Saturday 1 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదియవసర్గ

                             రామాయణము 

                       యుద్ధకాండ -తొంబదియవసర్గ                           

విభీషణుడు లక్ష్మణుడి వద్దకు తన అనుచరులతో సహా వచ్చెను . విభీషణుడి అనుచరులు ఇంద్రజిత్తు సేనను అడ్డకత్తులతో బల్లెములతో వధించసాగిరి . పిమ్మట విభీషణుడు వానరులకు ఉత్సాహము కలిగించుటకై వారితో "ఓ వానరోత్తములారా !రావణునికి ఈ ఇంద్రజిత్తు ఒక్కడే దిక్కు . వారి బలములన్నియు హతమై పోగా మిగిలివున్నాది యితడు మాత్రమే . సమరభూమి అందు పాపాత్ముడైన ఇతడిని హతుడిని కావించినచో ఇక రావణుడు ఒక్కడు తప్ప ప్రముఖ రాక్షస వీరులందరూ మరణించినట్టే . ఇతడికి నేను పినతండ్రిని పుత్రుడితో సమానమైన ఇతడిని చంపుట యుక్తము కాదు . అయినా రామ కార్యము కోసము జాలి పక్కన పెట్టి వాదివలెనంటే నా కళ్ళు అశ్రువులతో మూసుకుపోయి కనపడకున్నవి . కావున ఇతడిని మన లక్ష్మణవీరుడు హతమార్చెదడు . వానరయోధులందరూ కలిసి ఇంద్రజిత్తు వెనక ఉన్న ఆ రక్కసి మూక పని పట్టాలి . "అని పలికెను . 
విభీషణుడు ఇలా ప్రేరేపించిగా వానరులందరూ సంతోషముతో రాక్షసి మూకను చుట్టుముట్టి  వధించసాగిరి . లక్ష్మణ ఇంద్రజిత్తుల యుద్ధము కూడా తీవ్రముగా ఉండెను . వారిరువురు ప్రయోగించిన అసంఖ్యాకమైన బాణములు ఆకాశమంతా అలుముకొని ఉండుటచే చిమ్మచీకట్లు కమ్ముకొనెను . ఎటు చూసినా బాణములే కనపడుచుండెను . యుద్ధ కుశులుడైన లక్ష్మణుడు తన ధనస్సు అందు వజ్ర తుల్యమైన బాణమును సంధించి ,ఆకర్ణాంతము లాగి ,వదిలెను . ఆ బాణపు దెబ్బకు ఇంద్రజిత్తు రధసారధి చనిపోయెను . 
ఇంద్రజిత్తు రధమును నడుపుటలో నిమగ్నుడై ఉండగా లక్ష్మణుడు అతడిని తన బాణములతో కొట్టెను . అనంతరము ప్రమాథి ,శరభుడు ,రభసుడు ,గంధమాధనుడు అను వానర ప్రముఖులు ఇంద్రజిత్తు గుఱ్ఱములపై పడి వాటిని చంపివేసి పిమ్మట రధమును కూడా ధ్వంసము చేసి  తిరిగి ,లక్ష్మణుడి చెంతకు వచ్చిరి . గుఱ్ఱములు ,రధము నాశనము కాగా ,సారధి మరణించగా ఇంద్రజిత్తు ఆ రధము నుండి దిగి ,నేలపై నిలబడి శరవర్షము కురిపించుచు ,లక్ష్మణుడి దగ్గరగా రాసాగేను . 

రామాయణము యుద్ధకాండ తొంబదియవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం .ఏ , ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














No comments:

Post a Comment