Thursday 5 October 2017

రామాయణము కిష్కిందకాండ -ఆరవసర్గ

                                 రామాయణము 

                                  కిష్కిందకాండ -ఆరవసర్గ 

మిక్కిలి సంతోషముతో సుగ్రీవుడు" రామా !నా మంత్రి అగు ఆంజనేయుడు నీ గురించి చెప్పి వున్నాడు . నీవు లక్ష్మణునితో సీతాదేవి తో కలిసి వనవాసము చేయుచుండగా మాయావి రాక్షసుడు ఆమెను అపహరించినాడని హనుమంతుడు చెప్పాడు . నీవు ఏ మాత్రము చింతించవలదు . ఆమెను ఆ రక్కసుడు ఎక్కడ దాచినను నేను వెతికి తెచ్చెదను . నేను ఈ పర్వతము మీద మంత్రులతో కలిసి కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని బలవంతముగా తీసుకొనిపోవుట చూసాను . ఆమె జీరపోయిన గొంతుతో రామా !లక్ష్మణా !అని అరిచెను . ఆమె ఒక నగలమూటను మా మధ్య పడునట్లు వేసెను . 
దానిని నేను జాగ్రత్తపెట్టితిని . నీకు చూపించెదను నీవు తప్పక వాటిని గుర్తుపట్టగలవు . ఆమె తప్పక జనక నందిని అయివుంటుందని నా నమ్మకము . "అని పలికి నగల మూటను తెచ్చి రామునికి చూపించగా రాముడు ఆ ఉత్తరీయము ,ఆ నగలు సీతవిగా గుర్తించి ,కళ్ళనీళ్ళతో నేలపై కూలపడిపోయెను . పిమ్మట లక్ష్మణునితో "లక్ష్మణా ! ఈ నగలు చూడు ఇవి మీ వదినగారివే "అని పలుకగా లక్ష్మణుడు వాటిని చూచి "అన్నా !ఈ నాగాలన్నిటిని నేను గుర్తించలేను కానీ ,మా వదినగారి రోజు పాదాభివందనం చేయుటవలన నేను ఈ అందెలను గుర్తించగలను . "అని పలికెను . 
అప్పుడు రాముడు "సుగ్రీవా !ఆ రాక్షసుడిని నీవు చూసావు . వాడు ఎలా ఉంటాడు . ఏ దిశగా సీతను తీసుకువెళ్లాడు . ఆ రక్కసుడి ఆయువు మూడినట్లే "అని కోపావేశముతో పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఆరవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment