Tuesday 4 January 2022

రామాయణము , ఉత్తరకాండ--- ఎనబదిమూడవసర్గ

                            రామాయణము  

                          ఉత్తరకాండ--- ఎనబదిమూడవసర్గ 

రాముని యొక్క ఆజ్ఞను అనుసరించి ద్వార పాలకుడు లక్ష్మణ భరతులకు రాముని ఆగమన వార్త గురించి తెలిపెను . ఆ వార్త విన్న వెంటనే భరత లక్ష్మణులు పరుగు పరుగున రాముని వద్దకు వచ్చిరి . శ్రీ రాముడు తమ్ముళ్ళని ఇరువురిని అక్కున చేర్చుకొని " సోదరులారా! నేను వాగ్దానము చేసిన విధముగా సర్వ శ్రేష్టమైన బ్రాహ్మణ కార్యమును నెరవేర్చితిని . ఇప్పుడు రాజసూయ యాగము చేయగోరుచున్నాను . ఈ యాగము అక్షయ సంపదలను ఇచ్చును . శాశ్వత ఫలములను ప్రసాదించును . దీని వలన ధర్మం వృద్ధి చెందును . సకల పాపములు నశించును . మీరు బాగుగా అలోచించి నాకు యుక్తములైన సూచనలను చేయుడు " అని పలికెను . 
శ్రీ రాముని మాటలు విన్న భరతుడు అంజలి ఘటించి " మహా పురుషా నీవు మిక్కిలి పరాక్రమశాలివి.  ఈ భూమండల మంతయూ నీ అధీనములో ఉన్నది . నీవు పరమ ధర్మాత్ముడవు . నీ కీర్తి ప్రతిష్టలు అజరామరములు . రాజా! ఈ యజ్ఞము చేయుట వలన ఈ భూమండలమును కల రాజ వంశములన్నియూ దెబ్బతినే  అవకాశము కలదు . కావున అట్టి యజ్ఞమును మహాత్ముడవైన నీవు ఎలా చేయుదువు ?"అని పలుకగా శ్రీ రాముడు ఉత్తమోత్తమమైన రాజసూయ యాగమును చేయవలెనని అభిప్రాయపడితిని . సహేతుకములైన నీ మాటలు విన్న పిమ్మట నేను ఆ ప్రయత్నము నుండి విరమించుకొనుచున్నాను . భరతా ! తెలివి కల వారు లోకమునకు బాధాకరమైన పనులు చెయ్యరాదు . లోక కళ్యాణ  కారకములైనప్పుడు బాలుర వచనములు కూడా గ్రాహ్యములు " అని పలికెను .   

రామాయణము ఉత్తరకాండ ఎనుబదిమూడవసర్గ సమాప్తము . 

                                                                  శశి ,

                                                              ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Sunday 2 January 2022

రామాయణము ఉత్తరకాండ -ఎనుబదిరెండవసర్గ

                    రామాయణము 

                 ఉత్తరకాండ -ఎనుబదిరెండవసర్గ 

శ్రీరాముడు అగస్త్యుడు చెప్పిన దండకారణ్య వృత్తాంతమును విని ,పిమ్మట అగస్త్యుని ఆదేశము ప్రకారం ,పవిత్రమైన సరస్సు వద్దకు వెళ్లి ,స్నాన సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకుని తిరిగి అగస్త్యుని ఆశ్రమమునకు చేరెను . పిమ్మట శ్రీరాముడు అగస్త్యుడు పెట్టిన కందమూలములను ,కూరగాయలను ,శాల్యాన్నమును తృప్తిగా భుజించెను . ఆరోజు రాత్రి అక్కడే విశ్రమించి ,
మరునాడు ప్రాతఃకాలమే లేచి ,అగస్త్యుడి అనుమతి తీసుకుని ,ప్రయాణమునకు సన్నద్ధుడై పుష్పకము ఎక్కి అగస్త్యుడికి మిగిలిన మునులకు అభివాదం చేసెను . ఆ మునులందరూ శ్రీరాముని దీవించిరి . పిమ్మట శ్రీరాముడు పుష్పకముపై అయోధ్య చేరెను . పుష్పకమును పంపివేసి ద్వారపాలకునితో "నా రాకను గురించి లక్ష్మణునికిభరతునికి  తెలిపి ,వెంటనే వారిని నా వద్దకు రమ్మను "అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ ఎనుబదిరెండవసర్గ సమాప్తము . 

                                                         శశి ,

                                                                ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ -ఎనుబదియొకటవసర్గ

                      రామాయణము 

                  ఉత్తరకాండ -ఎనుబదియొకటవసర్గ  

మిక్కిలి ప్రభావశీలి అయిన  దేవర్షి అగు శుక్రాచార్యునకు శిష్యులద్వారా విషయము తెలిసెను . వెంటనే ఆ మహర్షి శిష్యులతో కలిసి ఆశ్రమమునకు వచ్చెను . అక్కడ కుమార్తెను చూసి ,ఆమె దీనస్థితిని చూసి ,ఆగ్రహోదగ్రుడయ్యెను . మండిపడుతూ తన శిష్యులతో "శిష్యులారా !దండుడు చేసిన అపరాధమునకు గాను ,అతడు సపరివారంగా  ఏడు రోజులలో నశించి తీరును . దేవేంద్రుడు ఈ దుర్మార్గుడి యొక్క దేశమునకు వందయోజనముల విస్తీర్ణము వరకు తీవ్రమైన దుమ్ము వర్షము కురిపించి ఈ దేశమునకల సకల ప్రాణులు నశింపచేయును . కావున ఆశ్రమవాసులారా !మీరంతా వెంటనే ఈ  దేశమును  వదిలి వేరొకచోట నివసించుము . "అని ఆదేశించి 
తన కుమార్తె అరజతో "దండుని అకృత్యమునకు గురి అయితివి కావున ఆ దోష నివృత్తికై ,విముక్తి కాలము వరకు ,ఇక్కడే దైవధ్యానము నందు నిమగ్నమై  ఈ సరోవరంలో నీటిని త్రాగుతూ ఇక్కడే ఉండుము . ఆ సరస్సు తీర ప్రాంతమంతా నా అనుగ్రహము వలన ఎటువంటి ప్రమాదం రాదు "అని పలికి ఆయన మరో చోట తన ఆశ్రమమును ఏర్పాటుచేసుకుని అక్కడ నివసించసాగెను . శుక్రాచార్యుడు శపించినట్లుగానే ఏడు రోజులలో దండుడి రాజ్యము నాశనమయ్యెను . ఒక్క ప్రాణి కూడా ప్రాణములతో నిలవలేదు . ఆనాటి నుండి ఈ ప్రదేశము దండకారణ్యముగా ప్రసిద్దిచెందెను . 

రామాయణము ఉత్తరకాండ ఎనుబదియొకటవసర్గ సమాప్తము . 

                                                               శశి ,

                                                                          ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .