Tuesday 17 October 2017

రామాయణము కిష్కిందకాండ -పదునొకొండవసర్గ

                                              రామాయణము 

                                                కిష్కిందకాండ -పదునొకొండవసర్గ 

శ్రీరాముడు పలికిన వచనములు విని సుగ్రీవుడు సంతోషించి తిరిగి ఆ మహానుభావుడితో "రామా !వాలి బాలసామర్ధ్యములు వివరించెదను "అని పలికి ఇలా తెలుపసాగెను . "రామా !వాలి బ్రహ్మయే ముహూర్తమునే లేచి భూమండలం నలుదిక్కులా కల సరోవరములలో స్నానము చేసిరాగలడు . వాలి పర్వత శిఖరములను బంతుల వలె ఆడుకొనగలడు . మహా వృక్షములను సైతము పెకలించగలడు ఒకానొక సమయములో దుందుభి అను పేరు కల ఒక పర్వతము తో సమానమైన భారీ దేహము కల ఒక రాక్షసుడు వుండెడివాడు . అతడు దేవతలా వలన పొందిన వార గర్వముతో సముద్రము వద్దకు వెళ్లి యుద్ధమునకు రమ్మని పిలిచెను . అప్పుడు సముద్రుడు వెలుపలికి వచ్చి "నీతో యుద్ధము చేయుటకు నేను అశక్తుడను . హిమవంతుడు అను ఒక మహా పర్వతుడు కలదు అతడే నీతో యుద్ధము చేయుటకు సమర్థుడు "అని పలికెను . 
అప్పుడా  దుందుభి హిమవత్పర్వతము వద్దకు వెళ్లి యుద్ధమునకు రమ్మని రెచ్చగొట్టెను . అప్పుడా మహాత్ముడు "ఓ వీరా !నేను తాపములాచరించెడి సాధువులకు నెలవైనవాడిని . నీతో యుద్ధము చేయలేను . కావున నీవు మరలిపొమ్ము "అని పలుకగా అప్పుడా రాక్షసుడు "నాకు యుద్ధము చేయవలెనని బాగుగా కోరిక వున్నది కావున నీవు యుద్ధము చేయలేను ఎడల ,నాతొ యుద్ధము చేయగల సమర్థుడు ఎవరో తెలుపుము "అని పలికెను . అప్పుడా హిమవంతుడు "వాలి అను వీరుడు కలడు . అతడు నీతో యుద్ధము చేయుటకు సమర్థుడు . కిష్కింధకు రాజు ,మహాబలశాలి ,వానరవీరుడు "అని తెలుపగా ఆ దుందుభి సమరోత్సాహముతో కిష్కింధకు వెళ్లి అచట ద్వారమును బాదుతూ ,పక్కన వున్నా చెట్లను పీకి వేయుచూ ,మహా నాదము చేస్తూ ,వాలిని యుద్ధమునకు రమ్మని బిగ్గరగా పిలువసాగెను . 
అప్పుడు వాలి ఆ చప్పుళ్లకు అంతఃపురము నుండీ స్త్రీలతో కలిసి బయటకు వచ్చి ఆ దుందుభిని చూసి "ఓ వీరా !దుందుభీ ! నీ గూర్చి ఇదివరలోనే వింటివుంటిని . ఎందుకు అలా ద్వారమును బాదుతూ వృక్షములను నాశనము చేస్తూ నీ మరణమును నీవే కొనితెచ్చుకొనెదవు "అని పలుకగా దుందుభి "ఓ వాలీ !స్త్రీల మధ్యలో నిలబడి ప్రగల్బాలు పలుకుచున్నావు . నీకు ఈ రాత్రికి గడువు ఇస్తున్నాను . ఈ రాత్రి హాయిగా గడిపిన పిమ్మట నిన్ను రేపు ఉదయమే వధించెదను . "అని పలికెను . అప్పుడు వాలి నవ్వుతూ స్త్రీలనందరినీ అంతఃపురములోకి పంపివేసి ఆ రక్కసుడితో యుద్ధమునకు దిగెను . ఇద్దరు హోరాహోరీగా పోట్లాడుకొనిరి . కొంతసేపటికి వాలి మెడలోని సువర్ణమాల కారణముగా దుందుభి శక్తి క్షీణించి వాలి శక్తి ఎక్కువయ్యెను . అంత వాలి ఆ దుందుభిని తన దెబ్బలతో చంపి ,వాడి శరీరమును దూరముగా విసిరివేసెను . 
ఆ దుందుభి శరీరము ఋష్యమూక పర్వతముపైవున్న మతంగా మహర్షి ఆశ్రమము దగ్గరలో పడెను . ఆ శరీరము నోటి నుండి కొన్ని రక్తపు బిందువులు మతంగా మహర్షి ఆశ్రముపై పడెను . అంత మహర్షి కోపించి దీనికి కారణము ఎవరా అని అలోచించి ,వాలి అని గ్రహించి అతడిని" ఈ ఆశ్రమము .పరిసరములు అపవిత్రము చేసిన కారణముగా ఈ పరిసర ప్రాంతములకు అడుగుపెట్టిన వెనువెంటనే మరణింతువని "శపించెను . "వాలి అనుచరులు కూడా ఈ పర్వతముపైనుండి రేపటిలోగా మరలిపోనిచో మరణించెదరు . "అని శపించెను . ఆ శాప వాక్కులు విన్న వాలి అనుచరులు అచటి నుండి కిష్కిన్దాకు చేరి వాలికి జరిగిన విషయము వివరించిరి . ఆ విషయము తెలుసుకున్న వాలి మాత్మగా మహర్షి ని కరుణించమని ప్రార్ధించెను . కానీ మతంగా మహర్షి వినిపించుకోలేదు . ఆ కారణముగా వాలి ఎప్పుడు ఈ పర్వతము వైపు కన్నెత్తి కూడా చూడడు "అని సుగ్రీవుడు పలికెను . 
ఇంకనూ సుగ్రీవుడు రామునితో "ఈ విషయముత్ తెలుసుకున్న నేను మా అన్న నుండీ  రక్షించుకొనుటకు  నివసించుచున్నాను . ఇదిగో పెద్ద కొండలా ఉన్న ఇదే దుందుభి అస్థిపంజరం . "అని పలికి సుగ్రీవుడు మరి వాలిని మీరు జనించగలరా ?"అని ప్రశ్నించెను . దానికి సమాధానముగా శ్రీరాముడు దుందుభి అస్తిపంజరమును తన ఎడమకాలి బొటనవేలితో దూరముగా ఎగురునట్లు చేసెను .

రామాయణము కిష్కిందకాండ పదునొకొండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday 12 October 2017

రామాయణము కిష్కిందకాండ -పదవసర్గ

                                               రామాయణము 

                                                        కిష్కిందకాండ -పదవసర్గ 

పిమ్మట నేను మా అన్న వాలితో "అన్నా !నీవు శత్రువును పరిమార్చి ,క్షేమముగా కిష్కింధకు విచ్చేయుట చాలా సంతోషము . ఈ వింజామరతో నీకు విసిరెదను . నీకు సేవ చేసెడి భాగ్యమును నాకు కలిగించుము . "ఓ అన్నా !పూర్తిగా సంవత్సర కాలము పాటు నేను ఆ గుహ వెలుపలే వేచి వున్నాను . పిమ్మట ఆ గుహ నుండి వచ్చిన రక్తము చూసి నేను నీకు అపాయము సంభవించిందని భ్రమించినాను . పిమ్మట ఆ రాక్షసుడు బయటపడకుండా ఉండుటకు గాను ఒక పెద్ద కొండరాయిని ఆ బిలద్వారమునకు అడ్డుగా పెట్టితిని . 
బాధతో ఉన్న నా నుండి సమాచారం రాబట్టిన మంత్రులు నన్ను బలవంతముగా రాజును చేసిరి . నేను ఈ రాజ్యమును న్యాసముగా (సంరక్షించి తిరిగి ఇచ్చు నట్లు )శ్వీకరించితిని . ఇప్పుడు సంతోషముగా ఈ రాజ్యమును శ్వీకరించు "అని పలికితిని . అయినను మా అన్న నా మాటలు వినక మంత్రులు ,ప్రముఖుల ముందు నన్ను అవమానించెను . ఇంకనూ ఇలా మాట్లాడేను . "నేను సుగ్రీవుడు గుహ బయట ఉంటాడనే ధైర్యముతో గుహలోకి వెళ్లితిని చీకటిగా వున్నా ఆ గుహలో ఆ రక్కసుడు కనపడకుండెను . ఒక సంవత్సర కాలము నేను అతడిని వెతుకుతూనే కాలము గడిపితిని . ఎట్టకేలకు సంవత్సరము ఐన పిమ్మట ఆ మాయావిని ,అతడి అనుచరులను చంపి బయటకు రాబోగా గుహ బయటకు వచ్చుటకు వీలులేకుండా ఒక రాయి అడ్డుగా ఉండెను . 
నేను సుగ్రీవా !సుగ్రీవా !అని పెక్కుమార్లు అరిచి అరిచి ప్రయోజనము లేక కాలితో తన్ని ఆ రాతిని బద్దలుకొట్టి బయటకు వచ్చితిని . వచ్చి చూస్తే బయట వేచి చూస్తానన్న తమ్ముడు లేడు . యితడు దుర్భుద్ధితో నన్ను చంపవలెననే ఉద్దేశ్యముతో ఆ రాతిని అడ్డుగా పెట్టి యితడు రాజ్యమును అనుభవించుచున్నాడు "అని పరుషముగా పలికెను . అంతటితో ఆగక అతడు నన్ను కట్టుబట్టలతో బయటకు గెంటివేసెను . నా భార్యను కూడా అపహరించాడు "అని చెప్పి సుగ్రీవుడు కన్నీరు కార్చెను . అప్పుడు శ్రీరాముడు 
"సుగ్రీవా !నీవు నాకు మిత్రుడవు నీ భాదకు కారణమైన వాడు నాకు పరమ శత్రువు కావున దుఃఖించవలదు . ఈ రోజే నేను వాలిని నా పదునైన బాణములకు బాలి చేసి నీ రాజ్యమును ,నీ భార్యను నీకు అప్పగించెదను "అని మాటిచ్చేను . ఆ మాటలు విన్న సుగ్రీవుడు తన బాధ తొలిగిపోతున్నదని సంతోషపడెను . అతడి మనసు ఊరడిల్లేను . 

 రామాయణము కిష్కిందకాండ పదవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Wednesday 11 October 2017

రామాయణము కిష్కిందకాండ -తొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                    కిష్కిందకాండ -తొమ్మిదవసర్గ 


మా తండ్రి ఋక్షరజుడు మరణించిన పిమ్మట ,మా అన్న వాలి కిష్కిందరాజ్యమునకు రాజు అయ్యెను . మా అన్న అన్న నాకు మిక్కిలి ప్రేమాభిమానములు ఉండెడివి . మయుని పెద్దకుమారుడైన మాయావి కి మా అన్నకు ఒక స్త్రీ కారణముగా విరోధము అని ప్రతీతి . అతడు దుందుభికి అన్న . ఆ మాయావి ఒకనాడు అర్ధరాత్రి వేల జనులందరు నిద్రించుచుండగా కిష్కిందనగరద్వారము వద్దకు వచ్చి బిగ్గరగా అరుస్తూ యుద్ధమునకు పిలిచెను . స్త్రీలు ,నేను ఎంతగా వద్దని వారించినను మా అన్న వాలి వినక ఆ రాక్షసుడిపైకి యుద్ధమునకు వెళ్లెను . 
నేనును మా అన్న మీదకల ప్రేమతో ఆయన వెంటే వెళ్లితిని . మమ్ములను చూసిన ఆ మాయావి పారిపోయెను . మేమును అతడిని వెంబడించుచు వెళ్ళితిమి . అతడు ఒక బిలములోకి దూరెను . మా అన్న వాలి కూడా అతడిని వెంబడిస్తూ వెళ్లబోగా నేనును వచ్చెదనని మా అన్నతో నేను అనగా మా అన్న నన్ను వద్దని తన పాదములమీద వొట్టు  పెట్టి గుహద్వారము వద్దనే వేచివుండమని చెప్పి లోపలి వెళ్లెను . అచట నేను ఒక సంవత్సరకాలం ఉంటిని . పూర్తిగా ఒక సంవత్సరము అయినా పిమ్మట నురగలతో కూడిన రక్తము బయటకు వచ్చుట నేను చూసితిని . 
పిమ్మట మా అన్న ఆక్రందన ,పిదప ఆ రాక్షసుడి గర్జన నాకు వినిపించెను . అప్పుడు నేను మా అన్న మరణించినట్లుగా భావించి బాధతో కాళ్ళీడ్చుకుంటూ రాజ్యమునకు తిరిగి వచ్చితిని . నేను బాధతో ఏమి చెప్పకున్నను మంత్రులు నాతో  సమాచారం రాబట్టి రాజ్యక్షేమము కోసము నన్ను రాజుగా పట్టాభిషిక్తుడను చేసితిరి . ఆ విధముగా నేను రాజ్యమును పరిపాలించుచుండగా ఒకరోజు మా అన్న వచ్చెను . వచ్చి నాపై శత్రుత్వము పూని ,నా మంత్రులందరినీ చెరసాలలో బంధించెను . అప్పుడు నేను మా అన్న తో "అన్నా !అజ్ఞానముతో తప్పు జరిగెను నన్ను మన్నించుము "అని నేను నా కిరీటమును ఆయన పాదమునకు ఆనించి నమస్కరించి ప్రార్ధించినను ఆయన నాపై దయ చూపలేదు నన్ను అనుగ్రహించలేదు . ఆయన కోపము చల్లారలేదు . 

రామాయణము కిష్కిందకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం .ఏ  .ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Monday 9 October 2017

రామాయణము కిష్కిందకాండ -ఎనిమిదవసర్గ

                                              రామాయణము 

                                                  కిష్కిందకాండ -ఎనిమిదవసర్గ 

శ్రీ రాముడి మాటలకు పొంగిపోయిన సుగ్రీవుడు లక్ష్మనుని  ముందు ,తన మంత్రుల ముందు రామునితో "రామా !నీవంటి మిత్రుడు లభించుట నా అదృష్టము . ప్రభూ !నీ అండదండలు లభించుటచే సురలోకాధిపత్యము కూడా  సులభముగా లభించును . ఇక కిష్కింద  విషయము వేరుగా చెప్పనేల ?ఓ రామా !నా మిత్రుడవైన నీ కోసము నేను ప్రాణములు త్యజించుటకైనను వెనుకాడను . "అని పలికెను పిమ్మట సుగ్రీవుడు రామలక్ష్మణులు నిలబడి ఉండుట గమనించి ,బాగుగా పుష్పించిన మద్ది చెట్టు కొమ్మ విరిచి తెచ్చి శ్రీరాముని కూర్చోమని చెప్పి తానునూ శ్రీరాముని పక్కన కూర్చొనెను . 
ఆంజనేయుడు లక్ష్మణుడు నిలబడి ఉండుట చూసి ,మద్ది చెట్టు దిమ్మను తెచ్చి ఆసీనుడిని చేసెను . ఆ విధముగా వారందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండెను . ఆ సమయములో సుగ్రీవుడు శ్రీరాముడంతటి మహావీరుడు స్నేహితుడైనందువలన సంతోషముతో వాలి వలన భయము అతడిలో గుర్తుకురాగా రామునితో "రామా !మా అన్న అగు వాలి నా భార్యను లాగుకొని నన్ను అవమానించెను . నేను మిగుల భయముతో దుఃఖితుడనై ఈ ఋశ్యమూకపర్వతము చేరి ,ఇచట వసించుచున్నాను . వాలి భయము వలన ఆర్తుడనై దిక్కుతోచక ఉన్నాను . సర్వరక్షకుడవైన నీవు నన్ను అనుగ్రహించి రక్షించుము . "అని పలికెను . 
అప్పుడు రాముడు "సుగ్రీవా !ఉపకారము చేయువాడు మిత్రుడు ,అపకారము చేయువాడు శత్రువు . నేను నీ  కావున నీకు అపకారము చేసిన వాలిని ఈ రోజే వధించెదను . నా శరములకు గురై ఒక పర్వతము వలె కుప్పకూలుట నీవు చూసెదవు . "అని పలికెను . అప్పుడు వానర రాజు ఐన సుగ్రీవుడు 'బాగుబాగు 'అని పలికెను . పిమ్మట అతడు "రామా !నేను మిక్కిలి శోకార్తుడనై వున్నాను . శోకముతో విలవిలలాడుతున్న నాకు నేవే దిక్కు . నీవు నా మిత్రుడివి కావున నిన్ను ప్రాధేయపడుచున్నాను . "అని పలికి మిక్కిలి శోకార్తుడై గద్గదతో మాటరాకుండెను . శ్రీరాముడికి తానూ ధైర్యము చెప్పి ఆయన ముందు ఏడ్చుట భావ్యము కాదని భావించి సుగ్రీవుడు బలవంతము మీద కన్నీరును ఆపుకొనెను . 

పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని ఓదార్చి అతడికి ధైర్యము చెప్పెను . పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునితో "నీకు వాలికి శత్రుత్వమునకు కారణమేమి ?దానిని గూర్చి నాకు సవివరముగా చెప్పుము . దానిని బట్టీ నేను నీకు మేలు కలుగునట్లు చేసెదను "అని పలికెను . అప్పుడు సుగ్రీవుడు శ్రీరామునికి  తన కథను వివరింపసాగెను . 

రామాయణము కిష్కిందకాండ ఎనిమిదవసర్గసమాప్తము . 

                          శశి 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ఏడవసర్గ

                                             రామాయణము 

                                                     కిష్కిందకాండ -ఏడవసర్గ 

శ్రీరాముడు శోకార్తుడై అలా వచించిన పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముడికి నమస్కరించి "ప్రభూ !ఆ రావణుని గురించి నాకు ఏమి తెలియదు అయినప్పటికీ వాడు ఎచట దాక్కున్ననూ ,కనిపెట్టి వానిని మృత్యుమార్గమునకు పంపెదను . మీరు ఈ విధముగా భాదపడుట యుక్తము కాదు . బాధ సర్వారిష్టములకు మూలకారణము . కావున దానిని వీడి ,ఇప్పుడు చేయవలసిన కర్తవ్యమును ఆలోచించుడు . నా భార్యను కూడా వాలి అపహరించాడు . నీవును నా వలెనే ధైర్యముగా ఉండుము . "అని పలికి శ్రీరాముని కౌగిలించుకొనెను . 

సుగ్రీవుని మాటలకు శ్రీరాముడు "సుగ్రీవా !సమయోచితముగా నీవు మాట్లాడిన మాటలకు నేను ఊరడిల్లితిని . నీవు చెప్పినట్టే రావణుని వెతికి చంపెదము "అని పలికెను . శ్రీరాముని మాటలు విన్న సుగ్రీవుడు ,ఆంజినేయుడు మొదలగువారు ఊరడిల్లిరి . పిదప రామసుగ్రీవులు ఇరువురు ఒకరికష్టములను ఒకరు చెప్పుకొంటిరి . ఒకరినొకరు ఓదార్చుకొనిరి . 

రామాయణము కిష్కిందకాండ ఏడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .        





Thursday 5 October 2017

రామాయణము కిష్కిందకాండ -ఆరవసర్గ

                                 రామాయణము 

                                  కిష్కిందకాండ -ఆరవసర్గ 

మిక్కిలి సంతోషముతో సుగ్రీవుడు" రామా !నా మంత్రి అగు ఆంజనేయుడు నీ గురించి చెప్పి వున్నాడు . నీవు లక్ష్మణునితో సీతాదేవి తో కలిసి వనవాసము చేయుచుండగా మాయావి రాక్షసుడు ఆమెను అపహరించినాడని హనుమంతుడు చెప్పాడు . నీవు ఏ మాత్రము చింతించవలదు . ఆమెను ఆ రక్కసుడు ఎక్కడ దాచినను నేను వెతికి తెచ్చెదను . నేను ఈ పర్వతము మీద మంత్రులతో కలిసి కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని బలవంతముగా తీసుకొనిపోవుట చూసాను . ఆమె జీరపోయిన గొంతుతో రామా !లక్ష్మణా !అని అరిచెను . ఆమె ఒక నగలమూటను మా మధ్య పడునట్లు వేసెను . 
దానిని నేను జాగ్రత్తపెట్టితిని . నీకు చూపించెదను నీవు తప్పక వాటిని గుర్తుపట్టగలవు . ఆమె తప్పక జనక నందిని అయివుంటుందని నా నమ్మకము . "అని పలికి నగల మూటను తెచ్చి రామునికి చూపించగా రాముడు ఆ ఉత్తరీయము ,ఆ నగలు సీతవిగా గుర్తించి ,కళ్ళనీళ్ళతో నేలపై కూలపడిపోయెను . పిమ్మట లక్ష్మణునితో "లక్ష్మణా ! ఈ నగలు చూడు ఇవి మీ వదినగారివే "అని పలుకగా లక్ష్మణుడు వాటిని చూచి "అన్నా !ఈ నాగాలన్నిటిని నేను గుర్తించలేను కానీ ,మా వదినగారి రోజు పాదాభివందనం చేయుటవలన నేను ఈ అందెలను గుర్తించగలను . "అని పలికెను . 
అప్పుడు రాముడు "సుగ్రీవా !ఆ రాక్షసుడిని నీవు చూసావు . వాడు ఎలా ఉంటాడు . ఏ దిశగా సీతను తీసుకువెళ్లాడు . ఆ రక్కసుడి ఆయువు మూడినట్లే "అని కోపావేశముతో పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఆరవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday 4 October 2017

రామాయణము కిష్కిందకాండ -అయిదవసర్గ

                                    రామాయణము 

                                      కిష్కిందకాండ -అయిదవసర్గ 

అప్పుడు హనుమంతుడు ఋష్యమూక పర్వతము నుండి మలయగిరికి చేరి ,సుగ్రీవుని రామలక్ష్మణులున్న ప్రదేశమునకు తీసుకువచ్చి ,ఆ కపిరాజుకి వారిని గూర్చి చెప్పసాగెను . వారి గురించి సవివరముగా వివరించి సుగ్రీవుని భయమును పోగొట్టి ,వారితో స్నేహము చేయమని చెప్పెను . ఆంజనేయుడి మాట విని సుగ్రీవుడు రామలక్ష్మణులను ఆలింగనము చేసుకుని వారితో మైత్రిని ఏర్పరచుకొనెను . వారు కూర్చొనుటకు ఆసనములు ఏర్పాటుచేసెను . 
పిమ్మట వారందరూ ఎంతో ప్రీతితో మాట్లాడుకొనసాగిరి  . అప్పుడు దీనవదనుడై సుగ్రీవుడు తన అన్న వాలి తనపై కోపమును పెంచుకుని తనను రాజ్యమునుండి వెడలగొట్టటం తన భార్య రుమను అపహరించుట మొదలైన సమస్త విషయములను వివరముగా చెప్పి రాముడి సహాయమును అర్ధించెను . రాముడు వెనువెంటనే సుగ్రీవునికి అభయహస్తము ఇచ్చి ,అతడిని ఓదార్చెను . ఆ సమయములో వాలికి,సీతాదేవికి ,రావణునికి ఒకేసారి ఎడమకన్ను అదిరెను . 

రామాయణము కిష్కిందకాండ అయిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .