Tuesday 21 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూట ఆరవసర్గ

                                                   రామాయణము 

                                                అయోధ్యకాండ -నూట ఆరవసర్గ 

శ్రీరాముడు  ఈ విధముగా పలికిన పిమ్మట భరతుడు "అన్నా !నీవు దుఃఖములకు కృంగిపోవు ,సంతోషములకు పొంగిపోవు . ఓ రఘువరా !నీవు దేవతలవలె సత్వగుణ సంపన్నుడవు . మిగుల దైర్యశాలివి ,సత్యసంధుడవు ,సర్వజ్ఞుడవు ప్రతిభాశాలివి జనన మరణ రహస్యములు బాగుగా ఎరిగినవాడివి . ఇట్టి ఉదాత్త గుణసంపన్నుడయిన నీవు ఎట్టి బాధలకు చలించవు . 
నేను పరదేశమున ఉండగా అల్పజ్ఞురాలయిన నా తల్లి నా నిమిత్తమై ఈ పాపకార్యములకు ఒడిగట్టేను . ఇది నాకు ఎంతమాత్రము సమ్మతము కాదు . తల్లి ఎంతటి దుష్టురాలైనను ఆమెను చంపుట ధర్మముకాదు . కావుననే మహాపరాధము చేసిన మాతల్లి మరణదండనకు అర్హురాలే అయినను నేను ఆ శిక్ష విధించలేదు . కనుక ఆమెను క్షమించి నా యెడ ప్రసన్నుడవుకమ్ము . 
మన తండ్రి ఎన్నో యజ్ఞయాగములు చేసినవాడు . ధర్మాధర్మములు బాగుగా ఎరిగినవాడు . అటుల ఎటువంటివాడైనను ఒక స్త్రీని సంతృప్తి పరుచుటకు ధర్మాధర్మములకు విరుద్ధముగా ఇంతటి పాపకార్యములకు ఒడిగట్టునా ?మన తండ్రి ఆ సమయాభావములకు లోనై అటుల ప్రవర్తించివుండవచ్చును .  లోక హితము కోరి ఆయన దోషమును నీవు సవరింపవచ్చును కదా !నన్ను తల్లులను ,జనులను పురోహితులను కాపాడుటకు నీవే సర్వసమర్థుడవు . ఓ రామా !నీకు శిరసా ప్రణమిల్లుచున్నాను . నన్ను అనుగ్రహించుము "అని ఎంతో దీనంగా భరతుడు ప్రార్ధించినప్పటికీ శ్రీరాముడు అయోధ్యకు మరలి వెళ్ళుటకు అంగీకరించలేదు . అతడు తండ్రి ఆదేశమునకే కట్టుబడివుండెను . 
శ్రీరాముడి ఆత్మస్తైర్యము చూసి అచటి జనులకు ఒకేసారి సంతోషము ,బాధ కలిగెను . ఋత్విజులు ,పురప్రముఖులు ,గణనాయకులు నిస్పృహతో కన్నీరు కార్చుచు శ్రీరామునికి ప్రణమిల్లి అయోధ్యకు వచ్చి పాలించమని అభ్యర్ధించిరి . తల్లులు ఏడుస్తూ నిలబడిరి . 

రామాయణము అయోధ్యకాండ నూట ఆరవసర్గ సమాప్తము . 


                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment