Friday 10 January 2020

రామాయణము యుద్ధకాండ - ఎనుబదియొకటవసర్గ

                                రామాయణము 

                             యుద్ధకాండ - ఎనుబదియొకటవసర్గ 

శ్రీరాముని మనోబలమును చూసిన ఇంద్రజిత్తు మయా యుద్దమువలన శ్రీరాముని జయించలేనని గ్రహించి ,కపటోపాయము ద్వారా శ్రీరాముని మనోబలమును దెబ్బతీసి తద్వారా యుద్ధమును గెలవలెననే ఆలోచనతో యుద్ధరంగమునుండి లంకా నగరంలోకి ప్రవేశించెను . తన రాక్షస మాయతో అచ్చముగా సీతాదేవిలా వుండే ఒక స్త్రీ ని సృష్టించి ,ఆమెను తన రధము పై ఎక్కించుకుని యుద్ధరంగమునకు వచ్చెను . అంతకుముందు వరకు కనపడకుండా మాయా యుద్ధము చేసిన ఇంద్రజిత్తు కళ్లకు కనపడుతుండటంతో వానరులంతా కోపముతో పెద్దగా అరుస్తూ అతడిపై దాడి చేయుటకు రాళ్లను ,చెట్లను ఆయుధములుగా తీసుకుని ఇంద్రజిత్తు వైపుగా పరుగిడి రాసాగిరి . హనుమంతుడు కూడా ఒక పెద్ద పర్వతమును చేతబూని ఇంద్రజిత్తుపైకి యుద్ధమునకు పరుగిడెను . 
అలా ఇంద్రజిత్తును హతమార్చుటకు గట్టిపూనికతో పరుగెడుతున్న హనుమ ఇంద్రజిత్తు రథముపై కల సీతాదేవిని చూసి ,ఆమె సీతాదేవే అని నిర్దారించుకుని అక్కడే నిలబడిపోయెను . మిగిలిన వానరులకు కూడా ఆమె సీతాదేవి అని హనుమ చెప్పెను . అప్పుడు ఇంద్రజిత్తు వానరులందరూ చూచుచుండగా సీతాదేవిని కొట్టసాగెను . ఆమె ఆర్తనాదములు చేయసాగెను . అది చూసిన వానరులంతా బాధతో అదే సమయములో కోపముతో ఊగిపోయిరి . అప్పుడు హనుమ ఇంద్రజిత్తుతో "ఓరి దుష్ట రాక్షసా !నీ రాక్షసత్వము పరాకాష్టకు చేరుకున్నది . నీవు మరణించు సమయము ఆసన్నమయినది అనుకుంటా . అందుకే ఇటువంటి హేయమైన పనికి పూనుకున్నావు . నిజముగా వీరుడైనవాడు స్త్రీని హింసించడు . నీవు చేయుచున్న తప్పునకు ప్రతిఫలంగా నీ ప్రాణములను త్వరలోనే మా చేతిలో వదలబోవుచున్నావు . "అని పలికెను . 
ఆ మాటలు విన్న ఇంద్రజిత్తు హనుమతో "ఓరి పిచ్చి వానరా !మీరందరూ ఈమె కోసమే కదా ఇంత కష్టపడి సముద్రమును దాటిమరీ వచ్చి యుద్ధము చేయుచున్నారు . నేను ఇప్పుడు ఈమెను చంపివేసెదను . అప్పుడు మీ కష్టమంతా వృధా అవుతుంది . ఆ తర్వాత నేను రామలక్ష్మణులను ,సుగ్రీవుడిని కూడా అవలీలగా వధించెదను . అడ్డువచ్చిన వానరులను కూడా నామరూపములు లేకుండా చేసెదను . ఈమెను హింసించుట ద్వారా చంపుట ద్వారా నా శత్రువులైన మీకు బాధ కలుగును . అదే నాకు సంతోషమును కలిగించును "అని పలికి ఇంద్రజిత్తు వానరులందరూ చూస్తూ ఉండగా మాయాసీతను తన ఖడ్గమునకు బలి ఇచ్చెను . పిదప ఇంద్రజిత్తు వానరులతో "వానరులారా !చూడండి . మీ సీతమ్మను . నా ఖడ్గమునకు బలి అయ్యి ,రెండుముక్కలుగా యుద్ధ భూమిలో పడిపోయినది "అని పలికి వికటాట్టహాసము చేసెను . అది చూసిన వానరులు అందరూ భయముతో బాధతో కాళ్ళు వణుకుతూ ఉండగా పెద్దగా రోదనలు చేస్తూ వెనుతిరిగి పరుగిడిరి . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదియొకటవసర్గ సమాప్తము . 

                                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









 

No comments:

Post a Comment