Wednesday 7 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదియొకటవసర్గ

                                  రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియొకటవసర్గ 

శ్రీరాముడు సుగ్రీవుని శరీరముపై కల యుద్ధ చిహ్నములను చూసి ,వెంటనే సుగ్రీవుని కౌగిలించుకొనెను . పిమ్మట ఆ ప్రభువు సుగ్రీవునితో "మిత్రమా !సుగ్రీవా !నాతొ మాటమాత్రమైనా చెప్పకుండా ఇటువంటి సాహస కార్యమునకు పూనుకొంటివి . ప్రభువులు తొందర[పడి ఇటువంటి సాహస కార్యములకు పూనుకొనరాదు కదా !ప్రాణమిత్రుడవైన నీకు ఏమాత్రము ఆపద సంభవించినా ఇక మా పరిస్థితి ఏమిటి ?అట్టి స్థితిలో సీతతో కానీ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కానీ చివరకి నా ప్రాణములతో కానీ పని ఏముంటుంది ?నీకు ఏదయినా ఆపద వాటిల్లిన యెడల నేను రాజ్యమును భరతునికి అప్పగించి నా ప్రాణములు త్యజించాలని నిశ్చయించుకున్నాను . "అని పలికెను 
అప్పుడు సుగ్రీవుడు "రఘువీరా ! నీ పౌరుషము మాట అలా ఉండనివ్వండి . నేను మీ మిత్రుడని అయి కూడా మీ ధర్మపత్నిని అపహరించిన దుష్టుడిని చూసి ఎలా ప్రశాంతముగా ఉండగలను ?"అని పలికెను . అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని అభినందించి ,లక్ష్మణునితో "నేడే ఆ దుష్ట రావణుని పాలనలో వున్న లంక ను అన్ని వైపుల నుండి ముట్టడించెదము "అని పలికి ,ఆ పర్వతమును దిగి కిందకు వచ్చెను . ఆయన వెనకే సమస్త సేనా కదిలి వచ్చెను . మహా పరాక్రమశాలి ఐన శ్రీరాముడు మరునాడు ప్రాతః కాలమే ధనుర్దారీ అయి వానర సైన్యము కూడి లంకాభిముఖుడై ముందుగా తానూ నడిచెను . 
శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి లంకా నగరము ప్రాకారము వద్దకు చేరిన పిమ్మట అతడు ఉత్తరద్వారమును ముట్టడించెను . మహావీరుడైన 'నీలుడు 'మైందునితో ద్వివిదునితో కూడి లంక యొక్క తూర్పు ద్వారమున నిలిచెను . మిక్కిలి బలశాలి యువరాజు ఐన అంగదుడు ఋషభునితో ,గవయునితో ,గవాక్షునితో గజునితో కలిసి దక్షిణ ద్వారము చేరెను . కపి వీరులలో ప్రముఖుడైన హనుమంతుడు ప్రమాదితో ,ప్రఘసునితో ఇంకా వానర యోదులతో కలిసి పశ్చిమ ద్వారముపై దాడి చేసి దానిని ఆక్రమించెను . గరుత్మంతునితో ,వాయుదేవునితో సమానమైన వానరవీరులతో సుగ్రీవుడు పశ్చిమోత్తర దిశల మధ్యభాగమున వున్న రాక్షసుల సేనా శిబిరంపై తానె స్వయముగా దాడి చేసెను . సుగ్రీవుని వెనక ముప్పై ఆరుకోట్ల మంది వానర వీరులు ఉండిరి . శ్రీరాముని ఆదేశము ప్రకారము లక్ష్మణుడు ,విభీషణుడు ప్రతి ద్వారము వద్ద ఒక కోటి మంది వానర వీరులను నిలిపిరి . 
వానరులందరూ పెద్ద పెద్ద కోరలతో, గోళ్ళతో ,పెద్ద పెద్ద కొండా రాళ్లను పెద్ద పెద్ద వృక్షములను చేత పూని దాడికి సిద్ధముగా ఉండిరి . ఆ వానర వీరులందరూ నలువైపులా నుండి చీమ దూరుటకు కూడా వీలు లేనంతగా త్రికూట పర్వతమును చుట్టి వున్నారు . ఇంకా కొంత మంది వానరవీరులు లంకా నగరమును ఆక్రమించారు . నల్లని మేఘము వలె  భయంకరాకారులు ,ఇంద్రుని వంటి పరాక్రమము కలవారు అయిన వానర వీరులు అకస్మాత్తుగా వచ్చి పాడుతా చే రాక్షసులంతా భయపడిరి . శ్రీరాముడు రాక్షసులను వధించుటకై ఆ విధముగా వానర వీరులను తగిన స్థానములలో నిలిపి ఉండెను . పిమ్మట ఆయన అనంతర కార్యక్రమము కై తన  అలోచించి చివరిసారిగా ఒక సారి దూతను పంపుట ఉత్తమమని భావించి అంగదుడిని పిలిపించెను . పిమ్మట ఆ మహానుభావుడు అంగదునితో "అంగదా నీవు లంకా నగరంలోకి ప్రవేశించి ఆ రావణుడి వద్దకు వెళ్లి నా సందేశమును ఈ విధముగా వినిపించు "ఓ దుష్టరావణా !నీకే పౌరుషము వున్నచో నగరము నుండి బయటకు వచ్చి నేరుగా ఎదుర్కో . నీకు ,నీ మంత్రులకు ,పుత్రమిత్రులకు నా చేతిలో చావు తప్పదు . నీవు మరణించినచో ముల్లోకములలోని వారు హాయిగా జీవించెదరు . నీవు సమస్త ప్రాణులకు కంటక ప్రాయుడవు . కనుక నిన్ను నేడే హతమార్చెదను . నీవు నన్ను సారాను జొచ్చి వైదేహిని నాకు అప్పగించినచో నిన్ను క్షమించేదను .  అట్లు కానిచో నా చేతిలో నీ చావు తప్పదు ఆపై విభీషణుడు లంకకు రాజు అవుతాడు "అని పలికి అతడి సమాధానమును తెలుసుకునిరా "అని శ్రీరాముడు అంగదుని రావణుడి వద్దకు పంపెను . 
అంగదుడు రావణుని వద్దకు వెళ్లి శ్రీరాముని వచనములను యధాతధముగా వినిపించెను . ఆ మాటలు విన్న రావణుడు కోపముతో రగిలిపోయి "ఈ దూతను పట్టుకొనండి ఇతడిని చంపండి "అని ఆజ్ఞాపించెను . ఆ మాటలు విన్న రాక్షసులు నలుగురు అంగదునిపై పడిరి అంగదుడు, ఆ నలుగురిని చంకలో చిక్కించుకుని ఎత్తైన భవనమునుఎక్కి ,ఆ భవనము పైనుండి బలముగా వారిని పడవేసెను . పిమ్మట అతడు ఎదురుగా వున్న రావణుని భవనమును చూసేను వెంటనే అతడు ఆ భవనము పైకి ఎక్కి ఆ ప్రాసాద గోపురమును కూలదోసెను . ఆ విధముగా అంగదుడు ఆ గోపురమును పడదోసి ,మీసములు దువ్వుకుని ఒక పెద్ద సింహనాదమొనర్చి ఒక్క గంతులో అక్కడ నుండి ప్రాకారము పైకి దూకి తన సేన వద్దకు వెళ్లెను . అంగదుని రాకతో వానరవీరులందరూ సంతోషముతో కేకలు వేసిరి . 
రావణుడు జరిగిన దానిని తలుచుకుని అవమానంతో రగిలిపోయెను . శ్రీరాముడు అంగదుని ద్వారా రావణుడి ఆంతర్యమును గ్రహించి ఇక యుద్ధము అనివార్యమని భావించెను . సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి లంకా నగరము వరకు వ్యాపించి వున్న వంద అక్షౌహిణుల  వానర సైన్యమును చూసిన రాక్షసులు మిక్కిలి ఆశ్చర్యపడిరి . పిరికివారు భయముతో వొణికిపోయిరి . లంక అంతా రాక్షసులు భయాందోళనలతో తిరగసాగిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదియొకటవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment