Monday 9 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునైదవసర్గ

                            రామాయణము 

                               కిష్కిందకాండ -పదునైదవసర్గ 

సుగ్రీవుడి గర్జన అంతఃపురంలో వున్నా వాలి కి వినపడినంతనే అతని మత్తు వదిలిపోయెను అతని శరీరము కోపముతో ఊగిపోవసాగెను . అతడి కళ్ళు కోపముతో ఎరుపెక్కేను . పిమ్మట అతడు గర్జించుచు సుగ్రీవునిపై యుద్ధమునకు వెళ్ళబోయేను . అప్పుడు వాలి భార్య తారా దేవి ఎదురొచ్చి భర్తను ప్రేమగా కౌగలించుకుని "ప్రాణేశ్వరా !నీ మంచి కొరకు నేను చెబుతున్న ఈ మాటలు వినుము నీలోని ఈ కోపమును త్వజించుము . ప్రభూ !యుద్ధమున నిన్ను గెలవగలిగినవాడు నీ శత్రువులలో ఎవ్వడు లేడు . నువ్వు మిక్కిలి పరాక్రమవంతుడివి . అందులో సందేహము లేదు . కానీ నీచేత    చావుదెబ్బలు  తిని వెంటనే తిరిగి వచ్చాడు అంటే ఎదో బలమయిన కారణము వుంది ఉంటుందని నా నమ్మకము . 
సుగ్రీవుని గర్జన లోని తీవ్రత ,గట్టితనం చూస్తూ ఉంటే ,అతడేదో గట్టి ప్రయత్నముతో వచ్చినట్టుగా నాకు సందేహముగా వున్నది . దీనిని సామాన్య విషయముగా  భావించకూడదు  . ఇదంతా చూస్తుంటే సుగ్రీవుడు ఎదో గట్టి అండతో వచ్చాడు అనిపిస్తోంది . ఇదంతా నేను ఊహించి చెప్పటం  లేదు . చారుల ద్వారా మన కుమారుడు అంగదుడు విన్న విషయాలు నాకు తెలిసాయి . అయోధ్యాధిపతి దశరధుని కుమారులు రామలక్ష్మణులు వీరాధివీరులు ,రణరంగమున ధీరులు వారు ఇప్పుడు ఇక్కడికి సమీపముననే అరణ్యమున ఉండి సుగ్రీవునితో మైత్రి కుదుర్చుకొన్నారుట . ఆ రాముడు అస్త్రవిద్యా విశారదుడు , సాధుజనులకు ఒక మహావృక్షం వంటివాడు . సర్వలోకరక్షకుడని వినివుంటిని .   అటువంటి మహానుభావుడితో కోరి వైరము పెట్టుకొనుట తగదు . 
పైగా సుగ్రీవుడు ఎవరో కాదు నీకు తోడబుట్టిన నీ తమ్ముడే ఈ లోకములో అతడికంటే ఆప్తులు నీకు ఇంకెవరు వుండరు . కాబట్టి అతడిని పిలిపించి యువరాజుగా పట్టాభిషేకము చేయి . ఆ పదవికి అతడు అన్ని విధములుగా అర్హుడు . కావున వైరము మాని అతడిని నీ అక్కున చేర్చుకొనుము . నాకు సంతోషము కలుగచేయదలుచుకున్నచో ఈ మాటలు పాటింపుము . "అని పలికెను . కానీ ఆయువు మూడిన వాలికి ఆ మాటలు ఏ మాత్రము రుచింపలేదు . 

రామాయణము కిష్కిందకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                                         శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ ఏ(తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment