Sunday, 11 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదిరెండవసర్గ

                                 రామాయణము 

                                  యుద్ధకాండ -నలుబదిరెండవసర్గ 

రాక్షసులు రావణుడి వద్దకు వెళ్లి శ్రీరాముడు తన సైన్యముతో లంక నాలుగు వైపులా ద్వారములను ముట్టడించినవిషయము తెలియచేసిరి . లంకా నగరము ముట్టడికి గురి ఐన విషయము తెలుసుకుని ,క్రుద్ధుడై రక్షణ ఏర్పాట్లని రెట్టింపు చేసెను . పిదప రావణుడు తన ప్రాసాదము ఫై కి ఎక్కి ,శత్రు సైన్యమును చూసేను . 
లంకా నగరద్వారమునకు చేరుకున్న శ్రీరాముడు దాడి చేయుటకు తన సైన్యమునకు ఆజ్ఞను ఇచ్చెను . కామరూపులైన ఆ వానరులు" శ్రీరామునికి జయము,లక్ష్మణ స్వామికి జయము ,వానరారాజైన సుగ్రీవునికి జయము ,అని బిగ్గరగా పలుకుచు ,సింహ గర్జనలు ,చేయుచు ,లంక యొక్క ప్రాకారముపైకి చకచకా పాకిరి . 
రావణుడు పై నుండి ఇది గమనించుచు ,తన సైన్యమునకు  ఆజ్ఞను ఇచ్చెను . వెనువెంటనే రాక్షస సైనికులు పెద్దగా గర్జనలు చేయుచు వానరసైనికుల వైపుగా పరుగులు పెట్టిరి . వెంటనే రాక్షస వానరుల మధ్య ,పూర్వము దేవాసురల సంగ్రామము వలె భయంకరమైన యుద్ధము మొదలయ్యెను . దృఢకాయులైన వానరయోధులు జయజయద్వానములు పలుకుతూ ,గోళ్ళతో రక్కుతూ ,దంతములతో కొరుకుతూ  చాలామంది రాక్షసులను హతమార్చిరి . అప్పుడు భయంకరులైన రాక్షసులు ముండ్లగదలతో ,ఖడ్గములతో ,శూలములతో వానరసైన్యములో దొరికిన వారిని దొరికినట్టు చంపసాగిరి . అప్పుడు వానరులు గోడపైకెక్కి అక్కడ తమపైకి ఆయుధములను ప్రయోగించుచున్న రాక్షసులను పడదోసిరి . ఈ విధముగా ఆ ప్రాంతమంతా రక్తముతో తడిసిపోయెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








 

Wednesday, 7 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదియొకటవసర్గ

                                  రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియొకటవసర్గ 

శ్రీరాముడు సుగ్రీవుని శరీరముపై కల యుద్ధ చిహ్నములను చూసి ,వెంటనే సుగ్రీవుని కౌగిలించుకొనెను . పిమ్మట ఆ ప్రభువు సుగ్రీవునితో "మిత్రమా !సుగ్రీవా !నాతొ మాటమాత్రమైనా చెప్పకుండా ఇటువంటి సాహస కార్యమునకు పూనుకొంటివి . ప్రభువులు తొందర[పడి ఇటువంటి సాహస కార్యములకు పూనుకొనరాదు కదా !ప్రాణమిత్రుడవైన నీకు ఏమాత్రము ఆపద సంభవించినా ఇక మా పరిస్థితి ఏమిటి ?అట్టి స్థితిలో సీతతో కానీ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కానీ చివరకి నా ప్రాణములతో కానీ పని ఏముంటుంది ?నీకు ఏదయినా ఆపద వాటిల్లిన యెడల నేను రాజ్యమును భరతునికి అప్పగించి నా ప్రాణములు త్యజించాలని నిశ్చయించుకున్నాను . "అని పలికెను 
అప్పుడు సుగ్రీవుడు "రఘువీరా ! నీ పౌరుషము మాట అలా ఉండనివ్వండి . నేను మీ మిత్రుడని అయి కూడా మీ ధర్మపత్నిని అపహరించిన దుష్టుడిని చూసి ఎలా ప్రశాంతముగా ఉండగలను ?"అని పలికెను . అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని అభినందించి ,లక్ష్మణునితో "నేడే ఆ దుష్ట రావణుని పాలనలో వున్న లంక ను అన్ని వైపుల నుండి ముట్టడించెదము "అని పలికి ,ఆ పర్వతమును దిగి కిందకు వచ్చెను . ఆయన వెనకే సమస్త సేనా కదిలి వచ్చెను . మహా పరాక్రమశాలి ఐన శ్రీరాముడు మరునాడు ప్రాతః కాలమే ధనుర్దారీ అయి వానర సైన్యము కూడి లంకాభిముఖుడై ముందుగా తానూ నడిచెను . 
శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి లంకా నగరము ప్రాకారము వద్దకు చేరిన పిమ్మట అతడు ఉత్తరద్వారమును ముట్టడించెను . మహావీరుడైన 'నీలుడు 'మైందునితో ద్వివిదునితో కూడి లంక యొక్క తూర్పు ద్వారమున నిలిచెను . మిక్కిలి బలశాలి యువరాజు ఐన అంగదుడు ఋషభునితో ,గవయునితో ,గవాక్షునితో గజునితో కలిసి దక్షిణ ద్వారము చేరెను . కపి వీరులలో ప్రముఖుడైన హనుమంతుడు ప్రమాదితో ,ప్రఘసునితో ఇంకా వానర యోదులతో కలిసి పశ్చిమ ద్వారముపై దాడి చేసి దానిని ఆక్రమించెను . గరుత్మంతునితో ,వాయుదేవునితో సమానమైన వానరవీరులతో సుగ్రీవుడు పశ్చిమోత్తర దిశల మధ్యభాగమున వున్న రాక్షసుల సేనా శిబిరంపై తానె స్వయముగా దాడి చేసెను . సుగ్రీవుని వెనక ముప్పై ఆరుకోట్ల మంది వానర వీరులు ఉండిరి . శ్రీరాముని ఆదేశము ప్రకారము లక్ష్మణుడు ,విభీషణుడు ప్రతి ద్వారము వద్ద ఒక కోటి మంది వానర వీరులను నిలిపిరి . 
వానరులందరూ పెద్ద పెద్ద కోరలతో, గోళ్ళతో ,పెద్ద పెద్ద కొండా రాళ్లను పెద్ద పెద్ద వృక్షములను చేత పూని దాడికి సిద్ధముగా ఉండిరి . ఆ వానర వీరులందరూ నలువైపులా నుండి చీమ దూరుటకు కూడా వీలు లేనంతగా త్రికూట పర్వతమును చుట్టి వున్నారు . ఇంకా కొంత మంది వానరవీరులు లంకా నగరమును ఆక్రమించారు . నల్లని మేఘము వలె  భయంకరాకారులు ,ఇంద్రుని వంటి పరాక్రమము కలవారు అయిన వానర వీరులు అకస్మాత్తుగా వచ్చి పాడుతా చే రాక్షసులంతా భయపడిరి . శ్రీరాముడు రాక్షసులను వధించుటకై ఆ విధముగా వానర వీరులను తగిన స్థానములలో నిలిపి ఉండెను . పిమ్మట ఆయన అనంతర కార్యక్రమము కై తన  అలోచించి చివరిసారిగా ఒక సారి దూతను పంపుట ఉత్తమమని భావించి అంగదుడిని పిలిపించెను . పిమ్మట ఆ మహానుభావుడు అంగదునితో "అంగదా నీవు లంకా నగరంలోకి ప్రవేశించి ఆ రావణుడి వద్దకు వెళ్లి నా సందేశమును ఈ విధముగా వినిపించు "ఓ దుష్టరావణా !నీకే పౌరుషము వున్నచో నగరము నుండి బయటకు వచ్చి నేరుగా ఎదుర్కో . నీకు ,నీ మంత్రులకు ,పుత్రమిత్రులకు నా చేతిలో చావు తప్పదు . నీవు మరణించినచో ముల్లోకములలోని వారు హాయిగా జీవించెదరు . నీవు సమస్త ప్రాణులకు కంటక ప్రాయుడవు . కనుక నిన్ను నేడే హతమార్చెదను . నీవు నన్ను సారాను జొచ్చి వైదేహిని నాకు అప్పగించినచో నిన్ను క్షమించేదను .  అట్లు కానిచో నా చేతిలో నీ చావు తప్పదు ఆపై విభీషణుడు లంకకు రాజు అవుతాడు "అని పలికి అతడి సమాధానమును తెలుసుకునిరా "అని శ్రీరాముడు అంగదుని రావణుడి వద్దకు పంపెను . 
అంగదుడు రావణుని వద్దకు వెళ్లి శ్రీరాముని వచనములను యధాతధముగా వినిపించెను . ఆ మాటలు విన్న రావణుడు కోపముతో రగిలిపోయి "ఈ దూతను పట్టుకొనండి ఇతడిని చంపండి "అని ఆజ్ఞాపించెను . ఆ మాటలు విన్న రాక్షసులు నలుగురు అంగదునిపై పడిరి అంగదుడు, ఆ నలుగురిని చంకలో చిక్కించుకుని ఎత్తైన భవనమునుఎక్కి ,ఆ భవనము పైనుండి బలముగా వారిని పడవేసెను . పిమ్మట అతడు ఎదురుగా వున్న రావణుని భవనమును చూసేను వెంటనే అతడు ఆ భవనము పైకి ఎక్కి ఆ ప్రాసాద గోపురమును కూలదోసెను . ఆ విధముగా అంగదుడు ఆ గోపురమును పడదోసి ,మీసములు దువ్వుకుని ఒక పెద్ద సింహనాదమొనర్చి ఒక్క గంతులో అక్కడ నుండి ప్రాకారము పైకి దూకి తన సేన వద్దకు వెళ్లెను . అంగదుని రాకతో వానరవీరులందరూ సంతోషముతో కేకలు వేసిరి . 
రావణుడు జరిగిన దానిని తలుచుకుని అవమానంతో రగిలిపోయెను . శ్రీరాముడు అంగదుని ద్వారా రావణుడి ఆంతర్యమును గ్రహించి ఇక యుద్ధము అనివార్యమని భావించెను . సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి లంకా నగరము వరకు వ్యాపించి వున్న వంద అక్షౌహిణుల  వానర సైన్యమును చూసిన రాక్షసులు మిక్కిలి ఆశ్చర్యపడిరి . పిరికివారు భయముతో వొణికిపోయిరి . లంక అంతా రాక్షసులు భయాందోళనలతో తిరగసాగిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదియొకటవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము యుద్ధకాండ -నలుబదియవసర్గ

                                రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణునితో , సుగ్రీవునితో ,వానరవీరులతో లంకా నగరము వైపు చూచుచుండగా ,వారికి లంకా నగరంలోని ఒక భవనము పైభాగమున కూర్చుని వున్న దుష్టుడైన రావణుడు కనిపించెను . అతడికి ఇరువైపులా ,పరిచారికలు వింద్యామరలు పట్టుకుని విసురుతూ ఉండిరి . ఆ రావణుడిని శ్రీరాముడు మిగిలిన వారంతా స్పష్టముగా చూసిరి . 
రాక్షస రాజైన రావణుడు కనపడినంతనే సుగ్రీవుడు ఒక్క ఉదుటున తన ఆసనంపై నుండి లేచి ,పర్వాతాగ్రభాగముననుండి ఎగిరి లంకా ద్వారముపై వాలెను . పిదప అతడు రావణుడున్న భవనముపైకి ఎగిరి ,రావణుడి ముందు వాలెను . అప్పుడు రావణునితో సుగ్రీవుడు "రావణా !నీ దుష్ట చేష్టలతో నీ చావును నేవే కొని తెచ్చుకున్నావు . ఇక మృత్యువు నుండి నిన్ను తప్పించుట ఎవరికిని సాధ్యముకాదు . ఇప్పుడు  నా దెబ్బలనుండి తప్పించుకుని బతికి బయటపడి చూద్దాము "అని పలికెను . 

అతడి మాటలు విన్న రావణుడు కోపముతో ఊగిపోతూ ,"ఓ సుగ్రీవా !ఇప్పటివరకూ నీవు నా కంట పడలేదు కాబట్టే సుగ్రీవుడిగా వున్నావు . లేకపోతె ఎప్పుడో హీనగ్రీవుడవు అయ్యేవాడివి . "అని పలికాడు . పిదప మహాబలశాలురు ఐన ఆ రావణాసుగ్రీవ వీరులిద్దరూ ,పిడికిళ్లతో గ్రుద్దుకొనుచూ ,అరచేతులతో చరుచుకొనుచు ,మోచేతులతో పొడుచుకొనుచు ,చేతులతో బాదుకొనుచూ ,తీవ్రముగా యుద్ధము చేసిరి . 
ఇంతలో రాక్షసరాజైన రావణుడు తన మాయా శక్తిని ప్రయోగించుటకు సిద్ధుడయ్యెను . అది గమనించిన సుగ్రీవుడు ,ఆకాశములోకి ఎగిరి ,రావణుడికి చిక్కక అతడిని ముప్పతిప్పలు పెట్టి ,తిరిగి ఎగిరి వానరసైన్యము వద్దకు వచ్చెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము యుద్ధకాండ -ముప్పదితొమ్మిదవసర్గ

                              రామాయణము 

                         యుద్ధకాండ -ముప్పదితొమ్మిదవసర్గ 

వానరోత్తములందరూ ఆ రాత్రి సూదులపర్వతముపై గడిపిరి . వారు అచట నుండే   అద్భుతముగా వున్న లంకా నగరమును దర్శించిరి . పెద్దభవనాలతో వున్న లంకా నగరమును చూసిన శ్రీరాముడు ఆశ్చర్యపోయేను . యంత్రయుక్తమైన ద్వారములతో అలరారుచున్న ఆ లంకా నగరమును శ్రీరాముడు ,లక్ష్మణుడు ,ఇంకా సమస్త వానర వీరులు దర్శించిరి . 

రామాయణము యుద్ధకాండ ముప్పదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                                   రామాయణము 

                           యుద్ధకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

శ్రీరాముడు సేనతో సహా సువేల పర్వతముపై ఆ పూట విడిది చేయ నిశ్చయించుకొనెను . శ్రీరాముడు సైన్యము అంతా సువేల పర్వతముపైకి చేరి ఎదురుగా ఉన్న లంకా నగరమును చూసిరి . అది ఆకాశమున వేలాడుచున్నట్టు ఉండెను . ఆ వానరయోధులు చూడముచ్చటగా ఉన్నలంకా నగరమును దర్శించిరి . దాని ద్వారము అద్భుతముగా ఉండెను . బంగారు ప్రాకారముతో ఉన్న ఆ నగరములో కల రాక్షసులు కోకొల్లలుగా నిండి ఉన్నారు . కోట గోడలపై చేరి వున్న రాక్షసులు చూడటానికి మరొక ప్రాకారమా ?అన్నట్టు ఉన్నారు . వారందరిని శ్రీరాముడు ,మిగిలిన వీరులు చూసిరి . అప్పుడు వానర సైన్యము అంతా యుద్దకాంక్షతో వివిధములగు కోలాహల ధ్వనులు చేసిరి . వారందరూ ఆ రాత్రికి అచటనే విశ్రమించిరి . 

రామాయణము యుద్ధకాండ ముప్పదిఎనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -ముప్పదియేడవసర్గ

                                     రామాయణము 

                                   యుద్ధకాండ -ముప్పదియేడవసర్గ 

శ్రీరాముడు,లక్ష్మణుడు  ,సుగ్రీవుడు ,హనుమంతుడు ఇంకా మిగిలిన వానర ప్రముఖులందరూ ఒక చోట సమావేసమయ్యిరి . యుద్దమునకై సమాలోచన చేయసాగిరి . అప్పుడు విభీషణుడు శ్రీరామునితో "ప్రభూ ! నా మంత్రులు పక్షుల రూపములో రావణుని లంకకు వెళ్లి ,అక్కడి రక్షణ వ్యవస్థను తెలుసుకుని వచ్చారు "అని పలికి లంకలో రక్షణకై రావణుడు చేసిన ఏర్పాట్లన్నీ శ్రీరాముడితో విభీషణుడు వివరముగా చెప్పాడు . ఇంకా రావణునికి కల బలము ,బలగము కూడా వివరించి చెప్పెను . 
అప్పుడు శ్రీరాముడు విభీషణుడితో "విభీషణా !వానరులలో మహావీరుడైన నీలుడు లంక యొక్క తూర్పు ద్వారము వైపున నిలుచును . అంగదుడు లంక యొక్క దక్షిణద్వారము వైపున నిలిచి ,మహాపార్శ్వ మహోదరుని చీల్చి చెండాడతాడు . హనుమంతుడు పశ్చిమద్వారము వైపున నిల్చి ,ఇంద్రజిత్తుని చిత్తూ కావించి లంకలో ప్రవేశించగలడు . రావణుడు ఉత్తరద్వారమున రక్షణకై వున్నాడు కదా నేను లక్ష్మణుడితో కలిసి అతడిని దెబ్బతీసి అతడి అహమును అణుస్తాను . వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ,జాంబవంతుడు ,విభీషణుడు లంక మధ్యలో వున్న సైనిక బలముపై దాడిచేయుదురు . వానరులు కామరూపులైనా వారు మానవ రూపము దాల్చరాదు . సైన్యములో మనవారిని గుర్తించుటకు అదే కొండగుర్తు . "అని పలికి శత్రు నిర్మూలనమునకై  శ్రీరాముడు సైన్యముతో సహా లంకా నగరము వైపుగా నడవసాగెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Monday, 5 August 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదిఆరవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -ముప్పదిఆరవసర్గ 

రావణుడి హితము కోరుచు మాల్యవంతుడు పలుకగా ఆయువు మూడిన రావణుడు అతడి మాటలు సహింపలేకపోయెను . అప్పుడు రావణుడు మాల్యవంతుడితో "మాల్యవంతా !నీవు శత్రువహించిన వాడు వలె కనుపడుతున్నావు . హితవచనముల పేరుతో నాకు పరుష వచనములు పలికితివి . రాముడు ఒక మానవుడే కదా పైగా తండ్రి చే అడవులకు తరిమివేయబడ్డాడు . దేవతలే నన్ను చూసి గడగడలాడెదరు . రాముడు సేనలతో సహా సముద్రమును దాటి వచ్చిన విషయము నిజమే కానీ అతడు ప్రాణములతో  తిరిగి వెళ్ళలేడు . ఇదియే నా ప్రతిజ్ఞ . "అని పలికెను . 
రావణుడు కోపముతో పలుకుతున్న మాటలు విన్న మాల్యవంతుడు అతడి మాటలకు సమాధానముగా ఏమి మాట్లాడక ,రావణుని ఆశీర్వదించి ,తన గృహమునకు వెళ్లిపోయెను . పిదప రావణుడు తన మంత్రులతో ఆలోచించి ,లంకకు రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసెను . తూర్పుద్వారమున ప్రహస్తుని ,మహాపార్శ్వుని ,మహోదరుని ,దక్షిణ ద్వారమున ,ఇంద్రజిత్తు ను పశ్చిమ ద్వారమున ,ఉత్తరద్వారమున శుక సారణులను రక్షణకై నియోగించెను . రావణుడు తాను కూడా  శుకసారణులకు అప్పగించిన ఉత్తరద్వారమును రక్షించుచు ఉండేదనని పలికెను . ఇంకా విరూపాక్షుడు అను రాక్షసుడిని పెక్కుమంది యోధుల సహాయముతో లంక మధ్యలో వున్న సైనిక స్థావర రక్షణకై నియోగించెను . పిమ్మట రావణుడు తన మంత్రులను ఇంటికి పంపి ,తాను కూడా అంతః పురమునకు వెళ్లెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పది ఆరవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .