Friday 17 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూటనాల్గవసర్గ

                                                రామాయణము 

                                      అయోధ్యకాండ -నూటనాల్గవసర్గ 

సోదరుడగు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు తనకు అత్యంత ప్రేమాస్పదుడు ,తనయందు భక్తిశ్రద్ధలు కలవాడు అయిన భరతుని ప్రియవచనములతో ఓదార్చుచు "నాయనా !భరతా !నీవు రాజ్యము వీడి కృష్ణాజినము ,వల్కలములు ధరించి ఇటు వచ్చితివేమి ?"అని ప్రశ్నించెను . 
అప్పుడు భరతుడు "ఓ పూజ్యుడా !మహాబాహువైన మన తండ్రి ఒక స్త్రీ కారణముగా నిన్ను అడవులకు పంపి నీ ఎడబాటును తట్టుకొనలేక మరణించెను . ఆయన భార్య ,నా తల్లి అగు ఈ కైకేయి ప్రోద్భలంతో ఈ పని చేసినాడు . ఈ పాపకార్యము ఆయన కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయునది . నా తల్లికి ఆమె ఆశించిన రీతిగా రాజ్యలాభము దక్కలేదు సరికదా తీరని వైధవ్యము ప్రాప్తించినది . ఫలితముగా శోకమున కృంగిపోవుచున్నది . ఈ కారణముగా ఆమె ఘోర నరకమునకు పోవుట తధ్యము . 
నాకు ఆమె ఆలోచనలతో కానీ ఆమె దుర్భుద్ధితో కానీ సంభందం లేదు . అన్నా !నీ దాసుడనై ఇచటికి విచ్చేసితిని . నన్ను అనుగ్రహించి కోశల రాజ్యమునకు పట్టాభిషిక్తుడవుకమ్ము . జ్యేష్ఠుడవు అయినకారణముగా రాజ్యపాలనకు నీవే అర్హుడవు . మన తల్లులు ,గురువులు ,మంత్రులు ,జనులు సమస్తులు ఇదే ఉద్దేశ్యముతో ఇచటకు వచ్చినారు . కావున మా అందరి అభ్యర్ధనను మన్నించి రాజ్యమును పాలించి మమ్ము అనుగ్రహించుము . "అని దోసిలి ఒగ్గి వినయముగా ప్రార్ధించి నిలబడెను . 

అప్పుడు శ్రీరాముడు "ఓ భరతా !ఉత్తమ వంశమున పుట్టినవాడవు . సత్ప్రవర్తన కలవాడివి నీకెటువంటి దుర్భుద్ధి కలదని నేననుకోను . నీ తల్లిని సైతము నిందింపకుము . ఓ భరతా !ధర్మశీలురైన తల్లి తండ్రి ఇద్దరు నన్ను వనములకు వెళ్ళమని ఆజ్ఞాపించిరి . వారి ఆజ్ఞను కాదని నేను మరియొకవిధముగా ఎట్లు చేయగలను . ?లోకకళ్యాణార్ధము నీవు అయోధ్యలో ఉండి రాజ్యమును పాలించుము . తండ్రి ఇచ్చిన ఆఙ్ఞయే నాకు పరమ హితము "అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ నూటనాల్గవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment