Saturday 8 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదినాలుగవసర్గ

                                   రామాయణము 

                                  యుద్ధకాండ -తొంబదినాలుగవసర్గ 

అంతులేని దుఃఖముతో దీనుడై వున్న రావణుడు సభలోకి ప్రవేశించి ,సింహాసనమును అలంకరించెను . అప్పుడు సభలోనివారితో "వీరులారా !సమస్త గజబలములను ,అశ్వికబలములను ,రథములను ,కాల్బలమును తీసుకుని వెంటనే యుద్ధమునకు బయలుదేరుము . రాముడిని ఒంటరిగా చేసి మీరు అతడిని చుట్టుముట్టి శరములను కురిపించి అతడిని సంహరించండి . ఒకవేళ మీరు చంపలేకపోతే ,మీ శరముల దాటికి గాయపడి ఉన్న అతడిని అందరూ చూస్తూఉండగా నిన్నే సంహరించెదను "అని పలికెను . 
రాక్షసరాజు ఆజ్ఞ వినన వెంటనే లంకలో కల సమస్త బలములు యుద్ధమునకు బయలుదేరి వెళ్ళినవి . ఇరుపక్షముల మధ్య పోరు ఘోరముగా సాగుచున్నది . యుద్ధముచేసే వీరుల పాదముల కదలికల వలన దూళి చెలరేగినది . గాయపడిన వానర ,రాక్షస వీరుల శరీరము నుండి స్రవించిన రక్తము వలన ఆ దూళి అణిగిపోయినది . వానరులు రాక్షసుల కేశములను ,చెవులను, పాలభాగములను ,ముక్కులను తమ దంతములతో కొరుకుతూ ,గోళ్ళతో రక్కుతూవారిని ముప్పతిప్పలు పెట్టసాగిరి . ఒక్కొక్క రాక్షసునిపై వందలకొలది వానరవీరులు విరుచుకుపడిరి . రాక్షసవీరులు బలమైన గదలతో ,పదునుతేరిన ఈటలతో ,ఖడ్గములతో ,గండ్రగొడ్డళ్ళతో వానరవీరులను చావగొట్టుచుండిరి . రాక్షసుల దాటికి తట్టుకోలేక ,వానరవీరులు దయాళువైన శ్రీరాముడిని శరణువేడిరి . 
శ్రీరాముడు రాక్షసులపై శరములను వర్షములా కురిపించెను . పిమ్మట రాముడు ప్రయోగించిన గాధర్వాస్త్ర ప్రభావంతో రాక్షసవీరులంతా సమ్మోహితులయ్యిరి . అందువలన వారు తమ వారిని అంతమొనర్చుచున్న శ్రీరాముని మాత్రము చూడలేకుంటిరి . బీతిల్లివున్న ఆ రాక్షసులకు సమరభూమిలో ఒక సారి వేలకొలది రాముడులు కనపడుచుండిరి . ఇంకోసారి ఒక్కడే రాముడు కనపడుచుండెను . శ్రీరాముని చేతిలో రధాశ్వగజబలములు నాశనము అవ్వగా ధ్వజపతాకములన్ని ముక్కలవ్వగా ,మిగిలిన రాక్షసులు బ్రతుకుజీవుడా అనుకుంటూ లంక వైపుగా పరుగులు తీసిరి . రణమున మరణించిన గజాశ్వకాల్బలముల కళేబరములతో నిండిన ఆ సమార భూమి లయకారుడైన రుద్రుని యొక్క విహారభూమిలా వున్నది . అప్పుడు దేవతలు గంధర్వులు ,సిద్దులు ,మహర్షులు బాగుబాగు అని శ్రీరాముని పరాక్రమమును పొగిడిరి . అప్పుడు శ్రీరాముడు తన పక్కనే వున్న సుగ్రీవుడు ,విభీషణుడు ,హనుమంతుడు ,జాంబవంతుడు మొదలగు వానరవీరులతో "ఈ దివ్యాస్త్ర బలము నాకు మరియు పరమేశ్వరునికి మాత్రమే కలదు "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ తొంబదినాలుగవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు )  ,తెలుగు పండితులు . 







No comments:

Post a Comment