Tuesday 21 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూట ఆరవసర్గ

                                                   రామాయణము 

                                                అయోధ్యకాండ -నూట ఆరవసర్గ 

శ్రీరాముడు  ఈ విధముగా పలికిన పిమ్మట భరతుడు "అన్నా !నీవు దుఃఖములకు కృంగిపోవు ,సంతోషములకు పొంగిపోవు . ఓ రఘువరా !నీవు దేవతలవలె సత్వగుణ సంపన్నుడవు . మిగుల దైర్యశాలివి ,సత్యసంధుడవు ,సర్వజ్ఞుడవు ప్రతిభాశాలివి జనన మరణ రహస్యములు బాగుగా ఎరిగినవాడివి . ఇట్టి ఉదాత్త గుణసంపన్నుడయిన నీవు ఎట్టి బాధలకు చలించవు . 
నేను పరదేశమున ఉండగా అల్పజ్ఞురాలయిన నా తల్లి నా నిమిత్తమై ఈ పాపకార్యములకు ఒడిగట్టేను . ఇది నాకు ఎంతమాత్రము సమ్మతము కాదు . తల్లి ఎంతటి దుష్టురాలైనను ఆమెను చంపుట ధర్మముకాదు . కావుననే మహాపరాధము చేసిన మాతల్లి మరణదండనకు అర్హురాలే అయినను నేను ఆ శిక్ష విధించలేదు . కనుక ఆమెను క్షమించి నా యెడ ప్రసన్నుడవుకమ్ము . 
మన తండ్రి ఎన్నో యజ్ఞయాగములు చేసినవాడు . ధర్మాధర్మములు బాగుగా ఎరిగినవాడు . అటుల ఎటువంటివాడైనను ఒక స్త్రీని సంతృప్తి పరుచుటకు ధర్మాధర్మములకు విరుద్ధముగా ఇంతటి పాపకార్యములకు ఒడిగట్టునా ?మన తండ్రి ఆ సమయాభావములకు లోనై అటుల ప్రవర్తించివుండవచ్చును .  లోక హితము కోరి ఆయన దోషమును నీవు సవరింపవచ్చును కదా !నన్ను తల్లులను ,జనులను పురోహితులను కాపాడుటకు నీవే సర్వసమర్థుడవు . ఓ రామా !నీకు శిరసా ప్రణమిల్లుచున్నాను . నన్ను అనుగ్రహించుము "అని ఎంతో దీనంగా భరతుడు ప్రార్ధించినప్పటికీ శ్రీరాముడు అయోధ్యకు మరలి వెళ్ళుటకు అంగీకరించలేదు . అతడు తండ్రి ఆదేశమునకే కట్టుబడివుండెను . 
శ్రీరాముడి ఆత్మస్తైర్యము చూసి అచటి జనులకు ఒకేసారి సంతోషము ,బాధ కలిగెను . ఋత్విజులు ,పురప్రముఖులు ,గణనాయకులు నిస్పృహతో కన్నీరు కార్చుచు శ్రీరామునికి ప్రణమిల్లి అయోధ్యకు వచ్చి పాలించమని అభ్యర్ధించిరి . తల్లులు ఏడుస్తూ నిలబడిరి . 

రామాయణము అయోధ్యకాండ నూట ఆరవసర్గ సమాప్తము . 


                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Monday 20 February 2017

రామాయణము అయోధ్యకాండ- నూటఅయిదవసర్గ

                                           రామాయణము 

                                      అయోధ్యకాండ- నూటఅయిదవసర్గ 

పురుషశ్రేష్ఠులైన  రామలక్ష్మణభరతశత్రుఘ్నులు బంధుమిత్రులతో కూడి పితృవియోగముతో తపిస్తూ ఉండగా ఆ రాత్రి గడిచెను . తెల్లవారగానే భరతుడు అన్నను ఒప్పించి అయోధ్యకు తీసుకువెళ్లవలననే కోరికతో శ్రీరాముని తన మాటలతో ఒప్పించుటకు యత్నించెను . కానీ శ్రీరాముడు ఒప్పుకొనక 'భరతా !మనుషులు దేవతల వలె ఇష్టాచరులు కారు . నన్ను తండ్రి వనములలో 14ఏండ్లు ఉండమని ఆజ్ఞాపించినారు కావున ఆ సమయము గడవక ముందే నేను అయోధ్యలోకి రాలేను . నీవుకూడా తండ్రి ఆజ్ఞప్రకారం అయోధ్యకు రాజువయి పాలించు . మన తండ్రి మిక్కిలి పుణ్యాత్ముడు అతడు అనేక పుణ్యకార్యములు ,యాగములు చేసి ఉన్నతలోకములకు చేరినాడు . కావున ఆయనను గూర్చి చింతించక రాజ్యమును పాలించుము "అని పలికి ఒక్క క్షణము మౌనము వహించెను . 

రామాయణము అయోధ్యకాండ నూటఅయిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Friday 17 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూటనాల్గవసర్గ

                                                రామాయణము 

                                      అయోధ్యకాండ -నూటనాల్గవసర్గ 

సోదరుడగు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు తనకు అత్యంత ప్రేమాస్పదుడు ,తనయందు భక్తిశ్రద్ధలు కలవాడు అయిన భరతుని ప్రియవచనములతో ఓదార్చుచు "నాయనా !భరతా !నీవు రాజ్యము వీడి కృష్ణాజినము ,వల్కలములు ధరించి ఇటు వచ్చితివేమి ?"అని ప్రశ్నించెను . 
అప్పుడు భరతుడు "ఓ పూజ్యుడా !మహాబాహువైన మన తండ్రి ఒక స్త్రీ కారణముగా నిన్ను అడవులకు పంపి నీ ఎడబాటును తట్టుకొనలేక మరణించెను . ఆయన భార్య ,నా తల్లి అగు ఈ కైకేయి ప్రోద్భలంతో ఈ పని చేసినాడు . ఈ పాపకార్యము ఆయన కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయునది . నా తల్లికి ఆమె ఆశించిన రీతిగా రాజ్యలాభము దక్కలేదు సరికదా తీరని వైధవ్యము ప్రాప్తించినది . ఫలితముగా శోకమున కృంగిపోవుచున్నది . ఈ కారణముగా ఆమె ఘోర నరకమునకు పోవుట తధ్యము . 
నాకు ఆమె ఆలోచనలతో కానీ ఆమె దుర్భుద్ధితో కానీ సంభందం లేదు . అన్నా !నీ దాసుడనై ఇచటికి విచ్చేసితిని . నన్ను అనుగ్రహించి కోశల రాజ్యమునకు పట్టాభిషిక్తుడవుకమ్ము . జ్యేష్ఠుడవు అయినకారణముగా రాజ్యపాలనకు నీవే అర్హుడవు . మన తల్లులు ,గురువులు ,మంత్రులు ,జనులు సమస్తులు ఇదే ఉద్దేశ్యముతో ఇచటకు వచ్చినారు . కావున మా అందరి అభ్యర్ధనను మన్నించి రాజ్యమును పాలించి మమ్ము అనుగ్రహించుము . "అని దోసిలి ఒగ్గి వినయముగా ప్రార్ధించి నిలబడెను . 

అప్పుడు శ్రీరాముడు "ఓ భరతా !ఉత్తమ వంశమున పుట్టినవాడవు . సత్ప్రవర్తన కలవాడివి నీకెటువంటి దుర్భుద్ధి కలదని నేననుకోను . నీ తల్లిని సైతము నిందింపకుము . ఓ భరతా !ధర్మశీలురైన తల్లి తండ్రి ఇద్దరు నన్ను వనములకు వెళ్ళమని ఆజ్ఞాపించిరి . వారి ఆజ్ఞను కాదని నేను మరియొకవిధముగా ఎట్లు చేయగలను . ?లోకకళ్యాణార్ధము నీవు అయోధ్యలో ఉండి రాజ్యమును పాలించుము . తండ్రి ఇచ్చిన ఆఙ్ఞయే నాకు పరమ హితము "అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ నూటనాల్గవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday 15 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూటమూడవసర్గ

                                                      రామాయణము   

                                                    అయోధ్యకాండ -నూటమూడవసర్గ 

వశిష్ఠుడు దశరధుని పత్నులను వెంట పెట్టుకుని రామాశ్రమము వైవు వేగముగా నడవసాగెను . దారిలో కౌశల్య మిగిలిన దశరధుని పత్నులతో శ్రీరాముని గూర్చి చెబుతూ నడవసాగెను . సుమిత్రతో "ఓ సుమిత్రా !నీ కుమారుడు బహుశా ఈ నది నుండే నా కుమారుడి కొరకు నీటిని తీసుకువెళ్తూ ఉండిఉండవచ్చు సుకుమారమైన లక్ష్మణుడు ఈ అరణ్యములో నా కుమారుడు కొఱకు నానా యాతన పడుచున్నాడు . భరతుడి అభ్యర్ధనను మన్నించి రాముడు అయోధ్యకు వచ్చినచో నీ కుమారుడికి ఈ యాతన తప్పుతుంది . "అని పలుకుతూ సీతారామలక్ష్మణులు తిరుగు ప్రదేశములు చూపుతూ కౌశల్య నడుచుచుండగా ,మిగిలిన దశరధుని పత్నులు సైతము శ్రీరాముని చూడవలెననే కోరికతో వేగముగా నడవసాగిరి . 

వారు ఆవిధముగా నడుస్తూ ఎట్టకేలకు శ్రీరాముని ఆశ్రమమునకు చేరిరి . అచట నారచీరలు ,జతలు ధరించి దర్భాసనము మీద కూర్చుని వున్న శ్రీరాముని చూసి కౌశల్య "మహారాజు బిడ్డ ఇటువంటి జీవనము గడపవలసి వచ్చినదే "అని ఏడ్చెను . తల్లులను చూసిన శ్రీరాముడు వారి మువ్వురి పాదములకు నమస్కారములు చేసెను . పిదప లక్ష్మణుడు సైతము వారికి నమస్కారము చేసెను . పిదప సీత కూడా అత్తల పాదములకు నమస్కారము చేసెను . కౌశల్య సీతను హత్తుకొనెను . ఆ విధముగా అందరూ కలుసుకొనిరి . అచట ఆసీనులయ్యిరి . 

రామాయణము అయోధ్యకాండ నూటమూడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము అయోధ్యకాండ -నూటరెండవసర్గ

                                            రామాయణము 

                                          అయోధ్యకాండ -నూటరెండవసర్గ 

భరతుడు చెప్పిన తండ్రి మరణవార్త విని నిశ్చేష్టుడయ్యెను . చేతులు " అయ్యో తండ్రీ మమ్ము వీడి ఎక్కడకు వెల్తివి "అంటూ బిగ్గరగా ఏడ్చుచు నేలపై పడి స్పృహ కోల్పోయెను . సీతా ,లక్ష్మణ,భరత ,శత్రుఘ్నులు రాముని చుట్టూ చేరి ఎడ్వసాగిరి. వారి అశ్రువులతో రాముని శరీరము తడిసిపోయెను . కొంతసేపటికి స్పృహ తెచ్చుకున్న రాముడు తమ్ములను కౌగలించుకుని ఏడ్చెను . 
పిమ్మట భరతునితో "భరతా !తండ్రి నా  వియోగముతో మరణించెను . చివరి చూపుకు నేను నోచుకోలేకపోతిని . ఆయనకు నిర్వర్తించవలసిన కార్యములు ఏమి చేయలేని వాడనయ్యాను . వారికి ఉత్తరక్రియలు నిర్వర్తించి నీవు ఆయన ఋణము తీర్చుకుంటివి . నీవు మిక్కిలి అదృష్టవంతుడివి . తండ్రి లేని అయోధ్యతో ఇక నాకు పనిలేదు . నా వనవాసము పూర్తయ్యిన పిదప కూడా నేను అయోధ్యలో అడుగుపెట్టలేను . 
మన తండ్రి నిరంతరము ఎన్నో మంచి విషయము చెబుతుండేవారు . నన్ను ఆజ్ఞాపించేవారు . నా మీద మిక్కిలి అభిమానము చూపించెడివారు . ఇక మీదట నాతొ అలా ఎవరు ఉండగలరు ?"అంటూఎడ్వసాగెను  . అన్నదమ్ములు నలుగురు ఒకరినొకరు పట్టుకొని ఎడ్వసాగిరి . పిదప సుమంత్రుడు ,వశిష్ఠుడు మున్నగు వారు వారిని ఓదార్చెను . పిదప వారందరూ మందాకినీ నదీ తీరమునకు వెళ్లిరి . అచట శ్రీరాముడు తండ్రికి తర్పణములు విడిచెను . 
పిదప అతడు తినే గారే పిండి ,రేగిపళ్ళు మొదలగు పదార్థములతో తండ్రికి పిండము పెట్టెను . శ్రీరాముడు తమ్ములను చూచి "మహారాజుకి గారే పిండితో పిండము పెట్టవల్సివచ్చినది . జనులు వారు తిను ఆహారమునే దేవతలకు నివేదనగా పెట్టుదురు కదా "అంటూ ఏడ్చెను . తమ్ములు కూడా ఏడ్చిరి . వారి ఏడుపులు విన్న సేన ఏమయినదో అని ఆందోళన పడుతూ ఆ రోదన వినపడిన దిశగా త్వరత్వరగా వచ్చిరి . చిత్రకూట పర్వతముపై దర్భాసనముపై కూర్చున్న శ్రీరాముని వద్దకు జనులు వచ్చి వారి పాదములపై పడి ఎడ్వసాగిరి . శ్రీరాముని చూసి కొద్దికాలమే అయినను పెక్కుకాలము అయినట్లుగా వారు ఎడ్వసాగిరి . శ్రీరాముడు వారిని లేపి హత్తుకొనెను . వారందరి రోదనలతో ఆ అరణ్యములోని గుహలు మారుమ్రోగేను . 

రామాయణము అయోధ్యకాండ నూటరెండవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







 

Tuesday 14 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూటయొకటవసర్గ

                             రామాయణము 

                    అయోధ్యకాండ -నూటయొకటవసర్గ 

శ్రీరాముడు పలికిన మాటలు విని భరతుడు  
"అన్నా !నిన్ను సేవించుటే నా పరమ ధర్మము దానికే దూరమైనపుడు నాకు రాజధర్మములతో పని ఏమి ?రాజకుమారులలో పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు రాజు కాజాలడు . ఇదియే మన వంశపారంపర్యముగా వస్తున్న ధర్మము . 
ఓ రఘునందనా !జేష్టుడవైన నీవు నాతొ పాటు అయోధ్యకు రమ్ము . వంశప్రతిష్ఠకై కోసల రాజ్యమునకు పట్టాభిషిక్తుడవుకమ్ము . సీతాదేవి ,లక్ష్మణులతో కలసి నీవు అరణ్యవాసమునకు బయలుదేరి రాగానే మహారాజు బాధ తట్టుకొనలేక మరణించెను . నేను కేకేయ రాజ్యమున ఉంటిని . విషయము తెలిసి వస్తిని . 
మన తండ్రి నీ ఎడబాటు కారణముగా నిన్ను గురించి  శోకసంతప్తుడయ్యెను . నిన్ను చూడవలెననే కోరికతో ఆయన తన బుద్ది నుండి నిన్ను మరల్పలేక దుఃఖముతో విలవిలలాడుచూ నిన్నే స్మరించుచు అస్తమించెను

రామాయణము అయోధ్యకాండ నూటయొకటవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 




Monday 13 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూఱవసర్గ

                                   రామాయణము 

                          అయోధ్యకాండ -నూఱవసర్గ 

తన పాదములకు నమస్కారము చేసివున్న ,బక్కచిక్కివున్న భరతుని చూసి గుర్తించిన శ్రీరాముడు తమ్ముని ప్రేమతో ఆలింగనము చేసుకుని శిరము మూర్కొనెను (ముద్దాడెను ). పిమ్మట రాముడు "నాయనా !భరతా !కుశలమేనా . మీ మేనమామగారింటికి వెళ్లిన పిదప పెక్కుకాలము తర్వాత నిన్ను చూస్తున్నాను . ఇలా చిక్కిపోయినవేమి ?తండ్రిగారు కానవచ్చుటలేదు వారు ఏరి ?రాలేదా !వారు కుశలమేనా ?తల్లులు మువ్వురు కుశలమేనా ?కౌశల్యాదేవి బాధ నుండి ఉపశమనము పొందినదా ?సుమిత్రాదేవి కుశలమేనా ?కైకేయి దేవి సంతోషమేనా ?మన కులగురువైనా వశిష్ఠుడు కుశలమేనా ?ఆయన తెలుపు మార్గములోనే నడుచుచున్నావు కదా !మంత్రులు కుశలమేనా ?నీకు అనుకూలురైన మంత్రులనే నియమించుకున్నావు కదా !రాజ్య భారము సక్రమముగా చేయుచున్నావుకదా ,రాజ్యము వదిలి ఇలా అరణ్యము నకు వచ్చితివేమి ?"అని పలుకుతూ పలు రకముల ధర్మ భోదలు చేసెను . 

రామాయణము అయోధ్యకాండ నూరవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Sunday 12 February 2017

                                            రామాయణము 

                                   అయోధ్యకాండ -తొంబది తొమ్మిదవసర్గ 

భరతుడు అన్నయైన శ్రీరాముని దర్శించవలెననే  కోరికతో శత్రుఘ్నుడికి ఆశ్రమ చిహ్నములు చూపిస్తూ దానిని సమీపించెను . వశిష్ట మహర్షికి తన తల్లులను జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పి ,తానూ వడివడిగా నడవసాగెను . ఆయనతో పాటు ,శత్రుఘ్నుడు ,సుమంత్రుడు ,గుహుడు నడవసాగిరి . భారద్వాజమహర్షి చెప్పిన గుర్తులను గుర్తుకు తెచ్చుకుంటూ ,ఆ దారిలో నడవసాగెను . దారిలో రామలక్ష్మణులు ఏర్పరుచుకున్న గుర్తులు గమనిస్తూ వాటి గురించి శత్రుఘ్నుడికి వివరిస్తూ భరతుడు ముందుకు సాగెను . నడుచునపుడు భరతుడు శత్రుఘ్నుడితో "రాజప్రాసాదములో రాజభోగములు అనుభవించవలిసిన అన్నావదినలు ఈవిధముగా  కష్టపడుటకు నేనే కారణము . కావున నేను వెళ్లిన వెంటనే అన్న పాదములపై పడి క్షమించమని వేసుకుంటాను . "
అని పలికెను . ఆ విధముగా మాట్లాడుకుంటూ రాముని ఆశ్రమమును సమీపించిరి . ఆ ఆశ్రమమును ,అచటి పరిసరములను బాగుగా పరిశీలించెను . అచట ఒకానొక ఆసనముపైన నారచీరలు జింక చర్మము ధరించి రాముడు ధ్యాన నిమగ్నుడై ఉండెను . ఆయనను చూడగానే భరతుడు దుఃఖముతో గొంతు పూడిపోగా స్వామీ !అని నెమ్మిదిగా పిలిచెను . పిదప ఆయన స్వరము పెక్కుసేపు దుఃఖముతో పెగలకుండెను . అతి ప్రయత్నమూ మీద అన్నా !అని పిలిచి రాముని పాదములపై పది ఏడవసాగెను . శత్రుఘ్నుడు సైతము రాముని పాదములపై పది ఏడవసాగెను . రాముడు వారిరువురిని లేవనెత్తి తన అక్కునచేర్చుకొనెను . ఆ దృశ్యము చూసిన అచటి వారు ఆశ్రమవాసులు ,సుమంత్రుడు ,గుహుడు ఆనందాశ్రువులు కార్చిరి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Saturday 11 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదియెనిమిదవసర్గ

                                     రామాయణము 

                                    అయోధ్యకాండ -తొంబదియెనిమిదవసర్గ 

నరశ్రేష్ఠుడు ప్రతిభాశాలి అయిన ఆ భరతుడు తన సేనను నిలుపుచేసి శ్రీరాముని వద్దకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకుని ,కొంతమంది దారి చూపు సేన ,మంత్రులు ,పురోహితులు ,శత్రుఘ్నుడు తో కలసి కాళీ నడకన చెట్లు ,కొండలు దాటుతూ ముందుకు సాగెను . అంత కొంతదూరము నడిచిన పిదప ఒక మద్ది చెట్టు ఎక్కి భరతుడు చూసేను . అప్పుడు ఆయనకు పొగ కనిపించెను . అచట రాముడు వుండివుండవచ్చునని ,రాముని చూడవలెననే ఉత్సాహముతో ముఖమున చిరునవ్వులు చిందుతుండగా రాముని ఆశ్రమము వైపు వడివడిగా అడుగులు వేసెను . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Friday 10 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబది ఏడవసర్గ

                                                 రామాయణము 

                                        అయోధ్యకాండ -తొంబది ఏడవసర్గ 

భరతుని విషయములో సుమిత్రానందనుడయిన  లక్ష్మణుడు కోపముతో ఊగిపోవుట గమనించిన రాముడు అతనిని శాంతపరుచుతూ "నాయనా !మిగుల ప్రాజ్ఞుడు అయిన భరతుడు మన వద్దకు వచ్చునప్పుడు ధనుర్భాణములతో పని ఏమున్నది ?మన తండ్రిగారే ఈ రాజ్యమును భరతునికి ఇచ్చివేశారు . ఇక భరతుడు మనకు ఎందుకు కీడు చేయ తలుస్తాడు . మనం అనాలోచితముగా భరతుడిపై దాడి చేసి సాధించుకున్న రాజ్యము ఎవరికోసం ?నాకు అటువంటి రాజ్యము వద్దు . 
భరతుడు చిన్నతనము నుండి నాకు బాగుగా తెలుసు అతడిది అటువంటి స్వభావము కాదు . ఓ సౌమిత్రీ !ఎట్టి ఆపదలు వచ్చినను పుత్రులు తండ్రిని ఎటుల చంపగలరు . అటులనే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన మరో సోదరుడిని ఎలా చంపగలడు . కావున నీ ఆలోచన తప్పు . కోపము విడిచి శాంతిని వహించుము . బహుశా జరిగిన విషయము తెలుసుకుని తన తల్లి కైకేయిని దూషించి ఉంటాడు . తండ్రిని ప్రసన్నుడిని చేసుకుని మనలను మరల్చుటకు వచ్చి ఉండవచ్చును . బహుశా ,మనము సుకుమారులము కావున దశరథ మహారాజు మనలను మరల్చి అయోధ్యకు తీసుకువెళ్ళుటకు వస్తున్నాడేమో ?కనీసము మిక్కిలి సుకుమారి అయిన సీతాదేవినైనను అతడు తీసుకుని వెళ్లవచ్చును . 
లక్ష్మణా !అన్ని వాహనము కానవచ్చుచున్నవి కానీ తండ్రి గారి శ్వేతచ్ఛత్ర రధము మాత్రము కానవచ్చుటలేదు . నాకేదో సందేహము కలుగుచున్నది ." అని రాముడు పలుకగా లక్ష్మణుడు శాంతించి చెట్టు దిగెను . భరతుడు "మానవలన శ్రీరాముని ఆశ్రమముకు ఏ ఇబ్బంది కలుగకూడదు "అని సైనికులను ఆజ్ఞాపించెను . పిమ్మట అత్యంత వినమ్రుడై రాముని అనుగ్రహము పొందుటకై రాముడు వున్న దిశగా బయలుదేరెను . 

రామాయణము అయోధ్యకాండ తొంబది ఏడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Thursday 9 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదిఆరవసర్గ

                                          రామాయణము 

                                అయోధ్యకాండ -తొంబదిఆరవసర్గ 

ఆ విధముగా శ్రీరాముడు సీతాదేవికి చిత్రకూటపర్వత అందములు చూపుతూ ఆమెకు ఫలముల గుజ్జును ,కందమూలములను పెట్టి ఆమెకు ప్రియమును కూర్చెను . ఆ విధముగా వారు చిత్రకూట పర్వతముపై వుండి భాషించుకుంటున్న సమయములో జంతువులు. అప్పుడు భయముభయముగా పెరిగిడసాగినవి . దూళి ఆకాశమునకు తాకుచున్నది .  అప్పుడు  రాముడు లక్ష్మణుని పిలిచి 
"లక్ష్మణా !ధూళి ఆకాశమును తాకుచున్నది . గజములు మొదలగు జంతువులూ భయముతో పరిగెడుచున్నవి . బహుశా ఏ రాజో ,లేక రాకుమారుడో వేటకి వచ్చివుండును . లేక క్రూర మృగములు వచ్చి ఉండును . ఏమిటో చూడు "అని పలికెను . అన్న ఆదేశమును అనుసరించి లక్ష్మణుడు చిత్రకూట పర్వతముపై కల అత్యంత ఎత్తయిన మద్ది చెట్టు ఎక్కి ఒక మహాసేనను ,వాటి రధములపై ఎగురు ధ్వజ పతాకములను చూసి అన్న వద్దకు వచ్చి 
"హోమాగ్నిని ఆర్పుము . అప్పుడే శత్రువులు మన జాడను కనిపెట్టలేరు . సీతాదేవిని బద్రముగా గుహలో దాయుము ,ధనుర్భాణములు ధరించుము "అని పలికెను అప్పుడు రాముడు "లక్ష్మణా !వచ్చినదెవరో బాగుగా పరిశీలించితివా ?"అని ప్రశ్నించగా ,లక్ష్మణుడు "అన్నా !వచ్చినది కైకేయి పుత్రుడైన భరతుడు . బహుశా మన అడ్డును తొలగించుకొనుటకు వచ్చివుండును . ధనుర్భాణములు ధరించి నేను అతడిని తుదముట్టించెదను . అతడిని చంపుట పాపము అవదు . మన శత్రువు చావుటకు మన చెంతకే వచ్చినాడు . నేడే కైకేయిని ఆమెతో అనుబంధము కల మంధర మున్నగు వారిని అందరిని తుదముట్టించెదను . ఆమె కారణముగా ఎంతో కలుషితమైన ఈ భూమండలం కు పాప విముక్తి కలిగించెదను . నీవు నీ రాజ్యమును ఏలుకోవచ్చును . 

రామాయణము అయోధ్యకాండ తొంబది ఆరవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday 8 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదియైదవసర్గ

                                           రామాయణము 

                                       అయోధ్యకాండ -తొంబదియైదవసర్గ 

అంతట శ్రీరాముడు చిత్రకూట పర్వతము నుండి మందాకినీ నదీ తీరమునకు సీతతో కూడి చేరి  నదీ సౌందర్యములను జనకనందినికి  చూపెను . నిర్మలమైన నదీజలములను ,నదీ తీరమునకు ఇరువైపులా కల వృక్షములు ,ఆ వృక్షముల నుండి పూలు జాలువారి నదీ తీరప్రదేశము ,నదీ జలములు ఆ పూలతో నిండి చూచుటకు మనోహరముగా కల ఆ దృశ్యమును రాముడు సీతకు చూపెను . ఆ నదీ తీరమున విహరించు చెకోర పక్షుల జంటలను సీతకు చూపెను .
ఇంకనూ శ్రీరాముడు సీతతో "ఓ మైథిలీ !నన్ను త్రికరణ శుద్ధిగా అనుసరించు అనుకూలవతివైన నీవు నా చెంతన ఉండుట వలన నాకు  అయోధ్య గుర్తుకు వచ్చుట లేదు . నీతో ,లక్ష్మణునితో ,కలసి ఈ నిర్మల జలములను త్రాగుచు ,మధురమైన కందమూలములను భుజించుచు నేను అయోధ్యలో వలే హాయిగా వున్నాను . ఈ నదీ ప్రాంతము మిక్కిలి రమణీయముగా కలదు . ఇచట సిద్దులు ,మునులు మున్నగు వారి నిత్యమూ స్నానమాచరించుచు వుండుదురు . ఈ నదీ జలములలో స్నానమాచరించినవారికి ,ఈ వృక్షఛాయలలో విశ్రమించువారికి శ్రమలు మాయమగును "అని పలుకుతూ ఆ ప్రాంతము లో విహరించుచుండెను . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియైదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .   






Tuesday 7 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదినాల్గవసర్గ

                                        రామాయణము 

                                 అయోధ్యకాండ -తొంబదినాల్గవసర్గ 

శ్రీరామునకు గిరులను దర్శించుట అందు ,వనములలో  విహరించుట అందు మక్కువ ఎక్కువ . సీతాలక్ష్మణులతో కూడి ఆ పర్వతముపై వసించుచున్న శ్రీరాముడు విదేహరాజకుమారి అయిన సీతాదేవికి ప్రియమును కూర్చుటకు చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభను  ఆమెకు చూపుతూ "ఓ సీతా !రాజ్యాధికారం ,నాకు హితులు ,మిత్రులు నాకు దూరంగా ఉన్నప్పటికీ ,ఈ చిత్రకూటము నందలి రమణీయ దృశ్యములను చూచుచు ఆనందించుటలో నిమగ్నమైన న మనసుకి ఆ విషయములు ఏమి కలవరపరుచుటలేదు . ఈ పర్వత అందములను చూడు 
వివిధ పక్షుల మధుర ధ్వనులు ,ఎత్తైన ఆకాశమును తాను శిఖరములు ,ఆ శిఖరములనుండి జాలువారుచున్న గైరికాదిధాతువులు కనువిందు చేయుచున్నవి . ఆ శిఖరములు రకరకముల రంగులతో అలరారుచున్నవి రకరకాల చెట్లతో ఎంతో పచ్చగా ,శోభాయమానంగా వున్నది . ఆహ్లాదకరమైన కొండచరియలు అందు ప్రేమానురాగములతో జంటలు జంటలుగా తిరుగుచున్న ఈ కిన్నెరజాతి వారిని చూడుము . ఇచట కల  జంతువులూ , క్రూర మృగములు జాతివైరమును మరచి ప్రశాంతముగా వున్నవి . ఈ చిత్రకూటము రుచికరములైన కందమూలములతో ,మధుర జలములతో మిగుల సంపన్నమయినది . ఓ ప్రాణేశ్వరీ !శ్రేష్ఠములైన వనవాస నియమములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసలుచు నీతోను ,లక్ష్మణుని తొడను ఈ పదునాలుగు సంవత్సరముల కాలమును సంతోషముగా గడిపేడను . దాని వలన మన వంశ ప్రతిష్టలు ఇనుమడించును . 

రామాయణము అయోధ్యకాండ తొంబది నాల్గవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం.  ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణo అయోధ్యకాండ -తొంబది మూడవసర్గ

                                     రామాయణo 

                                   అయోధ్యకాండ -తొంబది మూడవసర్గ 

అట్లు వనములో ప్రయాణించుచున్న మహా సేనను చూసి భీతిల్లిన మదపుటేనుగులు మున్నగు వన్య మృగములు తమ గుంపులతో కూడి ,పరుగులు తీసినవి . భరతుడు సేన సాగరము వలె అపారమైన వర్షాకాలము నందు మేఘసముదాయము ఆకాశమునువలె భూమిని కప్పివేసెను . సేన అంతా రామలక్ష్మణులను చూడవలెననే ఆత్రముతో పరుగులు తీయసాగిరి . 
అటుల ఎడతెరపి లేకుండా భరద్వాజుడు తెలిపిన మార్గములో  ప్రయాణించి చిత్రకూటము చేరిరి . దారి తెలిసిన సైనికులు ముందుగా ప్రయాణించి అచట పొగను గమనించి ,భరతుడి వద్దకు వచ్చి "ప్రభూ అచట పొగ కానవచ్చుచున్నది . పొగ వున్నచో అచట జనులు తప్పక వుండుదురు . రామలక్ష్మణులు ఉండి ఉండవచ్చు . లేదా మునులు తపమాచరించుచు ఉండవచ్చు . "అని పలికిరి . 
భరతుడు తన సేనను అచటనే ఉంచి తానూ ,మునులు ,పురోహితులు మాత్రము ముందుకు సాగిరి . భరతుని ఆజ్ఞ ప్రకారము సైనికులు అతి త్వరలో రాముని చూడబోతున్నామన్న ఆశతో ఉవ్విళ్ళూరుచు అచటనే ఉండిరి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదిమూడవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Sunday 5 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదిరెండవసర్గ

                                              రామాయణము 

                                             అయోధ్యకాండ -తొంబదిరెండవసర్గ 

భరతుడు భరద్వాజుడు ఇచ్చిన ఆతిధ్యమును శ్వీకరించి ఆ రాత్రి అచట హాయిగా ఉండెను . శ్రీరాముని దర్శించవలెననే కోరికతో భరతుడు వేకువజామునే లేచి ,తల్లులు ఇతర పరివారముతో కలసి వీడ్కోలు చెప్పుటకై భారద్వాజముని చెంతకు వెళ్లెను . ఆ మునితో ఆతిధ్యమునకు సంతుష్టుడనైతిని చెప్పి అన్న దగ్గరకు వెళ్ళుటకు అనుమతిని కోరెను . 
అప్పుడు భరద్వాజుడు "నాయనా !మీ అన్నగారిని చూడవలెనని నీవు పడుతున్న ఆత్రం నాకు సంతోషాన్ని కలిగించుచున్నది . మీ తల్లిగార్ల గురించి తెలుసుకోగోరుతున్నాను . తెలుపుము "అని పలికెను . అప్పుడు భరతుడు ఆమునితో "మునివర్యా !నావెనక నిలబడిన,బక్కచిక్కిన ఈమె రామజనని కౌశల్యాదేవి . మా తండ్రి దశరధుని పట్టపురాణి . ఆమెను ఆనుకుని వున్న ఈమె సుమిత్రాదేవి మిక్కిలి శాంత స్వభావురాలు ,లక్ష్మణశత్రుఘ్నుల జనని . ఇక ఈమె మిక్కిలి గర్విష్టి మా తల్లి ఈమె కారణముగానే మా అన్నగారు అడవులపాలయినారు . మా తండ్రి మరణించారు "అని పలికెను . 
అప్పుడు భరద్వాజుడు "నాయనా !కైకేయిని నిందించుట తగదు . మున్ముందు రామ అరణ్యవాసము వల్ల ఎన్నో సత్కార్యములు జరగనున్నాయి . ఇది విధిరాత "అని పలికి శ్రీరామ వాసము అయిన చిత్రకూటమునకు దారిని తెలిపి ఆశీర్వదించి పంపెను . భరతుడి ఆదేశమును అందుకున్న సమస్త సేన చిత్రకూటము వైపుగా ప్రయాణము సాగించెను . ఆసెన చూచుటకు పెద్ద అరణ్యమువలె గోచరించుచున్నది . 

రామాయణము అయోధ్యకాండ తొంబదిరెండవసర్గ సమాప్తము . 

శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అయోధ్యకాండ - తొంబది యొకటవసర్గ

                                       రామాయణము 

                                   అయోధ్యకాండ - తొంబది యొకటవసర్గ 

భరతుడు ఆ రాత్రి అచట విశ్రమించుటకు తన అనుమతిని తెలుపగా ,భరద్వాజుడు భరతునితో "కుమారా !నీ సేనలను ఎలా దూరముగా ఉంచితివి ?వాటిని కూడా ఇచటికి రప్పింపుము . నేను మీకు మీ సేనలకు అతిధి మర్యాదలు చేయుదును :అని పలికెను . అపుడు భరతుడు "స్వామీ !మీకు మాపై కల ఆదరాభిమానములకు మిక్కిలి సంతుష్టుడను . ఆశ్రమవాతావరణమునకు ,ప్రశాంతతకు భంగము కలగకూడదని నేను సేనను దూరముగా ఉంచితిని "అని పలికెను . 
అప్పుడు భరద్వాజముని "భరతా !నీ సేనలను కూడా పిలిపింపుడు . వారికి ఇచట ఏ లోటు రాదు . వారి వల్ల మాకు ఏ ఇబ్బంది కలుగదు కావున వాటిని కూడా ఇక్కడకు పిలిపింపుడు "అని ఆజ్ఞాపించి ,భరతునికి ,అతని సేనలకు మర్యాద చేయుటకై  మంచి మంచి గృహములను నిర్మించుటకు విశ్వకర్మను ఆహ్వానించెను . ఇంద్రుడు ,కుభేరుడు ,మొదలగు దేవతలను ,గంగా మొదలగు నదులను ,స్వర్గము ,బ్రహ్మలోకములలో కల అప్సరసలను ,ఇంకనూ అనేక మందిని ఆహ్వానించెను . 
వారందరూ వెనువెంటనే అచటికి విచ్చేసిరి . విశ్వకర్మ భరతుడు ,పురోహితులు ,మంత్రులు ,సేనలు నివసించుటకు ,రకరకములైన చిత్రవిచిత్రములైన గృహములను నిర్మించెను . ఇంకను మిగిలిన దేవతలు వారికి కావలిసిన ఏర్పాట్లు చేయనారంభించిరి . నలుగురైదుగురు అప్సరసలు ఒక్కొక్కరిని  నదీతీరములకు తీసుకువెళ్లి వారికి నాలుగు పెట్టి ,సుగంధద్రవ్యములతో అభ్యంగన స్నానములు చేయించిరి . వారికి తాగినంత మధ్యములు పోయసాగిరి . సేనలందరూ చక్కగా అలంకరింపబడి ,మేడలో పూలమాలలతో తూలుతూ వున్నారు . వారి కొఱకు కొన్ని వేల ,లక్షల ,రకముల ఆహార పదార్దములు ,రసములు ,పిండివంటలు బావుల వంటి ప్రమాణము కల పాత్రలలో సిద్దము చేయబడినవి . 
వాటిని కడుపునిండా తిని మద్యము మత్తులో వారికి కేటాయించబడిన భవనములలో కింద పడి దొర్లసాగిరి . వారి మెడలలో కల హారములు ,దండలు నేలపై చెల్లాచెదురుగా పడెను . ఆ సమయమున సేనలందరూ మద్యము మత్తులో ఇదియే స్వర్గము అని బిగ్గరగా అరవసాగిరి . భరతునికి ,ఆయన పరివారములు భరద్వాజముని జరిపిన అతిధి మర్యాదలు నిరుపమానమై అత్యత్భుతముగా ఉండెను . వారందరూ ఇది కలయా నిజమా అని అనుకొనుచు ఆశ్చర్యమున మునిగిపోయిరి . తెల్లవారిని పిదప గంధర్వులు ,అప్సరసలు ,నదులు మున్నగు వారందరూ భారద్వాజముని అనుమతి పొంది తమతమ వాసములకు వెడలిపోయిరి . తెల్లవారినప్పటికీ మదిరాపానము చేసినవారి మత్తు వీడలేదు . వారి శరీరములకు అంటుకొని వున్న దివ్యమైన అగ్రుచందన లేపనములు అట్లేవున్నవి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియొకటవసర్గ సమాప్తము . 


                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Saturday 4 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదియవసర్గ

                                     రామాయణము 

                                    అయోధ్యకాండ -తొంబదియవసర్గ 

రాకుమారుడైన భరతుడు దూరమునుండే భరద్వాజాశ్రమమును చూచి తన బలములను అచటనే నిలిపి శస్త్రములను ,ఆభరణములు విడిచి పట్టు వస్త్రములు ధరించేను . పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుచుతుండగా భరతుడు మంత్రులతో కూడి కాళీ నడకతో భరద్వాజాశ్రమమును చేరెను . ఆశ్రమము వద్దకు చేరిన పిమ్మట మంత్రులను అచటనే నిలిపి వశిష్టుని వెంట ఆశ్రమములోకి నడిచెను . 
భారద్వాజముని వశిష్టుని చూసి వారికి ఎదురేగి అతిధి సత్కారములు చేసెను . భరతుడు వినమ్రుడై తన ప్రవరాలను తెలుపుతూ మునికి నమస్కరించెను . పిదప ముని భరతుని ఎరిగి "రాజ్యాధికారం నీవు ఇటు వచ్చుటకు కారణమేమి ?"అని ప్రశ్నించెను . అప్పుడు భరతుడు జరిగినదానిలో తన ప్రమేయము లేదని వివరించెను . శ్రీరాముని తిరిగి తీసుకువచ్చుటకు వచ్చితినని చెప్పగా భరద్వాజుడు సంతోషించి భరతుని ఆశీర్వదించెను . పిమ్మట ఆ ముని సీతారాంలక్ష్మణులు చిత్రకూట మహా పర్వతమున వశించుచున్నారని తెలిపెను . వారిని ఆ రోజు అచట విశ్రమించి మరునాడు బయలుదేరి శ్రీరాముని వద్దకు వెళ్ళాలలిసినదిగా కోరెను . భరతుడు "ఓ మునీశ్వరా !మీ ఆజ్ఞను శిరాశావహింతును "అని పలికి ఆ రాత్రికి ఆ ఆశ్రమము నందే గడుపుటకు నిశ్చయించినేను . 

రామాయణము అయోధ్యకాండ తొంబదియవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Friday 3 February 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది తొమ్మిదవసర్గ

                                                    రామాయణము 

                                             అయోధ్యకాండ -ఎనుబది తొమ్మిదవసర్గ 

అన్నను దర్శించవలెననే కోరికతో భరత శత్రుఘ్నులు ప్రాతః కాలమునే మేల్కొనెను . గుహుడు సైతము ప్రాతః కాలమునే వారి చెంతకు వచ్చెను . భరతుడు గుహుని నది దాటుటకు ఏర్పాట్లు చేయమని కోరగా గుహుడు గంగా నదిని దాటుటకు 500 నావలను ,స్వస్తికము (స్వస్తిక్ గుర్తు కలిగినవి )అను పేరు కల కొన్ని నవలను గంగా నదీ తీరమున నిల్పెను . భరతశత్రుఘ్నులు బ్ర్రాహ్మణోత్తములు ,మునులు ముందుగా నావపైకెక్కినారు . పిదప కౌశాల్యసుమిత్రకైకేయిలు నావపైకెక్కిరి . మిగిలిన సైనికులు ,జనములు తాము విశ్రమించిన గుడారములకు నిప్పుపెట్టి (శత్రువులకు తమ జాడ తెలియకుండుట కొరకు నిప్పు పెట్టుట ఆనవాయితి . అటుల చేసిన తమకు విజయము కలుగుతుందని  భావించెడివారు )తమతమ వస్తువులను నావపైకి చేర్చిరి . కొన్ని నావలలో అశ్వములు ,రథములు ,విలువైన ఆభరణములు చేర్చబడినవి . గజములు మావటివాడి అదిలింపులతో నదిని దాటినవి . కొంతమంది సైన్యము గజములమీద కొంతమంది నావలపై తీరము దాటిరి . నావలు వారిని నదిని దాటించి మిగిలిన సైన్యము కొరకు వెనుతిరిగినవి . భరతశత్రుఘ్నులు నది దాటి భారద్వాజ ఆశ్రమం వైపు సాగెను . కొంత  వెళ్లిన పిమ్మట సైన్యమునకు విశ్రాంతి తీసుకోమని ఆదేశము ఇచ్చి వశిష్టాది మునులు ,మంత్రులతో కలసి భరతశత్రుఘ్నులు భరద్వాజాశ్రమమును దర్శించుటకై ముందుకు సాగి చూడముచ్చటగా ఉన్న పర్ణశాలలు ,ప్రకృతితో కూడిన భరద్వాజాశ్రమమునకు చేరిరి . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Thursday 2 February 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ

                                                    రామాయణము 

                                                    అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ 

గుహుడు పలికిన వచనములు అన్నిటిని భరతుడు సావధానంగా విని ,మంత్రులతో కూడి శ్రీరాముడు పరుండిన ఆ శయ్యను దర్శించి ,తల్లులతో "మా అన్న ఆ రోజు రాత్రి పరుండిన ప్రదేశము ఇదే ఇవి ఆయన శయనింపగా ఈ శయ్యపై ఏర్పడిన గుర్తులు . వాసిగాంచిన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడు ,మహానుభావుడు ,ప్రజ్ఞాశాలి . అట్టి ప్రభువుకు పుత్రుడైన శ్రీరాముడు ఈ కటిక నేలపై ఎట్లు పరుండెనో కదా ?రాజభవనంలో శ్రేష్టమైన మెత్తని శయ్యపై పరుండెడివాడు . కమ్మని సంగీతముతో ,శ్రావ్యములైన వీణావేణు నాదములతోడను ,పరిచారికల కాలిఅందెల రవళులచేత కారకంకణముల రవములచేత ఆభరణములు సవ్వడి చేత చెవులకింపైన మృదంగములలయ విన్యాసములతోడనుఆయన నిద్ర నుండి మేల్కొనెడివాడు . అతడు మేల్కొను సమయమున వందిగణములు స్తుతించుచుండెడివి . సూతులు మాగధలు సమయమునకు తగిన కధలను ,గాధలను వినిపించుచుండెడివారు . అట్టి సుఖ వైభవములలో ఓలలాడిన శ్రీరాముడు ఈ కటిక నేలపై పరుండుట ఎంత బాధాకరం . 

ఇక్కడ అక్కడక్కడా కొన్ని పట్టుదారములు చిక్కుకుని   మిలమిల మెరియుచున్నవి ఇవి సీతాదేవి అప్పుడు ధరించిన పట్టు ఉత్తరీయపు పోగులే అని స్పష్టమగుచున్నది . జనక మహారాజు ముద్దులపట్టి ,దశరధుని కోడలు ,శ్రీరాముని ప్రియపత్ని ,బాల ,సుకుమారి ,మహాసాధ్వి అయిన సీతాదేవికి ఈ శయ్యపై పరుండుట కష్టమనిపించి ఉండదు . ఏలననగా ఆమె మా అన్ననే తన ప్రాణముగా భావించును . 

వారిరువురు ఇలా దిక్కులేనివారు వలె ఇలా కష్టములు అనుభవించుటకు నేనే కారణము . ఛీ నా బ్రతుకు వ్యర్ధము . శ్రీ రాముని అడుగుజాడలలో నడుచు జానకిది ఎంత భాగ్యమో కదా !ఆయనను నిరంతరము సేవించు లక్ష్మణుని జన్మ ధన్యము . నేటి నుండి నేను కూడా నారా చీరలను ధరించెదను . కటిక నేలపై పరుండెదను . ఫలములు మొదలగు ఆహారమునే భుజించెదను . అన్నకు మారుగా నేను వనవాసము చేసెదను . నాకు తోడుగా శత్రుఘ్నుడు వనములకు వచ్చును . అన్నకు తోడుగా లక్ష్మణుడు రాజ్యములో ఉండును . అప్పుడు అన్న ప్రతిజ్ఞ నెరవేరును . ఒకవేళ అన్న మరలి వచ్చుటకు అంగీకరించనిచో నేనును ఆయనతో పాటు దీక్ష ముగియు వరకు వనములోనే యుందును . ఆ ప్రభువు నా కోరికను కాదనడు . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది ఏడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం.  ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 





 



Wednesday 1 February 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ

                                                   రామాయణము 

                                                 అయోధ్యకాండ -ఎనుబది ఏడవసర్గ 

శ్రీరాముడు జటాధారి అగుట ,నారచీరలు ధరఁచుట మొదలగు విషయములు విని ,భరతుడు తట్టుకొనలేక బిగ్గరగా ఏడవసాగెను . పక్కనే ఉన్న శత్రుఘ్నుడు భరతుని ఓదార్చుటకు యత్నించెను . ఏడ్పులు విని ముగ్గురు మాతలు అచటికి వచ్చిరి . కౌశల్య భరతుని దీన స్థితిని చూసి చలించిపోయి ,భరతుని అక్కున చేర్చుకుని ఏడవసాగెను . భరతునితో "నాయనా ఏమయినది ఎందుకిలా అయిపొతున్నావ్ ?ఈ సమస్త ఇక్ష్వాకు వంశమునకు నేవే దిక్కు . ఏమయినది ?మీ అన్న గురించి ఏమయినా అప్రియముగా విన్నావా ?"అని ప్రశ్నించెను . 
అప్పుడు భరతుడు తేరుకుని "అమ్మా !ఏమిలేదు మీరు కంగారు పడకండి నేను ఎట్టి అప్రియ పలుకులు వినలేదు "అని ఆవిడను ఓదార్చెను . పిదప భరతుడు అచటి నుండి బయటకు వచ్చి గుహునితో "ఓ నిషాద రాజా !మా అన్నా వదినలు ఏమి భుజించారు ?ఎక్కడ విశ్రమించారు ?నా మీద దయ ఉంచి తెలుపుడు అని పలుకగా ,గుహుడు తనకు అత్యంత ప్రియమైన శ్రీరాముని గురించి అడుగుటచే మిక్కిలి ఉత్సాహముతో 
"భరతా !రామ ఆగమన వార్త విని నేను అనేక ఫలములు ,తినుబండారములు ,రసములు ,తేనే మున్నగు అనేక పదార్థములను ఆయన చెంతకు తీసుకువెళ్లి శ్వీకరించమని కోరితిని . కానీ శ్రీరాముడు నేను క్షత్రియుడిని ఒకరికి ఇచ్చుట కానీ ఒకరినుండి తీసుకొనరాదు అని చెప్పి మమ్ములను ఒప్పించెను . లక్ష్మణుడు వారికై తెచ్చిన జలములు మాత్రమే తీసుకుని సీతారాములు ఆ రాత్రి ఉపవసించిరి . సీతారాములు తాగగా మిగిలిన నీటిని తాగి లక్ష్మణుడు ఆరోజు ఉపవసించెను . లక్ష్మణుడు స్వయముగా ఏర్పరిచిన దర్భ శయ్యపై సీతారాములు విశ్రమించిరి . ఇదిగో ఇక్కడే ఆ రోజు సీతారాములు విశ్రమించారు . వారు విశ్రమించిన పిదప లక్ష్మణుడు విశ్రమించక వారిని జాగరూపుడై రక్షించెను . నేనును ధనుర్భాణములు ధరించి లక్ష్మణునితో పాటు జాగరూకుడనై ఉంటిని . నా సైన్యము సైతము ఆ రాత్రి మాతో పాటు ఉండెను .  "అని గుహుడు భరతునికి ఆ ఆయా ప్రదేశములను చూపించెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదియేడవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అయోధ్యకాండ -------------ఎనుబదిఆరవసర్గ

                                               రామాయణము 

                                     అయోధ్యకాండ -------------ఎనుబదిఆరవసర్గ 

గుహుడు లక్ష్మణుని గూర్చి భరతునితో "వారు ఇచటికి వచ్చినపుడు   రాత్రి లక్ష్మణుడు ధనుర్భాణములు ధరించి సీతారాములను రక్షించుటకై  జాగరూకుడై ఉండెను . అపుడు నేను లక్ష్మణుని వద్దకు వెళ్లి నేను   ఈ అడవీ ప్రాంతాలన్నీ బాగుగా ఎరుగుదును . నీవు విశ్రమించుము . నేను జాగరూకుడై రక్షించెదను . అని పలుకగా అప్పుడు లక్ష్మణుడు మా అన్న ,వదినలు నేలపై పరుండుట చూస్తుంటే నిద్ర ఎలా వస్తుంది ?ఆకలి దప్పుడు ఉంటాయా ?మా తండ్రి దశరథ మహారాజు శ్రీరాముడు దూరమైన కారణముచేత ఎక్కువ కాలము జీవించి ఉండడు . భరత శత్రుఘ్నులు వారికి ఉత్తర క్రియలు నెరవేర్చెదరు . వారెంత అదృష్టవంతులో కదా !అంతః పుర స్త్రీలు ఏడ్చి ఏడ్చి ఏడుపు రాక మౌనముగా వుండివుంటారు . శ్రీరాముడు వనవాసము ముగించుకొని అయోధ్యకు వెళ్లునప్పుడు నేను ఆయనతో కూడి వెళ్లగలనో లేదో అని పలికెను . మేము ఆ విధముగా మాట్లాడుకొనుచుండగానే తెల్లవారెను . పిదప వారు మఱ్ఱి పాలతో జడలను ధరించి ధనుర్భాణములు ధరించి సీతతో కూడి గంగను దాటి సావధానులై ముందుకు సాగిరి ". అని చెప్పెను . 

 రామాయణము అయోధ్యకాండ ఎనుబదిఆరవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .