Sunday 5 February 2017

రామాయణము అయోధ్యకాండ - తొంబది యొకటవసర్గ

                                       రామాయణము 

                                   అయోధ్యకాండ - తొంబది యొకటవసర్గ 

భరతుడు ఆ రాత్రి అచట విశ్రమించుటకు తన అనుమతిని తెలుపగా ,భరద్వాజుడు భరతునితో "కుమారా !నీ సేనలను ఎలా దూరముగా ఉంచితివి ?వాటిని కూడా ఇచటికి రప్పింపుము . నేను మీకు మీ సేనలకు అతిధి మర్యాదలు చేయుదును :అని పలికెను . అపుడు భరతుడు "స్వామీ !మీకు మాపై కల ఆదరాభిమానములకు మిక్కిలి సంతుష్టుడను . ఆశ్రమవాతావరణమునకు ,ప్రశాంతతకు భంగము కలగకూడదని నేను సేనను దూరముగా ఉంచితిని "అని పలికెను . 
అప్పుడు భరద్వాజముని "భరతా !నీ సేనలను కూడా పిలిపింపుడు . వారికి ఇచట ఏ లోటు రాదు . వారి వల్ల మాకు ఏ ఇబ్బంది కలుగదు కావున వాటిని కూడా ఇక్కడకు పిలిపింపుడు "అని ఆజ్ఞాపించి ,భరతునికి ,అతని సేనలకు మర్యాద చేయుటకై  మంచి మంచి గృహములను నిర్మించుటకు విశ్వకర్మను ఆహ్వానించెను . ఇంద్రుడు ,కుభేరుడు ,మొదలగు దేవతలను ,గంగా మొదలగు నదులను ,స్వర్గము ,బ్రహ్మలోకములలో కల అప్సరసలను ,ఇంకనూ అనేక మందిని ఆహ్వానించెను . 
వారందరూ వెనువెంటనే అచటికి విచ్చేసిరి . విశ్వకర్మ భరతుడు ,పురోహితులు ,మంత్రులు ,సేనలు నివసించుటకు ,రకరకములైన చిత్రవిచిత్రములైన గృహములను నిర్మించెను . ఇంకను మిగిలిన దేవతలు వారికి కావలిసిన ఏర్పాట్లు చేయనారంభించిరి . నలుగురైదుగురు అప్సరసలు ఒక్కొక్కరిని  నదీతీరములకు తీసుకువెళ్లి వారికి నాలుగు పెట్టి ,సుగంధద్రవ్యములతో అభ్యంగన స్నానములు చేయించిరి . వారికి తాగినంత మధ్యములు పోయసాగిరి . సేనలందరూ చక్కగా అలంకరింపబడి ,మేడలో పూలమాలలతో తూలుతూ వున్నారు . వారి కొఱకు కొన్ని వేల ,లక్షల ,రకముల ఆహార పదార్దములు ,రసములు ,పిండివంటలు బావుల వంటి ప్రమాణము కల పాత్రలలో సిద్దము చేయబడినవి . 
వాటిని కడుపునిండా తిని మద్యము మత్తులో వారికి కేటాయించబడిన భవనములలో కింద పడి దొర్లసాగిరి . వారి మెడలలో కల హారములు ,దండలు నేలపై చెల్లాచెదురుగా పడెను . ఆ సమయమున సేనలందరూ మద్యము మత్తులో ఇదియే స్వర్గము అని బిగ్గరగా అరవసాగిరి . భరతునికి ,ఆయన పరివారములు భరద్వాజముని జరిపిన అతిధి మర్యాదలు నిరుపమానమై అత్యత్భుతముగా ఉండెను . వారందరూ ఇది కలయా నిజమా అని అనుకొనుచు ఆశ్చర్యమున మునిగిపోయిరి . తెల్లవారిని పిదప గంధర్వులు ,అప్సరసలు ,నదులు మున్నగు వారందరూ భారద్వాజముని అనుమతి పొంది తమతమ వాసములకు వెడలిపోయిరి . తెల్లవారినప్పటికీ మదిరాపానము చేసినవారి మత్తు వీడలేదు . వారి శరీరములకు అంటుకొని వున్న దివ్యమైన అగ్రుచందన లేపనములు అట్లేవున్నవి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియొకటవసర్గ సమాప్తము . 


                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment