Thursday 9 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనబదియవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -ఎనబదియవసర్గ 

మకరాక్షుడు యుద్దములో మరణించిన విషయము తెలుసుకున్న రావణుడు తన కుమారుడైన ఇంద్రజిత్తు ని పిలిపించి ,యుద్ధమునకు వెళ్ళమని ఆజ్ఞాపించెను . తండ్రి ఆజ్ఞాపించిన వెంటనే ,అగ్నికి ఆహుతులు సమర్పించి ,అగ్నికి ప్రదక్షణపూర్వకముగా నమస్కారము చేసి ,రధమును అధిరోహించి ,ఇంద్రజిత్తు యుద్ధరంగమునకు బయలుదేరెను . 
యుద్ధరంగమున ఇంద్రజిత్తు ఎవ్వరికిని కనపడకుండా యుద్ధముచేయసాగెను . ఆ సమయములో ఇంద్రజిత్తు  గుర్రపుగిట్టల చప్పుడు కూడా ఎవ్వరికి వినపడకుండా ఉండెను . ఇంద్రజిత్తు ఆకాశములో ఉండి ,వానరులపై ,రామలక్ష్మణులపై బాణములను వర్షములా కురిపించసాగేను . కానీ అతడుకానీ అతడి రథముకాని ఎవ్వరికి కనపడకుండెను .  ఆ బాణముల దాటికి వానరయోధులు పెక్కుమంది మరణించిరి . అనేకమంది గాయములపాలయ్యిరి . రామలక్ష్మణులు బాణములు వచ్చుచున్న దిశవైపుగా బాణములు వేయసాగిరి . ఏ వైపునుండి బాణములు వచ్చుచున్న వారు జాగ్రత్తగా పరిశీలించుచు ,బాణములను మధ్యలోనే త్రుంచివేయసాగిరి . 
అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడితో "అన్నా !ఈ ఇంద్రజిత్తు కపటోపాయముతో ,కనపడకుండా యుద్ధముచేయుచున్నాడు . కనుక ఇతడిని బ్రహ్మాస్త్రము ప్రయోగించి అంతమొందించెదను "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో "నాయనా !లక్ష్మణా !యుద్ధరంగములో భయముతో దాగుకొనినవాడిపై  ,పారిపోవువాడిపై , శరణుకోరిన వాడిపై అస్త్రశస్త్ర ప్రయోగము చేయరాదు . ఈ ఇంద్రజిత్తు మనతో ఎదురుగా నిలబడి యుద్ధముచేయు దైర్యములేక ,దాగుకొని యుద్ధముచేయుచున్నాడు . కావున మనము సాధారణ అస్త్రశస్త్రములనే ప్రయోగించి అతడిని ఎదుర్కొందాము . అదియును కాక ఈ ఒక్క రాక్షసుడు చేసిన తప్పిదమునకు యావత్ రాక్షసులందరిని వధించుట సరియైనది కాదు (బ్రహ్మాస్త్ర ప్రభావమున అది ప్రయోగించబడిన చోట ఉన్నవారందరూ మరణించెదరు " "అని పలికెను 

రామాయణము యుద్ధకాండ ఎనబదియవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment