Wednesday 11 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునేడవసర్గ

                                         రామాయణము 

                                        కిష్కిందకాండ -పదునేడవసర్గ 

శ్రీరాముడి బాణపు దెబ్బకు నేలకొరిగిన వాలి కొంతసేపటికి కళ్లుతెరిచి రామలక్ష్మణులను చూసేను . పిమ్మట అతడు రామునితో పరుషముగా ఇలా మాట్లాడనారంభించెను . "స్వామి !నీవు మహారాజు పుత్రుడవు ,సకల ధర్మశాస్త్రములు అభ్యసించినవాడవు . ఉత్తమవంశమున జన్మించినవాడవు . పరాక్రమవంతుడివి ,అన్ని విధములుగా వాసికెక్కినవాడవు . నేను వేరొకరితో యుద్ధము చేయునపుడు నీవు నా వక్షస్థలమున ఎందుకు కొట్టితివి .' శ్రీరాముడు కనికరము కలవాడు ఆశ్రీతులను కాపాడువాడు . ఎల్లప్పుడూ ప్రజాహితమునకే పాటుపడేవాడు ,దయామయుడు ,సదాచారసంపన్నుడు' ,అని ఈ భూమండలం మొత్తము నీ గుణములను గానము చేయుచున్నది . శ్రీరాముడు ధర్మపరుడు అని నమ్మి తార అడ్డు పడినా వినక నేను సుగ్రీవునితో యుద్ధమునకు వచ్చితిని . నీవు యధార్ధమునకు అధర్మపరుడివి . 
నీ దేశమునకు ,నీ పురమునకు నీకు నేనెన్నడూ అపకారము తలపెట్టి ఎరుగను . నిన్ను ఎన్నడూ అవమానించి ఎరుగను . అటువంటి నన్ను ఎందుకు చంపబూనావు . నేను నీతో యుద్ధము చేయలేదు . పైగా నేను వానరుడను . రాజులు సాధారణముగా రాజ్యము కొరకు సంపద కొరకు యుద్ధములు చేస్తారు . మరి నీవు ఈ  రోజు నా వనము నుండి ఏమి ఆశించి నన్ను కొట్టావు . రాజద్రోహి ,గోబ్రాహ్మణ హత్యలు చేయువాడు ,చోరుడు ,ఎల్లప్పుడూ ప్రాణులను ,వధించువాడు నాస్తికుడు ,అన్న కంటే ముందుగా వివాహము చేసుకున్న వాడు ,చాడీలు చెప్పేది వాడు ,లోభి ,మిత్రద్రోహి ,గురుద్రోహి ,ఇతరుల సంపదను బలవంతముగా అనుభవించెడివాడు ,స్త్రీలను ఏడిపించెడివాడు వీరందరికి నరకయాతనలు తప్పవు . 
ఓ రఘువీరా !జింక చర్మము ఆసనమునకు ఉపయోగపడును ,చమరీమృగకేసములు చామరములుగా దైవసేవలో ఉపయోగపడును ,ఏనుగుల దంతములు లోకులు ఉపయోగించుకొనెదరు . మరి నేను ఏ రకంగానూ ఉపయోగపడను కదా ,కనీసము మాంసముగా భుజించుటకు కూడా నా శరీరము పనికి రాదు మరి నీవు ఏమి ఆశించి నన్ను వధించచూసావు ?ఓ రాజా !నిరపరాధులమైన మావంటి వారి పట్ల నీ పరాక్రమము ప్రదర్శించితివి . నా ఎదురుగా నిలిచి నాతొ యుద్ధము చేసినచో నేను తప్పక యుద్దములో నిన్ను ఓడించెడివాడను . రణరంగమున ఎవ్వరు నన్ను ఎదిరించలేరు . సీతామాత జాడకై నీవు సుగ్రీవుని బదులు నన్ను ఆశ్రయించి ఉంటే నేను మరు నిముషములోనే ఆమెను నీ ఎదుట నిలబెట్టెడివాడను . ఆ రావణుడు ఆదేవిని సముద్రములోకాని ,పాతాళములో కానీ ఎచ్చట దాచినా ఆ సాద్విని తెచ్చి వుండెడివాడను . జీవులకు మరణము సహజమే ,నా తదుపరి సుగ్రీవుడు రాజు అగుట కూడా సమంజసమే ,కానీ నీవు నన్ను ఇలా ఎందుకు కొట్టావో నాకు సమాధానము చెప్పు "అని వాలి శ్రీరాముని కోరెను . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment