Tuesday 1 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియొకటవసర్గ

                                  రామాయణము 

                                      యుద్ధకాండ -డెబ్బదియొకటవసర్గ 

రావణుని కుమారులలో ,అతికాయుడు మిక్కిలి బలశాలి ,పర్వతము వలె దృఢమైన దేహము కలవాడు . బ్రహ్మ నుండి వరములు పొందినవాడు . దేవదానవుల దర్పములు అనిచినవాడు . అతడు తన పినతండ్రులు ,తన సోదరులు శత్రువులు మరణించారని తెలిసి ఎంతో కోపముతో రధమును అధిరోహించి ,యుద్ధమునకు వెళ్లెను . అతడి భారీ దేహమును చూసిన వానరసైన్యము కుంభకర్ణుడే మరలా లేచి వచ్చాడా ?అని భ్రమించి ,భయముతో పరుగులు తీయసాగిరి . 
అది చూసిన శ్రీరాముడు విభీషణుడిని అతికాయుడు గురించి అడిగెను . అప్పుడు విభీషణుడు శ్రీరామునితో" రామా !అతడు రావుణుడి కుమారుడైన అతికాయుడు . మహావీరుడు ,అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు . సామ భేద దాన దండోపాయమములలో చతురుడు . యితడు రావణుడి పత్ని ధాన్యమాలీ యొక్క కుమారుడు . యితడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ,అనేక అస్త్రశస్త్రములను పొందాడు . సురాసురులచే చావులేకుండా వరమును కూడా పొందాడు . అతడు ధరించిన దివ్యమైన కవచము ,అతడు ఎక్కి వస్తున్న రధమును బ్రహ్మదేవుడే ఇతడికి అనుగ్రహించాడు . ఇతడి చేతిలో వందలమంది దేవతలు ,దానవులు పరాజితులయిరి . ఇంద్రుని వజ్రాయుధము కూడా ఇతడి ముందు నిర్వీర్యమయినది . వరుణుని యొక్క పాశము కూడా నిర్వీర్యమైనది . వెంటనే ఇతడిని నిహతుడిని చేయనిచో మన వానరసైన్యమును మొత్తమును నాశనము చేయగలడు "అని పలికెను . 
బీకరుడైన అతికాయుడు యుద్ధరంగములోకి ప్రవేశించుట చూసిన ,కుముదుడు ,ద్వివిదుడు ,మైందుడు ,నీలుడు ,శరభుడు మొదలైన వానరవీరులు ఒక్కుమ్మడిగా అతడిపై దాడికి దిగిరి . కానీ వారందరూ అతికాయుడి పరాక్రము ముందు నిలవలేక పోయిరి . అతికాయుడు తనను ఎదిరించని వానరుల జోలికి వెళ్ళుటలేదు . తనతో యుద్ధమునకు వచ్చిన వాడిని వదులుటలేదు . ఇదంతా గమనించిన లక్ష్మణుడు ,అతికాయుడితో యుద్ధమునకు దిగెను . వారిరువురి మధ్య యుద్ధము భయంకరముగా జరిగెను . చివరికి లక్ష్మణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును తప్పించుకొనలేక అతికాయుడు మరణించేను . 
అతికాయుడు మరణించుట చూసిన వానరవీరులందరూ లక్ష్మణుని వేనోళ్ళ పొగిడిరి . వారందరూ ఆ విధముగా పొగుడుతుండగా ,లక్ష్మణుడు తన అన్న ఐన శ్రీరాముడి వద్దకు చేరెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియొకటవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment