Tuesday 4 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదిరెండవసర్గ

                                  రామాయణము 

                                      యుద్ధకాండ -తొంబదిరెండవసర్గ 

ఇంద్రజిత్తు మరణించిన పిమ్మట సంతోషిచిన లక్ష్మణుడు ,విభీషణుడు ,ఆంజనేయుడు ,ఇతర వానరయోధులతో కలిసి శ్రీరాముడు ,సుగ్రీవుడు వున్న ప్రదేశమునకు వెళ్లెను . అన్నగారికి కొద్దీ దూరములో వినయముగా నిలబడి తన అన్నతో ఇంద్రజిత్తు మరణించిన విషయము చెప్పెను . అప్పుడు విభీషణుడు" లక్ష్మణుడే ఇంద్రజిత్తును హతమార్చినాడు "అని తెలిపెను . అది విన్న శ్రీరాముడు సంతోషముతో లక్ష్మణుని దగ్గరకి పిలిచి లక్ష్మణుని నుదిటిపై ముద్దు పెట్టి ,కౌగిలించుకొనెను . పిమ్మట లక్ష్మణుని తన పక్కన కూర్చుండపెట్టుకుని అతడిని భుజము నిమురుతూ లక్ష్మణుడి ఒంటిపై కల గాయములను గమనించేను . 
అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో "తమ్ముడా !ఇంద్రుని సైతము ఓడించిన మిక్కిలి పరాక్రమము కలిగిన ఇంద్రజిత్తుని నీవు సంహరించినావు . నీ పరాక్రమము తిరుగులేనిది . నీ ఈ విజయముతో మనకు విజయము కాయమయినట్టే . విభీషణుడు ,హనుమతో కలిసి మూడు రోజులు రణరంగమున నీ తిరుగులేని పరాక్రమమును చూపి విజయము సాధించినావు . నీ వంటి తమ్ముడు నా పక్కనే ఉన్నట్టయితే సీతను,కోసల రాజ్యము ను కూడా తేలికగా సాధించగలను . "అని పలికి సుషేణుడిని పిలిచి లక్ష్మణుడికి ,విభీషనుడికి ,హనుమకు ,ఇంకా వానర యోధులకు వారి దెబ్బలకు వైద్యము చేయమని చెప్పెను . 
అప్పుడు సుషేణుడు ఒక వన మూలికను తీసుకువచ్చి ,లక్ష్మణుడి ముక్కు దగ్గర పెట్టెను . ఆ వాసన పీల్చిన లక్ష్మణుడి వంటి మీద గాయములన్నియు తగ్గిపోయెను . బాణముల గుర్తులు కూడా మటుమాయమయ్యెను . శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారము విభీషనుడికి ,హనుమకు వానర యోధులకు కూడా ఆ మూలిక వాసన చూపించగా వారి గాయములు కూడా మాయమయ్యెను . అప్పుడు వానరయోధులు అందరు మిక్కిలి సంతోషముతో "లక్ష్మణ స్వామికి జై ,శ్రీరామునికి జై "అని జయజయ ద్వానములు చేసిరి . 

రామాయణము యుద్ధకాండ తొంబదిరెండవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
   









No comments:

Post a Comment