Tuesday 21 August 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదినాల్గవసర్గ

                                         రామాయణము 

                                           కిష్కిందకాండ -ఇరువదినాల్గవసర్గ 

కన్నీరుమున్నీరుగా విలపించుచున్న తారను చూసి సుగ్రీవుడు చలించిపోయెను . తారను చూసి తానును విలపించెను . అతని మనస్సు న దైన్యము వహించెను . అతడు చిన్నబోయిన ముఖముతో శ్రీరాముని చేరెను . రామునితో ఈ విధముగా పలుకసాగెను . "ఓ మహాప్రభూ !నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటివి . రాజ్యము నాకు దక్కినది . కానీ ఇప్పుడు నాకు రాజ్యభోగములపై మనస్సే పోవుటలేదు . అంతేకాదు నాకు జీవితముమీదే విరక్తి కలుగుతున్నది . మా అన్న అగు వాలి ఇంతకూ మునుపు నన్ను అనేక విధములుగా అవమానించి వున్నాడు . పైగా నా భార్యను అపహరించి నాకు ద్రోహము చేసినాడు అందుచే నేను మీచే మా అన్నాను చంపించితిని . 

ఓ రామా ! నేను ఇప్పటి వరకు ఋష్యమూక పర్వతంపై జీవిస్తూ వచ్చాను . ఇప్పుడు నా అన్న మృతదేహము చూస్తుంటే అలాగే ఋశ్యమూకపర్వతం పైనే బతికేసివుంటే బాగుండేది అనిపిస్తోంది . మా అన్న అగు వాలి మహానుభావుడు యుక్తాయుక్త విచక్షణ కలిగినవాడు . అతడు నాతొ యుద్ధము చేయునపుడు "తమ్ముడా !నిన్ను చంపదలుచుకోలేదు . నీవు స్వేచ్ఛగా ఎక్కడికైనా పో "అని పలికాడు . ఆ విధముగా పలుకుట అతనికే చెల్లినది . కానీ దుర్మాత్ముడనైన  నేను అతడి గురించి నీకు చెప్పి అతడిని చంపించినాను . ఈ పాపమునకు పరిహారము లేదు . నేనును అగ్నిజ్వాలలో పడి మరణించెదను . ఓ రామా !నీకు ఇచ్చిన మాట ప్రకారము నేను మరణించినను నా ఆజ్ఞచే సీతాన్వేషణను ఈ వానరులు గావింతురు . క్షమించరాని పాపము చేసిన నేను జీవించుటకు అనర్హుడను . మరణించుటకు నాకు అనుమతి ఇవ్వు "అని పలికెను . 
ఆర్తుడై అలమటించుచున్న సుగ్రీవుని చూసి శ్రీరాముడు తానునూ కన్నీరు పెట్టి ఏడ్చుచున్న తారను ఓదార్చుటకు ఆ వైపుగా నడవసాగెను . శ్రీరాముడు వచ్చుట గమనించిన అక్కడి వారు భర్త దేహము పై పది ఏడ్చుచున్న తారను లేవదీయుటకు ప్రయత్నము చేసిరి . తార తన భర్తను వదులుటకు ఇష్టపడక బలవంతముగా భర్తపై పడుచుండెను . ఆ సమయములో తనవైపుగా వచ్చుచున్న శ్రీరాముని చూసి పెనుగులాడుట ఆపివేసెను . తార ఇంతకుముందు శ్రీరాముని చూడకపోయినా అతని తేజస్సు ను చూసి ,అంతకు మునుపు అంగదుడిచే రాముని రూపురేఖలు విని ఉండుటచే రాముని గుర్తించింది . 

పిమ్మట తార తన భర్త మరణమునకు కారణము శ్రీరాముడు అని తలిచి పరుషవాక్యములు పలుకవలెనని సంకల్పంతో రాముని చేరెను కానీ శ్రీరాముడి ప్రభావము చే ఆమెలోని తీవ్రభావము తగ్గిపోయెను . అప్పుడు ఆమె రామునితో ఇలా పలికెను . "ఓ రామా ! నీవు సర్వ గుణ సంపన్నుడవు . సత్పురుషుడవు . సర్వ ధర్మములు తెలిసినవాడవు . ఓ రామా !నా నాధుని చంపిన ఆ బాణముతోనే నా ప్రాణములు  కూడా తీయుము , నేను నా నాధుడు లేనిదే  ఉండలేను . నా నాధుడు కూడా స్వర్గము లభించినా చెంత నేను లేని యెడ సంతోషముగా వుండలేడు . నన్ను చంపి నా భర్త వద్దకు నన్ను చేర్చుము స్త్రీని చంపుట ఎట్లు అని ఆలోచించుతున్నావేమో ?భార్యాభర్తలు వేరుకాదు ఒక్కరే . భార్యయే భర్తకు ఆత్మ . కావున నన్ను వాలి ఆత్మగా భావించి వధించుము . అన్ని దానములలోకి కన్యా దానము మిక్కిలి ప్రశస్తమని పెద్దలు చెప్పుదురు . ఆ విధముగా నన్ను నా భర్తకు దానము ఇచ్చి పుణ్యము కట్టుకొనుము "అని పలికెను 
అప్పుడు శ్రీరాముడు తారను ఓదార్చుచు "ఓ వీర పత్నీ ! నీవు ఈ విధముగా దైన్యమునకు లోనుకావద్దు . సర్వప్రాణుల తలరాతను రాసిడెది బ్రహ్మదేవుడే . విధిని ఎవ్వరూ తప్పించుకొనలేరు . విధి నిర్ణయమే అంత . త్వరలోనే నీ కుమారుడైన అంగదుడు యువరాజు కానున్నాడు . అతడి బాధ్యతా భారము నీపై వున్నది . కావున దుఃఖించకు . వీర పత్నులు దుఃఖించరాదు . "అని పలికెను . పిమ్మట తార కొంత ఉపశమనము పొందెను 

రామాయణము కిష్కిందకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment