Sunday 2 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదియొకటవసర్గ

                                     రామాయణము 

                                        యుద్ధకాండ -తొంబదియొకటవసర్గ 

సమరభూమి అందు నేలపై నిలబడిన ఇంద్రజిత్తు తన సైన్యముతో "రాక్షస శ్రేష్ఠులారా !నలుదిశలఅందు చీకట్లు చుట్టిముట్టినవి . అందువలన మన పక్షము వారెవరో ,శత్రుపక్షము వారెవరో తెలియకున్నది . కనుక నేను లంకా నగరము లోకి వెళ్లి మరియొక రధమును తెచ్చుకొనెదను . ఇక్కడ నేను లేని విషయం శత్రువులకు తెలియకుండా ధైర్యముగా యుద్ధము చేయండి . ఆ వానరులు నా వెనక పడకుండా చూడండి "అని పలికి లంకా నగరంలోకి  వెళ్లి ,మరో రధమును అధిరోహించి ,సమర భూమికి వచ్చెను . 
ఇంద్రజిత్తు వందలవేలకొలది బాణములను వర్షములా ప్రయోగించి ,వానరులను బాధించెను . వానరులు ఇంద్రజిత్తు దాటికి తట్టుకోలేక లక్ష్మణుని శరణు వేడిరి . లక్ష్మణుడు ఇంద్రజిత్తు ధనస్సును ముక్కలుగా చేసెను . అప్పుడు ఆ నిశాచరుడు మరొక ధనుస్సుని తీసుకొనగా లక్ష్మణుడు దానిని కూడా విరుగకొట్టెను . లక్ష్మణుడు అయిదు బాణములతో ఇంద్రజిత్తు వక్షస్థలముపై కొట్టగా అతడి కవచము ముక్కలయ్యేను . ఇంద్రజిత్తు నోటినుండి రక్తము వచ్చెను . అప్పుడు ఇంద్రజిత్తు మరో ధనస్సు తీసుకొని లక్ష్మణునిపై శరముల వర్షము కురిపించసాగెను . లక్ష్మణుడు చాకచక్యంగా వాటిని ఖండించెను . పిమ్మట లక్ష్మణుడు ఒక్కో రాక్షసుడిని మూడేసి బాణములతో కొట్టెను . 
లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారధి శిరస్సుని ఖండించి వేసెను . సారధి లేకున్నా గుఱ్ఱములు ఏ మాత్రమూ తొట్రుపాటు లేకుండా మండలాకారములో తిరగసాగెను . ఆ దృశ్యము మిక్కిలి రమణీయముగా ఉండెను . ఇంద్రజిత్తు లక్ష్మణుని పది బాణములతో వక్షస్థలం పై కొట్టెను . కానీ అవి కవచమును తాకి కింద పడిపోయెను . బాణములు లక్ష్మణుని ఏ మాత్రము బాధించకుండుట చూసిన ఇంద్రజిత్తు మూడు బాణములతో లక్ష్మణుని నుదిటిపై కొట్టెను . అప్పుడు లక్ష్మణుడు అయిదు బాణములతో ఇంద్రజిత్తు నుదిటిపై కొట్టెను . ఇంద్రజిత్తు విభీషణుడిని ,వానరవీరులను ఒక్కో బాణముతో కొట్టెను . వెంటనే విభీషణుడు ఇంద్రజిత్తు రధాశ్వములను కొట్టెను . అప్పుడు రధాశ్వములు మరణించగా ఇంద్రజిత్తు రథములో వున్న శక్తి అనే ఆయుధమును తీసుకుని రధము దిగి దానిని విభీషణుడిపై ప్రయోగించెను . అది గమనించిన లక్ష్మణుడు తన బాణములతో ఆ ఆయుధమును ముక్కలు చేసెను . 
లక్ష్మణుడు వారుణాస్త్రము ప్రయోగించగా ,ఇంద్రజిత్తు రౌద్రాస్త్రముతో దానిని నిర్వీర్యము చేసెను . ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రము ప్రయోగించగా ,లక్ష్మణుడు సౌరాస్త్రము (సూర్య దేవాత్మక అస్త్రము )తో దానిని వమ్ము చేసెను . ఇంద్రజిత్తు అసురాస్త్రము ప్రయోగించగా లక్ష్మణుడు మహేంద్రాస్త్రముతో దానిని ముక్కలు చేసెను . ఆ వీరుల మధ్య సమరం మహా భయంకరముగా సాగుచున్నది . ఆ సమయములో ఆకాశములో పక్షులన్నియు లక్ష్మణుని చుట్టూ చేరినవి . అప్పుడు ఋషులు ,పితృదేవతలు ,సురులు గంధర్వులు ,గరుడుడు ,నాగులు మొదలగు వారందరు ఇంద్రుని నాయకత్వము న రణభూమి అందున్న లక్ష్మణుని రక్షించుచుండిరి . అప్పుడు లక్ష్మణుడు ఇంద్రాస్త్రము ను ఆ చావు మూడిన రావణుని సుతుడపై ప్రయోగించగా ఆ అస్త్రము . తిన్నగా దూసుకుపోయి ఇంద్రజిత్తు తలను ఖండించివేసెను . అప్పుడు ఇంద్రజిత్తు శిరస్సు మొండెము నుండి వేరుపడి నేలపై పడిపోయినది . 
ఆ విధముగా ఇంద్రజిత్తు సమర భూమికి బలియైపోగా విభీషణుడు ,వానరయోధులందరూ సంతోషముతో జయజయ ద్వానములు చేసిరి . దేవతలు ,మహాత్ములైన ఋషులు ,గంధర్వులు అప్సరసలు సంతోషముతో చేసిన జయజయద్వానములు అన్ని దిక్కులా వ్యాపించినవి . ఆ సమర భూమిలో వున్న వందలకొలది రాక్షసులు తమ  మారణాయుధములను అక్కడే వదిలిపెట్టి అన్ని దిక్కులకు పారిపోయిరి . కొందరు లంక లోకి పారిపోయిరి . మరికొందరు సముద్రములో దూకిరి . ఇంకొందరుపర్వతములలోకి పోయి దాగుకొనిరి . ఆకాశములో దేవదుందుభులు మ్రోగినవి . అప్సరసలు నాట్యము చేసినారు . గంధర్వులు గానము చేసినారు . దేవతలు పుష్ప వర్షము కురిపించారు . అందరూ లక్ష్మణుని ప్రశంసలతో ముంచెత్తిరి . 

రామాయణము యుద్ధకాండ తొంబదియొకటవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు 




No comments:

Post a Comment