Wednesday 19 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదిఆరవసర్గ

                                      రామాయణము 

                                       యుద్ధకాండ -తొంబదిఆరవసర్గ 

లంక లో ఇంటింటా రాక్షస స్త్రీల ఆర్తనాదములు రావణునికి వినపడెను . అప్పుడు రావణుడు దీర్ఘముగా నిట్టూర్చి ,క్షణకాలం ఆలోచనలో పడెను . పిమ్మట రావణుడు పరామక్రుద్ధుడై భీకరాకారుడయ్యెను . కన్నులనుండి నిప్పులు గ్రక్కుచు రాక్షసులతో ఇలా చెప్పెను . "వెంటనే సైన్యమును సన్నద్ధపరచండి . ఇది నా ఆజ్ఞ . "అని పలికెను . 
వెంటనే అక్కడ కల రాక్షసులు యుద్ధమునకు సిద్ధముగా లేని యోధులందరిని యుద్ధమునకు ప్రోత్సహించిరి . ఆ విధముగా యుద్ధమునకు సిద్దమయిన యోధులతో రావణుడు "వీరులారా !నేడే నేను శత్రువులను వధించివేసెదను . భర్తలను ,సోదరులను ,కొడుకులను కోల్పోయిన రాక్షస స్త్రీ ల కన్నీళ్లను నేను తుడిచెదను . నేడు నా బాణపరంపరలతో వానరులందరిని హతమార్చెదను . అలా వారి కళేభరములతో రణభూమి ఏ మాత్రమూ కనపడకుండా చేసెదను . వెంటనే నా రధమును సిద్దము చేయండి . నా ధనుర్భాణములను తీసుకు రండి . మీరందరూ నన్ను అనుసరిస్తూ యుద్ధమునకు రండి . "అని పలికెను . 
రావణుని ఆజ్ఞలను అందుకుని వెంటనే రాక్షసవీరులు భీకరముగా గర్జించుచు ,వివిధ ఆయుధములను చేతబూని ,క్షణ కాలములో బయలుదేరిరి . వారందరూ లంకా నగరమునకు కల ఉత్తర ద్వారము గుండా బయటకు వచ్చిరి . అక్కడ రామలక్ష్మణులు యుద్ధసన్నద్దులై ఉండిరి . ఆ సమయములో సూర్యకాంతి సన్నగిల్లెను . అన్ని దిక్కులందు చీకట్లు కమ్ముకొనెను . భూమి దద్దరిల్లునట్లుగా పక్షులు ఘోరముగా అరిచినవి . మేఘములు రక్తమును వర్షించెను . రధాశ్వముల నడకలు తడబడెను . ధ్వజాగ్రముపై గ్రద్దవాలెను . అశుభ సూచకంగా నక్కలు కూసెను . రావణుని ఎడమకన్ను అదిరెను . అతని ఎడమభుజము చలించెను . ఇలా అనేక అపశకునములు ఎదురయినప్పటికీ రావణుడు వాటిని ఏమాత్రము లెక్కచేయక ,మృత్యుప్రేరితుడై శత్రువులను వధించుటకు బయలుదేరెను . ఆ రాక్షసులయొక్క రథముల చప్పుడు వినగానే వానరులు యుద్ధమునకు సన్నద్దులయ్యిరి . కపివీరులు ,రాక్షసయోధులు జయేచ్ఛతో క్రుద్ధులై ,పరస్పరము కవ్వించుకొనుచు సంకుల సమరం చేసిరి . 
అప్పుడు రావణుడు తనబాణములను ప్రయోగించుచు వానరసేనపై విరుచుకుపడెను . వీరావేశముతో అతడు ప్రయోగించే బాణములవర్షమునకు కొందరి వానరుల తలలు తెగిపడినవి . కొందరికి వక్షస్థలములు దెబ్బతిన్నవి . కొందరికి చెవులు త్రేగిపడినవి . కొందరికి చేతులు మరికొందరికి కాళ్ళు తెగినవి . రావణుని దాటికి వానరవీరులు తట్టుకోలేకపోయిరి . 

రామాయణము యుద్ధకాండ తొంబదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 





No comments:

Post a Comment