Sunday, 12 February 2017

                                            రామాయణము 

                                   అయోధ్యకాండ -తొంబది తొమ్మిదవసర్గ 

భరతుడు అన్నయైన శ్రీరాముని దర్శించవలెననే  కోరికతో శత్రుఘ్నుడికి ఆశ్రమ చిహ్నములు చూపిస్తూ దానిని సమీపించెను . వశిష్ట మహర్షికి తన తల్లులను జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పి ,తానూ వడివడిగా నడవసాగెను . ఆయనతో పాటు ,శత్రుఘ్నుడు ,సుమంత్రుడు ,గుహుడు నడవసాగిరి . భారద్వాజమహర్షి చెప్పిన గుర్తులను గుర్తుకు తెచ్చుకుంటూ ,ఆ దారిలో నడవసాగెను . దారిలో రామలక్ష్మణులు ఏర్పరుచుకున్న గుర్తులు గమనిస్తూ వాటి గురించి శత్రుఘ్నుడికి వివరిస్తూ భరతుడు ముందుకు సాగెను . నడుచునపుడు భరతుడు శత్రుఘ్నుడితో "రాజప్రాసాదములో రాజభోగములు అనుభవించవలిసిన అన్నావదినలు ఈవిధముగా  కష్టపడుటకు నేనే కారణము . కావున నేను వెళ్లిన వెంటనే అన్న పాదములపై పడి క్షమించమని వేసుకుంటాను . "
అని పలికెను . ఆ విధముగా మాట్లాడుకుంటూ రాముని ఆశ్రమమును సమీపించిరి . ఆ ఆశ్రమమును ,అచటి పరిసరములను బాగుగా పరిశీలించెను . అచట ఒకానొక ఆసనముపైన నారచీరలు జింక చర్మము ధరించి రాముడు ధ్యాన నిమగ్నుడై ఉండెను . ఆయనను చూడగానే భరతుడు దుఃఖముతో గొంతు పూడిపోగా స్వామీ !అని నెమ్మిదిగా పిలిచెను . పిదప ఆయన స్వరము పెక్కుసేపు దుఃఖముతో పెగలకుండెను . అతి ప్రయత్నమూ మీద అన్నా !అని పిలిచి రాముని పాదములపై పది ఏడవసాగెను . శత్రుఘ్నుడు సైతము రాముని పాదములపై పది ఏడవసాగెను . రాముడు వారిరువురిని లేవనెత్తి తన అక్కునచేర్చుకొనెను . ఆ దృశ్యము చూసిన అచటి వారు ఆశ్రమవాసులు ,సుమంత్రుడు ,గుహుడు ఆనందాశ్రువులు కార్చిరి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Saturday, 11 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదియెనిమిదవసర్గ

                                     రామాయణము 

                                    అయోధ్యకాండ -తొంబదియెనిమిదవసర్గ 

నరశ్రేష్ఠుడు ప్రతిభాశాలి అయిన ఆ భరతుడు తన సేనను నిలుపుచేసి శ్రీరాముని వద్దకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకుని ,కొంతమంది దారి చూపు సేన ,మంత్రులు ,పురోహితులు ,శత్రుఘ్నుడు తో కలసి కాళీ నడకన చెట్లు ,కొండలు దాటుతూ ముందుకు సాగెను . అంత కొంతదూరము నడిచిన పిదప ఒక మద్ది చెట్టు ఎక్కి భరతుడు చూసేను . అప్పుడు ఆయనకు పొగ కనిపించెను . అచట రాముడు వుండివుండవచ్చునని ,రాముని చూడవలెననే ఉత్సాహముతో ముఖమున చిరునవ్వులు చిందుతుండగా రాముని ఆశ్రమము వైపు వడివడిగా అడుగులు వేసెను . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Friday, 10 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబది ఏడవసర్గ

                                                 రామాయణము 

                                        అయోధ్యకాండ -తొంబది ఏడవసర్గ 

భరతుని విషయములో సుమిత్రానందనుడయిన  లక్ష్మణుడు కోపముతో ఊగిపోవుట గమనించిన రాముడు అతనిని శాంతపరుచుతూ "నాయనా !మిగుల ప్రాజ్ఞుడు అయిన భరతుడు మన వద్దకు వచ్చునప్పుడు ధనుర్భాణములతో పని ఏమున్నది ?మన తండ్రిగారే ఈ రాజ్యమును భరతునికి ఇచ్చివేశారు . ఇక భరతుడు మనకు ఎందుకు కీడు చేయ తలుస్తాడు . మనం అనాలోచితముగా భరతుడిపై దాడి చేసి సాధించుకున్న రాజ్యము ఎవరికోసం ?నాకు అటువంటి రాజ్యము వద్దు . 
భరతుడు చిన్నతనము నుండి నాకు బాగుగా తెలుసు అతడిది అటువంటి స్వభావము కాదు . ఓ సౌమిత్రీ !ఎట్టి ఆపదలు వచ్చినను పుత్రులు తండ్రిని ఎటుల చంపగలరు . అటులనే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన మరో సోదరుడిని ఎలా చంపగలడు . కావున నీ ఆలోచన తప్పు . కోపము విడిచి శాంతిని వహించుము . బహుశా జరిగిన విషయము తెలుసుకుని తన తల్లి కైకేయిని దూషించి ఉంటాడు . తండ్రిని ప్రసన్నుడిని చేసుకుని మనలను మరల్చుటకు వచ్చి ఉండవచ్చును . బహుశా ,మనము సుకుమారులము కావున దశరథ మహారాజు మనలను మరల్చి అయోధ్యకు తీసుకువెళ్ళుటకు వస్తున్నాడేమో ?కనీసము మిక్కిలి సుకుమారి అయిన సీతాదేవినైనను అతడు తీసుకుని వెళ్లవచ్చును . 
లక్ష్మణా !అన్ని వాహనము కానవచ్చుచున్నవి కానీ తండ్రి గారి శ్వేతచ్ఛత్ర రధము మాత్రము కానవచ్చుటలేదు . నాకేదో సందేహము కలుగుచున్నది ." అని రాముడు పలుకగా లక్ష్మణుడు శాంతించి చెట్టు దిగెను . భరతుడు "మానవలన శ్రీరాముని ఆశ్రమముకు ఏ ఇబ్బంది కలుగకూడదు "అని సైనికులను ఆజ్ఞాపించెను . పిమ్మట అత్యంత వినమ్రుడై రాముని అనుగ్రహము పొందుటకై రాముడు వున్న దిశగా బయలుదేరెను . 

రామాయణము అయోధ్యకాండ తొంబది ఏడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Thursday, 9 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదిఆరవసర్గ

                                          రామాయణము 

                                అయోధ్యకాండ -తొంబదిఆరవసర్గ 

ఆ విధముగా శ్రీరాముడు సీతాదేవికి చిత్రకూటపర్వత అందములు చూపుతూ ఆమెకు ఫలముల గుజ్జును ,కందమూలములను పెట్టి ఆమెకు ప్రియమును కూర్చెను . ఆ విధముగా వారు చిత్రకూట పర్వతముపై వుండి భాషించుకుంటున్న సమయములో జంతువులు. అప్పుడు భయముభయముగా పెరిగిడసాగినవి . దూళి ఆకాశమునకు తాకుచున్నది .  అప్పుడు  రాముడు లక్ష్మణుని పిలిచి 
"లక్ష్మణా !ధూళి ఆకాశమును తాకుచున్నది . గజములు మొదలగు జంతువులూ భయముతో పరిగెడుచున్నవి . బహుశా ఏ రాజో ,లేక రాకుమారుడో వేటకి వచ్చివుండును . లేక క్రూర మృగములు వచ్చి ఉండును . ఏమిటో చూడు "అని పలికెను . అన్న ఆదేశమును అనుసరించి లక్ష్మణుడు చిత్రకూట పర్వతముపై కల అత్యంత ఎత్తయిన మద్ది చెట్టు ఎక్కి ఒక మహాసేనను ,వాటి రధములపై ఎగురు ధ్వజ పతాకములను చూసి అన్న వద్దకు వచ్చి 
"హోమాగ్నిని ఆర్పుము . అప్పుడే శత్రువులు మన జాడను కనిపెట్టలేరు . సీతాదేవిని బద్రముగా గుహలో దాయుము ,ధనుర్భాణములు ధరించుము "అని పలికెను అప్పుడు రాముడు "లక్ష్మణా !వచ్చినదెవరో బాగుగా పరిశీలించితివా ?"అని ప్రశ్నించగా ,లక్ష్మణుడు "అన్నా !వచ్చినది కైకేయి పుత్రుడైన భరతుడు . బహుశా మన అడ్డును తొలగించుకొనుటకు వచ్చివుండును . ధనుర్భాణములు ధరించి నేను అతడిని తుదముట్టించెదను . అతడిని చంపుట పాపము అవదు . మన శత్రువు చావుటకు మన చెంతకే వచ్చినాడు . నేడే కైకేయిని ఆమెతో అనుబంధము కల మంధర మున్నగు వారిని అందరిని తుదముట్టించెదను . ఆమె కారణముగా ఎంతో కలుషితమైన ఈ భూమండలం కు పాప విముక్తి కలిగించెదను . నీవు నీ రాజ్యమును ఏలుకోవచ్చును . 

రామాయణము అయోధ్యకాండ తొంబది ఆరవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday, 8 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదియైదవసర్గ

                                           రామాయణము 

                                       అయోధ్యకాండ -తొంబదియైదవసర్గ 

అంతట శ్రీరాముడు చిత్రకూట పర్వతము నుండి మందాకినీ నదీ తీరమునకు సీతతో కూడి చేరి  నదీ సౌందర్యములను జనకనందినికి  చూపెను . నిర్మలమైన నదీజలములను ,నదీ తీరమునకు ఇరువైపులా కల వృక్షములు ,ఆ వృక్షముల నుండి పూలు జాలువారి నదీ తీరప్రదేశము ,నదీ జలములు ఆ పూలతో నిండి చూచుటకు మనోహరముగా కల ఆ దృశ్యమును రాముడు సీతకు చూపెను . ఆ నదీ తీరమున విహరించు చెకోర పక్షుల జంటలను సీతకు చూపెను .
ఇంకనూ శ్రీరాముడు సీతతో "ఓ మైథిలీ !నన్ను త్రికరణ శుద్ధిగా అనుసరించు అనుకూలవతివైన నీవు నా చెంతన ఉండుట వలన నాకు  అయోధ్య గుర్తుకు వచ్చుట లేదు . నీతో ,లక్ష్మణునితో ,కలసి ఈ నిర్మల జలములను త్రాగుచు ,మధురమైన కందమూలములను భుజించుచు నేను అయోధ్యలో వలే హాయిగా వున్నాను . ఈ నదీ ప్రాంతము మిక్కిలి రమణీయముగా కలదు . ఇచట సిద్దులు ,మునులు మున్నగు వారి నిత్యమూ స్నానమాచరించుచు వుండుదురు . ఈ నదీ జలములలో స్నానమాచరించినవారికి ,ఈ వృక్షఛాయలలో విశ్రమించువారికి శ్రమలు మాయమగును "అని పలుకుతూ ఆ ప్రాంతము లో విహరించుచుండెను . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియైదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .   






Tuesday, 7 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదినాల్గవసర్గ

                                        రామాయణము 

                                 అయోధ్యకాండ -తొంబదినాల్గవసర్గ 

శ్రీరామునకు గిరులను దర్శించుట అందు ,వనములలో  విహరించుట అందు మక్కువ ఎక్కువ . సీతాలక్ష్మణులతో కూడి ఆ పర్వతముపై వసించుచున్న శ్రీరాముడు విదేహరాజకుమారి అయిన సీతాదేవికి ప్రియమును కూర్చుటకు చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభను  ఆమెకు చూపుతూ "ఓ సీతా !రాజ్యాధికారం ,నాకు హితులు ,మిత్రులు నాకు దూరంగా ఉన్నప్పటికీ ,ఈ చిత్రకూటము నందలి రమణీయ దృశ్యములను చూచుచు ఆనందించుటలో నిమగ్నమైన న మనసుకి ఆ విషయములు ఏమి కలవరపరుచుటలేదు . ఈ పర్వత అందములను చూడు 
వివిధ పక్షుల మధుర ధ్వనులు ,ఎత్తైన ఆకాశమును తాను శిఖరములు ,ఆ శిఖరములనుండి జాలువారుచున్న గైరికాదిధాతువులు కనువిందు చేయుచున్నవి . ఆ శిఖరములు రకరకముల రంగులతో అలరారుచున్నవి రకరకాల చెట్లతో ఎంతో పచ్చగా ,శోభాయమానంగా వున్నది . ఆహ్లాదకరమైన కొండచరియలు అందు ప్రేమానురాగములతో జంటలు జంటలుగా తిరుగుచున్న ఈ కిన్నెరజాతి వారిని చూడుము . ఇచట కల  జంతువులూ , క్రూర మృగములు జాతివైరమును మరచి ప్రశాంతముగా వున్నవి . ఈ చిత్రకూటము రుచికరములైన కందమూలములతో ,మధుర జలములతో మిగుల సంపన్నమయినది . ఓ ప్రాణేశ్వరీ !శ్రేష్ఠములైన వనవాస నియమములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసలుచు నీతోను ,లక్ష్మణుని తొడను ఈ పదునాలుగు సంవత్సరముల కాలమును సంతోషముగా గడిపేడను . దాని వలన మన వంశ ప్రతిష్టలు ఇనుమడించును . 

రామాయణము అయోధ్యకాండ తొంబది నాల్గవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం.  ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణo అయోధ్యకాండ -తొంబది మూడవసర్గ

                                     రామాయణo 

                                   అయోధ్యకాండ -తొంబది మూడవసర్గ 

అట్లు వనములో ప్రయాణించుచున్న మహా సేనను చూసి భీతిల్లిన మదపుటేనుగులు మున్నగు వన్య మృగములు తమ గుంపులతో కూడి ,పరుగులు తీసినవి . భరతుడు సేన సాగరము వలె అపారమైన వర్షాకాలము నందు మేఘసముదాయము ఆకాశమునువలె భూమిని కప్పివేసెను . సేన అంతా రామలక్ష్మణులను చూడవలెననే ఆత్రముతో పరుగులు తీయసాగిరి . 
అటుల ఎడతెరపి లేకుండా భరద్వాజుడు తెలిపిన మార్గములో  ప్రయాణించి చిత్రకూటము చేరిరి . దారి తెలిసిన సైనికులు ముందుగా ప్రయాణించి అచట పొగను గమనించి ,భరతుడి వద్దకు వచ్చి "ప్రభూ అచట పొగ కానవచ్చుచున్నది . పొగ వున్నచో అచట జనులు తప్పక వుండుదురు . రామలక్ష్మణులు ఉండి ఉండవచ్చు . లేదా మునులు తపమాచరించుచు ఉండవచ్చు . "అని పలికిరి . 
భరతుడు తన సేనను అచటనే ఉంచి తానూ ,మునులు ,పురోహితులు మాత్రము ముందుకు సాగిరి . భరతుని ఆజ్ఞ ప్రకారము సైనికులు అతి త్వరలో రాముని చూడబోతున్నామన్న ఆశతో ఉవ్విళ్ళూరుచు అచటనే ఉండిరి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదిమూడవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .