Wednesday 11 October 2017

రామాయణము కిష్కిందకాండ -తొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                    కిష్కిందకాండ -తొమ్మిదవసర్గ 


మా తండ్రి ఋక్షరజుడు మరణించిన పిమ్మట ,మా అన్న వాలి కిష్కిందరాజ్యమునకు రాజు అయ్యెను . మా అన్న అన్న నాకు మిక్కిలి ప్రేమాభిమానములు ఉండెడివి . మయుని పెద్దకుమారుడైన మాయావి కి మా అన్నకు ఒక స్త్రీ కారణముగా విరోధము అని ప్రతీతి . అతడు దుందుభికి అన్న . ఆ మాయావి ఒకనాడు అర్ధరాత్రి వేల జనులందరు నిద్రించుచుండగా కిష్కిందనగరద్వారము వద్దకు వచ్చి బిగ్గరగా అరుస్తూ యుద్ధమునకు పిలిచెను . స్త్రీలు ,నేను ఎంతగా వద్దని వారించినను మా అన్న వాలి వినక ఆ రాక్షసుడిపైకి యుద్ధమునకు వెళ్లెను . 
నేనును మా అన్న మీదకల ప్రేమతో ఆయన వెంటే వెళ్లితిని . మమ్ములను చూసిన ఆ మాయావి పారిపోయెను . మేమును అతడిని వెంబడించుచు వెళ్ళితిమి . అతడు ఒక బిలములోకి దూరెను . మా అన్న వాలి కూడా అతడిని వెంబడిస్తూ వెళ్లబోగా నేనును వచ్చెదనని మా అన్నతో నేను అనగా మా అన్న నన్ను వద్దని తన పాదములమీద వొట్టు  పెట్టి గుహద్వారము వద్దనే వేచివుండమని చెప్పి లోపలి వెళ్లెను . అచట నేను ఒక సంవత్సరకాలం ఉంటిని . పూర్తిగా ఒక సంవత్సరము అయినా పిమ్మట నురగలతో కూడిన రక్తము బయటకు వచ్చుట నేను చూసితిని . 
పిమ్మట మా అన్న ఆక్రందన ,పిదప ఆ రాక్షసుడి గర్జన నాకు వినిపించెను . అప్పుడు నేను మా అన్న మరణించినట్లుగా భావించి బాధతో కాళ్ళీడ్చుకుంటూ రాజ్యమునకు తిరిగి వచ్చితిని . నేను బాధతో ఏమి చెప్పకున్నను మంత్రులు నాతో  సమాచారం రాబట్టి రాజ్యక్షేమము కోసము నన్ను రాజుగా పట్టాభిషిక్తుడను చేసితిరి . ఆ విధముగా నేను రాజ్యమును పరిపాలించుచుండగా ఒకరోజు మా అన్న వచ్చెను . వచ్చి నాపై శత్రుత్వము పూని ,నా మంత్రులందరినీ చెరసాలలో బంధించెను . అప్పుడు నేను మా అన్న తో "అన్నా !అజ్ఞానముతో తప్పు జరిగెను నన్ను మన్నించుము "అని నేను నా కిరీటమును ఆయన పాదమునకు ఆనించి నమస్కరించి ప్రార్ధించినను ఆయన నాపై దయ చూపలేదు నన్ను అనుగ్రహించలేదు . ఆయన కోపము చల్లారలేదు . 

రామాయణము కిష్కిందకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం .ఏ  .ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment