Wednesday, 7 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదియవసర్గ

                                రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణునితో , సుగ్రీవునితో ,వానరవీరులతో లంకా నగరము వైపు చూచుచుండగా ,వారికి లంకా నగరంలోని ఒక భవనము పైభాగమున కూర్చుని వున్న దుష్టుడైన రావణుడు కనిపించెను . అతడికి ఇరువైపులా ,పరిచారికలు వింద్యామరలు పట్టుకుని విసురుతూ ఉండిరి . ఆ రావణుడిని శ్రీరాముడు మిగిలిన వారంతా స్పష్టముగా చూసిరి . 
రాక్షస రాజైన రావణుడు కనపడినంతనే సుగ్రీవుడు ఒక్క ఉదుటున తన ఆసనంపై నుండి లేచి ,పర్వాతాగ్రభాగముననుండి ఎగిరి లంకా ద్వారముపై వాలెను . పిదప అతడు రావణుడున్న భవనముపైకి ఎగిరి ,రావణుడి ముందు వాలెను . అప్పుడు రావణునితో సుగ్రీవుడు "రావణా !నీ దుష్ట చేష్టలతో నీ చావును నేవే కొని తెచ్చుకున్నావు . ఇక మృత్యువు నుండి నిన్ను తప్పించుట ఎవరికిని సాధ్యముకాదు . ఇప్పుడు  నా దెబ్బలనుండి తప్పించుకుని బతికి బయటపడి చూద్దాము "అని పలికెను . 

అతడి మాటలు విన్న రావణుడు కోపముతో ఊగిపోతూ ,"ఓ సుగ్రీవా !ఇప్పటివరకూ నీవు నా కంట పడలేదు కాబట్టే సుగ్రీవుడిగా వున్నావు . లేకపోతె ఎప్పుడో హీనగ్రీవుడవు అయ్యేవాడివి . "అని పలికాడు . పిదప మహాబలశాలురు ఐన ఆ రావణాసుగ్రీవ వీరులిద్దరూ ,పిడికిళ్లతో గ్రుద్దుకొనుచూ ,అరచేతులతో చరుచుకొనుచు ,మోచేతులతో పొడుచుకొనుచు ,చేతులతో బాదుకొనుచూ ,తీవ్రముగా యుద్ధము చేసిరి . 
ఇంతలో రాక్షసరాజైన రావణుడు తన మాయా శక్తిని ప్రయోగించుటకు సిద్ధుడయ్యెను . అది గమనించిన సుగ్రీవుడు ,ఆకాశములోకి ఎగిరి ,రావణుడికి చిక్కక అతడిని ముప్పతిప్పలు పెట్టి ,తిరిగి ఎగిరి వానరసైన్యము వద్దకు వచ్చెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment