Thursday 19 April 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదియవసర్గ

                                     రామాయణము 

                                    కిష్కిందకాండ -ఇరువదియవసర్గ 

శ్రీరాముని బాణాపుదెబ్బచే నేలపై పది ఉన్న వాలిని ఆ తార కౌగలించుకుని "ఓ వానరవీరా !యుద్ధమున తిరుగులేనివాడవు . వానరులలో ప్రముఖుడవు . నీవంటి మహారాజు ఇలా నేలపై పరుండుట తగునా !లే లేచి తగిన శయ్యపై పరుండుము . నీకు అత్యంత ప్రియమైన భార్యనైన నేను ఈ విధముగా నీ చెంతనే ఉండి ఈవిధముగా విలపించుచుండగా కానేసాము మారు పలుకవేమి ? కనీసము నీ గారాల పుత్రుడైన  అంగదుడనైనా ఊరడించవేమి ?మేము నీకు అప్రియములైన ఏ పనులు చేసినాము ?ఇక నుండి నువ్వు అల్లారుముద్దుగా పెంచిన అంగదుడు పినతండ్రి కోపతాపములు భరించుచు జీవించవలెను కాబోలు " అంటూ ఏడ్చెను . తిరిగి కుమారునివైపు తిరిగి . "నాయనా !అంగదా !మీ తండ్రి ని కనులారా చూచుకో మల్లి ఆ అదృష్టము దక్కదు ". అని పలికి తిరిగి వాలివైపు తిరిగి "నీవు నీ హితము కోరి నేను చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి నీ తమ్ముడి భార్య రామ ను చెర పట్టి చేచేతులారా ఈ దుస్థితిని తెచ్చుకున్నావు . "
 అని అప్లికి సుగ్రీవునితో "ఓ సుగ్రీవా !నీ కోరిక నెరవేరినది కదా తండ్రి వంటి అన్నగారిని పొట్టన పెట్టుకున్నావు . ఆయన విగత జీవుడై పడివున్నాడు ఇప్పుడు నీకు సంతోషమేగా ఇక నీ భార్యతో సంతోషముగా వుండు . ఈ రాజ్యమును ఏలుకో !"అనెను . అంటూ బిగ్గరగా ఏడ్చుచూ వాలివైపు తిరిగి "ఓ నాధా !నేను నీ భార్యలు అందరూ వచ్చి వున్నారు మమ్ములను కనీసము ఒక్కసారైనా చూడవేమి ?అజ్ఞానముతో మేమేమయినా దోషము చేసి ఉంటే మమ్ము మన్నించు "అనెను.  తిరిగి ఆమె నా ప్రియమైన భర్త చనిపోయి పడివున్ననూ  ఇంకనూ నా హృదయము బద్దలవలేదంటే నేను బహుశా పాషాణ హృదయురాలిని అయివుంటానని ఏడ్చి ప్రాయోపవేశమునకు సిద్దపడెను 

రామాయణము కిష్కిందకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు 







Saturday 14 April 2018

రామాయణము కిష్కిందకాండ -పందొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                              కిష్కిందకాండ -పందొమ్మిదవసర్గ 

ఆ విధముగా శ్రీరాముని దెబ్బకు వాలి పడిపోయాడని తెలిసిన తార అంతఃపురము నుండి పరుగు పరుగున వచ్చుచుండెను . ఆమెకు దారిలో అనేక వానర వీరులు వాలి కూలిపోవడంతో బయపడి పారిపోతూ కనిపించారు . ఆమె వారి ఆపి "ఓ వానర వీరులారా !రాజ్యము కోసము సుగ్రీవుడు పన్నిన పన్నాగము ఇది . అతడు శ్రీరాముని చేత తన అన్నపై బాణము వేయించెను . కావున మీరు భయపడనవసరము లేదు "అని పలికెను . అప్పుడా వానరవీరులు "అమ్మా !వాలి మరణావస్థలో వున్ననూ నీ కుమారుడు ఇంకనూ బతికే వున్నాడు ఇప్పుడు రాజ్యమును రక్షించుకొనుట తక్షణ కర్తవ్యము . ఇప్పటికే ఈ రాజ్యమునుండి వాలి చే బహిష్కరించబడిన వానరుల నుండి ముప్పు వున్నది సుగ్రీవుని నుండి ముప్పు వున్నది కావున  నీ కుమారునికి పట్టాభిషేకము చేసి రాజ్యరక్షణా బాధ్యతలు చేపట్టాలి కావున నీవు కూడా మా మాట విని అంతఃపురమునకు మారాలి పొమ్ము "అని పలికిరి . 
అప్పుడా తార "ఓ వీరులారా !నా భర్తే నా లోకము ఆయన మరణించినచో ఈ రాజ్యముతో నాకు పని లేదు . కుమారునితో కూడా పని లేదు . ఆయన చరణముల నేడే నాకు స్వర్గము "అని పలికి బోరున ఏడ్చుచు రణరంగమునకు వచ్చెను అచట ఆమె ముందుగా విల్లిను నేలపై పెట్టి దాని మీద చెయ్యి వేసి నిలబడిన శ్రీరాముని పక్కనే వున్నలక్ష్మణుని ,వారి వెంటే వున్నా సుగ్రీవుని నిర్మల బుద్దితో చూసేను . వారిని దాటుకుని వాలి  వద్దకు వచ్చి పెద్దపెట్టున ఎడ్వానారంభించెను .

 పెద్ద పెద్ద వృక్షములను కొండలను సైతము పీకి పారవేయగల వాలి ఇప్పుడు పరమ దీనావస్థలో వున్నాడు . శత్రువు ఎంతటి గొప్పవాడైన సునాయాసముగా ఓడించితిరిగి రాగల వీరుడు ఇప్పుడు తిరిగిరాని లోకములకు పోవుటకు సిద్దమై వున్నాడు . ఆమెకు గుండె పగిలినట్టు అనిపించెను . ఆమె ఆర్యాపుత్రా !అని బిగ్గరగా ఏడ్చుచుండెను . ఆడ లకుముకి పిట్ట వలే ఏడ్చుచున్న తారను ఆమె వెంటే వున్నా అంగదుడను చూసి సుగ్రీవుడు మిక్కిలి విషాదమునకు లోనయ్యేను . 

రామాయణము కిష్కిందకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Thursday 12 April 2018

రామాయణము కిష్కింద కాండ -పదునెనిమిదవసర్గ

                                          రామాయణము 

                                   కిష్కింద కాండ -పదునెనిమిదవసర్గ 

మరణావస్థలో వున్నవాలి శ్రీరాముని తనను వధించబూనటానికి కారణము అడుగగా శ్రీరాముడు ఇలా కారణము చెప్పనారంభించెను . "వానరా !ధర్మార్ధ విషయములు నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు . సరే నిన్ను శిక్షించుటకు కారణము చెబుతాను విను ,కొండలతో కొనలతో ,అరణ్యములతో కూడిన ఈ భూమి ఇక్ష్వాకు వంశ ఆధీనములో వున్నది . ఇప్పుడు ఇక్ష్వాకు వంశ ప్రభువు భరతుడు ,మేమందరము ఆయన అనుచరుల వంటి వారము ఆయనకు ధర్మపాలనలో సహాయపడు వారము . ఓ వాలి !పురుషుడు తనకంటే చిన్నవాడైన తన తమ్ముడిని ,తన పుతృడిని ,తన శిష్యుడిని ముగ్గురిని పుత్రుని వలె చూసుకొనవలెను . ఇది ధర్మజ్ఞులు చెప్పిన ధర్మము . ఆ ధర్మము ప్రకారము నీ సోదరుడైన సుగ్రీవుని భార్య నీకు కోడలుతో సమానము అనగా కూతురు వంటిది . అటువంటి ఆమెను నీవు కామాతురడవై చెరపట్టితివి . 
నీవు చేసిన ఈ తప్పుకు నేను శిక్షవిధించితిని . రాజ్యములో తప్పుచేసినవాడికి శిక్షవిధించక పోయినట్లయియే ఆ పాపము రాజుకు తగులుతుంది . పూర్వము ఇట్టిపాపమునే శ్రవణుడు అనే వాడు చేసాడు . మా వంశము వాడైన మాంధాత చక్రవర్తి అతడికి భయంకరమైన శిక్షవిధించాడు . ఓ వానరా !నీకు నేను విధించిన శిక్ష సరియైనది ఇందు ఏ మాత్రము అనుమానము లేదు . అదీ కాక నేను సుగ్రీవునితో మైత్రి చేసుకున్నప్పుడు అతడి భార్యను అతడి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించెదనని మాట ఇచ్చాను . నేను నా మాటను ఎలా నిలబెట్టుకోకుండావుండగలను ?ఓ వాలి !ఇక నిన్ను చాటుగా చంపుటకు గల కారణము చెప్పెదను వినుము . మహారాజులు మృగములను చాటున ఉండి అయినా వాలా పన్ని అయినా చంపవచ్చు . అది ధర్మమే నీవు మనిషివి కావు మృగమువి కావున ఇలా నిన్ను చంపుటలో ఏ దోషమూ లేదు . "అని పలికెను . 
శ్రీరాముని మాటలు విన్న వాలి "రామా !నీవు ధర్మపరుడవు ,నేను ఈ బాణపు దెబ్బకు తట్టుకోలేక ఏవో మాట్లాడాను నన్ను క్షమించు . నాకు నా మరణము గూర్చి చింతలేదు నా బాధ అంతా నా ఒక్కగానొక్క ముద్దులకుమారుడు అయినా అంగదుడు గురించే అతడిని అల్లారుముద్దుగా పెంచుకున్నాను . అతడి పరిస్థితి ఏమవుతుందో అనే నా భయము . నాయందు దయ ఉంచి నీవు అతడిని సంరక్షించుము . లక్ష్మణుడిని ,సుగ్రీవుని చూసినట్లే అతడిని చూడుము . నా భార్య తార మిక్కిలి తెలివికలది . ఆమె రాబోవు ఆపదను అంచనావేయుటలో సమర్థురాలు . ఆమె మాటలు పెడచెవినపెట్టి నేను ఈ మరణమును కొనితెచ్చుకున్నాను . సుగ్రీవుని ఆమెను ఏమి అనవద్దని చెప్పు "అని పలికెను . 
అప్పుడు రఘురాముడు "వానరా !అంగదుడు ఇంతవరకూ నేనుండి పొందిన ప్రేమాభిమానములే నా నుండి సుగ్రీవుని నుండి పొందగలడు . శిక్ష అనుభవించినావు కావున నీ పాపము నుండి విముక్తుడవు అయ్యావు . కావున నీవు విచారించవలదు "అని పలికెను . ఆ మాటలు విన్న వాలి స్వామి !నా అపచారమును మన్నింపుము "అని వేడుకొనెను . 

రామాయణము కిష్కిందకాండ పదునెనిమిదవసర్గ  సమాప్తం . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday 11 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునేడవసర్గ

                                         రామాయణము 

                                        కిష్కిందకాండ -పదునేడవసర్గ 

శ్రీరాముడి బాణపు దెబ్బకు నేలకొరిగిన వాలి కొంతసేపటికి కళ్లుతెరిచి రామలక్ష్మణులను చూసేను . పిమ్మట అతడు రామునితో పరుషముగా ఇలా మాట్లాడనారంభించెను . "స్వామి !నీవు మహారాజు పుత్రుడవు ,సకల ధర్మశాస్త్రములు అభ్యసించినవాడవు . ఉత్తమవంశమున జన్మించినవాడవు . పరాక్రమవంతుడివి ,అన్ని విధములుగా వాసికెక్కినవాడవు . నేను వేరొకరితో యుద్ధము చేయునపుడు నీవు నా వక్షస్థలమున ఎందుకు కొట్టితివి .' శ్రీరాముడు కనికరము కలవాడు ఆశ్రీతులను కాపాడువాడు . ఎల్లప్పుడూ ప్రజాహితమునకే పాటుపడేవాడు ,దయామయుడు ,సదాచారసంపన్నుడు' ,అని ఈ భూమండలం మొత్తము నీ గుణములను గానము చేయుచున్నది . శ్రీరాముడు ధర్మపరుడు అని నమ్మి తార అడ్డు పడినా వినక నేను సుగ్రీవునితో యుద్ధమునకు వచ్చితిని . నీవు యధార్ధమునకు అధర్మపరుడివి . 
నీ దేశమునకు ,నీ పురమునకు నీకు నేనెన్నడూ అపకారము తలపెట్టి ఎరుగను . నిన్ను ఎన్నడూ అవమానించి ఎరుగను . అటువంటి నన్ను ఎందుకు చంపబూనావు . నేను నీతో యుద్ధము చేయలేదు . పైగా నేను వానరుడను . రాజులు సాధారణముగా రాజ్యము కొరకు సంపద కొరకు యుద్ధములు చేస్తారు . మరి నీవు ఈ  రోజు నా వనము నుండి ఏమి ఆశించి నన్ను కొట్టావు . రాజద్రోహి ,గోబ్రాహ్మణ హత్యలు చేయువాడు ,చోరుడు ,ఎల్లప్పుడూ ప్రాణులను ,వధించువాడు నాస్తికుడు ,అన్న కంటే ముందుగా వివాహము చేసుకున్న వాడు ,చాడీలు చెప్పేది వాడు ,లోభి ,మిత్రద్రోహి ,గురుద్రోహి ,ఇతరుల సంపదను బలవంతముగా అనుభవించెడివాడు ,స్త్రీలను ఏడిపించెడివాడు వీరందరికి నరకయాతనలు తప్పవు . 
ఓ రఘువీరా !జింక చర్మము ఆసనమునకు ఉపయోగపడును ,చమరీమృగకేసములు చామరములుగా దైవసేవలో ఉపయోగపడును ,ఏనుగుల దంతములు లోకులు ఉపయోగించుకొనెదరు . మరి నేను ఏ రకంగానూ ఉపయోగపడను కదా ,కనీసము మాంసముగా భుజించుటకు కూడా నా శరీరము పనికి రాదు మరి నీవు ఏమి ఆశించి నన్ను వధించచూసావు ?ఓ రాజా !నిరపరాధులమైన మావంటి వారి పట్ల నీ పరాక్రమము ప్రదర్శించితివి . నా ఎదురుగా నిలిచి నాతొ యుద్ధము చేసినచో నేను తప్పక యుద్దములో నిన్ను ఓడించెడివాడను . రణరంగమున ఎవ్వరు నన్ను ఎదిరించలేరు . సీతామాత జాడకై నీవు సుగ్రీవుని బదులు నన్ను ఆశ్రయించి ఉంటే నేను మరు నిముషములోనే ఆమెను నీ ఎదుట నిలబెట్టెడివాడను . ఆ రావణుడు ఆదేవిని సముద్రములోకాని ,పాతాళములో కానీ ఎచ్చట దాచినా ఆ సాద్విని తెచ్చి వుండెడివాడను . జీవులకు మరణము సహజమే ,నా తదుపరి సుగ్రీవుడు రాజు అగుట కూడా సమంజసమే ,కానీ నీవు నన్ను ఇలా ఎందుకు కొట్టావో నాకు సమాధానము చెప్పు "అని వాలి శ్రీరాముని కోరెను . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Tuesday 10 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునాఱవసర్గ

                                                రామాయణము 

                                                 కిష్కిందకాండ -పదునాఱవసర్గ 

చంద్రుని వాలే మనోహరమైన ముఖము కల తార పలికిన మాటలు విన్న వాలి ఆమెను మందలించుచు "ఓ సుందరీ !సుగ్రీవుడు నాకు సోదరుడే కాదనను . ఇప్పుడు అతడు నాకు శత్రువు అతడు యుద్ధమునకు ఆహ్వానించుచు గర్జిస్తుoడగా  నేను పిరికివాడు వాలే కూర్చొననా ?శ్రీరాముని వలన నాకు ప్రమాదం జరుగునని శంకించకు . ధర్మము బాగుగా ఎరిగిన ఆయన నిర్దోషినైన నన్ను భాదించడు . ఓ తారా !నీవు నాపై కల ప్రేమను వ్యక్తపరిచితివి . నేను నీకు మాట ఇచ్చుచున్నాను . సుగ్రీవుని చిత్తుగా ఓడించి తిరిగి నీ వద్దకు వచ్చెదను . సుగ్రీవుడు నా బలము ముందు నిలవలేడు . నేను అతడిని చావమోడుతాను కానీ చంపను . నీవు అంతఃపురములోకి వెళ్లుము . "అని పలికెను . 
వాలి మాటలు విన్న తార వాలికి ప్రదక్షణ చేసి ,మంగళహారతి ఇచ్చి స్వస్తి వచనములు పలికి అంతఃపురములోకి వెళ్లెను . పిమ్మట వాలి సుగ్రీవుని అరుపు వచ్చిన దిశగా కోపముతో వడివడిగా నడక ప్రారంభించెను . సుగ్రీవుడు కనపడినంతనే వాలి తన పై వస్త్రమును నడుమునకు బిగువుగా కట్టి పిడికిలి బిగించి సుగ్రీవునికి దగ్గరగా రాసాగేను



 . 
వాలిని చూసిన సుగ్రీవుడు కూడా తన ఉత్తరీయమును నడుమునకు బిగించి వాలి మీదకు దూకేను . వాలి ఒక్క పిడిగుద్దుతో సుగ్రీవుని పడవేసెను . రక్తము కక్కుకున్న సుగ్రీవుడు మిక్కిలి కోపముతో అరుచుచు అక్కడే వున్నా పెద్ద మద్ది చెట్టుని పీకి వాలిని  దానితో కొట్టెను . ఆ దెబ్బకు వాలి చలించిపోయెను . పిమ్మట అన్నదమ్ములు ఇరువురు చెట్లతోటి ,పర్వతములతోటి ,గోళ్ళతోటి ,మోచేతులతో ,మోకాళ్ళతో భయంకరముగా అరుస్తూ యుద్ధముచేసుకొనసాగిరి . వారిరువురి శరీరములు రక్తముతో తడిసిపోయెను . క్రమముగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లనారంభించెను . అప్పుడు సుగ్రీవుడు మాటిమాటికి దిక్కులు చూడనారంభించెను . అది గమనించిన శ్రీరాముడు సుగ్రీవుని ఆంతర్యమును అర్ధము చేసుకుని విషతుల్యమైన బాణమును తీసి వాలిపై ప్రయోగించెను . 

అది మాత్రా (రెప్పపాటు ) కాలములో వాలి శరీరములో ప్రవేశించెను . ఆ బాణము దాటికి నిలువలేక వాలి కిందపడిపోయెను . శ్రీరాముడు ప్రయోగించిన బాణము బంగారము వెండి తో అలంకృతమై వున్నది . ఆ బాణపు దాటికి వాలి శరీరము నుండి రక్తము ప్రవహింపసాగెను . అతడు అచేతనుడై రణరంగమున పడిపోయెను . 

రామాయణము కిష్కింద కాండ పదునాఱవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 9 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునైదవసర్గ

                            రామాయణము 

                               కిష్కిందకాండ -పదునైదవసర్గ 

సుగ్రీవుడి గర్జన అంతఃపురంలో వున్నా వాలి కి వినపడినంతనే అతని మత్తు వదిలిపోయెను అతని శరీరము కోపముతో ఊగిపోవసాగెను . అతడి కళ్ళు కోపముతో ఎరుపెక్కేను . పిమ్మట అతడు గర్జించుచు సుగ్రీవునిపై యుద్ధమునకు వెళ్ళబోయేను . అప్పుడు వాలి భార్య తారా దేవి ఎదురొచ్చి భర్తను ప్రేమగా కౌగలించుకుని "ప్రాణేశ్వరా !నీ మంచి కొరకు నేను చెబుతున్న ఈ మాటలు వినుము నీలోని ఈ కోపమును త్వజించుము . ప్రభూ !యుద్ధమున నిన్ను గెలవగలిగినవాడు నీ శత్రువులలో ఎవ్వడు లేడు . నువ్వు మిక్కిలి పరాక్రమవంతుడివి . అందులో సందేహము లేదు . కానీ నీచేత    చావుదెబ్బలు  తిని వెంటనే తిరిగి వచ్చాడు అంటే ఎదో బలమయిన కారణము వుంది ఉంటుందని నా నమ్మకము . 
సుగ్రీవుని గర్జన లోని తీవ్రత ,గట్టితనం చూస్తూ ఉంటే ,అతడేదో గట్టి ప్రయత్నముతో వచ్చినట్టుగా నాకు సందేహముగా వున్నది . దీనిని సామాన్య విషయముగా  భావించకూడదు  . ఇదంతా చూస్తుంటే సుగ్రీవుడు ఎదో గట్టి అండతో వచ్చాడు అనిపిస్తోంది . ఇదంతా నేను ఊహించి చెప్పటం  లేదు . చారుల ద్వారా మన కుమారుడు అంగదుడు విన్న విషయాలు నాకు తెలిసాయి . అయోధ్యాధిపతి దశరధుని కుమారులు రామలక్ష్మణులు వీరాధివీరులు ,రణరంగమున ధీరులు వారు ఇప్పుడు ఇక్కడికి సమీపముననే అరణ్యమున ఉండి సుగ్రీవునితో మైత్రి కుదుర్చుకొన్నారుట . ఆ రాముడు అస్త్రవిద్యా విశారదుడు , సాధుజనులకు ఒక మహావృక్షం వంటివాడు . సర్వలోకరక్షకుడని వినివుంటిని .   అటువంటి మహానుభావుడితో కోరి వైరము పెట్టుకొనుట తగదు . 
పైగా సుగ్రీవుడు ఎవరో కాదు నీకు తోడబుట్టిన నీ తమ్ముడే ఈ లోకములో అతడికంటే ఆప్తులు నీకు ఇంకెవరు వుండరు . కాబట్టి అతడిని పిలిపించి యువరాజుగా పట్టాభిషేకము చేయి . ఆ పదవికి అతడు అన్ని విధములుగా అర్హుడు . కావున వైరము మాని అతడిని నీ అక్కున చేర్చుకొనుము . నాకు సంతోషము కలుగచేయదలుచుకున్నచో ఈ మాటలు పాటింపుము . "అని పలికెను . కానీ ఆయువు మూడిన వాలికి ఆ మాటలు ఏ మాత్రము రుచింపలేదు . 

రామాయణము కిష్కిందకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                                         శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ ఏ(తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము కిష్కిందకాండ -పదునాల్గవసర్గ

                                     రామాయణము 


                                             కిష్కిందకాండ -పదునాల్గవసర్గ 

రామసుగ్రీవాదులు త్వరత్వరగా నడుచుచు కిష్కింద సమీపమునకు చేరిరి . పిమ్మట సుగ్రీవుడు పెద్దగా గర్జన చేసెను . రామలక్ష్మణులు మిగిలిన వానర వీరులు చెట్లచాటున నిలబడి చూచుచుండిరి . అప్పుడు సుగ్రీవుడు రామునికి సమీపముగా వచ్చి ",రామా !నీ మాట ప్రకారము నేను మరలా వాలి పై యుద్ధమునకు వచ్చితిని . కేవలము నీవు రక్షించెదవనే దైర్యముతోనే వచ్చి ఉంటిని . కావున నీవు నాకు ఇదివరకు ఇచ్చిన మాట (వాలిని పరిమార్చెదను )నిలబెట్టుకొనుము" అని వినయముగా ,దీనంగా ప్రార్ధించెను . 
అప్పుడు రఘురాముడు "మిత్రమా !ఈ విషయముపై నీకు భయము కించిత్తు కూడా వలదు . నీవు ధైర్యముగా యుద్ధమునకు వెళ్లుము . నిన్ను గుర్తించుటకై లక్ష్మణుడు నా అనుజ్ఞచే 'గజసాహ్వము 'అను పేరు కల లతను నీ మేడలో వేసినాడు . ఆ మాల కారణముగా నేను నిన్ను గుర్తించి వాలిని వధించెదను . ఆ వాలిని నేను గుర్తించిన పిమ్మట కూడా అతడు సజీవుడై తిరిగి వెళ్ళినచో అది నా దోషము . కావున నీవు ఆలసింపక ఆ వాలిని యుద్ధమునకు ఆహ్వానింపుము . అతడికి యుద్ధము అన్న మిక్కిలి ప్రీతి . కావున అతడు మరల నీతో యుద్ధమునకు తప్పక వచ్చును . "అని పలికెను . 
రాముని మాటలు విన్న సుగ్రీవుడు ధైర్యము తెచ్చుకుని బిగ్గరగా ఆకాశము బ్రద్దలగునట్లు గర్జించెను . సుగ్రీవుడు  సూర్యుని వరము వలన జన్మించాడు . మేఘము వలె గర్జించుటలో సుప్రసిద్ధుడు . అతడి గర్జన విని పక్షులు బయపడి ఎగిరిపోయినవి . జంతువులూ మృగములూ బెదిరి పరుగిడినవి . 

                రామాయణము కిష్కిందకాండ పదునాలుగవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .