Tuesday 22 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియేడవసర్గ

                                      రామాయణము 

                                     యుద్ధకాండ -డెబ్బదియేడవసర్గ 

తన సోదరుడైన కుంభుడు మరణించుట చూసిన నికుంభుడు యుద్దములో విజృంభించెను . తుదకు మారుతి చేతిలో చచ్చెను . అది చూసిన వానరవీరులు దిక్కులు పిక్కటిల్లేలా కోలాహలధ్వనులు చేసిరి . ఆ ధ్వనులకు భూమి కంపించినట్టుగా ,ఆకాశము బద్దలైనట్టుగా అనిపించెను . అప్పుడు రాక్షస సైనికుల గుండెలు గుభిల్లుమనినవి . 
పిమ్మట శ్రీరామునికి ఖరుడి కుమారుడైన మకరాక్షుడికి మధ్య మిక్కిలి భయంకరంగా యుద్ధము జరిగినది . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియేడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియారవసర్గ

                              రామాయణము 

                             యుద్ధకాండ -డెబ్బదియారవసర్గ 

భయంకరముగా జరుగుతున్న ఆ యుద్దములో అంగదుడు కంపనుడు అను రాక్షసుడిని ,ప్రజంఘుడు అను వానిని చంపివేసెను . కుంభుడితో కూడా తలపడెను . కుంభుడి దాటికి తట్టుకొనలేక స్పృహ తప్పు స్థితిలో వున్న అంగదునికి తోడుగా సుగ్రీవుడు వచ్చి ,కుంభుడిని ఎదిరించి చంపివేసెను . అది చూసిన రాక్షస సైనికులు భయముతో వణికిరి . 

       రామాయణము యుద్ధకాండ డెబ్బదియారవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియైదవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -డెబ్బదియైదవసర్గ 

సుగ్రీవుడు శ్రీరాముడితో జరిగిన యుద్ధమును అంతా అలోచించి ,హనుమతో "హనుమా !మన వానరవీరులు కాగడాలచేతబూని ఈ రోజు రాత్రి సమయములో లంకా నగరమునకు నిప్పుపెట్టవలెను "అని ఆజ్ఞాపించెను . సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు వానరులు ప్రాకారమును దాటి లంకా నగరంలోకి ప్రవేశించి ,ఆ నగరములోకల ప్రాకారములు ఇళ్లకు నిప్పు పెట్టసాగెను . దానితో భయపడిన రాక్షసులు పారిపోసాగిరి . ఇళ్లకు నిప్పు అంటుకోవటంతో ,ఆ లంకా నగరము అంతా హాహాకారములు చెలరేగినవి . అది గమనించిన రావణుడు కుంభకర్ణుని కుమారులైన కుంభుడు ,నికుంభుడు అనువారిని వారికి తోడుగా అనేక బలగములను ఇచ్చి యుద్ధమునకు పంపెను . యుద్ధము కోసమే ఎదురుచూస్తున్న వానరవీరులు రెట్టింపు ఉత్సాహముతో యుద్ధమునకు దిగిరి . ఆ రాత్రి సమయములో వానరులకు రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియైదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Tuesday 15 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదినాలుగవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -డెబ్బదినాలుగవసర్గ 

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము ప్రభావమున రామలక్ష్మణులు స్పృహతప్పి నేలపై పది ఉండిరి . ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో ఆ సాయంత్రము అరువదియేడు కోట్లమంది వానరులు మరణించిరి . మిగిలినవారు గాయములతో కొనఊపిరితో ఉండిరి . అంతటా హాహాకారములు మారుమ్రోగగా విభీషణుడు ,హనుమంతుడు ధైర్యము తెచ్చుకుని తమవారెవరెవరు మరణించిరో ,ఎవరు సజీవంగా వుంటిరో తెలుసుకొనుటకు యుద్ధరంగము కలియతిరగసాగిరి . వారికి శరీరమంతా గాయములతో చూపు సరిగా కనిపించని స్థితిలో ఉన్న జాంబవంతుడు కనిపించాడు . 
విభీషణుడు జాంబవంతుడిని పలకరించగా ,జాంబవంతుడు అతడి కంఠస్వరమును గుర్తించి హనుమ క్షేమసమాచారమును అడిగాడు . రామలక్ష్మణుల క్షేమసమాచారము అడగకుండా ,హనుమ క్షేమసమాచారము అడిగినందుకు ఆశ్చర్యపోయిన విభీషణుడు కారణము అడుగగా ,"హనుమ జీవించి ఉంటే ఎంతమంది మరణించినా విజయము మనదే ,హనుమంతుడు లేనట్టయితే ఎంతమంది జీవించి వున్నా విజయము సాధించలేము "అని సమాధానము చెప్పి ,హనుమతో "హనుమా !మహాపరాక్రమవంతా !ఇప్పుడు వానరభల్లూక సేన జీవనము నీ చేతిలో వున్నది . నీవు నీ పరాక్రమమును ప్రదర్శించుచు ,సముద్రమును దాటి ,హిమగిరిని చేరి ,అక్కడ కల వృషభగిరికి ,కైలాస పర్వతమునకు మధ్యకల ఓషదగిరిపై కల మృతసంజీవనీ ,విశల్యకరణి ,సంధానకరణి ,సావర్ణ్యకరణి అను పేర్లు కల ఓషధులను వెనువెంటనే ఏమాత్రము ఆలస్యము చేయక తీసుకునిరా "అని పలికెను . 
జాంబవంతుని మాటలు విన్న హనుమ క్షణము కూడా ఆలస్యము చేయక ,వెంటనే తన శరీరమును పెంచి ,సముద్రమును లంఘించి ,హిమగిరి చేరి అచటకల మహిషదీ పర్వతమును చూసేను . తనకు కావలిసిన ఓషదులకోసము వెతుకగా అవి కనిపించలేదు . వెంటనే హనుమ తన బలమును ప్రదర్శించుచు ఆ పర్వతమును పెకలించి ,దానిని తీసుకుని ఆకాశములో ఎగురుతూ వానరసైన్యము మధ్యకు చేరెను . 

ఆ ఓషధీ వాసనలు తగిలినంతనే  మరణించిన వానరులందరూ నిద్రనుండి లేచినట్టు లేచి కూర్చుండిరి . వారి శరీరములపై కల గాయములన్నీ మాయమయినవి . రామలక్ష్మణులు కూడా పూర్తి స్వస్తులై లేచిరి . వానరసైన్యము హనుమను పొగిడిరి . జయజయద్వానములు చేసిరి . ఆ శబ్దములకు లంకలోని రాక్షసులు భయపడిరి . అప్పుడు హనుమ ఆ ఓషధీ పర్వతమును మరల తీసుకువెళ్లి యధాస్థానంలో పెట్టి ,తిరిగి వానరసైన్యము మధ్యకు వచ్చి చేరెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదినాలుగవసర్గ సమాప్తము . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము యుద్ధకాండ -డెబ్బదిమూడవసర్గ

                                   రామాయణము 

                                 యుద్ధకాండ  -డెబ్బదిమూడవసర్గ 

తన సోదరులు ,పుత్రులు మరణించుటచే వారిని తలుచుకుని దుఃఖించుచున్న రావణుడిని చూసిన అతని కుమారుడు ఇంద్రజిత్తు ,తండ్రికి ధైర్యము చెప్పి ,అగ్నికార్యము చేసి అగ్ని దేవుడికి హవిస్సులను సమర్పించి ,బ్రహ్మాస్త్రమును తీసుకుని అదృశ్య రూపములో యుద్ధరంగమునకు వెళ్లెను . అక్కడి ఎవ్వరికి కనపడకుండా వానరసైన్యముపై బాణవర్షమును కురిపించెను . అతడి బాణపరంపరకు వానరసైన్యము రక్తసిత్తమయ్యెను . పెక్కుమంది యుద్ధ భూమిలో పడిపోయిరి . 
సుగ్రీవుడు ,నలుడు ,నీలుడు ,హనుమంతుడు ,జాంబవంతుడు మొదలగు వీరులుకూడా ,ఇంద్రజిత్తు చేతిలో గాయములపాలయ్యిరి . వారు తిరిగి దాడి చేయుటకు ఇంద్రజిత్తు ఎక్కడఉన్నాడో తెలియలేదు . రామలక్ష్మణులపై ఇంద్రజిత్తు మంత్రించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను . అది వారిని బాదించకపోయినను ,బ్రహ్మదేవుడుపై కల గౌరవముతో వారు స్పృహ తప్పినట్టుగా యుద్దభూమిపై పడిపోయిరి . అది చూసిన రాక్షస వీరులు ఇంద్రజిత్తుకి జయజయద్వానములు చేసిరి . అది చూసిన ఇంద్రజిత్తు లంకా నగరంలోకి ప్రవేశించి తండ్రి వద్దకు వెళ్లి జరిగిన యుద్ధమును ఉత్సాహముతో చెప్పెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదిమూడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము యుద్ధకాండ -డెబ్బదిరెండవసర్గ

                                    రామాయణము 

                                     యుద్ధకాండ -డెబ్బదిరెండవసర్గ 

మిక్కిలి తేజోమూర్తి ఐన లక్ష్మణుడి చేతిలో అతికాయుడు మరణించిన వార్త విన్న రావణుడు మిక్కిలి బాధపడి తన సభలోని వారితో ఇలా పలికెను . "మన రాక్షసులలో మిక్కిలి బలశాలురైన అనేకమంది రాక్షసవీరులు శత్రువుల చేతిలో మరణించారు . ఇంతకూ ముందు ఎప్పుడు ఓటమి ఎరుగని మహావీరులు కూడా శ్రీరాముడి సైన్యము ముందు నిలవలేక మరణించారు . శ్రీరాముడు మెచ్చుకోదగిన మహావీరుడే . మన లంకా నగర రక్షణ వ్యవస్థను పటిష్టము చేయండి . లంకా నగర ద్వారముల వద్ద రక్షణను అధికము చేయండి . "అని చెప్పి దీనావదనుడై అంతః పురములోకి ప్రవేశించెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదిరెండవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Tuesday 1 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియొకటవసర్గ

                                  రామాయణము 

                                      యుద్ధకాండ -డెబ్బదియొకటవసర్గ 

రావణుని కుమారులలో ,అతికాయుడు మిక్కిలి బలశాలి ,పర్వతము వలె దృఢమైన దేహము కలవాడు . బ్రహ్మ నుండి వరములు పొందినవాడు . దేవదానవుల దర్పములు అనిచినవాడు . అతడు తన పినతండ్రులు ,తన సోదరులు శత్రువులు మరణించారని తెలిసి ఎంతో కోపముతో రధమును అధిరోహించి ,యుద్ధమునకు వెళ్లెను . అతడి భారీ దేహమును చూసిన వానరసైన్యము కుంభకర్ణుడే మరలా లేచి వచ్చాడా ?అని భ్రమించి ,భయముతో పరుగులు తీయసాగిరి . 
అది చూసిన శ్రీరాముడు విభీషణుడిని అతికాయుడు గురించి అడిగెను . అప్పుడు విభీషణుడు శ్రీరామునితో" రామా !అతడు రావుణుడి కుమారుడైన అతికాయుడు . మహావీరుడు ,అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు . సామ భేద దాన దండోపాయమములలో చతురుడు . యితడు రావణుడి పత్ని ధాన్యమాలీ యొక్క కుమారుడు . యితడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ,అనేక అస్త్రశస్త్రములను పొందాడు . సురాసురులచే చావులేకుండా వరమును కూడా పొందాడు . అతడు ధరించిన దివ్యమైన కవచము ,అతడు ఎక్కి వస్తున్న రధమును బ్రహ్మదేవుడే ఇతడికి అనుగ్రహించాడు . ఇతడి చేతిలో వందలమంది దేవతలు ,దానవులు పరాజితులయిరి . ఇంద్రుని వజ్రాయుధము కూడా ఇతడి ముందు నిర్వీర్యమయినది . వరుణుని యొక్క పాశము కూడా నిర్వీర్యమైనది . వెంటనే ఇతడిని నిహతుడిని చేయనిచో మన వానరసైన్యమును మొత్తమును నాశనము చేయగలడు "అని పలికెను . 
బీకరుడైన అతికాయుడు యుద్ధరంగములోకి ప్రవేశించుట చూసిన ,కుముదుడు ,ద్వివిదుడు ,మైందుడు ,నీలుడు ,శరభుడు మొదలైన వానరవీరులు ఒక్కుమ్మడిగా అతడిపై దాడికి దిగిరి . కానీ వారందరూ అతికాయుడి పరాక్రము ముందు నిలవలేక పోయిరి . అతికాయుడు తనను ఎదిరించని వానరుల జోలికి వెళ్ళుటలేదు . తనతో యుద్ధమునకు వచ్చిన వాడిని వదులుటలేదు . ఇదంతా గమనించిన లక్ష్మణుడు ,అతికాయుడితో యుద్ధమునకు దిగెను . వారిరువురి మధ్య యుద్ధము భయంకరముగా జరిగెను . చివరికి లక్ష్మణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును తప్పించుకొనలేక అతికాయుడు మరణించేను . 
అతికాయుడు మరణించుట చూసిన వానరవీరులందరూ లక్ష్మణుని వేనోళ్ళ పొగిడిరి . వారందరూ ఆ విధముగా పొగుడుతుండగా ,లక్ష్మణుడు తన అన్న ఐన శ్రీరాముడి వద్దకు చేరెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియొకటవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .