Thursday 12 October 2017

రామాయణము కిష్కిందకాండ -పదవసర్గ

                                               రామాయణము 

                                                        కిష్కిందకాండ -పదవసర్గ 

పిమ్మట నేను మా అన్న వాలితో "అన్నా !నీవు శత్రువును పరిమార్చి ,క్షేమముగా కిష్కింధకు విచ్చేయుట చాలా సంతోషము . ఈ వింజామరతో నీకు విసిరెదను . నీకు సేవ చేసెడి భాగ్యమును నాకు కలిగించుము . "ఓ అన్నా !పూర్తిగా సంవత్సర కాలము పాటు నేను ఆ గుహ వెలుపలే వేచి వున్నాను . పిమ్మట ఆ గుహ నుండి వచ్చిన రక్తము చూసి నేను నీకు అపాయము సంభవించిందని భ్రమించినాను . పిమ్మట ఆ రాక్షసుడు బయటపడకుండా ఉండుటకు గాను ఒక పెద్ద కొండరాయిని ఆ బిలద్వారమునకు అడ్డుగా పెట్టితిని . 
బాధతో ఉన్న నా నుండి సమాచారం రాబట్టిన మంత్రులు నన్ను బలవంతముగా రాజును చేసిరి . నేను ఈ రాజ్యమును న్యాసముగా (సంరక్షించి తిరిగి ఇచ్చు నట్లు )శ్వీకరించితిని . ఇప్పుడు సంతోషముగా ఈ రాజ్యమును శ్వీకరించు "అని పలికితిని . అయినను మా అన్న నా మాటలు వినక మంత్రులు ,ప్రముఖుల ముందు నన్ను అవమానించెను . ఇంకనూ ఇలా మాట్లాడేను . "నేను సుగ్రీవుడు గుహ బయట ఉంటాడనే ధైర్యముతో గుహలోకి వెళ్లితిని చీకటిగా వున్నా ఆ గుహలో ఆ రక్కసుడు కనపడకుండెను . ఒక సంవత్సర కాలము నేను అతడిని వెతుకుతూనే కాలము గడిపితిని . ఎట్టకేలకు సంవత్సరము ఐన పిమ్మట ఆ మాయావిని ,అతడి అనుచరులను చంపి బయటకు రాబోగా గుహ బయటకు వచ్చుటకు వీలులేకుండా ఒక రాయి అడ్డుగా ఉండెను . 
నేను సుగ్రీవా !సుగ్రీవా !అని పెక్కుమార్లు అరిచి అరిచి ప్రయోజనము లేక కాలితో తన్ని ఆ రాతిని బద్దలుకొట్టి బయటకు వచ్చితిని . వచ్చి చూస్తే బయట వేచి చూస్తానన్న తమ్ముడు లేడు . యితడు దుర్భుద్ధితో నన్ను చంపవలెననే ఉద్దేశ్యముతో ఆ రాతిని అడ్డుగా పెట్టి యితడు రాజ్యమును అనుభవించుచున్నాడు "అని పరుషముగా పలికెను . అంతటితో ఆగక అతడు నన్ను కట్టుబట్టలతో బయటకు గెంటివేసెను . నా భార్యను కూడా అపహరించాడు "అని చెప్పి సుగ్రీవుడు కన్నీరు కార్చెను . అప్పుడు శ్రీరాముడు 
"సుగ్రీవా !నీవు నాకు మిత్రుడవు నీ భాదకు కారణమైన వాడు నాకు పరమ శత్రువు కావున దుఃఖించవలదు . ఈ రోజే నేను వాలిని నా పదునైన బాణములకు బాలి చేసి నీ రాజ్యమును ,నీ భార్యను నీకు అప్పగించెదను "అని మాటిచ్చేను . ఆ మాటలు విన్న సుగ్రీవుడు తన బాధ తొలిగిపోతున్నదని సంతోషపడెను . అతడి మనసు ఊరడిల్లేను . 

 రామాయణము కిష్కిందకాండ పదవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment