Tuesday 15 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియెనిమిదవసర్గ

                                            రామాయణము 

                                            అరణ్యకాండ -అరువదియెనిమిదవసర్గ 

శ్రీరాముడు నేలపై పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గృధ రాజుని చూసి లక్ష్మణునితో "లక్ష్మణా !ఈ జటాయువు నాకోసము ఆ రాక్షసుడితో పోరాడి ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు . అయ్యో ఈయనకు నావలన కదా ఇంతటి కష్టము వచ్చిపడినది . మా తండ్రిగారికి మిత్రుడు ,నా శ్రేయోభిలాషి ఐన ఈయన ప్రాణాపాయముతో కొట్టుమిట్టాడుతూ ,నోట మాట లేక పడివున్నాడు . "అని పలికెను . 

పిమ్మట శ్రీరాముడు జటాయువుతో "అయ్యో మీకు మా వలన ఎంత కష్టము వచ్చినది . అసలు సీతను అపహరించిన ఆ రక్కసుడు ఎవ్వడు ?అతడు ఎందులకు జానకిని ఎందులకు అపహరించాడు ?అతడిదే రాజ్యము . మిమ్ము ఎటుల జయించగలిగాడు ?"అని అడిగాడు . అప్పుడు జటాయువు "రామా !ఆ రాక్షసుడి పేరు రావణుడు అతడు సీతను అపహరించుకు పోవుచుండగా నేను నా శాయశక్తులా ఎదుర్కొంటిని . కానీ అతడు నేను అలసిన తరుణములో నా రెక్కలను కాళ్ళను కండించివేసెను . 

అతడు సీతను ఎత్తుకుని దక్షిణ దిశగా పోయెను . అతడి పేరు రావణుడు . అతడు మిశ్రవసుడి కుమారుడు . లంకాధిపతి . కుబేరుడి సోదరుడు ." అని పలికి ఆ జటాయువు మరణించెను . అప్పుడు శ్రీరాముడు జటాయువును పట్టుకుని మిక్కిలి ఆక్రోశించెను . అప్పుడు ఆ క్షణములో ఆయన బాధ వర్ణనాతీతము . కొంత తడవుకు రాముడు లక్ష్మణునితో కలిసి జటాయువుకి ఉత్తమ గతులు కల్పించుట కొరకు దహనసంస్కారాది కార్యము నిర్వహించి ,పిండము పెట్టెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                             శశి ,

                                   ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు . 





Monday 14 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువది ఏడవసర్గ

                            రామాయణము 

                       అరణ్యకాండ -అరువది ఏడవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విని కోపము తగ్గించుకుని లక్ష్మణుడు చెప్పినట్టు ఆ దండకారణ్యప్రాంతమంతా  వెతుకసాగెను . కొంత దూరము వెళ్లిన పిమ్మట పెద్ద ఆకారము రక్తమోడుతూ కనిపించెను . ఆ పర్వతాకారములో వున్న ప్రాణిని చూసిన శ్రీరాముడు అది రాక్షసుడేమో సీతను మింగేసాడేమో అని ఊహించి ఆ ప్రాణిని చంపుటకు ధనుస్సుని పట్టుకొనెను . అప్పుడా ప్రాణి "రామా !నేను జటాయువుని . సీతను రావణుడు అపహరించి తీసుకుపోవుచుండగా నేను అడ్డగించినాను . నా శాయశక్తులా యత్నించినాను . ఆ రావణుడి రధమును ,అతడి సారధిని నాశనము చేసితిని . పిమ్మట అతడు నా రెక్కలు కాళ్ళు నరికి జానకిని తీసుకుని వెళ్ళిపోయాడు . "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు తన తండ్రి మిత్రుడు తనకు అత్యంత ఆప్తుడు అయిన జటాయువు ఆ విధముగా ప్రాణాపాయ స్థితిలో ఉండుట చూసి మిక్కిలి బాధపడెను . పిమ్మట రాముడు ఆ గ్రద్ద ను తాకుతూ ఏడవసాగెను . తన పెన్నిధి దూరమయినట్లుగా బాధపడసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం. ఏ ,తెలుగు పండితులు . 






Sunday 13 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదిఆరవసర్గ

                                          రామాయణము 

                                            అరణ్యకాండ -అరువదిఆరవసర్గ 

సీతాదేవి కొఱకై ఏడ్చుచు రాముడు మిక్కిలి బాధా హృదయుడు అయ్యెను . లక్ష్మణుడు అన్న పక్కనే ఉండి అన్నకు ధైర్యము చెబుతూ అన్నకు కాళ్ళు నొక్కుతూ సపరిచర్యలు చేయసాగెను . ఎన్నో విధములుగా రాముని ఓదార్చుటకు యత్నించుచు ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరువదిఆరవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు .  


Saturday 12 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియైదవసర్గ

                                                 రామాయణము 

                                                     అరణ్యకాండ -అరువదియైదవసర్గ 

సీతాదేవి ఎడబాటు వలన మిక్కిలి కృశించి వున్న రాముడు లోకములను నాశనము చేయుటకై కోపముతో రగిలిపోసాగెను . అప్పుడు లక్ష్మణుడు "అన్నా !ఇచట ఉన్న ఆనవాళ్లను బట్టీ ఇక్కడ ఇద్దరు వీరులకు భీకర యుద్ధము జరిగినదని తెలుస్తున్నది . కానీ ఇచట ఆనవాళ్లు గమనించినట్లయితే ఇక్కడ నాశనమై పడిపోయిన వస్తువులన్నీ ఒకే వ్యక్తి కి సంబందించినవి . సైన్యము కూడా యుద్దములో పాల్గొనలేదని తెలియవచ్చుచున్నది . కావున ఒక్కడు చేసిన తప్పుకు లోకములను శిక్షించుట నీవంటి ఉత్తముడు చేయదగిన పనికాదు . 
నీవు ధనుర్భాణములు ధరించి సీతాన్వేషణకై కదులుము నేను నీకు తోడుగా ఉండెదను . మునులు మనకు సహాయము చేయుదురు . నీ ధర్మపత్నిని అపహరించి న దుష్టుడు దొరుకునంతవరకు ఈ సమస్త భూమండలమును ,పాతాళమును ,సముద్రమును వెతుకుదాము . నీవు న్యాయ బద్దముగా వెతికినను వదినగారు దొరకనిచో   నీవు కోరుకున్నట్టే లోకములను నాశనము చేద్దువుగాని "అని లక్ష్మణుడు పలికెను . 





 రామాయణము అరణ్యకాండ అరువదియైదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం.  ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు






 

Thursday 3 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదినాల్గవసర్గ

                                 రామాయణము 

                           అరణ్యకాండ -అరువదినాల్గవసర్గ 

శ్రీరాముడు అటుల రోధించుచు ,తాను శోదించినను ,మరల తిరిగి లక్ష్మణుని గోదావరి నదీ తీరమునకు వెళ్లి ,సీతను వెతకమని చెప్పెను . లక్ష్మణుడు అచటకు వెళ్లి వెతికి అచట సీతాదేవి కనపడక పోవుటచే అదే విషయమును రామునికి విన్నవించెను . పిమ్మట రాముడు సీతకొరకై శోకించుచు ,"సీత ఎచటకు వెళ్ళినదో ఓ మృగములారా  చెప్పుము . ఓ వృక్షములారా చెప్పుము "అని బిగ్గరగా అరువగా మృగములన్నీ ఒక్కసారిగా లేచి దక్షిణ దిశగా పరిగెడుతూ మాటిమాటికీ రామునివంక  సీతజాడ చెబుతున్నావా అన్నట్లు చూచుచుండెను . 
అది గమనించిన లక్ష్మణుడు అన్నతో "అన్నా !ఈ మృగముల కదలికలను బట్టీ వదినగారు జాడ ఈ దిశగా వెళ్ళినచో తెలియునను అనిపించుచున్నది "అని పలికి ఇరువురు దక్షిణ దిశగా నడవసాగిరి . పిమ్మట రాముడు నేలపై పది వున్న పూరేకులను చూచెను . వాటిని గుర్తించిన రాముడు "లక్ష్మణా !ఈ పూరేకులు మీ వదినగారు ధరించినవే . వీటిని నేనే తెచ్చి ఆమెకు ఇచ్చితిని . "అని పలికెను . కొంత దూరము వెళ్లిన పిమ్మట విరిగి పడిపోయిన ధనస్సు ,కవచము ,రధము ,చనిపోయిన అశ్వములు ,మొదలగున్నవి కనిపించునేయు . వాటిని చూసిన రాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !ఈ బంగారు ధనుస్సు ఎవరిదీ అయివుండును ? ఈ బంగారు కవచము ,విరిగిపోయిన రధము ,అశ్వములు ,మొదలగున్నవి చూచుచుంటే ,ఇద్దరు రాక్షసులు సీత కొరకై యుద్ధము చేసుకుని ఉండవచ్చునని అనిపించుచున్నది "అని పలికెను . 
పిమ్మట రాముడు ఎర్రబారిన కళ్ళతో మిక్కిలి క్రుద్ధుడై లక్ష్మనునితో "లక్ష్మణా !ఈ వృక్షములు కొండలు ,మృగములు నాకు సీతజాడ చెప్పుకున్నచో నేను ఈ సమస్త లోకమును నాశనము చేసెదను "అని పలుకసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదినాల్గవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






                                            రామాయణము 

                                              అరణ్యకాండ -అరవదిమూడవసర్గ 

 
   శ్రీరాముడు సీతాదేవిని తలుచుకుని ఆమెకు ఎట్టి ఆపద వచ్చినదో అని భయపడుతూ మిక్కిలి రోదించసాగెను . లక్ష్మణుని తో సీతని తలుచుకుని బాధపడసాగెను . లక్ష్మణుడు ఎంత ఓదార్చుటకు ప్రయత్నించినను ఫలితము లేకుండెను . ఆయన బాధ హృదయవిదారకంగా ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరవదిమూడవసర్గ సమాప్తము . 

                               శశి ,

              ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు .