Friday 3 April 2020

రామాయణమ- యుద్ధకాండ -తొంబదితొమ్మిదవ సర్గ

                                       రామాయణము 

                                   యుద్ధకాండ       -     తొంబదితొమ్మిదవ సర్గ 

సుగ్రీవుడి చేతిలో మహోదరుడు మరణించుట చూసి మిక్కిలి బల శాలి అయిన మహాపార్శ్వుడు కోపంతో , అంగదుడి సైన్యమును తన బాణములతో హింసించ సాగెను  .  వేగంగా వీచే గాలికి తొడిమెల  నుండి ఫలములు రాలి పడిపోయినట్లు ఆ రాక్షసుని బాణముల దాటికి  ప్రముఖులైన వానర యోధుల శిరస్సులు  శరీరముల నుండి  వేరై  రణభూమి అంతటా పడిపోయెను . మహాపార్శ్వుని  బాణపరంపర  కు  దెబ్బ తినిన  ఆ వానరులు  దాదాపు స్పృహలేని స్థితికి గురిఅయి విషాద గ్రస్తులై యుద్ధ విముఖులైరి .  
అపుడు తన బలములు భీతిల్లుట చూసిన అంగదుడు పున్నమినాటి సముద్రుడివలె విజృంభించెను . మహాపార్శ్వుడు, వాలిసుతుడు ఆ  సమరభూమి అందు  మిక్కిలి భీకరముగా  యుద్ధముచేసిరి  ఆ సంగ్రామములో  అంగదుడు మహాపార్శ్వుని  అంతమొందించెను . అది చూసిన రాక్షస సైన్యము  మిక్కిలి  భీతిల్లిరి  రావణుడు క్రోధముతో ఊగిపోయెను  .  
వానరులు పట్టరాని సంతోషముతో ఆకాసము తాకినట్లు సింహనాదం చేసిరి . అది విని రావణుడు కదనరంగమున  యుద్ధసన్నద్దుడై నిలిచెను . 



రామాయణము, యుద్ధకాండ - తొంబదితొమ్మిదవ సర్గ ---- సమాప్తము . 






శశి,

ఎం ఏ , ఎం ఏ( తెలుగు) ,
తెలుగుపండితులు . 







No comments:

Post a Comment