Sunday, 5 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదిరెండవసర్గ

                                              రామాయణము 

                                             అయోధ్యకాండ -తొంబదిరెండవసర్గ 

భరతుడు భరద్వాజుడు ఇచ్చిన ఆతిధ్యమును శ్వీకరించి ఆ రాత్రి అచట హాయిగా ఉండెను . శ్రీరాముని దర్శించవలెననే కోరికతో భరతుడు వేకువజామునే లేచి ,తల్లులు ఇతర పరివారముతో కలసి వీడ్కోలు చెప్పుటకై భారద్వాజముని చెంతకు వెళ్లెను . ఆ మునితో ఆతిధ్యమునకు సంతుష్టుడనైతిని చెప్పి అన్న దగ్గరకు వెళ్ళుటకు అనుమతిని కోరెను . 
అప్పుడు భరద్వాజుడు "నాయనా !మీ అన్నగారిని చూడవలెనని నీవు పడుతున్న ఆత్రం నాకు సంతోషాన్ని కలిగించుచున్నది . మీ తల్లిగార్ల గురించి తెలుసుకోగోరుతున్నాను . తెలుపుము "అని పలికెను . అప్పుడు భరతుడు ఆమునితో "మునివర్యా !నావెనక నిలబడిన,బక్కచిక్కిన ఈమె రామజనని కౌశల్యాదేవి . మా తండ్రి దశరధుని పట్టపురాణి . ఆమెను ఆనుకుని వున్న ఈమె సుమిత్రాదేవి మిక్కిలి శాంత స్వభావురాలు ,లక్ష్మణశత్రుఘ్నుల జనని . ఇక ఈమె మిక్కిలి గర్విష్టి మా తల్లి ఈమె కారణముగానే మా అన్నగారు అడవులపాలయినారు . మా తండ్రి మరణించారు "అని పలికెను . 
అప్పుడు భరద్వాజుడు "నాయనా !కైకేయిని నిందించుట తగదు . మున్ముందు రామ అరణ్యవాసము వల్ల ఎన్నో సత్కార్యములు జరగనున్నాయి . ఇది విధిరాత "అని పలికి శ్రీరామ వాసము అయిన చిత్రకూటమునకు దారిని తెలిపి ఆశీర్వదించి పంపెను . భరతుడి ఆదేశమును అందుకున్న సమస్త సేన చిత్రకూటము వైపుగా ప్రయాణము సాగించెను . ఆసెన చూచుటకు పెద్ద అరణ్యమువలె గోచరించుచున్నది . 

రామాయణము అయోధ్యకాండ తొంబదిరెండవసర్గ సమాప్తము . 

శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అయోధ్యకాండ - తొంబది యొకటవసర్గ

                                       రామాయణము 

                                   అయోధ్యకాండ - తొంబది యొకటవసర్గ 

భరతుడు ఆ రాత్రి అచట విశ్రమించుటకు తన అనుమతిని తెలుపగా ,భరద్వాజుడు భరతునితో "కుమారా !నీ సేనలను ఎలా దూరముగా ఉంచితివి ?వాటిని కూడా ఇచటికి రప్పింపుము . నేను మీకు మీ సేనలకు అతిధి మర్యాదలు చేయుదును :అని పలికెను . అపుడు భరతుడు "స్వామీ !మీకు మాపై కల ఆదరాభిమానములకు మిక్కిలి సంతుష్టుడను . ఆశ్రమవాతావరణమునకు ,ప్రశాంతతకు భంగము కలగకూడదని నేను సేనను దూరముగా ఉంచితిని "అని పలికెను . 
అప్పుడు భరద్వాజముని "భరతా !నీ సేనలను కూడా పిలిపింపుడు . వారికి ఇచట ఏ లోటు రాదు . వారి వల్ల మాకు ఏ ఇబ్బంది కలుగదు కావున వాటిని కూడా ఇక్కడకు పిలిపింపుడు "అని ఆజ్ఞాపించి ,భరతునికి ,అతని సేనలకు మర్యాద చేయుటకై  మంచి మంచి గృహములను నిర్మించుటకు విశ్వకర్మను ఆహ్వానించెను . ఇంద్రుడు ,కుభేరుడు ,మొదలగు దేవతలను ,గంగా మొదలగు నదులను ,స్వర్గము ,బ్రహ్మలోకములలో కల అప్సరసలను ,ఇంకనూ అనేక మందిని ఆహ్వానించెను . 
వారందరూ వెనువెంటనే అచటికి విచ్చేసిరి . విశ్వకర్మ భరతుడు ,పురోహితులు ,మంత్రులు ,సేనలు నివసించుటకు ,రకరకములైన చిత్రవిచిత్రములైన గృహములను నిర్మించెను . ఇంకను మిగిలిన దేవతలు వారికి కావలిసిన ఏర్పాట్లు చేయనారంభించిరి . నలుగురైదుగురు అప్సరసలు ఒక్కొక్కరిని  నదీతీరములకు తీసుకువెళ్లి వారికి నాలుగు పెట్టి ,సుగంధద్రవ్యములతో అభ్యంగన స్నానములు చేయించిరి . వారికి తాగినంత మధ్యములు పోయసాగిరి . సేనలందరూ చక్కగా అలంకరింపబడి ,మేడలో పూలమాలలతో తూలుతూ వున్నారు . వారి కొఱకు కొన్ని వేల ,లక్షల ,రకముల ఆహార పదార్దములు ,రసములు ,పిండివంటలు బావుల వంటి ప్రమాణము కల పాత్రలలో సిద్దము చేయబడినవి . 
వాటిని కడుపునిండా తిని మద్యము మత్తులో వారికి కేటాయించబడిన భవనములలో కింద పడి దొర్లసాగిరి . వారి మెడలలో కల హారములు ,దండలు నేలపై చెల్లాచెదురుగా పడెను . ఆ సమయమున సేనలందరూ మద్యము మత్తులో ఇదియే స్వర్గము అని బిగ్గరగా అరవసాగిరి . భరతునికి ,ఆయన పరివారములు భరద్వాజముని జరిపిన అతిధి మర్యాదలు నిరుపమానమై అత్యత్భుతముగా ఉండెను . వారందరూ ఇది కలయా నిజమా అని అనుకొనుచు ఆశ్చర్యమున మునిగిపోయిరి . తెల్లవారిని పిదప గంధర్వులు ,అప్సరసలు ,నదులు మున్నగు వారందరూ భారద్వాజముని అనుమతి పొంది తమతమ వాసములకు వెడలిపోయిరి . తెల్లవారినప్పటికీ మదిరాపానము చేసినవారి మత్తు వీడలేదు . వారి శరీరములకు అంటుకొని వున్న దివ్యమైన అగ్రుచందన లేపనములు అట్లేవున్నవి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియొకటవసర్గ సమాప్తము . 


                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Saturday, 4 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదియవసర్గ

                                     రామాయణము 

                                    అయోధ్యకాండ -తొంబదియవసర్గ 

రాకుమారుడైన భరతుడు దూరమునుండే భరద్వాజాశ్రమమును చూచి తన బలములను అచటనే నిలిపి శస్త్రములను ,ఆభరణములు విడిచి పట్టు వస్త్రములు ధరించేను . పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుచుతుండగా భరతుడు మంత్రులతో కూడి కాళీ నడకతో భరద్వాజాశ్రమమును చేరెను . ఆశ్రమము వద్దకు చేరిన పిమ్మట మంత్రులను అచటనే నిలిపి వశిష్టుని వెంట ఆశ్రమములోకి నడిచెను . 
భారద్వాజముని వశిష్టుని చూసి వారికి ఎదురేగి అతిధి సత్కారములు చేసెను . భరతుడు వినమ్రుడై తన ప్రవరాలను తెలుపుతూ మునికి నమస్కరించెను . పిదప ముని భరతుని ఎరిగి "రాజ్యాధికారం నీవు ఇటు వచ్చుటకు కారణమేమి ?"అని ప్రశ్నించెను . అప్పుడు భరతుడు జరిగినదానిలో తన ప్రమేయము లేదని వివరించెను . శ్రీరాముని తిరిగి తీసుకువచ్చుటకు వచ్చితినని చెప్పగా భరద్వాజుడు సంతోషించి భరతుని ఆశీర్వదించెను . పిమ్మట ఆ ముని సీతారాంలక్ష్మణులు చిత్రకూట మహా పర్వతమున వశించుచున్నారని తెలిపెను . వారిని ఆ రోజు అచట విశ్రమించి మరునాడు బయలుదేరి శ్రీరాముని వద్దకు వెళ్ళాలలిసినదిగా కోరెను . భరతుడు "ఓ మునీశ్వరా !మీ ఆజ్ఞను శిరాశావహింతును "అని పలికి ఆ రాత్రికి ఆ ఆశ్రమము నందే గడుపుటకు నిశ్చయించినేను . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Friday, 3 February 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది తొమ్మిదవసర్గ

                                                    రామాయణము 

                                             అయోధ్యకాండ -ఎనుబది తొమ్మిదవసర్గ 

అన్నను దర్శించవలెననే కోరికతో భరత శత్రుఘ్నులు ప్రాతః కాలమునే మేల్కొనెను . గుహుడు సైతము ప్రాతః కాలమునే వారి చెంతకు వచ్చెను . భరతుడు గుహుని నది దాటుటకు ఏర్పాట్లు చేయమని కోరగా గుహుడు గంగా నదిని దాటుటకు 500 నావలను ,స్వస్తికము (స్వస్తిక్ గుర్తు కలిగినవి )అను పేరు కల కొన్ని నవలను గంగా నదీ తీరమున నిల్పెను . భరతశత్రుఘ్నులు బ్ర్రాహ్మణోత్తములు ,మునులు ముందుగా నావపైకెక్కినారు . పిదప కౌశాల్యసుమిత్రకైకేయిలు నావపైకెక్కిరి . మిగిలిన సైనికులు ,జనములు తాము విశ్రమించిన గుడారములకు నిప్పుపెట్టి (శత్రువులకు తమ జాడ తెలియకుండుట కొరకు నిప్పు పెట్టుట ఆనవాయితి . అటుల చేసిన తమకు విజయము కలుగుతుందని  భావించెడివారు )తమతమ వస్తువులను నావపైకి చేర్చిరి . కొన్ని నావలలో అశ్వములు ,రథములు ,విలువైన ఆభరణములు చేర్చబడినవి . గజములు మావటివాడి అదిలింపులతో నదిని దాటినవి . కొంతమంది సైన్యము గజములమీద కొంతమంది నావలపై తీరము దాటిరి . నావలు వారిని నదిని దాటించి మిగిలిన సైన్యము కొరకు వెనుతిరిగినవి . భరతశత్రుఘ్నులు నది దాటి భారద్వాజ ఆశ్రమం వైపు సాగెను . కొంత  వెళ్లిన పిమ్మట సైన్యమునకు విశ్రాంతి తీసుకోమని ఆదేశము ఇచ్చి వశిష్టాది మునులు ,మంత్రులతో కలసి భరతశత్రుఘ్నులు భరద్వాజాశ్రమమును దర్శించుటకై ముందుకు సాగి చూడముచ్చటగా ఉన్న పర్ణశాలలు ,ప్రకృతితో కూడిన భరద్వాజాశ్రమమునకు చేరిరి . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Thursday, 2 February 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ

                                                    రామాయణము 

                                                    అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ 

గుహుడు పలికిన వచనములు అన్నిటిని భరతుడు సావధానంగా విని ,మంత్రులతో కూడి శ్రీరాముడు పరుండిన ఆ శయ్యను దర్శించి ,తల్లులతో "మా అన్న ఆ రోజు రాత్రి పరుండిన ప్రదేశము ఇదే ఇవి ఆయన శయనింపగా ఈ శయ్యపై ఏర్పడిన గుర్తులు . వాసిగాంచిన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడు ,మహానుభావుడు ,ప్రజ్ఞాశాలి . అట్టి ప్రభువుకు పుత్రుడైన శ్రీరాముడు ఈ కటిక నేలపై ఎట్లు పరుండెనో కదా ?రాజభవనంలో శ్రేష్టమైన మెత్తని శయ్యపై పరుండెడివాడు . కమ్మని సంగీతముతో ,శ్రావ్యములైన వీణావేణు నాదములతోడను ,పరిచారికల కాలిఅందెల రవళులచేత కారకంకణముల రవములచేత ఆభరణములు సవ్వడి చేత చెవులకింపైన మృదంగములలయ విన్యాసములతోడనుఆయన నిద్ర నుండి మేల్కొనెడివాడు . అతడు మేల్కొను సమయమున వందిగణములు స్తుతించుచుండెడివి . సూతులు మాగధలు సమయమునకు తగిన కధలను ,గాధలను వినిపించుచుండెడివారు . అట్టి సుఖ వైభవములలో ఓలలాడిన శ్రీరాముడు ఈ కటిక నేలపై పరుండుట ఎంత బాధాకరం . 

ఇక్కడ అక్కడక్కడా కొన్ని పట్టుదారములు చిక్కుకుని   మిలమిల మెరియుచున్నవి ఇవి సీతాదేవి అప్పుడు ధరించిన పట్టు ఉత్తరీయపు పోగులే అని స్పష్టమగుచున్నది . జనక మహారాజు ముద్దులపట్టి ,దశరధుని కోడలు ,శ్రీరాముని ప్రియపత్ని ,బాల ,సుకుమారి ,మహాసాధ్వి అయిన సీతాదేవికి ఈ శయ్యపై పరుండుట కష్టమనిపించి ఉండదు . ఏలననగా ఆమె మా అన్ననే తన ప్రాణముగా భావించును . 

వారిరువురు ఇలా దిక్కులేనివారు వలె ఇలా కష్టములు అనుభవించుటకు నేనే కారణము . ఛీ నా బ్రతుకు వ్యర్ధము . శ్రీ రాముని అడుగుజాడలలో నడుచు జానకిది ఎంత భాగ్యమో కదా !ఆయనను నిరంతరము సేవించు లక్ష్మణుని జన్మ ధన్యము . నేటి నుండి నేను కూడా నారా చీరలను ధరించెదను . కటిక నేలపై పరుండెదను . ఫలములు మొదలగు ఆహారమునే భుజించెదను . అన్నకు మారుగా నేను వనవాసము చేసెదను . నాకు తోడుగా శత్రుఘ్నుడు వనములకు వచ్చును . అన్నకు తోడుగా లక్ష్మణుడు రాజ్యములో ఉండును . అప్పుడు అన్న ప్రతిజ్ఞ నెరవేరును . ఒకవేళ అన్న మరలి వచ్చుటకు అంగీకరించనిచో నేనును ఆయనతో పాటు దీక్ష ముగియు వరకు వనములోనే యుందును . ఆ ప్రభువు నా కోరికను కాదనడు . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది ఏడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం.  ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 





 



Wednesday, 1 February 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ

                                                   రామాయణము 

                                                 అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ 

శ్రీరాముడు జటాధారి అగుట ,నారచీరలు ధరఁచుట మొదలగు విషయములు విని ,భరతుడు తట్టుకొనలేక బిగ్గరగా ఏడవసాగెను . పక్కనే ఉన్న శత్రుఘ్నుడు భరతుని ఓదార్చుటకు యత్నించెను . ఏడ్పులు విని ముగ్గురు మాతలు అచటికి వచ్చిరి . కౌశల్య భరతుని దీన స్థితిని చూసి చలించిపోయి ,భరతుని అక్కున చేర్చుకుని ఏడవసాగెను . భరతునితో "నాయనా ఏమయినది ఎందుకిలా అయిపొతున్నావ్ ?ఈ సమస్త ఇక్ష్వాకు వంశమునకు నేవే దిక్కు . ఏమయినది ?మీ అన్న గురించి ఏమయినా అప్రియముగా విన్నావా ?"అని ప్రశ్నించెను . 
అప్పుడు భరతుడు తేరుకుని "అమ్మా !ఏమిలేదు మీరు కంగారు పడకండి నేను ఎట్టి అప్రియ పలుకులు వినలేదు "అని ఆవిడను ఓదార్చెను . పిదప భరతుడు అచటి నుండి బయటకు వచ్చి గుహునితో "ఓ నిషాద రాజా !మా అన్నా వదినలు ఏమి భుజించారు ?ఎక్కడ విశ్రమించారు ?నా మీద దయ ఉంచి తెలుపుడు అని పలుకగా ,గుహుడు తనకు అత్యంత ప్రియమైన శ్రీరాముని గురించి అడుగుటచే మిక్కిలి ఉత్సాహముతో 
"భరతా !రామ ఆగమన వార్త విని నేను అనేక ఫలములు ,తినుబండారములు ,రసములు ,తేనే మున్నగు అనేక పదార్థములను ఆయన చెంతకు తీసుకువెళ్లి శ్వీకరించమని కోరితిని . కానీ శ్రీరాముడు నేను క్షత్రియుడిని ఒకరికి ఇచ్చుట కానీ ఒకరినుండి తీసుకొనరాదు అని చెప్పి మమ్ములను ఒప్పించెను . లక్ష్మణుడు వారికై తెచ్చిన జలములు మాత్రమే తీసుకుని సీతారాములు ఆ రాత్రి ఉపవసించిరి . సీతారాములు తాగగా మిగిలిన నీటిని తాగి లక్ష్మణుడు ఆరోజు ఉపవసించెను . లక్ష్మణుడు స్వయముగా ఏర్పరిచిన దర్భ శయ్యపై సీతారాములు విశ్రమించిరి . ఇదిగో ఇక్కడే ఆ రోజు సీతారాములు విశ్రమించారు . వారు విశ్రమించిన పిదప లక్ష్మణుడు విశ్రమించక వారిని జాగరూపుడై రక్షించెను . నేనును ధనుర్భాణములు ధరించి లక్ష్మణునితో పాటు జాగరూకుడనై ఉంటిని . నా సైన్యము సైతము ఆ రాత్రి మాతో పాటు ఉండెను .  "అని గుహుడు భరతునికి ఆ ఆయా ప్రదేశములను చూపించెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదియేడవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అయోధ్యకాండ -------------ఎనుబదిఆరవసర్గ

                                               రామాయణము 

                                     అయోధ్యకాండ -------------ఎనుబదిఆరవసర్గ 

గుహుడు లక్ష్మణుని గూర్చి భరతునితో "వారు ఇచటికి వచ్చినపుడు   రాత్రి లక్ష్మణుడు ధనుర్భాణములు ధరించి సీతారాములను రక్షించుటకై  జాగరూకుడై ఉండెను . అపుడు నేను లక్ష్మణుని వద్దకు వెళ్లి నేను   ఈ అడవీ ప్రాంతాలన్నీ బాగుగా ఎరుగుదును . నీవు విశ్రమించుము . నేను జాగరూకుడై రక్షించెదను . అని పలుకగా అప్పుడు లక్ష్మణుడు మా అన్న ,వదినలు నేలపై పరుండుట చూస్తుంటే నిద్ర ఎలా వస్తుంది ?ఆకలి దప్పుడు ఉంటాయా ?మా తండ్రి దశరథ మహారాజు శ్రీరాముడు దూరమైన కారణముచేత ఎక్కువ కాలము జీవించి ఉండడు . భరత శత్రుఘ్నులు వారికి ఉత్తర క్రియలు నెరవేర్చెదరు . వారెంత అదృష్టవంతులో కదా !అంతః పుర స్త్రీలు ఏడ్చి ఏడ్చి ఏడుపు రాక మౌనముగా వుండివుంటారు . శ్రీరాముడు వనవాసము ముగించుకొని అయోధ్యకు వెళ్లునప్పుడు నేను ఆయనతో కూడి వెళ్లగలనో లేదో అని పలికెను . మేము ఆ విధముగా మాట్లాడుకొనుచుండగానే తెల్లవారెను . పిదప వారు మఱ్ఱి పాలతో జడలను ధరించి ధనుర్భాణములు ధరించి సీతతో కూడి గంగను దాటి సావధానులై ముందుకు సాగిరి ". అని చెప్పెను . 

 రామాయణము అయోధ్యకాండ ఎనుబదిఆరవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .