Monday 9 October 2017

రామాయణము కిష్కిందకాండ -ఎనిమిదవసర్గ

                                              రామాయణము 

                                                  కిష్కిందకాండ -ఎనిమిదవసర్గ 

శ్రీ రాముడి మాటలకు పొంగిపోయిన సుగ్రీవుడు లక్ష్మనుని  ముందు ,తన మంత్రుల ముందు రామునితో "రామా !నీవంటి మిత్రుడు లభించుట నా అదృష్టము . ప్రభూ !నీ అండదండలు లభించుటచే సురలోకాధిపత్యము కూడా  సులభముగా లభించును . ఇక కిష్కింద  విషయము వేరుగా చెప్పనేల ?ఓ రామా !నా మిత్రుడవైన నీ కోసము నేను ప్రాణములు త్యజించుటకైనను వెనుకాడను . "అని పలికెను పిమ్మట సుగ్రీవుడు రామలక్ష్మణులు నిలబడి ఉండుట గమనించి ,బాగుగా పుష్పించిన మద్ది చెట్టు కొమ్మ విరిచి తెచ్చి శ్రీరాముని కూర్చోమని చెప్పి తానునూ శ్రీరాముని పక్కన కూర్చొనెను . 
ఆంజనేయుడు లక్ష్మణుడు నిలబడి ఉండుట చూసి ,మద్ది చెట్టు దిమ్మను తెచ్చి ఆసీనుడిని చేసెను . ఆ విధముగా వారందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండెను . ఆ సమయములో సుగ్రీవుడు శ్రీరాముడంతటి మహావీరుడు స్నేహితుడైనందువలన సంతోషముతో వాలి వలన భయము అతడిలో గుర్తుకురాగా రామునితో "రామా !మా అన్న అగు వాలి నా భార్యను లాగుకొని నన్ను అవమానించెను . నేను మిగుల భయముతో దుఃఖితుడనై ఈ ఋశ్యమూకపర్వతము చేరి ,ఇచట వసించుచున్నాను . వాలి భయము వలన ఆర్తుడనై దిక్కుతోచక ఉన్నాను . సర్వరక్షకుడవైన నీవు నన్ను అనుగ్రహించి రక్షించుము . "అని పలికెను . 
అప్పుడు రాముడు "సుగ్రీవా !ఉపకారము చేయువాడు మిత్రుడు ,అపకారము చేయువాడు శత్రువు . నేను నీ  కావున నీకు అపకారము చేసిన వాలిని ఈ రోజే వధించెదను . నా శరములకు గురై ఒక పర్వతము వలె కుప్పకూలుట నీవు చూసెదవు . "అని పలికెను . అప్పుడు వానర రాజు ఐన సుగ్రీవుడు 'బాగుబాగు 'అని పలికెను . పిమ్మట అతడు "రామా !నేను మిక్కిలి శోకార్తుడనై వున్నాను . శోకముతో విలవిలలాడుతున్న నాకు నేవే దిక్కు . నీవు నా మిత్రుడివి కావున నిన్ను ప్రాధేయపడుచున్నాను . "అని పలికి మిక్కిలి శోకార్తుడై గద్గదతో మాటరాకుండెను . శ్రీరాముడికి తానూ ధైర్యము చెప్పి ఆయన ముందు ఏడ్చుట భావ్యము కాదని భావించి సుగ్రీవుడు బలవంతము మీద కన్నీరును ఆపుకొనెను . 

పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని ఓదార్చి అతడికి ధైర్యము చెప్పెను . పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునితో "నీకు వాలికి శత్రుత్వమునకు కారణమేమి ?దానిని గూర్చి నాకు సవివరముగా చెప్పుము . దానిని బట్టీ నేను నీకు మేలు కలుగునట్లు చేసెదను "అని పలికెను . అప్పుడు సుగ్రీవుడు శ్రీరామునికి  తన కథను వివరింపసాగెను . 

రామాయణము కిష్కిందకాండ ఎనిమిదవసర్గసమాప్తము . 

                          శశి 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment