Thursday 30 April 2020

రామాయణము యుద్ధకాండ -------నూటయొకటవ సర్గ

                                  రామాయణము 

   

                         యుద్ధకాండ -------నూటయొకటవ సర్గ 

తన అసురాస్త్రము నిర్వీర్య మై పోవుట చే రావణుడు  రౌద్రము (మయుడిచే నిర్మింప బడిన అస్త్రము) ను శ్రీ రాముడి పై ప్రయోగించెను . శ్రీ రాముడు గాంధర్వం అనే అస్త్రము తో రౌద్రాస్త్రమును ముక్కలు చేసెను . అది చూసిన రావణుడు కోపము తో  సౌరాస్త్రము ప్రయోగించెను . రాముడు తన బాణ పరంపర తో  ఆ అస్త్రమును కూడా ఛేదించెను . 
రావణుడు పది బాణములతో శ్రీ రాముడి ఆయువు పట్టుల యందు కొట్టెను .  శ్రీ రాముడు మిక్కిలి కోపంతో పది బాణములతో రావణుని యొక్క వివిధ అవయవములపై గట్టిగా కొట్టెను . అపుడు లక్ష్మణుడు మానవ కపాల చిహ్నముగల రావణుని యొక్క ధ్వజమును తన బాణములతో ముక్కలు చేసెను . రావణుని రధసారధి చెవులకు ధరించిన  బంగారు కుండలములు లక్ష్మణుడు ఒకే బాణముతో ఖండించెను . పిమ్మట రావణుని ధనస్సును కూడా ముక్కలు చేసెను . 
రావణుడు తన ధనస్సు ముక్కలైపోవుటచే క్షణ కాలము పాటు ఏమీ తోచక  ఊరకుండెను . అప్పుడు విభీషణుడు పైకెగిరి రావణుని అశ్వాలను తన గదతో సంహరించెను . అప్పుడు రావణుడు వెంటనే తన రధమునుండి కిందకు దూకి  ఒక బల్లెమును విభీషణుని పైకి విసిరెను .  ఆ బల్లెము విభీషణుడిని చేరక ముందే లక్ష్మణుడు దానిని ఖండించివేసెను . అపుడు యుద్ధరంగమున వానరుల కోలాహలం చెలరేగింది . పిమ్మట రావణుడు విభీషణుని  చంపుటకు మరొక బల్లెము పైకి ఎత్తగ అది చూసిన లక్ష్మణుడు  రావణుని పై బాణ వర్షమును కురిపించెను . తన మీదకు వచ్చిపడుతున్న బాణాలను తట్టు కొనలేక విభీషణుణ్ణి చంపే ప్రయత్నమును రావణుడు విరమించుకుండెను . 
అప్పుడు రావణుడు లక్ష్మణుని పై శక్త్తి అను ఆయుధమును ప్రయోగించి పెద్దగా గర్జించెను  అపుడు శ్రీ రాముడు వేగముగా వచ్చుచున్న ఆ శక్తి ఆయుధమునకు నమస్కరించి "ఓ శక్తీ ఆయుధమా లక్ష్మణునకు శుభమగుగాక !నీ లోగల ప్రాణహరణ శక్తి నశించు గాక " అని పలికెను . అంతలో ఆ శక్తి ఆయుధము లక్ష్మణుని వక్షస్థలమున లోతుగా నాటుకొనుటచే లక్ష్మణుడు నేల పై పడిపోయెను . 
అది చూసిన శ్రీ రాముడు కోపముతో బాధతో రావణుని వధించుటకు గట్టి పూనిక తో నిశ్చయించుకొనెను. రావణుడు తీవ్రముగా కొట్టుచుట చే  ఆ శక్తి  లక్ష్మణుని గుండెలను  చీల్చుకొని అవతలకు వెళ్లి భూమికి గుచ్చుకొనెను . అక్కడి వానర ప్రముఖులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ లక్ష్మణుని శరీరమునుండి ఆ శక్తిని బయటకు లాగలేక పోయిరి అపుడు బలశాలి అయిన రాముడు భయంకరమైన ఆ శక్తిని తన రెండు చేతులతో పట్టుకొని బయటకులాగి దానిని విరిచివేసెను . స్పృహ తప్పి పడి  ఉన్న లక్ష్మణుని   చూసి  అతడిని కౌగలించుకొని శ్రీ రాముడు హనుమంతునితో ఇలా పలికెను . "కపివరులారా !  మీరు లక్ష్మణుని  చుట్టూ చేరి  ఇతడిని జాగ్రత్తగా చూసుకొనండి పాపాత్ముడు , క్రూరాత్ముడు అయిన  ఈ దశ గ్రీవుని సంహరించుటకు ఎప్పుడో సంకల్పించాను . ఇప్పుడు ఆ సమయము ఆసన్నమయింది . ఓ వానరులారా !ఇప్పుడే మీ ముందు సత్య ప్రతిజ్ఞ   చేయుచుఁన్నాను ఈ లోకంలో రావణుడో  రాముడో ఎవరో ఒకరే నిలిచి ఉండుట తధ్యము దీనిని మీరు త్వరలోనే చూడగలరు . " అని పలికెను. 
వానరులతో ఇలా పలికిన పిమ్మట శ్రీ రాముడు  యుద్ధ సన్నద్దుడై తన బాణములతో  రావణుని కొట్టెను . రావణుడు కూడా శ్రీ రాముని పై అనేక బాణములను వర్షింప చేసెను . రామరావణులు  ఒకరినొకరు  వధింపవలననే పూనికతో  ప్రయోగించుచున్న బాణములు  పరస్పరము  ఢీకొనుచుండగా  భీకర ధ్వనులు ఏర్పడుచుండెను . శ్రీ రాముని యొక్క బాణములు వరసగా తనపై వఛ్చి పడుతుండటం చే  రావణుడు  మిక్కిలి పీడితుడై  పెనుగాలికి తట్టు కోలేని  మేఘమువలె  భయముతో  పరుగులు తీసెను . 





రామాయణము ----యుద్ధకాండ ------నూటయొకటవ సర్గ -------సమాప్తము . 



శశి . 

ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు ) తెలుగు పండితులు . 












No comments:

Post a Comment