Sunday 12 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబదియైదవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -ఎనుబదియైదవసర్గ 

శ్రీరాముడు శోకసముద్రములో మునిగి ఉన్నందువలన విభీషణుడు పలికిన పలుకులని శ్రీరాముడు సరిగ్గా వినలేకపోయెను . అప్పుడు శ్రీరాముడు  విభీషణుడితో "నీవు పలికిన పలుకులు మరొకసారి పలుకుము "అని పలికెను . అప్పుడు విభీషణుడు అంతకు ముందు చెప్పిన విషయములన్నియు మరలా వివరముగా చెప్పెను . ఇంకనూ విభీషణుడు "రామా !నీవు అనవసరముగా శోకములో మునిగివుండుట వలన వానరభల్లూకసైన్యములన్నియు శోకములో మునిగి నిస్సత్తువుగా వున్నవి . నీవు ఆ శోకమును వీడి ఉత్సాహము తెచ్చుకో . ఆ దుష్ట రాక్షసుడిని పరిమార్చి సీతామాతని విడిపించు కర్తవ్యము కొరకు ఇక్కడివరకు వచ్చినాము . ఆ విషయమును విస్మరించకు . 
రావణుని సుతుడైన ఇంద్రజిత్తు బ్రహ్మ కొరకు తపస్సు చేయగా అతడి తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకి రధము అధిరోహించినవారి మనసులో తలుచుకున్నట్టుగా పయనించు గుఱ్ఱములు కల రధమును ,బ్రహ్మశిరము అను అస్త్రము ఇచ్చెను . ఇంకనూ బ్రహ్మ ఇంద్రజిత్తుతో "నీవు నికుంబలా యాగము చేసి యుద్ధమునకు వెళ్ళినచో ,శత్రువుని జయించెదవు . కానీ నీవు నికుంబలా యాగము పూర్తి చేయక ముందే నీ శత్రువు ఆయుధము ధరించి నీతో యుద్ధము చేయనారంభించినచో అతడి చేతిలో నీకు చావు తప్పదు "అని వరములు ఇచ్చెను . ఇప్పుడు ఆ ఇంద్రజిత్తు యాగము పూర్తి చేయకముందే అతడితో యుద్ధము చేసి అతడిని సంహరించవలెను . అతడు మరణించినచో ఇక మనము ఈ యుద్ధములో  విజయము సాధించినట్టే "అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు శోకమును వీడి తిరిగి ఉత్సాహమును తెచ్చుకుని ,లక్ష్మణుడిని ఇంద్రజిత్తుపై యుద్ధమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించెను . అన్న ఆజ్ఞను అందుకున్న లక్ష్మణుడు ప్రముఖులైన వానర భల్లూకసేనతో ,విభీషణునితో కలిసి ఇంద్రజిత్తు వున్న ప్రదేశమునకు వెళ్లెను . అక్కడ అనేకులైన రాక్షసులు యుద్ధ సన్నద్ధులై ఉండిరి . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదియైదవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment