Sunday, 9 September 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదిఆరవసర్గ

                                  రామాయణము 

                                   కిష్కిందకాండ -ఇరువదిఆరవసర్గ 

వాలికి దాహంగా సంస్కారములు ముగిసిన పిమ్మట సుగ్రీవుడు ఒకచోట కూర్చుని బాధపడుచుండెను . తన అన్న ను తలచుకొని మిక్కిలి రోదించెను . అప్పుడు వానర ప్రముఖులందరూ సుగ్రీవుని వద్దకు వెళ్లి అతడిని ఓదార్చి ,శ్రీరాముని వద్దకు అతడిని తీసుకువెళ్ళేను . వారందరూ శ్రీరామునికి నమస్కారము చేసిరి . పిమ్మట  వాయునందనుడు శ్రీరామునితో "ఓ మహా వీరా !అనితర సాధ్యమయిన వాలి రాజ్యము నీ దయవలన సుగ్రీవుని కి దక్కినది . సుగ్రీవుడు నీ ఆజ్ఞకు బద్దుడు . అతడిని ఈ రాజ్యమునకు రాజుగా చేయుము . అతడు నిన్ను బాగుగా గౌరవించును . మాతో కిష్కింధకు రమ్ము . "అని పిలిచెను . 

అప్పుడు శ్రీరాముడు "హనుమా !నేను పదునాలుగు సంవత్సరముల కాలము గ్రామములో కానీ పట్టణములో కానీ ప్రవేశించరాదని మా ఆటీన్ద్రి ఆజ్ఞ . కావున మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఈ ప్రసవం గిరిపై ఉంటాను ఇచ్చటి ప్రక్రుతి రామణీయముగా ఉండును . గాలులు చల్లగా ఉండును . "అని పలికి పిమ్మట సుగ్రీవునితో "సుగ్రీవా !నీవు కిష్కింధకు రాజువి కమ్ము . నీ అన్న వాలి కుమారుడైన అంగదుడు వీరుడు . సర్వ శ్రేష్ఠుడు . అతడిని యువరాజుగా ప్పట్టాభిషిక్తుడిని గావింపుము . వానలు వుండు నాలుగు మాసములను వార్షికములు అందురు . ఈ సమయములో సీతాన్వేషణ కష్టము . కావున మీరు సుఖముగా కిష్కిందలో వుండండి . వర్షాకాలం పూర్తి అయిన పిదప కార్తీకమాస ఆరంభములో సీతాన్వేషణ కు ,రావణ వద్దకు సైన్యమును సంసిద్దము చేయుము . "అని పలికెను . 
అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముని ఆదేశము మేరకు కిష్కిందా నగరములో ప్రవేశించేను . నగరంలోని ప్రజలు ,వానర ప్రముఖులు అందరూ సుగ్రీవుని చుట్టుముట్టేను . వారందరితో కొద్దిసేపు కుశలప్రశ్నలు మొదలగు సంభాషణలు గావించి పిమ్మట సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్లి అటునుండి రాజ్యసభకు వెళ్లెను . వానరులు రాజ్యసభను రంగురంగుల పూలతో అలంకరించిరి . బంగారు సింహాసనంపై సుగ్రీవుని కూర్చొండబెట్టి ,పుణ్యతీర్ధములనుండి ,నదీనదముల నుండి ,సప్తసముద్రముల నుండి తెచ్చిన నీటిని బంగారు పాత్రలో ఉంచి వాటితో సుగ్రీవునికి పట్టాభిషేకము చేసెను . ఆ సమయములో బ్రాహ్మణోత్తములు అనేక యజ్ఞములు చేసిరి . వారందరికీ అమూల్యమైన నగలు ,వస్త్రములు ,దనము ,ధాన్యము ,గోవులు ,వస్తువులను ,మావోహారమైన ఆహార పదార్ధములను ఇచ్చి సంతోష పరిచేను . సుగ్రీవుడు తన భార్య రుమను శ్వీకరించెను . పిమ్మట శ్రీరాముని ఆదేశము మేరకు అంగదుని యువరాజుగా పట్టాభిషేకము చేసెను . అప్పుడు అచట వున్న వానర ప్రముఖులందరూ "బాగుబాగు "అని పొగిడిరి . పిమ్మర సుగ్రీవుడు శ్రీరాముని దగ్గరకు వెళ్లి పట్టాభిషేక విషయములన్నీ వివరించెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువది ఆరవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .   










Thursday, 23 August 2018

రామాయణము కిష్కిందకాండ - ఇరువది అయిదవసర్గ

                                        రామాయణము  

                                                                         

                                 కిష్కిందకాండ - ఇరువది అయిదవసర్గ 

శ్రీ రాముడు దుఃఖించుచున్న తార సుగ్రీవుడు అంగదుడు మొదలగు వారిని ఓదార్చి ,వాలి అంతిమ సంస్కారమునకు ఏర్పాట్లు చేయమని చెప్పెను . ఆ బాధ్యతను లక్ష్మణుడు తీసుకుని వాలి అంతిమసంస్కారమునకు కావలిసిన వస్తువు అన్ని దగ్గరుండి తెప్పించి  అంతిమ వీడ్కోలు ఘనముగా ఏర్పాటు చేసెను . చక్కగా అలంకరించబడిన పల్లకీని తీసుకువచ్చి దానిపై వస్త్రాభరణములతో అలంకరించిన వాలి మృత దేహమును చేర్చి ,ముందు వానరులు విలువైన రత్నములు చల్లుచుండగా పల్లకీని తీసుకువచ్చిరి . 
ఎండిన కట్టెలు గంధపు చెక్కలతో వాలి దేహమునకు సంస్కారములు నిర్వహించిరి . ఆ సమయములో తారను అతి కష్టము మీద తక్కిన వానర స్త్రీలు పట్టుకోగలిగారు . పిమ్మట వాలికి తర్పణములు వదులుటకు వారందరూ నాదీ జలముల వద్దకు వెళ్లిరి . రామలక్ష్మణులు ,సుగ్రీవుడు ,తార అంగదులను ముందు ఉంచుకుని ఆ వానర ప్రముఖులంతా తర్పణములు వదిలిరి . ఈ సమస్త కార్యమును రామలక్ష్మణులు దగ్గరుండి నడిపించిరి . కార్యక్రమము అయ్యిన పిమ్మట సుగ్రీవుడు రాముని వద్దకు వచ్చి నిలబడెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము . 

                                                  శశి ,

ఎం . ఏ .ఎం . ఏ (తేలుగు ),తెలుగు పండితులు . 

                                                                                          

Tuesday, 21 August 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదినాల్గవసర్గ

                                         రామాయణము 

                                           కిష్కిందకాండ -ఇరువదినాల్గవసర్గ 

కన్నీరుమున్నీరుగా విలపించుచున్న తారను చూసి సుగ్రీవుడు చలించిపోయెను . తారను చూసి తానును విలపించెను . అతని మనస్సు న దైన్యము వహించెను . అతడు చిన్నబోయిన ముఖముతో శ్రీరాముని చేరెను . రామునితో ఈ విధముగా పలుకసాగెను . "ఓ మహాప్రభూ !నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటివి . రాజ్యము నాకు దక్కినది . కానీ ఇప్పుడు నాకు రాజ్యభోగములపై మనస్సే పోవుటలేదు . అంతేకాదు నాకు జీవితముమీదే విరక్తి కలుగుతున్నది . మా అన్న అగు వాలి ఇంతకూ మునుపు నన్ను అనేక విధములుగా అవమానించి వున్నాడు . పైగా నా భార్యను అపహరించి నాకు ద్రోహము చేసినాడు అందుచే నేను మీచే మా అన్నాను చంపించితిని . 

ఓ రామా ! నేను ఇప్పటి వరకు ఋష్యమూక పర్వతంపై జీవిస్తూ వచ్చాను . ఇప్పుడు నా అన్న మృతదేహము చూస్తుంటే అలాగే ఋశ్యమూకపర్వతం పైనే బతికేసివుంటే బాగుండేది అనిపిస్తోంది . మా అన్న అగు వాలి మహానుభావుడు యుక్తాయుక్త విచక్షణ కలిగినవాడు . అతడు నాతొ యుద్ధము చేయునపుడు "తమ్ముడా !నిన్ను చంపదలుచుకోలేదు . నీవు స్వేచ్ఛగా ఎక్కడికైనా పో "అని పలికాడు . ఆ విధముగా పలుకుట అతనికే చెల్లినది . కానీ దుర్మాత్ముడనైన  నేను అతడి గురించి నీకు చెప్పి అతడిని చంపించినాను . ఈ పాపమునకు పరిహారము లేదు . నేనును అగ్నిజ్వాలలో పడి మరణించెదను . ఓ రామా !నీకు ఇచ్చిన మాట ప్రకారము నేను మరణించినను నా ఆజ్ఞచే సీతాన్వేషణను ఈ వానరులు గావింతురు . క్షమించరాని పాపము చేసిన నేను జీవించుటకు అనర్హుడను . మరణించుటకు నాకు అనుమతి ఇవ్వు "అని పలికెను . 
ఆర్తుడై అలమటించుచున్న సుగ్రీవుని చూసి శ్రీరాముడు తానునూ కన్నీరు పెట్టి ఏడ్చుచున్న తారను ఓదార్చుటకు ఆ వైపుగా నడవసాగెను . శ్రీరాముడు వచ్చుట గమనించిన అక్కడి వారు భర్త దేహము పై పది ఏడ్చుచున్న తారను లేవదీయుటకు ప్రయత్నము చేసిరి . తార తన భర్తను వదులుటకు ఇష్టపడక బలవంతముగా భర్తపై పడుచుండెను . ఆ సమయములో తనవైపుగా వచ్చుచున్న శ్రీరాముని చూసి పెనుగులాడుట ఆపివేసెను . తార ఇంతకుముందు శ్రీరాముని చూడకపోయినా అతని తేజస్సు ను చూసి ,అంతకు మునుపు అంగదుడిచే రాముని రూపురేఖలు విని ఉండుటచే రాముని గుర్తించింది . 

పిమ్మట తార తన భర్త మరణమునకు కారణము శ్రీరాముడు అని తలిచి పరుషవాక్యములు పలుకవలెనని సంకల్పంతో రాముని చేరెను కానీ శ్రీరాముడి ప్రభావము చే ఆమెలోని తీవ్రభావము తగ్గిపోయెను . అప్పుడు ఆమె రామునితో ఇలా పలికెను . "ఓ రామా ! నీవు సర్వ గుణ సంపన్నుడవు . సత్పురుషుడవు . సర్వ ధర్మములు తెలిసినవాడవు . ఓ రామా !నా నాధుని చంపిన ఆ బాణముతోనే నా ప్రాణములు  కూడా తీయుము , నేను నా నాధుడు లేనిదే  ఉండలేను . నా నాధుడు కూడా స్వర్గము లభించినా చెంత నేను లేని యెడ సంతోషముగా వుండలేడు . నన్ను చంపి నా భర్త వద్దకు నన్ను చేర్చుము స్త్రీని చంపుట ఎట్లు అని ఆలోచించుతున్నావేమో ?భార్యాభర్తలు వేరుకాదు ఒక్కరే . భార్యయే భర్తకు ఆత్మ . కావున నన్ను వాలి ఆత్మగా భావించి వధించుము . అన్ని దానములలోకి కన్యా దానము మిక్కిలి ప్రశస్తమని పెద్దలు చెప్పుదురు . ఆ విధముగా నన్ను నా భర్తకు దానము ఇచ్చి పుణ్యము కట్టుకొనుము "అని పలికెను 
అప్పుడు శ్రీరాముడు తారను ఓదార్చుచు "ఓ వీర పత్నీ ! నీవు ఈ విధముగా దైన్యమునకు లోనుకావద్దు . సర్వప్రాణుల తలరాతను రాసిడెది బ్రహ్మదేవుడే . విధిని ఎవ్వరూ తప్పించుకొనలేరు . విధి నిర్ణయమే అంత . త్వరలోనే నీ కుమారుడైన అంగదుడు యువరాజు కానున్నాడు . అతడి బాధ్యతా భారము నీపై వున్నది . కావున దుఃఖించకు . వీర పత్నులు దుఃఖించరాదు . "అని పలికెను . పిమ్మట తార కొంత ఉపశమనము పొందెను 

రామాయణము కిష్కిందకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Monday, 20 August 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదిమూడవసర్గ

                                           రామాయణము 

                                     కిష్కిందకాండ -ఇరువదిమూడవసర్గ 

వానవేంద్రుడైన వాలి బంధుమిత్రులందరినీ వీడి స్వర్గస్తుడు కాగా తార అతని దేహముపై పడి మిక్కిలి దీనంగా విలపించసాగెను . పరిపరి విధములుగా భర్త శూరత్వమును తలచుకుని బిగ్గరగా ఏడవసాగెను . పిమ్మట తార తన కుమారుడైన అంగదునిచే వాలికి నమస్కరింపచేసెను . అప్పుడు నీలుడు  (సుగ్రీవుని సేనాధిపతి )వాలి కి గుచ్చుకున్న బాణమును లాగివేసెను . 
రామాయణము కిష్కిందకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము . 
                                                                                                        


                                                                                                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday, 17 May 2018

రామాయణం కిష్కిందకాండ -ఇరువదిరెండవసర్గ

                                     రామాయణం 

                               కిష్కిందకాండ -ఇరువదిరెండవసర్గ 

కొనఊపిరితో వున్నా వాలి తన శక్తినంతా కూడగట్టుకుని కళ్లుతెరిచి చూచెను అతడికి ఎదురుగా సుగ్రీవుడు కనపడెను . అప్పుడా వానర ప్రభువు "తమ్ముడా !నేను బలగర్వితుడనై ,అజ్ఞానవసమున  భార్యను చెరపట్టితిని . నా దోషమును మన్నింపుము . అన్నదమ్ములమైన మనము కలిసి మెలిసి జీవించు అదృష్టము  దేవుడు మన నొసటన రాయలేదు . మరి కొన్ని క్షణములలో నేను ఈ తనువును చాలించెదను . కావున ఈ వానర రాజ్యమును నీవు శ్వీకరింపుము . ఈ సమస్త సంపదలు రాజ్యము తుదకు నా ప్రాణములు కూడా వదిలి వెళ్ళిపోచున్నాను . 'వాలి అజేయుడు ,ఎంతటి వీరుడికైనా లొంగడు 'అనే నా కీర్తి నేటితో పరిసమాప్తి అయినది . ఓ వీరుడా !రాజ్యభారం క్లిష్టమైనదే అయిననూ దానిని భరించ నీవు సమర్థుడవు . 
సోదరా !నా కుమారుడై అంగదుడు నాకు ప్రాణములకంటే ఎక్కువ ప్రియుడు . అతడు  పసివాడు అమాయకుడు . అతడి రక్షణ  భారము  ఇకపై నీదే . అతనికి నాకు మారుగా అన్నవస్త్రాభరణాదులను నీవే సమకూర్పవలెను . ఇతడికి ఎట్టి భయము లేకుండా అండగా ఉండుము . నాయనా !సుగ్రీవా !నా ధర్మపత్ని అగు తార సుషేణుని కూతురు , ఈమె ఏంటో సూక్ష్మ బుడ్డి కలది . రాబోవు ఆపదలను పసిగట్టగలడు . సకల విషయములనందును సమర్థురాలు . తమ్ముడా !శ్రీరాముని కార్యము ఎట్టి సంకోచము లేకుండా చేయుము . సుగ్రీవా !ఇదిగో !ఈ దివ్యమైన బంగారుమాలను నా బొందిలో ప్రాణము ఉండగానే నీవు దరింపుము లేనిచో నేను మృతి చెందిన వెంటనే ఈ మాలకున్న అజేయ శక్తి నశిస్తుంది . "అని పలికి తమ్ముడికి ఆ మాలను అందించెను . 

అన్న వాలి మాటలు విన్న సుగ్రీవునికి అతనిపై అంతకు ముందు వరకు వున్న శత్రు భావము పూర్తిగా నశించి అన్నపై ప్రేమ భాద అంకురించినవి . పిమ్మట వాలి తన కుమారుడైన అంగదుడను పిలిచి అతడికి అనేక బుద్దులు చెప్పెను. పిమ్మట వాలి మరణము ఆసన్నమగుటచే కన్నులు మూసివేసెను అతడి ప్రాణములు అనంతవాయువులలో కలిసిపోయెను . ఆ క్షణములో కిష్కింద నగరములో ఆక్రోసనాలు ఏడుపులు ఆకాశము అంటు నట్లుగా వినిపించెను . కిష్కిందా రాజ్యము కళావిహీనము అయ్యెను . తన పాటి మరణించిన  కారణముగా తార దుఃఖసముద్రములో మునిగిపోయెను . చచ్చిపడి ఉన్న భర్త ముఖము చూచి  కౌగలించుకుని నరికివేయబడ్డ చెట్టుని అల్లుకున్న తీగలా నేలపై పడిపోయెను . 

రామాయణము కిష్కింద కాండ ఇరువదిరెండవసర్గ సమాప్తము . 

                                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ ( తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ఇరువదిఒకటవసర్గ

                                           రామాయణము 

                                               కిష్కిందకాండ -ఇరువదిఒకటవసర్గ 

ఆకాశము నుండి రాలి పడిన తారక వలె భూమిపై పది ఏడ్చుచున్న తారను చూచి ఆంజినేయుడు ఇలా పలికెను . 
"ఓ మహాసాద్వీ !ఏ ప్రాణి అయినను తెలిసి చేసిన ,తెలియక చేసిన పాపపుణ్య ఫలితములన్నిటినీ ఈ లోకమునైనా ,పరలోకమునైనా తప్పక అనుభవించి తీరవలెను . ఈ శరీరము నీటి బుడగ వాలే అస్తిరమైనది ,కావున ఒక దేహమున వున్న జీవుడు మరొక దేహమున వున్నా జీవుడి గూర్చి విచారించుట అవివేకము . ఓ దేవీ !నీవు అన్నీ తెలిసిన దానవు . ఏ జీవి ఎప్పుడు పుట్టునో ఏ జీవి ఎప్పుడు గిట్టునో ఎవ్వరూ చెప్పలేరు . కావున ఈ విలాపములు మాని పరలోకమున వున్నత గతులిచ్చెడి పుణ్యకార్యములు చేయుము . 
తల్లీ అసంఖ్యాకులైన వానరభల్లూకములతో కూడిన సువిశాలమైన  కిష్కింద రాజ్యమును నీ భర్త అయినా వాలి ఏంటో సమర్ధవంతముగా పరిపాలించాడు . దీనులను ఆప్తులను చక్కగా రక్షించాడు ఒక వీరునితో యుద్ధము చేస్తూ వీరమరణము పొందుటకు సిద్ధముగా వున్నాడు . కావున అతనికి తప్పక ఉత్తమలోకములు లభిస్తాయి . ఆ విషయములో నీవు శోకించవలిసిన పనిలేదు . ఓ పూజ్యురాలా !ఈ వానరప్రముఖులందరికీ అంగదునికి ,ఈ కిష్కింద రాజ్యమునకు నీవే రక్షకురాలివి . వారందరూ సోకథంతప్తులై వున్నారు వారిని ఊరడించి భావికార్యమునకు ప్రోత్సహించుము . నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యమును పరిపాలించగలడు . సింహాసనమును అధిష్టించిన అంగదుడిని చూచినచో నీ మనసుకు కొంత ఊరట లభించును . "అని పలికెను . 
అప్పుడా తార మారుతితో "ఓ వానర శ్రేష్టా !నీవు పలికినట్టు నా కుమారుడు వున్ననూ ఈ రాజ్యము నాకు ఉన్నానో వాటి మీద నాకు మనసు లేదు . నా మనసు నా పాటి పాదపద్మములనే ఆశ్రయించుకుని వున్నది . ఆయన లేను బతుకు నాకు వ్యర్థం . కావున నేను కూడా ఆయనతో సహగమనము చేసెదను . అంగదునికి సుగ్రీవుడు తండ్రి వంటి వాడు అతని బాగోగులు సుగ్రీవుడి చూసుకొనును . నేను నా భర్తతో సహగమనము చేసెదను "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువదిఒకటవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు  పండితులు . 








Thursday, 19 April 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదియవసర్గ

                                     రామాయణము 

                                    కిష్కిందకాండ -ఇరువదియవసర్గ 

శ్రీరాముని బాణాపుదెబ్బచే నేలపై పది ఉన్న వాలిని ఆ తార కౌగలించుకుని "ఓ వానరవీరా !యుద్ధమున తిరుగులేనివాడవు . వానరులలో ప్రముఖుడవు . నీవంటి మహారాజు ఇలా నేలపై పరుండుట తగునా !లే లేచి తగిన శయ్యపై పరుండుము . నీకు అత్యంత ప్రియమైన భార్యనైన నేను ఈ విధముగా నీ చెంతనే ఉండి ఈవిధముగా విలపించుచుండగా కానేసాము మారు పలుకవేమి ? కనీసము నీ గారాల పుత్రుడైన  అంగదుడనైనా ఊరడించవేమి ?మేము నీకు అప్రియములైన ఏ పనులు చేసినాము ?ఇక నుండి నువ్వు అల్లారుముద్దుగా పెంచిన అంగదుడు పినతండ్రి కోపతాపములు భరించుచు జీవించవలెను కాబోలు " అంటూ ఏడ్చెను . తిరిగి కుమారునివైపు తిరిగి . "నాయనా !అంగదా !మీ తండ్రి ని కనులారా చూచుకో మల్లి ఆ అదృష్టము దక్కదు ". అని పలికి తిరిగి వాలివైపు తిరిగి "నీవు నీ హితము కోరి నేను చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి నీ తమ్ముడి భార్య రామ ను చెర పట్టి చేచేతులారా ఈ దుస్థితిని తెచ్చుకున్నావు . "
 అని అప్లికి సుగ్రీవునితో "ఓ సుగ్రీవా !నీ కోరిక నెరవేరినది కదా తండ్రి వంటి అన్నగారిని పొట్టన పెట్టుకున్నావు . ఆయన విగత జీవుడై పడివున్నాడు ఇప్పుడు నీకు సంతోషమేగా ఇక నీ భార్యతో సంతోషముగా వుండు . ఈ రాజ్యమును ఏలుకో !"అనెను . అంటూ బిగ్గరగా ఏడ్చుచూ వాలివైపు తిరిగి "ఓ నాధా !నేను నీ భార్యలు అందరూ వచ్చి వున్నారు మమ్ములను కనీసము ఒక్కసారైనా చూడవేమి ?అజ్ఞానముతో మేమేమయినా దోషము చేసి ఉంటే మమ్ము మన్నించు "అనెను.  తిరిగి ఆమె నా ప్రియమైన భర్త చనిపోయి పడివున్ననూ  ఇంకనూ నా హృదయము బద్దలవలేదంటే నేను బహుశా పాషాణ హృదయురాలిని అయివుంటానని ఏడ్చి ప్రాయోపవేశమునకు సిద్దపడెను 

రామాయణము కిష్కిందకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు