Tuesday 28 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబది ఎనిమిదవసర్గ

                           రామాయణము 

                         యుద్ధకాండ -ఎనుబది ఎనిమిదవసర్గ 

విభీషణుడి మాటలు వినినంతనే ఇంద్రజిత్తు మిక్కిలి కోపోద్రిక్తుడయ్యెను . పిమ్మట అతడు పరుషముగా మాట్లాడుతూ ,ఎగిసిపడుతూ ముందుకు వచ్చెను . ఆ రావణ సుతుని రధము చక్కగా అలంకృతమై ఉండెను . పిమ్మట గర్వితుడై వున్న ఇంద్రజిత్తు లక్ష్మణుడిని ,విభీషణుడిని ,వానరశ్రేష్ఠులని ఉద్దేశించి "ఆకాశము నుండి పడు జడివానవలె సమరభూమి అందు నా ధనస్సు నుండి తిరుగులేని బాణ పరంపరను వర్షింపచేసెదను . నేను ప్రయోగించెడి శరములు  అగ్ని దూదికుప్పవలె మీ శరీరములను దహించి వేయగలవు . శరములతో వివిధరకముల ఆయుధములతో మిమ్ములను చీల్చి చెండాడి మృత్యుముఖమునకు పంపెదను . నా ముందు నిలవగల మొనగాడెవ్వడు ?ఓ లక్ష్మణా !ఇదివరకే నా బాణము దెబ్బ తిని తృటిలో మృత్యువును తప్పించుకుంటివి . ఇప్పుడు మరల యుద్ధము చేయుటకు వచ్చితివి . నీకు యమసధనమునకు చేరవలెనని కోరికగా వున్నట్టుగా ఉన్నది . "అని పలికెను . 
ఇంద్రజిత్తు పోలికేకలు విన్న లక్ష్మణుడు అతడితో "శత్రువులను యమసధనమునకు పంపుట అనే కార్యములో నీవు ఇంతకు మునుపే నీవు విఫలమయినావు . వ్యర్థముగా ఎందుకు మాట్లాడెదవు .ఆనాడు కనపడకుండా పిరికిపందలా దాక్కుని యుద్ధము చేసితివి . అది దొంగల పద్దతి . నిజముగా వీరుడైనవాడు బయపడి దాగుకొనడు . నీరు ప్రతాపమును ఇప్పుడు చూపించు "అని పలికెను . 
అప్పుడు ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధము మొదలయినది . లక్ష్మణుడు ఇంద్రజిత్తుని అయిదు బలమైన బాణములతో కొట్టెను . ఇంద్రజిత్తు మూడు బాణములతో లక్ష్మణుడిని దెబ్బతీసేను . నరరాక్షసశ్రేష్ఠులైన వారిరువురు సమరభూమి అందు స్థిరముగా నిలిచి అనేక రకములగు శరములను ప్రయోగించుచు ,అత్యుత్సాహముతో యుద్ధము చేసిరి . వారిరువురు ఇంద్రశంబరాసురలును తలపింపచేయుచు తీవ్రముగా యుద్ధము చేయుచుండిరి . 

           రామాయణము యుద్ధకాండ ఎనుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Tuesday 21 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబదియేడవసర్గ

                                  రామాయణము 

                                  యుద్ధకాండ -ఎనుబదియేడవసర్గ 

విభీషణుడి మాటలు విన్న లక్ష్మణుడు విభీషణుడు చూపించే మార్గములో ,ఇంద్రజిత్తు వున్న ప్రదేశమునకు చేరెను . అక్కడ లక్ష్మణుడు రథముపై అధిరోహించి వున్న ఇంద్రజిత్తుని స్పష్టముగా చూసేను . ఇంద్రజిత్తు కూడా లక్ష్మణుడిని ,విభీషణుడిని చూసేను . వెంటనే అతడు కోపముతో విభీషణుడిని నోటికి వచ్చినట్టు తిట్టెను . నమ్మకద్రోహి అని పలికెను . అప్పుడు విభీషణుడు" ధర్మము చెప్పినా వినిపించుకోకుండా అధర్మముగా ప్రవర్తించువారిని వదులుట నమ్మకద్రోహము కాదు . రావణుడు చేసిన అధర్మమును సమర్ధించుచున్న మీ అందరికి కూడా వీరులైన రామలక్ష్మణుల చేతిలో మరణము తప్పదు "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదియేడవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -ఎనుబదిఆరవసర్గ

                                    రామాయణము 

                                      యుద్ధకాండ -ఎనుబదిఆరవసర్గ 

నికుంబలా యాగము జరుగుతున్న ప్రదేశమునకు చేరిన పిమ్మట అక్కడ అపారంగా ఉన్న రాక్షస సైన్యముపైకి లక్ష్మణుడు విభీషణుడి సలహా ప్రకారము తన బాణముల వర్షమును కురిపించెను . లక్ష్మణుడి వెనక వున్న వానరసైన్యము కూడా రాక్షసవీరులతో తలపడసాగిరి . వానరుల దాటికి తట్టుకోలేక అనేక మంది రాక్షస వీరులు మరణించిరి . పెక్కుమంది గాయములపాలయ్యిరి . 
ఎదిరింప శక్యము కానీ తన సేన ,వానరభల్లూక సేన చేతిలో చావుదెబ్బ తినిన విషయము విన్న ఇంద్రజిత్తు వెంటనే హోమమకార్యము మాని లేచి రధమును అధిరోహించి యుద్ధమునకు బయలుదేరెను . యుద్ధరంగములో హనుమంతుడు తన సేనను చిత్తుచిత్తుగా కొట్టుట చూసి కోపముతో ఊగిపోతూ హనుమపై అనేక బాణములు ప్రయోగించెను . కానీ అవేమి హనుమను ఏమిచేయలేకపోయినవి . అది చూసిన విభీషణుడు ,ఇంద్రజిత్తుపై బాణప్రయోగము చేయమని లక్ష్మణుడికి చెప్పెను . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదిఆరవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Sunday 12 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబదియైదవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -ఎనుబదియైదవసర్గ 

శ్రీరాముడు శోకసముద్రములో మునిగి ఉన్నందువలన విభీషణుడు పలికిన పలుకులని శ్రీరాముడు సరిగ్గా వినలేకపోయెను . అప్పుడు శ్రీరాముడు  విభీషణుడితో "నీవు పలికిన పలుకులు మరొకసారి పలుకుము "అని పలికెను . అప్పుడు విభీషణుడు అంతకు ముందు చెప్పిన విషయములన్నియు మరలా వివరముగా చెప్పెను . ఇంకనూ విభీషణుడు "రామా !నీవు అనవసరముగా శోకములో మునిగివుండుట వలన వానరభల్లూకసైన్యములన్నియు శోకములో మునిగి నిస్సత్తువుగా వున్నవి . నీవు ఆ శోకమును వీడి ఉత్సాహము తెచ్చుకో . ఆ దుష్ట రాక్షసుడిని పరిమార్చి సీతామాతని విడిపించు కర్తవ్యము కొరకు ఇక్కడివరకు వచ్చినాము . ఆ విషయమును విస్మరించకు . 
రావణుని సుతుడైన ఇంద్రజిత్తు బ్రహ్మ కొరకు తపస్సు చేయగా అతడి తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకి రధము అధిరోహించినవారి మనసులో తలుచుకున్నట్టుగా పయనించు గుఱ్ఱములు కల రధమును ,బ్రహ్మశిరము అను అస్త్రము ఇచ్చెను . ఇంకనూ బ్రహ్మ ఇంద్రజిత్తుతో "నీవు నికుంబలా యాగము చేసి యుద్ధమునకు వెళ్ళినచో ,శత్రువుని జయించెదవు . కానీ నీవు నికుంబలా యాగము పూర్తి చేయక ముందే నీ శత్రువు ఆయుధము ధరించి నీతో యుద్ధము చేయనారంభించినచో అతడి చేతిలో నీకు చావు తప్పదు "అని వరములు ఇచ్చెను . ఇప్పుడు ఆ ఇంద్రజిత్తు యాగము పూర్తి చేయకముందే అతడితో యుద్ధము చేసి అతడిని సంహరించవలెను . అతడు మరణించినచో ఇక మనము ఈ యుద్ధములో  విజయము సాధించినట్టే "అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు శోకమును వీడి తిరిగి ఉత్సాహమును తెచ్చుకుని ,లక్ష్మణుడిని ఇంద్రజిత్తుపై యుద్ధమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించెను . అన్న ఆజ్ఞను అందుకున్న లక్ష్మణుడు ప్రముఖులైన వానర భల్లూకసేనతో ,విభీషణునితో కలిసి ఇంద్రజిత్తు వున్న ప్రదేశమునకు వెళ్లెను . అక్కడ అనేకులైన రాక్షసులు యుద్ధ సన్నద్ధులై ఉండిరి . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదియైదవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Saturday 11 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబదినాలుగవసర్గ

                                 రామాయణము 

                                యుద్ధకాండ -ఎనుబదినాలుగవసర్గ 

శ్రీరాముని లక్ష్మణుడు ఓదార్చుచుండగా విభీషణుడు అప్పుడే అక్కడికి వచ్చెను . అక్కడ వున్న వారందరి ముఖములు దీనంగా ఉండుట చూసిన విభీషణుడు విషయము తెలుసుకుని శ్రీరాముడితో "రామా !మా అన్న ఐన రావణుడి ఆంతర్యము నాకు తెలుసు అతడు సీతాదేవిని వధించడు . వానర వీరుల ఉత్సాహము నీరుకార్చుటకై తద్వారా యుద్ధమును గెలుచుటకై మాయావి ఐన ఇంద్రజిత్తు పన్నిన పన్నాగము ఇది . అతడు యుద్ధరంగమున హతమార్చింది నిజముగా సీతామాతను కాదు . మాయా సీతను మాత్రమే . మనలందరిని శోకములో ముంచి యుద్ధము గెలుచుటకై నికుంబలా యాగము చేయుటకు వెళ్ళినాడు . అతడు ఆ యాగము పూర్తి చేసినచో అతడిని గెలుచుట ఇంద్రాదులకు కూడా సాధ్యము కాదు కావున మనము ఇప్పుడే బయలుదేరి ఆ యాగము జరుగు ప్రదేశమునకు వెళ్లి ,ఆ యాగమునకు ఆటంకము కలిగించాలి . లక్ష్మణుని మాతో పంపు అతడి నిశిత శరములకు ఆ ఇంద్రజిత్తు యమలోక గతుడు అవుట తధ్యము "అని పలికేను . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదినాలుగవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
                         




రామాయణము యుద్ధకాండ -ఎనుబదిమూడవసర్గ

                                 రామాయణము 

                                       యుద్ధకాండ -ఎనుబదిమూడవసర్గ 

రాక్షసులు ,వానరులు చేసిన యుద్దకోలాహలము విన్న శ్రీరాముడు తన పక్కనే వున్న జాంబవంతుని వానరులకు సహాయముగా పంపెను . శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారము జాంబవంతుడు సేనతో యుద్ధము జరుగుతున్న ప్రదేశమునకు బయలుదేరెను . వారికి దారిలోనే వానరసేనతో పాటుగా హనుమంతుడు కనిపించెను . హనుమంతుడు జాంబవంతుని ఆపి తనతోపాటుగా శ్రీరాముడి వద్దకు తీసుకువచ్చెను . అప్పుడు హనుమ శ్రీరాముడితో దీనస్వరంతో "ప్రభూ !పరమదుర్మార్గుడైన రావణసుతుడు శోకించుచున్న జానకీ మాతను నేను చూస్తుండగానే యుద్ధరంగములో వధించినాడు "అని పలికెను 
ఆ మాటలు వినగానే శ్రీరాముడు మొదలు నరికిన మహా వృక్షము వలె నేలపై కూలిపోయెను . అప్పుడు వానరులందరూ కంగారుతో శ్రీరాముని చుట్టుముట్టిరి . నీరు తీసుకువచ్చి శ్రీరామునిపై  చిలకిరించిరి .స్పృహ లోకి వచ్చిన శ్రీరాముడు సోకసముద్రములో మునిగి కన్నీరుమున్నీరు అయ్యెను . ఆ సమయములో వానరులందరూ శోకముతో గొంతులు పూడిపోయి బొమ్మలులా నిలబడి ఉండిరి . అప్పుడు శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడు తానూ ధైర్యము తెచ్చుకుని ,శ్రీరాముని ఓదార్చెను 

రామాయణము యుద్ధకాండ ఎనుబదిమూడవసర్గ సమాప్తము . 

                                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 

Friday 10 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబదిరెండవసర్గ

                               రామాయణము 

                                యుద్ధకాండ -ఎనుబదిరెండవసర్గ 

ఆ విధముగా యుద్ధరంగమున వెనుతిరిగి పారిపోవుచున్న వానరవీరులను చూసిన హనుమ వారిని ఆఫై వారికి ఉత్సాహము కలిగించి యుద్ధరంగమునకు వచ్చెను . ఇంద్రజిత్తుపై విపరీతమైన కోపముతో వున్న వానరవీరులందరూ తమ యావత్ శక్తితో కసి తీరా యుద్ధము చేయసాగిరి . ఆ విధముగా కసితో యుద్ధము చేయుచున్న వానరుల దాటికి రాక్షసులు తట్టుకొనలేకపోయిరి . చాలా మంది రాక్షసులు మరణించిరి . 
పిదప వానరవీరులందరితో కలిసి ,హనుమ శ్రీరామునికి జానకీ దేవిని ఇంద్రజిత్తు హతమార్చిన విషయము తెలుపుటకై శ్రీరాముడు వున్నా చోటికి బయలుదేరివెళ్లెను . వారు శ్రీరాముడి దగ్గరకు వెళ్ళుట చూసిన ఇంద్రజిత్తు నికుంబలా యాగము చేయదలచి లంకలోకి వెళ్లిపోయెను . నీకుంబలా  యాగమునకు కావలసిన ఏర్పాట్లు చేయించి విధివిధానంగా యాగము చేయనారంభించెను . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదిరెండవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ - ఎనుబదియొకటవసర్గ

                                రామాయణము 

                             యుద్ధకాండ - ఎనుబదియొకటవసర్గ 

శ్రీరాముని మనోబలమును చూసిన ఇంద్రజిత్తు మయా యుద్దమువలన శ్రీరాముని జయించలేనని గ్రహించి ,కపటోపాయము ద్వారా శ్రీరాముని మనోబలమును దెబ్బతీసి తద్వారా యుద్ధమును గెలవలెననే ఆలోచనతో యుద్ధరంగమునుండి లంకా నగరంలోకి ప్రవేశించెను . తన రాక్షస మాయతో అచ్చముగా సీతాదేవిలా వుండే ఒక స్త్రీ ని సృష్టించి ,ఆమెను తన రధము పై ఎక్కించుకుని యుద్ధరంగమునకు వచ్చెను . అంతకుముందు వరకు కనపడకుండా మాయా యుద్ధము చేసిన ఇంద్రజిత్తు కళ్లకు కనపడుతుండటంతో వానరులంతా కోపముతో పెద్దగా అరుస్తూ అతడిపై దాడి చేయుటకు రాళ్లను ,చెట్లను ఆయుధములుగా తీసుకుని ఇంద్రజిత్తు వైపుగా పరుగిడి రాసాగిరి . హనుమంతుడు కూడా ఒక పెద్ద పర్వతమును చేతబూని ఇంద్రజిత్తుపైకి యుద్ధమునకు పరుగిడెను . 
అలా ఇంద్రజిత్తును హతమార్చుటకు గట్టిపూనికతో పరుగెడుతున్న హనుమ ఇంద్రజిత్తు రథముపై కల సీతాదేవిని చూసి ,ఆమె సీతాదేవే అని నిర్దారించుకుని అక్కడే నిలబడిపోయెను . మిగిలిన వానరులకు కూడా ఆమె సీతాదేవి అని హనుమ చెప్పెను . అప్పుడు ఇంద్రజిత్తు వానరులందరూ చూచుచుండగా సీతాదేవిని కొట్టసాగెను . ఆమె ఆర్తనాదములు చేయసాగెను . అది చూసిన వానరులంతా బాధతో అదే సమయములో కోపముతో ఊగిపోయిరి . అప్పుడు హనుమ ఇంద్రజిత్తుతో "ఓరి దుష్ట రాక్షసా !నీ రాక్షసత్వము పరాకాష్టకు చేరుకున్నది . నీవు మరణించు సమయము ఆసన్నమయినది అనుకుంటా . అందుకే ఇటువంటి హేయమైన పనికి పూనుకున్నావు . నిజముగా వీరుడైనవాడు స్త్రీని హింసించడు . నీవు చేయుచున్న తప్పునకు ప్రతిఫలంగా నీ ప్రాణములను త్వరలోనే మా చేతిలో వదలబోవుచున్నావు . "అని పలికెను . 
ఆ మాటలు విన్న ఇంద్రజిత్తు హనుమతో "ఓరి పిచ్చి వానరా !మీరందరూ ఈమె కోసమే కదా ఇంత కష్టపడి సముద్రమును దాటిమరీ వచ్చి యుద్ధము చేయుచున్నారు . నేను ఇప్పుడు ఈమెను చంపివేసెదను . అప్పుడు మీ కష్టమంతా వృధా అవుతుంది . ఆ తర్వాత నేను రామలక్ష్మణులను ,సుగ్రీవుడిని కూడా అవలీలగా వధించెదను . అడ్డువచ్చిన వానరులను కూడా నామరూపములు లేకుండా చేసెదను . ఈమెను హింసించుట ద్వారా చంపుట ద్వారా నా శత్రువులైన మీకు బాధ కలుగును . అదే నాకు సంతోషమును కలిగించును "అని పలికి ఇంద్రజిత్తు వానరులందరూ చూస్తూ ఉండగా మాయాసీతను తన ఖడ్గమునకు బలి ఇచ్చెను . పిదప ఇంద్రజిత్తు వానరులతో "వానరులారా !చూడండి . మీ సీతమ్మను . నా ఖడ్గమునకు బలి అయ్యి ,రెండుముక్కలుగా యుద్ధ భూమిలో పడిపోయినది "అని పలికి వికటాట్టహాసము చేసెను . అది చూసిన వానరులు అందరూ భయముతో బాధతో కాళ్ళు వణుకుతూ ఉండగా పెద్దగా రోదనలు చేస్తూ వెనుతిరిగి పరుగిడిరి . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదియొకటవసర్గ సమాప్తము . 

                                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









 

Thursday 9 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనబదియవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -ఎనబదియవసర్గ 

మకరాక్షుడు యుద్దములో మరణించిన విషయము తెలుసుకున్న రావణుడు తన కుమారుడైన ఇంద్రజిత్తు ని పిలిపించి ,యుద్ధమునకు వెళ్ళమని ఆజ్ఞాపించెను . తండ్రి ఆజ్ఞాపించిన వెంటనే ,అగ్నికి ఆహుతులు సమర్పించి ,అగ్నికి ప్రదక్షణపూర్వకముగా నమస్కారము చేసి ,రధమును అధిరోహించి ,ఇంద్రజిత్తు యుద్ధరంగమునకు బయలుదేరెను . 
యుద్ధరంగమున ఇంద్రజిత్తు ఎవ్వరికిని కనపడకుండా యుద్ధముచేయసాగెను . ఆ సమయములో ఇంద్రజిత్తు  గుర్రపుగిట్టల చప్పుడు కూడా ఎవ్వరికి వినపడకుండా ఉండెను . ఇంద్రజిత్తు ఆకాశములో ఉండి ,వానరులపై ,రామలక్ష్మణులపై బాణములను వర్షములా కురిపించసాగేను . కానీ అతడుకానీ అతడి రథముకాని ఎవ్వరికి కనపడకుండెను .  ఆ బాణముల దాటికి వానరయోధులు పెక్కుమంది మరణించిరి . అనేకమంది గాయములపాలయ్యిరి . రామలక్ష్మణులు బాణములు వచ్చుచున్న దిశవైపుగా బాణములు వేయసాగిరి . ఏ వైపునుండి బాణములు వచ్చుచున్న వారు జాగ్రత్తగా పరిశీలించుచు ,బాణములను మధ్యలోనే త్రుంచివేయసాగిరి . 
అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడితో "అన్నా !ఈ ఇంద్రజిత్తు కపటోపాయముతో ,కనపడకుండా యుద్ధముచేయుచున్నాడు . కనుక ఇతడిని బ్రహ్మాస్త్రము ప్రయోగించి అంతమొందించెదను "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో "నాయనా !లక్ష్మణా !యుద్ధరంగములో భయముతో దాగుకొనినవాడిపై  ,పారిపోవువాడిపై , శరణుకోరిన వాడిపై అస్త్రశస్త్ర ప్రయోగము చేయరాదు . ఈ ఇంద్రజిత్తు మనతో ఎదురుగా నిలబడి యుద్ధముచేయు దైర్యములేక ,దాగుకొని యుద్ధముచేయుచున్నాడు . కావున మనము సాధారణ అస్త్రశస్త్రములనే ప్రయోగించి అతడిని ఎదుర్కొందాము . అదియును కాక ఈ ఒక్క రాక్షసుడు చేసిన తప్పిదమునకు యావత్ రాక్షసులందరిని వధించుట సరియైనది కాదు (బ్రహ్మాస్త్ర ప్రభావమున అది ప్రయోగించబడిన చోట ఉన్నవారందరూ మరణించెదరు " "అని పలికెను 

రామాయణము యుద్ధకాండ ఎనబదియవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .