Monday 9 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునాల్గవసర్గ

                                     రామాయణము 


                                             కిష్కిందకాండ -పదునాల్గవసర్గ 

రామసుగ్రీవాదులు త్వరత్వరగా నడుచుచు కిష్కింద సమీపమునకు చేరిరి . పిమ్మట సుగ్రీవుడు పెద్దగా గర్జన చేసెను . రామలక్ష్మణులు మిగిలిన వానర వీరులు చెట్లచాటున నిలబడి చూచుచుండిరి . అప్పుడు సుగ్రీవుడు రామునికి సమీపముగా వచ్చి ",రామా !నీ మాట ప్రకారము నేను మరలా వాలి పై యుద్ధమునకు వచ్చితిని . కేవలము నీవు రక్షించెదవనే దైర్యముతోనే వచ్చి ఉంటిని . కావున నీవు నాకు ఇదివరకు ఇచ్చిన మాట (వాలిని పరిమార్చెదను )నిలబెట్టుకొనుము" అని వినయముగా ,దీనంగా ప్రార్ధించెను . 
అప్పుడు రఘురాముడు "మిత్రమా !ఈ విషయముపై నీకు భయము కించిత్తు కూడా వలదు . నీవు ధైర్యముగా యుద్ధమునకు వెళ్లుము . నిన్ను గుర్తించుటకై లక్ష్మణుడు నా అనుజ్ఞచే 'గజసాహ్వము 'అను పేరు కల లతను నీ మేడలో వేసినాడు . ఆ మాల కారణముగా నేను నిన్ను గుర్తించి వాలిని వధించెదను . ఆ వాలిని నేను గుర్తించిన పిమ్మట కూడా అతడు సజీవుడై తిరిగి వెళ్ళినచో అది నా దోషము . కావున నీవు ఆలసింపక ఆ వాలిని యుద్ధమునకు ఆహ్వానింపుము . అతడికి యుద్ధము అన్న మిక్కిలి ప్రీతి . కావున అతడు మరల నీతో యుద్ధమునకు తప్పక వచ్చును . "అని పలికెను . 
రాముని మాటలు విన్న సుగ్రీవుడు ధైర్యము తెచ్చుకుని బిగ్గరగా ఆకాశము బ్రద్దలగునట్లు గర్జించెను . సుగ్రీవుడు  సూర్యుని వరము వలన జన్మించాడు . మేఘము వలె గర్జించుటలో సుప్రసిద్ధుడు . అతడి గర్జన విని పక్షులు బయపడి ఎగిరిపోయినవి . జంతువులూ మృగములూ బెదిరి పరుగిడినవి . 

                రామాయణము కిష్కిందకాండ పదునాలుగవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment