Wednesday 5 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదిమూడవసర్గ

                                   రామాయణము 

                                       యుద్ధకాండ -తొంబదిమూడవసర్గ 

రావణుని మంత్రులు యుద్దములో ఇంద్రజిత్తు మరణించిన వార్త విని ,స్వయముగా చూసి ధ్రువ పరుచుకుని రావణుని వద్దకు వెళ్లి "మహారాజా !దేవేంద్రుడి అంతటి వాడిని జయించిన మహావీరుడు ,లక్ష్మణుడితో తలపడి , అతడి చేతిలో హతుడైనాడు . కానీ ప్రభూ !మీ కుమారుడు ఆ లక్ష్మణుడిని తన శరములతో ముప్పతిప్పలు పెట్టిన తర్వాతే పుణ్యలోకమునకు చేరినాడు "అని పలికెను . తన కుమారుడు యుద్దములో భయంకరముగా పోరాడి మరణించిన విషయము విన్న రావణుడు ,వెంటనే మూర్చితుడయ్యెను . కొంతసేపటికి స్పృహలోకి వచ్చి ,పుత్రశోకమును తట్టుకోలేక ,మిక్కిలి దీనుడై "అయ్యో !ముద్దుల కుమారా !నీవు రాక్షస యోధులలో ముఖ్యమైనవాడివి . మహారధుడివి . మహేంద్రుని జయించిన పరాక్రమశాలివి . అట్టి నీవు లక్ష్మణుడికి ఎలా వశమయితివి ?శత్రువులను గడగడలాడించు మహావీరా !నీ మాతృమూర్తిని ,నన్ను ,నీ భార్యను ,రాక్షసులను యువరాజ్యమును ,లంక ను విడిచి ఎక్కడకు వెళ్ళితివి . సాధారణముగా నేను ముందు మరణించుట , నీవు నాకు ప్రేత కార్యములను నిర్వహించుట జరగవలెను . కానీ నేడు అది తారుమారయినది . "అని పరిపరి విధములుగా దుఃఖించసాగెను . 
రావణుడు తీవ్రదుఖముతో విలపించుచుండెను . పుత్రవియోగము కారణముగా అతడిలో కోపము కట్టలు త్రెంచుకొనెను . రావణునికి ఆలోచించినకొలది సీతను వధించుటే యుక్తమని తోచెను . అప్పుడు రాక్షసరాజు కన్నులు నిప్పులు కక్కసాగినవి . మామూలుగానే అతడి రూపము భయంకరమైనది . ఇప్పుడు క్రోధాగ్నిచే  రుద్రిడిలా చూచుటకు భయంకరముగా ఉండెను . అతడు కోపముతో పళ్ళు పటపటమని కొరుకుతుండగా ,ఆ శబ్దములు భయంకరముగా వినపడసాగినవి . ఆ సమయములో ఆ మందిరములో వున్న రాక్షసులందరూ రావణునికి ఎదురుగా వచ్చుటకు బయపడి స్తంభముల చాటున దాక్కోనిరి . 
మిక్కిలి కోపముతో ఊగిపోతున్న రావణుడు బయపడి దాక్కున్న రాక్షస వీరులను తిరిగి యుద్ధమునకు సన్నద్దులను చేయుటకు వారితో "మిత్రులారా !పూర్వము నేను వివిధరీతులలో వేలకొలది సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించాను . నా తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ,అసురులవలనకానీ ,దేవతలవలన కానీ ఎప్పుడు ఎక్కడా భయము లేకుండా వారము ఇచ్చినారు . నేను ధరించిన సూర్యకాంతులతో వెలిగిపోతున్న ఈ కవచమును కూడా బ్రహ్మ దేవుడే  నాకు ఇచ్చినాడు . దేవతలతో ,ఇతరవీరులతో యుద్ధములు చేసిన అనేక సందర్భములలో ఎటువంటి ఆయుధములు కూడా ఈ కవచమును ముక్కలుచేయలేకపోయినవి . అటువంటి కవచమును ధరించి రధము ఎక్కి నేను సమరభూమిలో నిలబడితే నన్ను ఎదిరించి నిలబడే వీరుడే లేనేలేడు . దేవేంద్రుడు కూడా నన్ను జయించలేడు . దేవాసుర సంగ్రామములో నా పరాక్రమమునకు మెచ్చుకుని అతడే నా ఈ ధనుస్సుని నాకు ఇచ్చాడు . నేను ఇప్పుడే ఏ ధనుస్సుని తీసుకుని యుద్ధమునకు బయలుదేరెదను . "అని పలికి తన ఒరనుండి ఒక ఖడ్గమును బయటకు తీసెను . ఆ ఖడ్గమును చేతబూని తన భార్యలు మంత్రులు ,రాక్షసులు తన వెంట నడుస్తుండగా రావణుడు సీతాదేవి ఉన్న అశోకవనమునకు బయలుదేరెను . 
తన మిత్రులు ఎంతగా వారించినా వినకుండా తన వైపుగానే వచ్చుచున్న రావణుని చూసిన సీతాదేవి వ్యధచెందెను . సుపార్శ్వుడు అను రాక్షసుడు రావణునితో "మహారాజా !నీవు సమస్త వేదములను అధ్యయనము చేసినవాడివి . సకల శాస్త్రములను పుక్కిట బట్టినవాడవు . రామునిపై నీ ప్రతాపము చూపుము . నీవు రథముని అధిరోహించి యుద్ధరంగమునకు వెళ్లి ,ఆ రాముని సంహరించు . పిదప సీతాదేవి నీకు తప్పక వశమవగలదు . "అని పలికెను . అప్పుడు రావణుడు ఆ మాటలు విని అందుకు సమ్మతించెను . వెంటనే అతడు అక్కడినుండి వెనుతిరిగి ఇంటికి వెళ్లెను . అనంతరము అతడు తన మంత్రులతో కూడి సభాభవనమున ఆసీనుడయ్యెను . 

రామాయణము యుద్ధకాండ తొంబదిమూడవసర్గ సమాప్తము . 

                      శశి ,

 ఎం , ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment