Wednesday 28 August 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదిరెండవసర్గ

                                      రామాయణము 

                                         యుద్ధకాండ -ఏబదిరెండవసర్గ 

ధూమ్రాక్షుడు సైన్యముతో వచ్చుట చూసిన హనుమ ,మిగిలిన వానరులు రెట్టింపు ఉత్సాహముతో యుద్ధమునకు దిగెను . రాక్షసులు శూలములతో ,గదలతో రకరకాల ఆయుధములతో వానరులపై దాడికి దిగిరి . వానరులంతా రాళ్లతో ,చెట్లతో యుద్ధమునకు దిగిరి . వారి గోళ్లు ,పళ్లే వారికి ఆయుధములు . సమరప్రదేశమంతా రక్తసిత్తమయ్యెను . పచ్చి నెత్తురు తాగే రాక్షసులు వానరుల దాటికి నోటా రక్తము కక్కినారు . 
వానరుల విజృంభణ గమనించిన ధూమ్రాక్షుడు వానరులను అనేక బాణములతో బాధించుట మొదలుపెట్టేను . ఆ బాణ పరంపరలకు వానరులు తట్టుకొనలేక విలవిలలాడుట చూసిన హనుమ ధూమ్రాక్షుడి రథముపైన పెద్ద కొండరాయిని విసిరెను . అది గమనించిన ధూమ్రాక్షుడు తన గదను తీసుకుని రధమునుండి కిందకు దూకేను . పిమ్మట అతడు హనుమపైకి తన ముళ్ల గదను ప్రయోగించెను . అప్పుడు హనుమ పెద్ద పర్వతముతో ధూమ్రాక్షుడిపైకి దాడికి దిగెను . ధూమ్రాక్షుడి గద తనను గాయపరిచినా లెక్కచేయకుండా హనుమ పర్వతముతో దాడి చేయుటచే ధూమ్రాక్షుడు అక్కడికక్కడే నామరూపములు లేకుండా మరణించెను . ధూమ్రాక్షుడు మరణించుట చూసిన అతడి సైన్యము భయముతో పరుగులు తీసిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Tuesday 27 August 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదిఒకటవసర్గ

                                రామాయణము 

                             యుద్ధకాండ -ఏబదిఒకటవసర్గ 

రామలక్ష్మణులు కోలుకోవటం చూసిన వానరుల సమూహము పెద్దగా కోలాహలంగా ధ్వని చేసెను . ఆ ధ్వనిని విని ఏమి అర్ధము కానీ రావణుడు తన పక్కనే వున్న కొంత మంది రాక్షసులను విషయము కనుక్కురమ్మని పంపెను . వెంటనే ఆ రాక్షసులు వెళ్లి రామలక్ష్మణులు సజీవంగా ఉండుట చూసి వచ్చి  రావణుడికి అదే విషయమును తెలిపిరి . ఆ మాటలు విన్న రావణుడు విషసర్పముల వంటి ఇంద్రజిత్తు బాణములు ఎలా విఫలము అయ్యోయో తెలియక ఆలోచించసాగెను . 
పిమ్మట రావణుడు" ధూమ్రాక్షుడు "అనే రాక్షసుడిని యుద్ధరంగమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించెను . వెంటనే 'ధూమ్రాక్షుడు 'అపారమైన సైన్యమును వెంట పెట్టుకుని పశ్చిమ ద్వారము వైపుగా యుద్ధమునకు బయలుదేరెను . అప్పటికే అక్కడ హనుమ లెక్కలేనంత వానరసైన్యముతో కూడి పశ్చిమద్వారము వద్ద యుద్ధము కొరకై నిలిచి ఉండెను . ధూమ్రాక్షుడు యుద్దమునకై రధము మీద వచ్చుచుండగా అతనికి అనేకమైన అపశకునములు కనిపించెను . ఆ అపశకునములు అపారంగా వున్న వానరసేనను చూసేసరికి ధూమ్రాక్షునికి కలవరపాటు మొదలయ్యెను . 

రామాయణము యుద్ధకాండ ఏబదిఒకటవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Sunday 25 August 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదియవసర్గ

                             రామాయణము 

                              యుద్ధకాండ -ఏబదియవసర్గ      

వానరులు భయముతో పారిపోవుట చూసిన సుగ్రీవుడు వానరులంతా ఎందుకిలా పారిపోవుచున్నారని ఆలోచించెను . అప్పుడే విభీషణుడు అక్కడికి వచ్చెను . సుగ్రీవుడికి విభీషణుడిని చూసే వానరులు పారిపోవుచున్నారని అర్ధము చేసుకున్నాడు . వెంటనే జాంబవంతుడు పారిపోవుచున్న పెద్దగా పిలుస్తూ ఆపెను . అంతట విభీషణుడు రామలక్ష్మణుల కన్నులను  మంత్రపూరిత జలములతో తుడిచెను . వారి దురవస్థను చూసిన వానరులందరూ మిక్కిలి చింతించసాగిరి . 
అప్పుడు సుగ్రీవుడు" వీరు కొంచం కోలుకున్నతర్వాత వీరిని కిష్కింధకు పంపి వానరసైన్యముతో నేనే లంకపై దాడి చేసి ఆ రావణుడిని ,అతడి పరివారమును చంపి సీతామాతను తీసుకువచ్చి శ్రీరాముడికి అప్పగిస్తాను "అని పలికెను . వానరులంతా మాట్లాడుకుంటుండగా పెద్దగా పెనుగాలులు వీచెను . సముద్రములో నీరు అల్లకల్లోలమయ్యెను . అందరూ ఏమిజరుగుతోందో అర్ధము కాక ,దిక్కులు చూడసాగిరి . అప్పుడే పక్షిరాజైన గరుత్మంతుడు అక్కడికి వచ్చెను గరుత్మంతుడు రావడంతోనే సర్పాస్త్రములో వున్న సర్పములన్నీ భయముతో ఆరిపోయెను . గరుత్మంతుడు రామలక్ష్మణుల వద్దకు వచ్చి ,రామలక్ష్మణులను తన చేతితి స్పృశించెను . వెంటనే రామలక్ష్మణుల శరీరముపై వున్న గాయములన్ని మాయమైపోయి వారికి పూర్వ రూపము వచ్చెను . 
అప్పుడు రామలక్ష్మణులు లేచి కూర్చొనెను . పిమ్మట గరుత్మంతుడు రామలక్ష్మణులను కౌగిలించుకొనెను . అప్పుడు శ్రీరాముడు గరుత్మంతునితో "మహానుభావా !నీవు రావటంతో మేము నాగాస్త్రము నుండి విముక్తులమయ్యాము . పైగా మాకు పూర్వపు జవసత్వములు వచ్చినవి . మాకు మహోపకారం చేసితివి . "అని పలికెను . ఆ మాటలకు గరుత్మంతుడు "శ్రీరామా !మనము స్నేహితులు మీరు ఆపదలో వున్నారని తెలిసి పరుగు పరుగు న వచ్చితిని . రాక్షసులు మాయా స్వభావులు . వారితో జాగ్రత్తగా ఉండండి . "అని పలికెను . ఆ విధముగా పలికి గరుత్మంతుడు శ్రీ రాముని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయెను . 

రామాయణము యుద్ధకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Friday 23 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                     రామాయణము 

                                  యుద్ధకాండ -నలుబదితొమ్మిదవసర్గ 

రామలక్ష్మణులు భయంకరమైన నాగాస్త్రముచే బందీలు అయి శరీరమంతా రక్తసిత్తమై పడివుండిరి . సుగ్రీవుడు మిగిలిన వానరులంతా వారి చుట్టూ చేరి ,కంగారుపడుతూ ఉండిరి . పరాక్రమశాలి ఐన శ్రీరాముడు నాగాస్త్రముతో బందించబడినప్పటికీ బలశాలి ,ధీరుడు కావున స్పృహలోకి వచ్చెను . స్పృహలోకి వచ్చిన శ్రీరాముడు పక్కనేపడివున్న తమ్ముడు లక్ష్మణుడిని చూసి మిక్కిలి విలపించెను . లక్ష్మణుడు లేనిచో తనకు సీతతోకాని ,తుదకు తన ప్రాణములతో కానీ పని ఏమున్నది బాధపడెను . లక్ష్మణుడు మరణించినచో తానూ మరణించేదని పలికెను . 
పిమ్మట సుగ్రీవుని తిరిగి కిష్కింధకు వెళ్లిపొమ్మని చెప్పెను . హనుమకు అంగదునికి కృతఙ్ఞతలు తెలిపి మిక్కిలి బాధపడసాగెను . అప్పుడు విభీషణుడు సైన్యమును తగురీతిగా నిలబెట్టి  రామలక్ష్మణులు వున్నా చోటికి రాసాగేను . కొందరు వానరులు అతడిని చూసి ఇంద్రజిత్తు అని భయపడి పారిపోయిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -నలుబదియెనిమిదవసర్గ

                                    రామాయణము 

                                         యుద్ధకాండ -నలుబదియెనిమిదవసర్గ 

మహాబలశాలురైన రామలక్ష్మణులు యుద్ధభూమిలో కిందపడివుండుట చూసిన సీతాదేవి ,అంతులేని శోకముతో కృశించి విలపించసాగెను . ఆ సమయములో సీతామాత తనకు వివాహము కాకముందు పండితులు ,జ్యోతిషశాస్త్రజ్ఞులు తనను దీర్ఘసుమంగళీ అని చక్రవర్తికి భార్య అని చెప్పిన విషయములు గుర్తుతెచ్చుకుని ,ఈ రోజు ఇలా ఎందుకు జరిగిందని వారి మాటలు ఎలా తప్పయ్యాయని రోదించెను . ఆ విధముగా రోదిస్తున్న సీతాదేవిని చూసిన త్రిజట సీతాదేవితో
 "అమ్మా !నీవు దుఃఖించవలదు . నీ భర్త మరణించలేదు . సజీవంగానే వున్నాడు . అందుకు కారణములు చెబుతున్నాను విను . వానర సైన్యము అంతా ప్రశాంతముగా వున్నది . ఒకవేళ రామలక్ష్మణులు మరణించినట్లయితే ,వానరసైన్యము ఇప్పటికే భయముతో పారిపోయెడి వారు . లేదా దుఃఖించెడివారు . అదేమిలేక వారు ప్రశాంతముగా వున్నారు పైగా రామలక్ష్మణులను రక్షించుచున్నారు . మరణించినవారిని రక్షించరుకదా !మరణించినవారి ముఖములు నిర్జీవంగా వికృతముగా ఉంటాయి . రామలక్ష్మణులు కిందపడి వున్నా వారి ముఖములు కళగా వున్నవి . కావున వారు మరణించలేదు . నా మాటలు విని దుఃఖము మానుము . నీ మంచి కోరేదానిగా నీకు ఇవన్నీ చెప్పాను . నా మాట నిజము "అని పలికెను . 
త్రిజట మాటలు విన్న సీతాదేవి కొద్దిగా ఊరడిల్లెను . పిమ్మట రాక్షస స్త్రీలు అశోకవనమునకు సీతాదేవిని చేర్చిరి . రావణాసురునకు విహారభూమి ఐన అశోకవనమునకు చేరిన పిమ్మట సీతాదేవి తన మనసులో రామలక్ష్మణులను తలుచుకుని మిక్కిలి బాధపడెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Thursday 22 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదియేడవసర్గ

                                   రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియేడవసర్గ 

రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చెప్పిన మాటలు విని మిక్కిలి సంతోషించిన రావణుడు ఇంద్రజిత్తును పంపించివేసి ,అశోకవనంలో సీతాదేవికి కాపలా పెట్టిన రాక్షసస్త్రీలను రప్పించెను . త్రిజట మొదలగు స్త్రీలు రావణుడి ఆజ్ఞ మేరకు వచ్చారు . వారితో రావణుడు "మీరు తక్షణమే బయలుదేరి ,అశోకవనమునకు వెళ్లి ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపిన విషయము తెలిపి ,ఆమెను పుష్పకవిమానములో తీసుకువెళ్లి ,యుద్ధరంగములో పడివున్న రామలక్ష్మణులను చూపించండి "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞ మేరకు త్రిజట మొదలగు రాక్షస స్త్రీలు పుష్పకవిమానమును అశోకవనమునకు తీసుకువెళ్లి ,సీతాదేవిని అందు ఎక్కించి ,యుద్దభూమికి తీసుకువెళ్లిరి . యుద్ధభూమిలో రాక్షసులు సంతోషముగా కోలాహలంగా ఉండిరి . వానరులందరూ బాధతో ఉండిరి . యుద్ధభూమిలో రామలక్ష్మణులు కిందపడి ఉండిరి . వారి కవచములు విరిగి ఉండెను . వారి శరీరములు మట్టికొట్టుకుని ఉండెను . అది చూసిన సీతాదేవి మిక్కిలి రోదించెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు )తెలుగుపండితులు . 

Wednesday 21 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదిఆరవసర్గ

                                  రామాయణము 

                                       యుద్ధకాండ -నలుబదిఆరవసర్గ 

ఇంద్రజిత్తు ఉనికి తెలుసుకొనుటకై వెళ్లిన పదిమంది వానరులు ఆకాశము ,భూమిపై అంతా వెతికి అతడు కనపడకపోవుటచే తిరిగి రామలక్ష్మణులు వున్న చోటికి వచ్చిరి . సుగ్రీవుడు ,విభీషణుడు ,జాంబవంతుడు మిగిలిన వానరులందరూ రామలక్ష్మణులు వున్న చోటికి వచ్చి  చూసి మిక్కిలి శోకసంతస్తులయ్యిరి . 

వారందరిని చూసిన ఇంద్రజిత్తు  సైన్యముతో "చూసినారా ఖరదూషణాదులను చంపిన రాముడిని , సోదరుడు లక్ష్మణుడు ని చంపాను . దేవతలే దిగి వచ్చినా  రక్షించలేరు . మనల్నందరిని ఇంత ఇబ్బంది పెట్టిన వారిని నేను హతమార్చివేసాను . "అని పలికి నీలుని వాడి అయిన తొమ్మిది బాణములతో కొట్టెను . మైందుని ద్వివిదుని మూడు బాణములతో ,జాంబవంతుని ఒక  మీద ,హనుమంతునిపై  బాణములతో ,ఇంకా కొంత మంది మీద  ప్రయోగించి ఇంద్రజిత్తు యుద్ధరంగమునుండి లంకా నగరము  లోకి ప్రవేశించెను . 
రామలక్ష్మణుల దురవస్థ చూసిన సుగ్రీవుడు ధైర్యమును కోల్పోయి ,మిక్కిలి బాధపడసాగెను . అక్కడి వాతావరణము అంతా శోకముతో నిండిపోయెను . కన్నీరుమున్నీరు గా విలపించుచున్న సుగ్రీవుని విభీషణుడు తన మాటలతో ఓదార్చెను . "సుగ్రీవా !యుద్దములో ఈ విధముగా గాయపడుట సర్వసాధారణము . రామలక్ష్మణులకు  . వారిని హతమార్చగలవారు దేవతలలో లేరు . వారు ఆ నాగాస్త్ర ప్రభావము నుండి భయటపడు వరకు  జాగ్రత్తగా రక్షించవలెను . తర్వాత వారే మన బాగోగులు చూసుకుంటారు .  వుంది సమస్త  సైన్యమునకు ధైర్యము చెప్పు "అని పలికి మంత్రం పూరిత నీతితో సుగ్రీవుని నేత్రములను తుడిచెను . ఆ ప్రభావమున రాక్షస మాయలను సుగ్రీవుడు గుర్తించగలడు . 
 యుద్ధ రంగము నుండి అంతః పురములోకి ప్రవేశించిన ఇంద్రజిత్తు తండ్రిని చేరి రామలక్ష్మణులు మరణించిరని తెలిపెను . ఆ మాటలు విన్న రావణుడు సంతోషముతో  కౌగిలించుకొని యుద్ధ విశేషములు చెప్పమని కోరెను . అప్పుడు ఇంద్రజిత్తు యుద్ధరంగములో తన ప్రదర్శించిన విశేషములను తండ్రికి పూర్తిగా వివరించి చెప్పెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదిఆరవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ, ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Sunday 18 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబది అయిదవసర్గ

                                 రామాయణము 

                               యుద్ధకాండ -నలుబది అయిదవసర్గ 

శ్రీరాముని ఆదేశము మేరకు ఇంద్రజిత్తు ఆచూకీ తెలుసుకొనుటకు 'సుషేణుడి కుమారులు ఇద్దరు ,నీలుడు ,అంగదుడు ,శరభుడు ,వినతుడు ,జాంబవంతుడు ,సానప్రస్తుడు ,ఋషభుడు ,ఋషభస్కందుడు 'మొదలగు 10 మంది వానరవీరులు పెద్దపెద్ద వృక్షములను పట్టుకుని ఆకాశమునకు ఎగిరిరి . ఇంద్రజిత్తు తన ఆచూకీ కోసము ఆకాశములోకి ఎగిరిన వానరులను చూసి వారిపై భయంకరములైన బాణములను ప్రయోగించెను . మాయా యుద్ధము చేయుచుండుటచే ఆ వీరులు ఇంద్రజిత్తుని కనిపెట్టలేకపోయిరి . 
ఇంద్రజిత్తు మాయా రూపమున ఉండియే ,ఇంకా నాగాస్త్రములను రామలక్ష్మణులపై ప్రయోగించుచు ఉండెను . ఆ బాణముల దాటికి రామలక్ష్మణుల శరీరము రక్తసిత్తమయ్యెను . హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులందరూ రణరంగమున రఘువీరులు నాగాస్త్రముచే బంధింపబడి యుండగా చూసి ,వారి సమీపమున చుట్టూ చేరి ఆర్తులై తీరని దుఃఖంలో మునిగిపోయిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదియైదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -నలుబదినాలుగవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -నలుబదినాలుగవసర్గ 

ఆ విధముగా వానరులకు రాక్షసులకు మధ్య ఘోర యుద్ధము జరుగుతుండగా సూర్యుడు అస్తమించెను . వానరులు ,రాక్షసులు యుద్ధము జయింపవలననే కోరికతో పట్టుదలతో యుద్ధము చేయసాగిరి . దట్టమైన చీకట్లు వ్యాపించుటచే ,ఇరుపక్షములవారు ఒకరినొకరు గుర్తింపలేక "నీవు రాక్షసుడవేనా ?"అని వానరులు ,"నీవు వానరుడవేనా "అని రాక్షసులు అడిగి తెలుసుకుని మరీ యుద్ధము చేయసాగిరి . 
రాక్షసులు క్రోధావేశముతో వానరులపై పడి వారిని భక్షించుచుండిరి . అప్పుడు వానరులు కూడా కోపోద్రిక్తులై రాక్షసులపై పడి తమ పదునైన దంతములతో వారిని చీల్చుచుండిరి . మాయావులైన రాక్షసులు ఒకొకప్పుడు కనపడుచు ,మరొకసారి కనపడక యుద్ధము చేయుచుండిరి . అక్కడ రక్తపుటేరులు ప్రవహించినవి . తీవ్రముగా గాయపడి ,గగ్గోలు పెట్టుచున్న రాక్షసుల ,వానరుల ఆర్తనాదములు ఎంతో దారుణముగా వినపడెను . ఆ సమర భూమి గుర్తుపట్టలేనంతగా మారిపోయెను . 
రాక్షసులందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి వానరులపై శరవృష్టి కురిపించెను . అలా విజృంభించుచున్నవారిలో ఆరుగురిని శ్రీరాముడు తన బాణములతో చంపివేసెను . పిమ్మట శ్రీరామచంద్ర ప్రభువు అన్ని దిక్కులా తన బాణములను ప్రయోగించెను . ఆ బాణములు తగిలిన రాక్షసులందరూ అగ్నిలో పడిన మిడతలవలె మరణించిరి . 

అప్పుడు వానరులలో బలిష్ఠులు మహాకాయులైన కొండముచ్చులు రాక్షసులను అదిమి పట్టి సంహరించిరి . 
మరోయొకవైపు అందగనితో ఇంద్రజిత్తు యుద్ధమొనర్చుచువుండెను . అంగదుని చేతిలో ఇంద్రజిత్తు రధము అశ్వములు నాశనము కాగా ఏమి చేయలేక  వున్నచోటునే ఇంద్రజిత్తు మాయమయ్యెను . అది చూసిన దేవతలు మహర్షులు ,రామలక్ష్మణులు ఇంద్రజిత్తుని ప్రశంసించిరి . ఆ విధముగా అంగదుని చేతిలో పరాభవం చెందిన ఇంద్రజిత్తు కోపముతో ఎవ్వరికి కనపడకుండా మాయారూపములో ఉండి రామలక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగించెను . ఆ నాగాస్త్ర ప్రభావము వలన రామలక్ష్మణులు మూర్చిల్లిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదినాలుగవసర్గ సమాప్తము . 

                           శశి 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము యుద్ధకాండ -నలుబదిమూడవసర్గ

                                    రామాయణము 

                                    యుద్ధకాండ -నలుబదిమూడవసర్గ 

వానరసైన్యము రాక్షస సైన్యము మీదికి పరుగులు తీసెను . అప్పుడు ఆ ఇరువురి సైన్యము మధ్య ధ్వంధ్వ యుద్ధము జరిగెను . అంగదుడిని ఇంద్రజిత్తు తన గదతో కొట్టెను . అప్పుడు అంగదుడు అదే గదను లాక్కుని ,ఇంద్రజిత్తు రధమును ,రధాశ్వములను,సారధిని చిత్తు చేసెను . 
ప్రజంఘనుడు అను రాక్షసుడు విభీషణుడి సచివుడైన సంపాతి పై మూడు బాణములు ప్రయోగించెను . అప్పుడు సంపాతి అక్కడే వున్న నల్లమద్ది చెట్టు ను పీకి ,ప్రజంఘనుడిని కొట్టగా మరుక్షణమే అతడు మరణించెను . 
జంబుమాలి తన బలమును ప్రయోగించుచు ,హనుమంతుడి వక్షస్థలముపై కొట్టెను . వెంటనే హనుమ ఆకాశములో ఎగిరి తన రచేతితో జంబుమాలిని కొట్టెను వెంటనే అతడు మరణించెను . 
'ప్రతపనుడు 'అను రాక్షసుడు నలుడుని తన బాణములచే గాయపరిచేను . వెంటనే నలుడు 'ప్రతపనుడి 'కళ్లు రాలగొట్టెను . 
వానరులకు ప్రభువైన సుగ్రీవుడు తన సైన్యములను దెబ్బతీయుచున్న 'ప్రఘసుని 'సప్తవర్ణ వృక్షముతో చావకొట్టి నిహతుని చేసెను . శ్రీరాముడు తన మీదకు బాణములు వేయుచున్న అగ్నికేతువు ,రశ్మికేతువు ,సుప్తఘ్నుడు ,యజ్ఞకోపుడు అను రాక్షసులను తన బాణములచే యమపురికి పంపెను . 
'మైందుడు 'తన పిడికిలి దెబ్బతో 'వజ్రముష్టి 'అను రాక్షసుని చంపివేసెను . నికుంభుడు అను రాక్షసుడు నీలుని వంద బాణములచే గాయపరిచి ,వికటాట్టహాసము చేసెను . వెంటనే నీలుడు నికుంభుడి రధ చక్రమును పీకి దానితోనే నికుంభుని ,అతడి రధ సారధి ని తల మీద కొట్టెను . విద్యున్మాలి సుషేణుడిని తీవ్రముగా కొట్టి గర్జించెను . అప్పుడు సుషేణుడు ఒక కొండరాయితో విద్యున్మాలి రధమును ధ్వంసము చేసెను అప్పుడు విద్యున్మాలి రధము దిగి ,గదతో తనపై దాడిచేస్తున్న సుషేణుడిని కొట్టెను . ఆ దెబ్బను పట్టించుకొనక సుషేణుడు ఒక కొండరాయితో విద్యున్మాలిని తీవ్రముగా కొట్టెను . వెంటనే అతడు మరణించెను . 
వానర వీరులకు ,రాక్షస యోధులకు ఇలా ఘోరముగా జరిగిన ధ్వంధ్వ యుద్దములో రాక్షసులు వానరుల చేతిలో మట్టికరిచితిరి . ఆ యుద్ధరంగమున ఖడ్గములు ,గదలు ,బల్లెములు ,ఇనుపగుదియలు ,అడ్డుకత్తులు విరిగి పడియుండెను . ముక్కలై పడిపోయిన రథములు చచ్చిపడి వున్న రధాశ్వములు ,మదపుటేనుగులు ,వానరుల యొక్క ,రాక్షసుల యొక్క కళేబరములు రథముల యొక్క చక్రములు  ఆ సమారా భూమి అందు కనపడుచున్నవి . శవములు భక్షించుటకై అక్కడికి నక్కలు గుంపులు గుంపులుగా వచ్చి వున్నవి . రాక్షస యోధులను చీల్చి చెండాడుటచే వానరుల దేహములు రక్తసిత్తములై వున్నవి . అప్పుడు నిశాచరులు (రాత్రిపూట తిరుగు వారైన రాక్షసులు )మళ్లీ ఘోరముగా యుద్ధము చేయుటకై సూర్యాస్తమయముకై (సూర్యాస్తమయ సమయములో రాక్షసుల శక్తి అధికమగును )నిరీక్షించుచుండెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 11 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదిరెండవసర్గ

                                 రామాయణము 

                                  యుద్ధకాండ -నలుబదిరెండవసర్గ 

రాక్షసులు రావణుడి వద్దకు వెళ్లి శ్రీరాముడు తన సైన్యముతో లంక నాలుగు వైపులా ద్వారములను ముట్టడించినవిషయము తెలియచేసిరి . లంకా నగరము ముట్టడికి గురి ఐన విషయము తెలుసుకుని ,క్రుద్ధుడై రక్షణ ఏర్పాట్లని రెట్టింపు చేసెను . పిదప రావణుడు తన ప్రాసాదము ఫై కి ఎక్కి ,శత్రు సైన్యమును చూసేను . 
లంకా నగరద్వారమునకు చేరుకున్న శ్రీరాముడు దాడి చేయుటకు తన సైన్యమునకు ఆజ్ఞను ఇచ్చెను . కామరూపులైన ఆ వానరులు" శ్రీరామునికి జయము,లక్ష్మణ స్వామికి జయము ,వానరారాజైన సుగ్రీవునికి జయము ,అని బిగ్గరగా పలుకుచు ,సింహ గర్జనలు ,చేయుచు ,లంక యొక్క ప్రాకారముపైకి చకచకా పాకిరి . 
రావణుడు పై నుండి ఇది గమనించుచు ,తన సైన్యమునకు  ఆజ్ఞను ఇచ్చెను . వెనువెంటనే రాక్షస సైనికులు పెద్దగా గర్జనలు చేయుచు వానరసైనికుల వైపుగా పరుగులు పెట్టిరి . వెంటనే రాక్షస వానరుల మధ్య ,పూర్వము దేవాసురల సంగ్రామము వలె భయంకరమైన యుద్ధము మొదలయ్యెను . దృఢకాయులైన వానరయోధులు జయజయద్వానములు పలుకుతూ ,గోళ్ళతో రక్కుతూ ,దంతములతో కొరుకుతూ  చాలామంది రాక్షసులను హతమార్చిరి . అప్పుడు భయంకరులైన రాక్షసులు ముండ్లగదలతో ,ఖడ్గములతో ,శూలములతో వానరసైన్యములో దొరికిన వారిని దొరికినట్టు చంపసాగిరి . అప్పుడు వానరులు గోడపైకెక్కి అక్కడ తమపైకి ఆయుధములను ప్రయోగించుచున్న రాక్షసులను పడదోసిరి . ఈ విధముగా ఆ ప్రాంతమంతా రక్తముతో తడిసిపోయెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








 

Wednesday 7 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదియొకటవసర్గ

                                  రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియొకటవసర్గ 

శ్రీరాముడు సుగ్రీవుని శరీరముపై కల యుద్ధ చిహ్నములను చూసి ,వెంటనే సుగ్రీవుని కౌగిలించుకొనెను . పిమ్మట ఆ ప్రభువు సుగ్రీవునితో "మిత్రమా !సుగ్రీవా !నాతొ మాటమాత్రమైనా చెప్పకుండా ఇటువంటి సాహస కార్యమునకు పూనుకొంటివి . ప్రభువులు తొందర[పడి ఇటువంటి సాహస కార్యములకు పూనుకొనరాదు కదా !ప్రాణమిత్రుడవైన నీకు ఏమాత్రము ఆపద సంభవించినా ఇక మా పరిస్థితి ఏమిటి ?అట్టి స్థితిలో సీతతో కానీ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కానీ చివరకి నా ప్రాణములతో కానీ పని ఏముంటుంది ?నీకు ఏదయినా ఆపద వాటిల్లిన యెడల నేను రాజ్యమును భరతునికి అప్పగించి నా ప్రాణములు త్యజించాలని నిశ్చయించుకున్నాను . "అని పలికెను 
అప్పుడు సుగ్రీవుడు "రఘువీరా ! నీ పౌరుషము మాట అలా ఉండనివ్వండి . నేను మీ మిత్రుడని అయి కూడా మీ ధర్మపత్నిని అపహరించిన దుష్టుడిని చూసి ఎలా ప్రశాంతముగా ఉండగలను ?"అని పలికెను . అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని అభినందించి ,లక్ష్మణునితో "నేడే ఆ దుష్ట రావణుని పాలనలో వున్న లంక ను అన్ని వైపుల నుండి ముట్టడించెదము "అని పలికి ,ఆ పర్వతమును దిగి కిందకు వచ్చెను . ఆయన వెనకే సమస్త సేనా కదిలి వచ్చెను . మహా పరాక్రమశాలి ఐన శ్రీరాముడు మరునాడు ప్రాతః కాలమే ధనుర్దారీ అయి వానర సైన్యము కూడి లంకాభిముఖుడై ముందుగా తానూ నడిచెను . 
శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి లంకా నగరము ప్రాకారము వద్దకు చేరిన పిమ్మట అతడు ఉత్తరద్వారమును ముట్టడించెను . మహావీరుడైన 'నీలుడు 'మైందునితో ద్వివిదునితో కూడి లంక యొక్క తూర్పు ద్వారమున నిలిచెను . మిక్కిలి బలశాలి యువరాజు ఐన అంగదుడు ఋషభునితో ,గవయునితో ,గవాక్షునితో గజునితో కలిసి దక్షిణ ద్వారము చేరెను . కపి వీరులలో ప్రముఖుడైన హనుమంతుడు ప్రమాదితో ,ప్రఘసునితో ఇంకా వానర యోదులతో కలిసి పశ్చిమ ద్వారముపై దాడి చేసి దానిని ఆక్రమించెను . గరుత్మంతునితో ,వాయుదేవునితో సమానమైన వానరవీరులతో సుగ్రీవుడు పశ్చిమోత్తర దిశల మధ్యభాగమున వున్న రాక్షసుల సేనా శిబిరంపై తానె స్వయముగా దాడి చేసెను . సుగ్రీవుని వెనక ముప్పై ఆరుకోట్ల మంది వానర వీరులు ఉండిరి . శ్రీరాముని ఆదేశము ప్రకారము లక్ష్మణుడు ,విభీషణుడు ప్రతి ద్వారము వద్ద ఒక కోటి మంది వానర వీరులను నిలిపిరి . 
వానరులందరూ పెద్ద పెద్ద కోరలతో, గోళ్ళతో ,పెద్ద పెద్ద కొండా రాళ్లను పెద్ద పెద్ద వృక్షములను చేత పూని దాడికి సిద్ధముగా ఉండిరి . ఆ వానర వీరులందరూ నలువైపులా నుండి చీమ దూరుటకు కూడా వీలు లేనంతగా త్రికూట పర్వతమును చుట్టి వున్నారు . ఇంకా కొంత మంది వానరవీరులు లంకా నగరమును ఆక్రమించారు . నల్లని మేఘము వలె  భయంకరాకారులు ,ఇంద్రుని వంటి పరాక్రమము కలవారు అయిన వానర వీరులు అకస్మాత్తుగా వచ్చి పాడుతా చే రాక్షసులంతా భయపడిరి . శ్రీరాముడు రాక్షసులను వధించుటకై ఆ విధముగా వానర వీరులను తగిన స్థానములలో నిలిపి ఉండెను . పిమ్మట ఆయన అనంతర కార్యక్రమము కై తన  అలోచించి చివరిసారిగా ఒక సారి దూతను పంపుట ఉత్తమమని భావించి అంగదుడిని పిలిపించెను . పిమ్మట ఆ మహానుభావుడు అంగదునితో "అంగదా నీవు లంకా నగరంలోకి ప్రవేశించి ఆ రావణుడి వద్దకు వెళ్లి నా సందేశమును ఈ విధముగా వినిపించు "ఓ దుష్టరావణా !నీకే పౌరుషము వున్నచో నగరము నుండి బయటకు వచ్చి నేరుగా ఎదుర్కో . నీకు ,నీ మంత్రులకు ,పుత్రమిత్రులకు నా చేతిలో చావు తప్పదు . నీవు మరణించినచో ముల్లోకములలోని వారు హాయిగా జీవించెదరు . నీవు సమస్త ప్రాణులకు కంటక ప్రాయుడవు . కనుక నిన్ను నేడే హతమార్చెదను . నీవు నన్ను సారాను జొచ్చి వైదేహిని నాకు అప్పగించినచో నిన్ను క్షమించేదను .  అట్లు కానిచో నా చేతిలో నీ చావు తప్పదు ఆపై విభీషణుడు లంకకు రాజు అవుతాడు "అని పలికి అతడి సమాధానమును తెలుసుకునిరా "అని శ్రీరాముడు అంగదుని రావణుడి వద్దకు పంపెను . 
అంగదుడు రావణుని వద్దకు వెళ్లి శ్రీరాముని వచనములను యధాతధముగా వినిపించెను . ఆ మాటలు విన్న రావణుడు కోపముతో రగిలిపోయి "ఈ దూతను పట్టుకొనండి ఇతడిని చంపండి "అని ఆజ్ఞాపించెను . ఆ మాటలు విన్న రాక్షసులు నలుగురు అంగదునిపై పడిరి అంగదుడు, ఆ నలుగురిని చంకలో చిక్కించుకుని ఎత్తైన భవనమునుఎక్కి ,ఆ భవనము పైనుండి బలముగా వారిని పడవేసెను . పిమ్మట అతడు ఎదురుగా వున్న రావణుని భవనమును చూసేను వెంటనే అతడు ఆ భవనము పైకి ఎక్కి ఆ ప్రాసాద గోపురమును కూలదోసెను . ఆ విధముగా అంగదుడు ఆ గోపురమును పడదోసి ,మీసములు దువ్వుకుని ఒక పెద్ద సింహనాదమొనర్చి ఒక్క గంతులో అక్కడ నుండి ప్రాకారము పైకి దూకి తన సేన వద్దకు వెళ్లెను . అంగదుని రాకతో వానరవీరులందరూ సంతోషముతో కేకలు వేసిరి . 
రావణుడు జరిగిన దానిని తలుచుకుని అవమానంతో రగిలిపోయెను . శ్రీరాముడు అంగదుని ద్వారా రావణుడి ఆంతర్యమును గ్రహించి ఇక యుద్ధము అనివార్యమని భావించెను . సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి లంకా నగరము వరకు వ్యాపించి వున్న వంద అక్షౌహిణుల  వానర సైన్యమును చూసిన రాక్షసులు మిక్కిలి ఆశ్చర్యపడిరి . పిరికివారు భయముతో వొణికిపోయిరి . లంక అంతా రాక్షసులు భయాందోళనలతో తిరగసాగిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదియొకటవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము యుద్ధకాండ -నలుబదియవసర్గ

                                రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణునితో , సుగ్రీవునితో ,వానరవీరులతో లంకా నగరము వైపు చూచుచుండగా ,వారికి లంకా నగరంలోని ఒక భవనము పైభాగమున కూర్చుని వున్న దుష్టుడైన రావణుడు కనిపించెను . అతడికి ఇరువైపులా ,పరిచారికలు వింద్యామరలు పట్టుకుని విసురుతూ ఉండిరి . ఆ రావణుడిని శ్రీరాముడు మిగిలిన వారంతా స్పష్టముగా చూసిరి . 
రాక్షస రాజైన రావణుడు కనపడినంతనే సుగ్రీవుడు ఒక్క ఉదుటున తన ఆసనంపై నుండి లేచి ,పర్వాతాగ్రభాగముననుండి ఎగిరి లంకా ద్వారముపై వాలెను . పిదప అతడు రావణుడున్న భవనముపైకి ఎగిరి ,రావణుడి ముందు వాలెను . అప్పుడు రావణునితో సుగ్రీవుడు "రావణా !నీ దుష్ట చేష్టలతో నీ చావును నేవే కొని తెచ్చుకున్నావు . ఇక మృత్యువు నుండి నిన్ను తప్పించుట ఎవరికిని సాధ్యముకాదు . ఇప్పుడు  నా దెబ్బలనుండి తప్పించుకుని బతికి బయటపడి చూద్దాము "అని పలికెను . 

అతడి మాటలు విన్న రావణుడు కోపముతో ఊగిపోతూ ,"ఓ సుగ్రీవా !ఇప్పటివరకూ నీవు నా కంట పడలేదు కాబట్టే సుగ్రీవుడిగా వున్నావు . లేకపోతె ఎప్పుడో హీనగ్రీవుడవు అయ్యేవాడివి . "అని పలికాడు . పిదప మహాబలశాలురు ఐన ఆ రావణాసుగ్రీవ వీరులిద్దరూ ,పిడికిళ్లతో గ్రుద్దుకొనుచూ ,అరచేతులతో చరుచుకొనుచు ,మోచేతులతో పొడుచుకొనుచు ,చేతులతో బాదుకొనుచూ ,తీవ్రముగా యుద్ధము చేసిరి . 
ఇంతలో రాక్షసరాజైన రావణుడు తన మాయా శక్తిని ప్రయోగించుటకు సిద్ధుడయ్యెను . అది గమనించిన సుగ్రీవుడు ,ఆకాశములోకి ఎగిరి ,రావణుడికి చిక్కక అతడిని ముప్పతిప్పలు పెట్టి ,తిరిగి ఎగిరి వానరసైన్యము వద్దకు వచ్చెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము యుద్ధకాండ -ముప్పదితొమ్మిదవసర్గ

                              రామాయణము 

                         యుద్ధకాండ -ముప్పదితొమ్మిదవసర్గ 

వానరోత్తములందరూ ఆ రాత్రి సూదులపర్వతముపై గడిపిరి . వారు అచట నుండే   అద్భుతముగా వున్న లంకా నగరమును దర్శించిరి . పెద్దభవనాలతో వున్న లంకా నగరమును చూసిన శ్రీరాముడు ఆశ్చర్యపోయేను . యంత్రయుక్తమైన ద్వారములతో అలరారుచున్న ఆ లంకా నగరమును శ్రీరాముడు ,లక్ష్మణుడు ,ఇంకా సమస్త వానర వీరులు దర్శించిరి . 

రామాయణము యుద్ధకాండ ముప్పదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                                   రామాయణము 

                           యుద్ధకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

శ్రీరాముడు సేనతో సహా సువేల పర్వతముపై ఆ పూట విడిది చేయ నిశ్చయించుకొనెను . శ్రీరాముడు సైన్యము అంతా సువేల పర్వతముపైకి చేరి ఎదురుగా ఉన్న లంకా నగరమును చూసిరి . అది ఆకాశమున వేలాడుచున్నట్టు ఉండెను . ఆ వానరయోధులు చూడముచ్చటగా ఉన్నలంకా నగరమును దర్శించిరి . దాని ద్వారము అద్భుతముగా ఉండెను . బంగారు ప్రాకారముతో ఉన్న ఆ నగరములో కల రాక్షసులు కోకొల్లలుగా నిండి ఉన్నారు . కోట గోడలపై చేరి వున్న రాక్షసులు చూడటానికి మరొక ప్రాకారమా ?అన్నట్టు ఉన్నారు . వారందరిని శ్రీరాముడు ,మిగిలిన వీరులు చూసిరి . అప్పుడు వానర సైన్యము అంతా యుద్దకాంక్షతో వివిధములగు కోలాహల ధ్వనులు చేసిరి . వారందరూ ఆ రాత్రికి అచటనే విశ్రమించిరి . 

రామాయణము యుద్ధకాండ ముప్పదిఎనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -ముప్పదియేడవసర్గ

                                     రామాయణము 

                                   యుద్ధకాండ -ముప్పదియేడవసర్గ 

శ్రీరాముడు,లక్ష్మణుడు  ,సుగ్రీవుడు ,హనుమంతుడు ఇంకా మిగిలిన వానర ప్రముఖులందరూ ఒక చోట సమావేసమయ్యిరి . యుద్దమునకై సమాలోచన చేయసాగిరి . అప్పుడు విభీషణుడు శ్రీరామునితో "ప్రభూ ! నా మంత్రులు పక్షుల రూపములో రావణుని లంకకు వెళ్లి ,అక్కడి రక్షణ వ్యవస్థను తెలుసుకుని వచ్చారు "అని పలికి లంకలో రక్షణకై రావణుడు చేసిన ఏర్పాట్లన్నీ శ్రీరాముడితో విభీషణుడు వివరముగా చెప్పాడు . ఇంకా రావణునికి కల బలము ,బలగము కూడా వివరించి చెప్పెను . 
అప్పుడు శ్రీరాముడు విభీషణుడితో "విభీషణా !వానరులలో మహావీరుడైన నీలుడు లంక యొక్క తూర్పు ద్వారము వైపున నిలుచును . అంగదుడు లంక యొక్క దక్షిణద్వారము వైపున నిలిచి ,మహాపార్శ్వ మహోదరుని చీల్చి చెండాడతాడు . హనుమంతుడు పశ్చిమద్వారము వైపున నిల్చి ,ఇంద్రజిత్తుని చిత్తూ కావించి లంకలో ప్రవేశించగలడు . రావణుడు ఉత్తరద్వారమున రక్షణకై వున్నాడు కదా నేను లక్ష్మణుడితో కలిసి అతడిని దెబ్బతీసి అతడి అహమును అణుస్తాను . వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ,జాంబవంతుడు ,విభీషణుడు లంక మధ్యలో వున్న సైనిక బలముపై దాడిచేయుదురు . వానరులు కామరూపులైనా వారు మానవ రూపము దాల్చరాదు . సైన్యములో మనవారిని గుర్తించుటకు అదే కొండగుర్తు . "అని పలికి శత్రు నిర్మూలనమునకై  శ్రీరాముడు సైన్యముతో సహా లంకా నగరము వైపుగా నడవసాగెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Monday 5 August 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదిఆరవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -ముప్పదిఆరవసర్గ 

రావణుడి హితము కోరుచు మాల్యవంతుడు పలుకగా ఆయువు మూడిన రావణుడు అతడి మాటలు సహింపలేకపోయెను . అప్పుడు రావణుడు మాల్యవంతుడితో "మాల్యవంతా !నీవు శత్రువహించిన వాడు వలె కనుపడుతున్నావు . హితవచనముల పేరుతో నాకు పరుష వచనములు పలికితివి . రాముడు ఒక మానవుడే కదా పైగా తండ్రి చే అడవులకు తరిమివేయబడ్డాడు . దేవతలే నన్ను చూసి గడగడలాడెదరు . రాముడు సేనలతో సహా సముద్రమును దాటి వచ్చిన విషయము నిజమే కానీ అతడు ప్రాణములతో  తిరిగి వెళ్ళలేడు . ఇదియే నా ప్రతిజ్ఞ . "అని పలికెను . 
రావణుడు కోపముతో పలుకుతున్న మాటలు విన్న మాల్యవంతుడు అతడి మాటలకు సమాధానముగా ఏమి మాట్లాడక ,రావణుని ఆశీర్వదించి ,తన గృహమునకు వెళ్లిపోయెను . పిదప రావణుడు తన మంత్రులతో ఆలోచించి ,లంకకు రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసెను . తూర్పుద్వారమున ప్రహస్తుని ,మహాపార్శ్వుని ,మహోదరుని ,దక్షిణ ద్వారమున ,ఇంద్రజిత్తు ను పశ్చిమ ద్వారమున ,ఉత్తరద్వారమున శుక సారణులను రక్షణకై నియోగించెను . రావణుడు తాను కూడా  శుకసారణులకు అప్పగించిన ఉత్తరద్వారమును రక్షించుచు ఉండేదనని పలికెను . ఇంకా విరూపాక్షుడు అను రాక్షసుడిని పెక్కుమంది యోధుల సహాయముతో లంక మధ్యలో వున్న సైనిక స్థావర రక్షణకై నియోగించెను . పిమ్మట రావణుడు తన మంత్రులను ఇంటికి పంపి ,తాను కూడా అంతః పురమునకు వెళ్లెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పది ఆరవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .