Monday 5 August 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదిఆరవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -ముప్పదిఆరవసర్గ 

రావణుడి హితము కోరుచు మాల్యవంతుడు పలుకగా ఆయువు మూడిన రావణుడు అతడి మాటలు సహింపలేకపోయెను . అప్పుడు రావణుడు మాల్యవంతుడితో "మాల్యవంతా !నీవు శత్రువహించిన వాడు వలె కనుపడుతున్నావు . హితవచనముల పేరుతో నాకు పరుష వచనములు పలికితివి . రాముడు ఒక మానవుడే కదా పైగా తండ్రి చే అడవులకు తరిమివేయబడ్డాడు . దేవతలే నన్ను చూసి గడగడలాడెదరు . రాముడు సేనలతో సహా సముద్రమును దాటి వచ్చిన విషయము నిజమే కానీ అతడు ప్రాణములతో  తిరిగి వెళ్ళలేడు . ఇదియే నా ప్రతిజ్ఞ . "అని పలికెను . 
రావణుడు కోపముతో పలుకుతున్న మాటలు విన్న మాల్యవంతుడు అతడి మాటలకు సమాధానముగా ఏమి మాట్లాడక ,రావణుని ఆశీర్వదించి ,తన గృహమునకు వెళ్లిపోయెను . పిదప రావణుడు తన మంత్రులతో ఆలోచించి ,లంకకు రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసెను . తూర్పుద్వారమున ప్రహస్తుని ,మహాపార్శ్వుని ,మహోదరుని ,దక్షిణ ద్వారమున ,ఇంద్రజిత్తు ను పశ్చిమ ద్వారమున ,ఉత్తరద్వారమున శుక సారణులను రక్షణకై నియోగించెను . రావణుడు తాను కూడా  శుకసారణులకు అప్పగించిన ఉత్తరద్వారమును రక్షించుచు ఉండేదనని పలికెను . ఇంకా విరూపాక్షుడు అను రాక్షసుడిని పెక్కుమంది యోధుల సహాయముతో లంక మధ్యలో వున్న సైనిక స్థావర రక్షణకై నియోగించెను . పిమ్మట రావణుడు తన మంత్రులను ఇంటికి పంపి ,తాను కూడా అంతః పురమునకు వెళ్లెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పది ఆరవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment