Tuesday 15 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదినాలుగవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -డెబ్బదినాలుగవసర్గ 

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము ప్రభావమున రామలక్ష్మణులు స్పృహతప్పి నేలపై పది ఉండిరి . ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో ఆ సాయంత్రము అరువదియేడు కోట్లమంది వానరులు మరణించిరి . మిగిలినవారు గాయములతో కొనఊపిరితో ఉండిరి . అంతటా హాహాకారములు మారుమ్రోగగా విభీషణుడు ,హనుమంతుడు ధైర్యము తెచ్చుకుని తమవారెవరెవరు మరణించిరో ,ఎవరు సజీవంగా వుంటిరో తెలుసుకొనుటకు యుద్ధరంగము కలియతిరగసాగిరి . వారికి శరీరమంతా గాయములతో చూపు సరిగా కనిపించని స్థితిలో ఉన్న జాంబవంతుడు కనిపించాడు . 
విభీషణుడు జాంబవంతుడిని పలకరించగా ,జాంబవంతుడు అతడి కంఠస్వరమును గుర్తించి హనుమ క్షేమసమాచారమును అడిగాడు . రామలక్ష్మణుల క్షేమసమాచారము అడగకుండా ,హనుమ క్షేమసమాచారము అడిగినందుకు ఆశ్చర్యపోయిన విభీషణుడు కారణము అడుగగా ,"హనుమ జీవించి ఉంటే ఎంతమంది మరణించినా విజయము మనదే ,హనుమంతుడు లేనట్టయితే ఎంతమంది జీవించి వున్నా విజయము సాధించలేము "అని సమాధానము చెప్పి ,హనుమతో "హనుమా !మహాపరాక్రమవంతా !ఇప్పుడు వానరభల్లూక సేన జీవనము నీ చేతిలో వున్నది . నీవు నీ పరాక్రమమును ప్రదర్శించుచు ,సముద్రమును దాటి ,హిమగిరిని చేరి ,అక్కడ కల వృషభగిరికి ,కైలాస పర్వతమునకు మధ్యకల ఓషదగిరిపై కల మృతసంజీవనీ ,విశల్యకరణి ,సంధానకరణి ,సావర్ణ్యకరణి అను పేర్లు కల ఓషధులను వెనువెంటనే ఏమాత్రము ఆలస్యము చేయక తీసుకునిరా "అని పలికెను . 
జాంబవంతుని మాటలు విన్న హనుమ క్షణము కూడా ఆలస్యము చేయక ,వెంటనే తన శరీరమును పెంచి ,సముద్రమును లంఘించి ,హిమగిరి చేరి అచటకల మహిషదీ పర్వతమును చూసేను . తనకు కావలిసిన ఓషదులకోసము వెతుకగా అవి కనిపించలేదు . వెంటనే హనుమ తన బలమును ప్రదర్శించుచు ఆ పర్వతమును పెకలించి ,దానిని తీసుకుని ఆకాశములో ఎగురుతూ వానరసైన్యము మధ్యకు చేరెను . 

ఆ ఓషధీ వాసనలు తగిలినంతనే  మరణించిన వానరులందరూ నిద్రనుండి లేచినట్టు లేచి కూర్చుండిరి . వారి శరీరములపై కల గాయములన్నీ మాయమయినవి . రామలక్ష్మణులు కూడా పూర్తి స్వస్తులై లేచిరి . వానరసైన్యము హనుమను పొగిడిరి . జయజయద్వానములు చేసిరి . ఆ శబ్దములకు లంకలోని రాక్షసులు భయపడిరి . అప్పుడు హనుమ ఆ ఓషధీ పర్వతమును మరల తీసుకువెళ్లి యధాస్థానంలో పెట్టి ,తిరిగి వానరసైన్యము మధ్యకు వచ్చి చేరెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదినాలుగవసర్గ సమాప్తము . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment