకొండవసర్గ 

శ్రీరాముడు పలికిన వచనములు విని సుగ్రీవుడు సంతోషించి తిరిగి ఆ మహానుభావుడితో "రామా !వాలి బాలసామర్ధ్యములు వివరించెదను "అని పలికి ఇలా తెలుపసాగెను . "రామా !వాలి బ్రహ్మయే ముహూర్తమునే లేచి భూమండలం నలుదిక్కులా కల సరోవరములలో స్నానము చేసిరాగలడు . వాలి పర్వత శిఖరములను బంతుల వలె ఆడుకొనగలడు . మహా వృక్షములను సైతము పెకలించగలడు ఒకానొక సమయములో దుందుభి అను పేరు కల ఒక పర్వతము తో సమానమైన భారీ దేహము కల ఒక రాక్షసుడు వుండెడివాడు . అతడు దేవతలా వలన పొందిన వార గర్వముతో సముద్రము వద్దకు వెళ్లి యుద్ధమునకు రమ్మని పిలిచెను . అప్పుడు సముద్రుడు వెలుపలికి వచ్చి "నీతో యుద్ధము చేయుటకు నేను అశక్తుడను . హిమవంతుడు అను ఒక మహా పర్వతుడు కలదు అతడే నీతో యుద్ధము చేయుటకు సమర్థుడు "అని పలికెను . 
అప్పుడా  దుందుభి హిమవత్పర్వతము వద్దకు వెళ్లి యుద్ధమునకు రమ్మని రెచ్చగొట్టెను . అప్పుడా మహాత్ముడు "ఓ వీరా !నేను తాపములాచరించెడి సాధువులకు నెలవైనవాడిని . నీతో యుద్ధము చేయలేను . కావున నీవు మరలిపొమ్ము "అని పలుకగా అప్పుడా రాక్షసుడు "నాకు యుద్ధము చేయవలెనని బాగుగా కోరిక వున్నది కావున నీవు యుద్ధము చేయలేను ఎడల ,నాతొ యుద్ధము చేయగల సమర్థుడు ఎవరో తెలుపుము "అని పలికెను . అప్పుడా హిమవంతుడు "వాలి అను వీరుడు కలడు . అతడు నీతో యుద్ధము చేయుటకు సమర్థుడు . కిష్కింధకు రాజు ,మహాబలశాలి ,వానరవీరుడు "అని తెలుపగా ఆ దుందుభి సమరోత్సాహముతో కిష్కింధకు వెళ్లి అచట ద్వారమును బాదుతూ ,పక్కన వున్నా చెట్లను పీకి వేయుచూ ,మహా నాదము చేస్తూ ,వాలిని యుద్ధమునకు రమ్మని బిగ్గరగా పిలువసాగెను . 
అప్పుడు వాలి ఆ చప్పుళ్లకు అంతఃపురము నుండీ స్త్రీలతో కలిసి బయటకు వచ్చి ఆ దుందుభిని చూసి "ఓ వీరా !దుందుభీ ! నీ గూర్చి ఇదివరలోనే వింటివుంటిని . ఎందుకు అలా ద్వారమును బాదుతూ వృక్షములను నాశనము చేస్తూ నీ మరణమును నీవే కొనితెచ్చుకొనెదవు "అని పలుకగా దుందుభి "ఓ వాలీ !స్త్రీల మధ్యలో నిలబడి ప్రగల్బాలు పలుకుచున్నావు . నీకు ఈ రాత్రికి గడువు ఇస్తున్నాను . ఈ రాత్రి హాయిగా గడిపిన పిమ్మట నిన్ను రేపు ఉదయమే వధించెదను . "అని పలికెను . అప్పుడు వాలి నవ్వుతూ స్త్రీలనందరినీ అంతఃపురములోకి పంపివేసి ఆ రక్కసుడితో యుద్ధమునకు దిగెను . ఇద్దరు హోరాహోరీగా పోట్లాడుకొనిరి . కొంతసేపటికి వాలి మెడలోని సువర్ణమాల కారణముగా దుందుభి శక్తి క్షీణించి వాలి శక్తి ఎక్కువయ్యెను . అంత వాలి ఆ దుందుభిని తన దెబ్బలతో చంపి ,వాడి శరీరమును దూరముగా విసిరివేసెను . 
ఆ దుందుభి శరీరము ఋష్యమూక పర్వతముపైవున్న మతంగా మహర్షి ఆశ్రమము దగ్గరలో పడెను . ఆ శరీరము నోటి నుండి కొన్ని రక్తపు బిందువులు మతంగా మహర్షి ఆశ్రముపై పడెను . అంత మహర్షి కోపించి దీనికి కారణము ఎవరా అని అలోచించి ,వాలి అని గ్రహించి అతడిని" ఈ ఆశ్రమము .పరిసరములు అపవిత్రము చేసిన కారణముగా ఈ పరిసర ప్రాంతములకు అడుగుపెట్టిన వెనువెంటనే మరణింతువని "శపించెను . "వాలి అనుచరులు కూడా ఈ పర్వతముపైనుండి రేపటిలోగా మరలిపోనిచో మరణించెదరు . "అని శపించెను . ఆ శాప వాక్కులు విన్న వాలి అనుచరులు అచటి నుండి కిష్కిన్దాకు చేరి వాలికి జరిగిన విషయము వివరించిరి . ఆ విషయము తెలుసుకున్న వాలి మాత్మగా మహర్షి ని కరుణించమని ప్రార్ధించెను . కానీ మతంగా మహర్షి వినిపించుకోలేదు . ఆ కారణముగా వాలి ఎప్పుడు ఈ పర్వతము వైపు కన్నెత్తి కూడా చూడడు "అని సుగ్రీవుడు పలికెను . 
ఇంకనూ సుగ్రీవుడు రామునితో "ఈ విషయముత్ తెలుసుకున్న నేను మా అన్న నుండీ  రక్షించుకొనుటకు  నివసించుచున్నాను . ఇదిగో పెద్ద కొండలా ఉన్న ఇదే దుందుభి అస్థిపంజరం . "అని పలికి సుగ్రీవుడు మరి వాలిని మీరు జనించగలరా ?"అని ప్రశ్నించెను . దానికి సమాధానముగా శ్రీరాముడు దుందుభి అస్తిపంజరమును తన ఎడమకాలి బొటనవేలితో దూరముగా ఎగురునట్లు చేసెను .

రామాయణము కిష్కిందకాండ పదునొకొండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment