Thursday 30 April 2020

రామాయణము యుద్ధకాండ -నూఱవ సర్గ

                                        రామాయణము 

             

                                యుద్ధకాండ -నూఱవ సర్గ 

మహోదర మహాపార్శ్వులు మరణించుట చూసిన  రావణుడు కోపంతో రధమును ముందుకు నడుపమని సారథికి ఆజ్ఞాపించెను  . అప్పుడు రావణుడు తన సారధితో" ఆ రామ లక్ష్మణులను , హతమార్చి మన లంకా పుర వాసుల దుఃఖమును తొలగించెదను . "అని పలికెను. 
 రావణుడు రథముపై వేగంగా శ్రీ రాముడి వద్దకు వెళ్లుచుండగా అతడి రథచక్ర ఘోషలు నలు దిశలా వ్యాపించెను . వానర సైన్యము వద్దకు వచ్చిన రావణుడు తామసాస్త్రమును ప్రయోగించెను. బ్రహ్మ దేవుడు స్వయముగా నిర్మించిన ఆ అస్త్రము  వానరులను దహించి వేయ సాగింది . ఆ ప్రభావము తట్టుకొనలేక ఎటువారటు పారిపోయిరి . అప్పుడు రావణుడు శ్రీ రాముడను చూసి ఆయనతో  యుద్ధము చేయుటకై శ్రీ రాముని వైపుగా వెళ్లసాగెను . 
రావణుని రదము తన వైపుకు వచ్ఛుట చూసిన శ్రీ రాముడు ధనుష్టంకారము  చేసెను . ఆ శబ్దము భూమిని బద్దలు చేయునట్టుగా  ఉండెను . అప్పుడు లక్ష్మణుడు   రావణునితో  ముందుగా యుద్ధము చేయ దల్చి రావణునిపై బాణములను ప్రయోగించెను . వాటిని రావణుడు తన బాణములతో ఆకాశము లోనే ముక్కలు  చేసెను . పిమ్మట రావణుడు శ్రీ రాముడపై బాణముల వర్షము కురిపించెను . శ్రీ రాముడు వాటిని మధ్యలోనే ముక్కలు చేసెను . పిమ్మట శ్రీ రాముడు రావణునిపైన రావణుడు శ్రీ రాముడి పైన పరస్పరము వివిధ రకములైన  శరములను అతివేగముతో ప్రయోగించిరి . అయినను వారిలో ఎవ్వరు పరాజితులు కాకుండిరి . తీవ్రమైన వారిరువురి  యుద్ధ రీతులకు ప్రాణులన్నియూ  భయపడ సాగెను . 
రావణుడు రెచ్చిపోయిన  సర్పమువలె బుసలు కొడుతూ అసురాస్త్రము ద్వారా సింహ ములు , పెద్ద పులులు, రాబందులు, డేగలు, కాకులు, గ్రద్దలు, నక్కలు,తోడేళ్ళు , ఐదుతలలు గల సర్పములు, కుక్కలు, కోళ్లు, వరాహములు, గాడిదెలు,ముసళ్ళను  , కోళ్లు,మొదలగు ప్రాణుల యొక్క ముఖముల ఆకారములో ఉన్న బాణములను సృష్టించి శ్రీ రాముని దెబ్బ తీయుటకై ప్రయోగించెను . 
అది చూసియాసిన  శ్రీ రాముడు ఆగ్నేయాస్త్రము ద్వారా మండుతున్న అగ్ని , ప్రకాశిస్తున్న సూర్య చంద్రులు , అర్ధచంద్రుడు తోక చుక్కలు , నక్షత్రాలు ఉల్కలు , గ్రహములు, మెరుపుతీగలు, మొదలైన, వానివలె మెరయుచున్న పదునై న  బాణములనుఁ సృష్టించి రావణుడిపై ప్రయోగించెను . 
రావణు ని ఘోరభాణములు , శ్రీ రాముని ఆగ్నేయాస్త్రము దాటికి ఆకాసములోనే ముక్కలైపోయెను . అది చూసిన సుగ్రీవాది వానర ప్రముఖ వీరులందరు సంతోషముతో శ్రీ రాముని చుట్టూ చేరి కోలాహలధ్వనులు కావించిరి దిక్కులు పిక్కటిల్లు నట్లు  జయజయ ధ్వనులు  కావించెను. 




రామాయణము --- యుద్ధ కాండ----- నూఱవసర్గ -------సమాప్తము. 




శశి ,

ఎం.ఏ ఎం.ఏ  (తెలుగు ), తెలుగు పండితులు. 




No comments:

Post a Comment