Wednesday 19 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదియైదవసర్గ

                                       రామాయణము 

                                        యుద్ధకాండ -తొంబదియైదవసర్గ 

శ్రీరాముడి చేతిలో చావగా మిగిలిన రాక్షసులు ,ఈ వార్త విన్న రాక్షస స్త్రీలు అందరూ ఒక చోటికి చేరి ,ఏడుస్తూ ,ఒకరినొకరు కౌగిలించుకుంటూ ,పెడబొబ్బలు పెడుతూ తమలో తాము ఇలా మాట్లాడుకోసాగిరి . "శ్రీరాముడు మన్మధుడి వలె మిక్కిలి అందగాడు . ఎంతో శక్తిమంతుడు . సమస్త ప్రాణుల హితము కొరకు పాటుపడువాడు . ఇక శూర్పనకేమో ముసలిది . లావైన పొట్ట కలిగినది . వీరిద్దరికి ఏమాత్రము జోడు కుదరదు . ఈ శూర్పణఖ ఆ రాముడిని ఎలా చేరినది ?జనస్థానములోని ఖర దూషణాది రాక్షసుల వినాశము కోసమే  ఆ మహానుభావుడితో బరితెగించి ప్రవర్తించింది . ఆ కారణముతోనే రావణుడు శ్రీరాముడితో వైరమునకు పూనుకున్నాడు . రాక్షసుల అందరి చావు కోసమే రావణుడు సీతను అపహరించుకువచ్చాడు . ఎంతగా వేధించినా జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి మాత్రము ఈ దశగ్రీవుడికి దక్కదు సరికదా !శ్రీ రాముడితో వైరము కారణముగా మనకు కూడా చావు రానున్నది . 
విరాధుడు సీతాదేవిపై ఆశపడిన కారణముగా రాముడు ఒక్కడే ఆ వీరుడిని చంపివేసెను . జనస్థానములోని పదునాలుగువేలమంది రాక్షసులను ,ఖరదూషణాది రాక్షసవీరులను శ్రీరాముడు ఒక్కడే హతమార్చెను . కబంధుడిని కూడా రాముడు పరిమార్చెను . ఇంద్రుని వరముతో పుట్టిన మహావీరుడైన వాలి కూడా రాముని చేతిలో మరణించాడు . ఆనాడు విభీషణుడు నిండు సభలో పలికిన పలుకులు రాక్షసులందరికి హితమునుకూర్చెడివి . కానీ రావణుడుకి  సీతాదేవిపై కల మోహము వలన ఆ మాటలు రుచించలేదు . ఆనాడే విభీషణుడి మాటలు రావణుడు విని ఉంటే ఈ రోజు లంకా నగరము ఈ విధముగా స్మశానముగా మారి ఉండెడిది కాదు . 
మహాకాయుడు (పెద్ద శరీరము కలవాడు ),గొప్పవీరుడు ,ఓటమి ఎరుగనివాడు ఐన కుంభకర్ణుడు రాముడి చేతిలో మరణించాడు . రావణుడి ప్రియ పుత్రుడైన ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో చచ్చాడు . ఇంతటి గొప్ప వీరులు మరణించినా ,రావణునికి బుద్దిరాలేదు . రావణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ దేవుడి నుండి దేవదానవరాక్షసుల వలన తనకు మరణము లేకుండా వారము కోరినాడు . మనుష్యలను ప్రస్తావించలేదు . అందువలన రావణునికి మనుష్యులైన ఈ రామలక్ష్మణుల చేతిలోనే చావు రాసి ఉన్నట్టు తెలుస్తోంది . శ్రీరాముడి వలన వచ్చిపడిన ఈ సంకట స్థితి నుండి మనల్ని ఆడుకొనువాడు ఈ లోకము నందు ఎవడును కనుపడుటలేదు . మహాత్ముడైన విభీషణుడు శ్రీరాముడి వలన కలుగు ప్రమాదమును ముందుగానే ఊహించాడు . అందువలనే బుద్ధిశాలియై శ్రీరాముని శరణు వేడాడు . "ఈ విధముగా లంకా నగరంలోని స్త్రీలు మిక్కిలి విషాదమునకు లోనయ్యిరి . వారు మిక్కిలి భయముతో కృంగిపోయి ఒకరినొకరు కౌగిలించుకుంటూ బిగ్గరగా ఏడవసాగిరి . 

రామాయణము యుద్ధకాండ తొంబదియైదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 




No comments:

Post a Comment