Tuesday 15 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియెనిమిదవసర్గ

                                            రామాయణము 

                                            అరణ్యకాండ -అరువదియెనిమిదవసర్గ 

శ్రీరాముడు నేలపై పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గృధ రాజుని చూసి లక్ష్మణునితో "లక్ష్మణా !ఈ జటాయువు నాకోసము ఆ రాక్షసుడితో పోరాడి ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు . అయ్యో ఈయనకు నావలన కదా ఇంతటి కష్టము వచ్చిపడినది . మా తండ్రిగారికి మిత్రుడు ,నా శ్రేయోభిలాషి ఐన ఈయన ప్రాణాపాయముతో కొట్టుమిట్టాడుతూ ,నోట మాట లేక పడివున్నాడు . "అని పలికెను . 

పిమ్మట శ్రీరాముడు జటాయువుతో "అయ్యో మీకు మా వలన ఎంత కష్టము వచ్చినది . అసలు సీతను అపహరించిన ఆ రక్కసుడు ఎవ్వడు ?అతడు ఎందులకు జానకిని ఎందులకు అపహరించాడు ?అతడిదే రాజ్యము . మిమ్ము ఎటుల జయించగలిగాడు ?"అని అడిగాడు . అప్పుడు జటాయువు "రామా !ఆ రాక్షసుడి పేరు రావణుడు అతడు సీతను అపహరించుకు పోవుచుండగా నేను నా శాయశక్తులా ఎదుర్కొంటిని . కానీ అతడు నేను అలసిన తరుణములో నా రెక్కలను కాళ్ళను కండించివేసెను . 

అతడు సీతను ఎత్తుకుని దక్షిణ దిశగా పోయెను . అతడి పేరు రావణుడు . అతడు మిశ్రవసుడి కుమారుడు . లంకాధిపతి . కుబేరుడి సోదరుడు ." అని పలికి ఆ జటాయువు మరణించెను . అప్పుడు శ్రీరాముడు జటాయువును పట్టుకుని మిక్కిలి ఆక్రోశించెను . అప్పుడు ఆ క్షణములో ఆయన బాధ వర్ణనాతీతము . కొంత తడవుకు రాముడు లక్ష్మణునితో కలిసి జటాయువుకి ఉత్తమ గతులు కల్పించుట కొరకు దహనసంస్కారాది కార్యము నిర్వహించి ,పిండము పెట్టెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                             శశి ,

                                   ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు . 





No comments:

Post a Comment